Previous Page Next Page 
ముద్దుగుమ్మ పేజి 20

    పద్మిని ప్రియదర్శిని చాలా తీవ్రంగ ఆలోచిస్తున్న వేళ అచ్చెమ్మ యలమందయ్య పిల్లుల్లాగ నడిచివచ్చి వారివారి స్థానాల్లో పడుకొన్నారు.

    మరికాసేపటికి యలమందయ్య గుర్రు వినపడసాగింది గాఢనిద్రపోతున్న గుర్తుగ.

    పద్మిని ప్రియదర్శినికి నిద్రపట్టలేదు.

    తెల్లవారి లాభంలేదు. రేపురాత్రికి అసలే లాభం లేదు. ఏం చేసినా ఇప్పుడే చేయాలి...

    ఆలోచించి ఆలోచించి పద్మినికి మళ్ళీ జ్వరం ఎక్కువైంది. తలనెప్పి అంతకన్నా ఎక్కువైంది. ఆ జ్వరంలో ఆ బాధలో "ఇక్కడ్నించి ఎంత తొందరగా బైటపడితే అంత మంచిది" అన్న ఆలోచన తప్ప మరో ఆలోచన రాలేదు.

    "వెళ్ళిపోవటం మంచిది" అన్న ఆలోచనరాంగానే అంత జ్వరంలోను వేయి ఏనుగుల బలం వచ్చింది. నెమ్మదిగ మంచం మీంచి లేచింది. ఏ మాత్రం చప్పుడు చేయకుండ గుడిశెలోకి వెళ్ళింది. ఆనాడు గాజు అమ్మిన డబ్బుల్లో నూటయాభైరూపాయలు మిగిలాయి. ఆ నూటయాభై రూపాయలు తీసుకుంది. కాళ్ళకి చెప్పులు వేసుకుంది. నిండా దుప్పటి కప్పుకొని కాలినడకతో అక్కడ్నించి బయల్దేరింది.

    ఎవరన్నా లేచి చూస్తే ప్రమాదం. అందుకని గుడిశెల చాటు నుంచి తప్పుకుంటూ అలానే నడుస్తూ సరీగ అరగంటకి ఆ పేట దాటింది .ఎవరో తాగిన వాళ్ళు నలుగురైదుగురు ఎదురొస్తూ కనిపించారు.

    పద్మినికి పై ప్రాణాలు పైనే పోయినట్టయింది. సమయానికి బెల్లుమోగిస్తూ అటుగా ఖాళీరిక్షా వచ్చింది. ఆ సమయంలో ఖాళీరిక్షా రావడం కూడా అదృష్టమే! రిక్షా ఆపి గబుక్కున ఎక్కి కూర్చుంది.

    "ఎక్కడికెళ్ళాలమ్మా?" రిక్షాబ్బి అడిగాడు.

    తను ఎక్కడికెళ్ళాలన్నది ముందే నిర్ణయించుకుని బయలుదేరలేదు పద్మిని. ముందు అక్కడ్నించి బయటపడాలి! ఆ ఒక్కమాట మాత్రమే అనుకొంది.

    విన్నమాటలు, అంతకంతకు హెచ్చుతున్న జ్వరమూ తలనొప్పి అరగంటసేపు యింతదూరం నడిచి రావటం... దాంతో మనసూ, శరీరం ఆధీనంలోకి రాకుండా పోయాయి. "స్టేషన్ కి పోనీయ్" నోటికొచ్చింది చెప్పింది పద్మిని ప్రియదర్శిని.

    రిక్షా స్టేషన్ వేపు సాగింది.


                                    11


    రైలు ఒక స్టేషన్లో ఆగి మళ్ళీ బయలుదేరింది.

    అది మామూలురైలు కాదు ఎక్స్ ప్రెస్! ముఖ్యమైన స్టేషన్ లలో ఆగి శరవేగంగా ముందుకు సాగుతున్నది. ట్రయిను ఏ స్టేషనులో ఆగితే అక్కడ ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు. దిగేవాళ్ళు దిగుతున్నారు.

    రైల్లోపడుకుని ప్రయాణం చేస్తున్న పద్మినీ ప్రియదర్శినికి యిదేమీ తెలియదు. నిండా దుప్పటి కప్పుకొని పడుకొంది. జ్వర తీవ్రతకి వుండి వుండి మూలుగుతోంది.

    ఆ తెల్లవారుఝామున స్టేషనుదగ్గర రిక్షా దిగిన పద్మిని ప్రియదర్శిని జ్వరతీవ్రతలో పట్టరాని అవమాన భారంతో తనేం చేస్తోందో తనకే తెలీకుండాపోయి స్టేషన్ లోకి రావటం అప్పుడే బయలుదేరటానికి సిద్ధంగా వున్న రైలు యెక్కి ముణగదీసుకుని పడుకోవటం అదేదీ తెలీకుండానే చేసింది.

    పద్మిని ప్రియదర్శిని ఎక్కంగానే ఎక్స్ ప్రెస్ బయలుదేరటం జరిగింది. ఆ తరువాత ఏమిటన్నది పద్మినికి తెలియదు. అటు నిద్రా, ఇటు మెలుకువా కాని స్థితిలో మూలగటం తప్పించి.

    తెల్లవారుజామున ట్రయినెక్కితే ఇప్పుడు ఉదయం తొమ్మిది అయింది. అదే ట్రైన్ లో పద్మిని పడుకొన్న ఎదుటి సీట్లో పార్వతమ్మ, శంకర్రావుకూడా ప్రయాణం చేస్తూ వున్నారు.

    మొహంమీది దుప్పటి తొలగటం వలన మూలుగుతున్నది ఒక అమ్మాయిని ముందుగ పార్వతమ్మ గుర్తించింది.

    "ఆ అమ్మాయి ఎందుకో మూలుగుతున్నదండీ" భర్తతో చెప్పింది పార్వతమ్మ. 

    "అవును మూలుగుతున్నది. జ్వరమో! లేక మరేదైనా బాధో!" అన్నాడు శంకర్రావు.

    "పాపం అడిగి చూస్తాను" జాలిహృదయంగల పార్వతమ్మ జాలిగ మొహంపెట్టి అడిగింది.

    "నీ ఇష్టం" అన్నాడు శంకర్రావు.

    "అమ్మాయీ! అమ్మాయీ!" దగ్గరగా మొహంపెట్టి పిలిచింది.

    పద్మిని ప్రియదర్శిని పలకలేదు.

    పార్వతమ్మ వూరుకోలేదు. ఒంటిమీద చేయివేసి కుదుపుతూ "అమ్మాయీ! అమ్మాయీ!" అంటూ పిలిచింది.

    పద్మిని ప్రియదర్శిని పట్టు బలవంతానా కళ్ళు తెరిచి చూసింది. ఎర్రగా కణ కణ లాడుతున్న నిప్పుకణికల్లాగా వున్నాయి కళ్ళు. తడి ఆరిపోయిన పెదవులను కదిలిస్తూ "దాహం" అంది.

    వెంటనే పార్వతమ్మ తనదగ్గరున్న మరచెంబులోని మంచినీళ్ళని గ్లాసులోకి వొంపి పద్మిని దగ్గరకి తీసుకొచ్చి "ఇంద అమ్మాయి! మంచినీళ్ళు లే...లేచి కూర్చొని తాగు. పడుకుని తాగితే ముక్కులోకి పోతాయి" మంచినీళ్ళతోపాటు ఉచిత సలహా కూడా యిస్తూ మాట్లాడింది పార్వతమ్మ!

    మరోసారి పద్మిని ప్రియదర్శిని "దాహం" అంది తన బుల్లి పెదవులని నెమ్మదిగ కదిలిస్తూ.

    అప్పుడు అనుమానం వచ్చింది పార్వతమ్మకి. నుదుటిమీద చెయ్యివేసి చూసింది. మంట తాకినట్టు చురుక్కు మనిపించింది. "ఈ అమ్మాయికి బాగా జ్వరం వుందండీ" అని భర్తతో చెప్పింది.

    "జ్వరంమాత్ర ఏదన్నా ఇద్దామంటావా?" శంకర్రావు అడిగాడు.

    "ఇద్దామా? అని మెల్లిగా అంటారేమిటండీ! ఈ పిల్లతోపాటు యెవరూ వచ్చినట్లు లేదు. ఇంత జ్వరంతో వంటరిగా ఎందుకు ప్రయాణం చేస్తున్నదో తెలీదు. అదంతా మనకనవసరం. మనదగ్గర మాత్రల పెట్టె వుంది. జ్వరం మాత్ర ఒకటిచ్చి మంచినీళ్ళు తాగించడం మంచిది. నన్నడిగితే అదే చెబుతాను" అంది పార్వతమ్మ.

    "నిన్నడక్కపోయినా నువ్వేం చేబుతావో నాకు తెలుసులే" నవ్వుతూ అని మందులపెట్టె తీసి మెటాసిన్ మాత్ర ఒకటి తీసి భార్యచేతిలో పెట్టి "జాగ్రత్తగా మింగించు" అన్నాడు శంకర్రావు.

    శంకర్రావు, పార్వతమ్మ ఎక్కడికి ప్రయాణమయినా సరే, దగ్గర ఒక మందులపెట్టె, మంచినీళ్ళకి మరచెంబు, నాలుగుకప్పుల కాఫీ పట్టే ప్లాస్కు సామానులతో పాటు వెంట వుండాల్సిందే. మందులంటూ పెద్దగా ఏమీ ఉండవ్! జ్వరం తగ్గడానికి మాత్రలు, తలనొప్పి తగ్గడానికి మాత్రలు, మోషన్స్ ఆగటానికి మాత్రలు, వికారం తగ్గటానికి మాత్రలు, గాయమైతే రాచకుటుంటానికి ఆయింట్ మెంటు, జెండూబామ్ సీసా, కాస్త కాటను అలాంటి చిన్న చిన్నవి మాత్రమే ఉంటాయ్!

 Previous Page Next Page