Previous Page Next Page 
ఒక జంట కలిసిన తరుణాన పేజి 20

    మధ్యాహ్నం తీరుబడిగా మంచానికడ్డంగా పడుకుని వాసంతి ఆలోచిస్తున్నది. వాసంతి ఆలోచనకి అంతరాయం కలిగిస్తూ "వాసంతీ. వాసంతీ!" అంటూ కంగారుగా గదిలోకి వచ్చింది శ్రీదేవమ్మ.
    శ్రీదేవమ్మ ముఖం అదోలా వుండటం చూసి వాసంతి వెంటనే మంచంమీద నుంచి లేచి "ఏమయింది అత్తయ్యా?" అంది.
    "తొందరగా తయారయిరా. ఆసుపత్రి కెళదాం. రామలక్ష్మి చావుబ్రతుకుల్లో వుందట."
    "నిన్నకూడా బాగానేవుందిగా! ఇంతలో ఏమయింది?"
    "చీరకు నిప్పంటుకున్నదట. కారణం వివరంగా తెలియదు. ఊఁ, తొందరగా తయారుగా వెళదాం" అని చెప్పి శ్రీదేవమ్మ గదిలోంచి బైటికెళ్ళిపోయింది.
    వాసంతికి ముందుగదిలోంచి అత్తా మామగారు మాట్లాడుకునే మాటలు వినిపిస్తున్నాయి. భానుమూర్తి వచ్చి చెపితేనే ఈ విషయం తెలిసింది యింట్లో. రామలక్ష్మి ఎవరో వాసంతికి బాగా తెలుసు. రామలక్ష్మి కొత్తగా కాపురానికొచ్చిన అమ్మాయి, కొత్త అంటే నిన్నా మొన్నా కాకపోయినా ఆరునెలలు దాటింది. రామలక్ష్మి మామగారు భానుమూర్తికి దూరపు బంధువు. ఆ యింటికి, ఈ యింటికి రాకపోకలున్నాయి, ఇందువల్లనే వాసంతికి రామలక్ష్మి ఎవరో తెలుసు.
    పదినిమిషాల తర్వాత శ్రీదేవమ్మ, భానుమూర్తి, వాసంతి ఇంటికి తాళంవేసి హాస్పటల్ కి బయలుదేరారు. వీళ్లు వెళ్ళేటప్పటికి రామలక్ష్మి కొనప్రాణంతో బెడ్ మీద వుంది. శరీరం మొత్తంమీద అంగుళం కూడా ఖాళీలేకుండా ఎర్రని నిప్పుల్లో కమిలిన వంకాయలా వుండటమేగాక కురులు నామరూపాలు లేకుండా చర్మం కాలింది. ముడతలుగా జారి వికృతంగా వుండటమేగాక చూసేవాళ్ళకి కడుపులో దేవుతూ వుంది. పసిమిఛాయతో నిడుపాటి కురులు. చక్రాల్లాంటి కళ్ళు. మనిషి పొట్టి అయినా మహారూపసి రామలక్ష్మి.
    వాసంతికి కళ్ళు బైర్లుకమ్మాయి. రామలక్ష్మి తాలూకా యిప్పటి రూపానికి స్థితికి, స్టేట్ మెంట్ తీసుకోవటానికి కూడా వీలుకలుగలేదు. రామలక్ష్మి ప్రాణం గాలిలో కల్సిపోయింది.
    వాసంతి, శ్రీదేవమ్మ వెంటనే యింటికి వచ్చేశారు. భానుమూర్తి అక్కడే వుండిపోయాడు.
    రామలక్ష్మీ వాళ్లు చుట్టాలయినా అక్కడ వుండక శ్రీదేవమ్మ ఎందుకు యింటికొచ్చేసిందో వాసంతికి అప్పటికప్పుడే తెల్సిపోయింది. రామలక్ష్మి చీరకు పొరపాటున నిప్పు అంటుకోలేదు, అత్తా, మొగుడు కల్సి రామలక్ష్మిని నిలువునా కిరసనాయిలుతో తడిపి అగ్గిపుల్ల గీసి అగ్నికి ఆహుతి చేశారుట. ఇరుగు పొరుగు కట్టకట్టుకు సాక్ష్యం యిచ్చారు.
    రామలక్ష్మి తల్లి తండ్రి వాళ్లు చీరసారెలు సరీగ పెట్టకపోగా కట్నం తాలూకు డబ్బు యింకా సగం యివ్వవలసి వున్నారు. పుట్టింటివారికి కష్టంమీద కష్టం వచ్చిపడ్డ కారణాన ఇప్పటిలో యివ్వలేము. త్వరలో యిస్తామని చెప్పారు. ఆ కట్నం డబ్బుకోసం అత్తా, భర్త కల్సి రామలక్ష్మిని నానా బాధా పెట్టేవాళ్లు. ఈ సంగతి యిరుగు పొరుగుకి తెలుసు. శ్రీదేవమ్మకి తెల్సు.
    "వాళ్లు మనుషులు కారు. ముక్కుపచ్చలారని పసిదానికి నరకం చూపించారు. ఆ యింటి గుమ్మం తొక్కేదిలేదు. వాళ్ళ ముఖం చూసేదిలేదు. వీళ్ళూ మనుషులేనా! వీళ్ళదీ ఓ బ్రతుకేనా! ఛీఛీ!" అంది శ్రీదేవమ్మ.
    వాసంతింకా రామలక్ష్మి కళకళలాడే ముఖము. కాలిన కాయము కనిపిస్తున్నాయి. కోడలిని రాచి రంపానపెట్టే అత్తగారు, భార్యని చావబాదె భర్త వరకట్నాల దురాచారాలు నవలల్లోను, సినిమాలలోనేకాదు. నిజజీవితంలో కూడా వుండటం దారుణఫలితం. కళ్ళారా చూసింది వాసంతి. ఆలోచించి తలనొప్పి తెచ్చుకుంది.
    సాయంత్రానికి భానుమూర్తి వచ్చాడు. రామలక్ష్మి మరణం అజాగ్రత్తవల్ల జరిగింది కాదని, ఆత్మహత్య అంతకన్నా కాదని అత్త, భర్త కలిసి సజీవదహనం చేసినట్లు సాక్ష్యం లభించిందని, కాని ఆ సాక్ష్యం ఎంతవరకు నిలుస్తుందా అన్నది అనుమానమని చెప్పాడు.
    "ఏముంది! పాపం పండకపోతే ఇటు యిరుగు పొరుగు ముందుకొచ్చి సాక్ష్యం చెప్పరు. అటు పోలీసులు శ్రద్ధవహించరు. కన్నెత్తి చూడలేదు. ఓ మూలుగు లేదు. ఇలాంటి పాపాత్ముల పాపం పండకనే రామలక్ష్మి అలా వెళ్ళిపోయింది" అంది శ్రీదేవమ్మ.
    రామలక్ష్మిని ఎన్నిరకాలుగా హింసించేవారో ఎన్ని రకాలుగా ఆడిపోసుకునేవారో తెల్సిన శ్రీదేవమ్మ భానుమూర్తి ఆ సంగతులు చెప్పుకుంటుంటే వాసంతి విన్నది.
    ప్రపంచంలో ఎన్ని రకాలవాళ్ళుంటారు? అమ్మ యిలాంటివి ఎన్నో విని చూచి వుంటుంది. అందుకే తనను గురించి తన కాపురం గురించి అంత ఆందోళన భయం, నోట్లోనాలుకలేని రామలక్ష్మి మవునంగా ఎన్నో బాధలు పడింది. ఈ రోజు పెదవి కదిపి ఏదయినా వక్కమాట అని వుంటుంది. ఆవేశంతో వాళ్లు రాక్షసుల్లా ప్రవర్తించి రామలక్ష్మిని పొట్టన పెట్టుకుని వుంటారు. నిజంగా తానెంతో అదృష్టవంతురాలు కన్నవి విన్నవి చూస్తుంటే......" ఈవిధంగా సాగిపోతున్నది వాసంతి ఆలోచన.
    మొదటిసారిగా తల్లి తనగురించి పడే ఆందోళనకి అర్ధము ,అదృష్ట దురదృష్టాల మీద నమ్మకము వాసంతికి తెలిసివచ్చాయి.
                                                                                 17
    "తప్పదా!" అంది వాసంతి.
    "తప్పించుకుందామన్నా తప్పదు మరి. మోహన్ మనసు చాలా సున్నితం. కాదంటే బాధ పడతాడు." శ్యామ్ సుందర్ బూటు లేసుకుని ముడేసుకుంటూ అన్నాడు.
    "హాయిగా పిక్చర్ కి వెళదామనుకుంటే."
    "భోజనం కాంగానే వెళ్ళేది అక్కడికే."
    నిజంగా!"
    "రెండునిమిషాలలో తయారవుతాను." బాత్ రూమ్ కి పరుగెత్తింది వాసంతి.
    శ్యామ్ సుందర్ చిన్నగా నవ్వుకున్నాడు.
    శ్యామ్ సుందర్ మితృడు శ్యామ్ సుందర్ ని వాసంతిని భోజనానికి పిలిచాడు, శలవురోజు సరదాగ శ్యామ్ సుందర్ తో సినిమాకి వెళదామనుకుంది వాసంతి. ఫ్రెండ్ భోజనానికి పిలిచిన విషయం చెప్పాడు. భోజనం అంటే అంత ఆనందం కలగలేదు గాని సినిమా అనేసరికి వుషారొచ్చింది వాసంతికి. సరీగ అయిదు నిమిషాలలో తయారయింది.
    శ్యామ్ సుందర్ వాసంతి కొత్తదంపతులు అప్పుడే నలుగురు భోజనానికి పిలవటం వెళ్ళి రావటం వక్కోయింట్లో వక్కోపద్ధతి అన్నీ చూసింది వాసంతి. ఇది అయిదోవాళ్ళు పిలవటం.

 Previous Page Next Page