Previous Page Next Page 
రుధిర మందారం పేజి 21

    ఇహ నవలల విషయానికి వస్తే మాలవ్యా సుభా ప్రచురణ అంటే ఆ పేరుగల పబ్లికేషన్ ఎక్కడాలేదు.
    ఈ నాలుగు రోజుల పరిశోధనలో ఇంతవరకూ తెలుసుకో గలిగాను.
    బన్నీ అని పిలవబడే అందాల సుందరి ఏ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నదన్నది తెలుసుకోవాలి. ఉద్యోగం విషయం అబద్ధం అయితే పగలంతా ఎక్కడ గడుపుతున్నదన్నది కనిపెట్టి చూడాలి. ఇంకా చేయవలసినవి చాలా పనులున్నాయి.
    ఏదో ముఠా వుంది. వాళ్ళు చాలా పెద్ద పనులే చేస్తూ వుండవచ్చు. బన్నీ లాంటి వాళ్ళని వాడుకుంటూ వుండవచ్చు. ఇదంతా నేనొక్కడినీ పరిశోధించి తేల్చలేను. కారణం ఏకకాలంలో నాలుగు ప్రదేశాలలో కనిపెట్టి వుండాలంటే ఒక్కడివల్ల సాధ్యం కాదు. ఒకరు అందాల సుందరి వెనుకనే నీడలా తిరగాలి. ఇంకొకరు డాక్టర్ సుధీర్ ఇంటి మీద కన్నేసి వుంచాలి. అలాగే శ్యామలరావు విషయం చూసుకోవాలి. అద్దెపుస్తకాల షాపుమీద దృష్టి మళ్ళించాలి. ప్రతి ఇరవై నాలుగు గంటల తర్వాత అందరి రిపోర్టులు పరిశోధిస్తే కేసు స్వరూపం కొంతలో కొంతయినా తెలుస్తుంది. ఎమర్జన్సీ అయితే వెంట వెంటనే వార్తలు అందించుకోటం మాకు అలవాటే.
    వంటరిగా పరిశోధనచేస్తే ఈ జన్మకి సాధించలేను. ఈ కేసు స్వరూపం అలా వుంది.
    రేపు యీ కేసుని మావాళ్ళతో కన్సల్టు చేయాలి. ప్రస్తుతం పనేమీ లేదుకాబట్టి యీకేసు నేనూ పరిశోధిస్తానని యీ కేసులో నన్ను నియమించాలని కోరాలి. తప్పక నాకు డ్యూటీవేస్తారు.
    నా పరిశోధనలో అందాలసుందరి బన్నీ నేరస్థురాలు అవుతుంది. తను భరించగలడా! ఏంచేస్తాను, భరిస్తాను. కాని కాని...తన మనసెందుకో ఎదురు తిరుగుతున్నది. సామాన్య కుటుంబం అనేగాక మధ్యరకంగా గౌరవంగా బ్రతికే సామాన్య యువతి పెద్ద నేరం చేయదని రూలు ఎక్కడా లేదు. కాని...తనంతట తానుగా పెద్దపనులు చేయదు. ఆమెచేత ఎవరో చేయిస్తున్నారు. అది ఆమె ఇష్టపడి చేస్తున్నదా, వాళ్ళ బలవంతాన చేయిస్తున్నారా! అది కావాలి...
    ఆలోచిస్తూ కొద్దిసేపు పడుకోంగానే నా భుక్తాయాసం తీరింది.
    మళ్ళీ రంగంలోకి దిగటానికి లేచి తయారుకావటం మొదలుపెట్టాను.
                                     18
    గాలిలో వేసే బాణాలు ఎప్పుడూ గాలిలో కల్సిపోవు. ఏదో ఒకనాడు ఏదో ఒక బాణం సూటిగా వెళ్ళి తగలక తప్పదు.
    కాని...
    నేను ధైర్యం చేసి వేసిన ఒకేఒక బాణం కరెక్టుగా తగిలేచోట తగిలింది. దాంతో షాక్ నవల నా చేతికి వచ్చింది.
    నిన్న వేసిన వేషం కాక మరో మారువేషం వేసుకుని అద్దె పుస్తకాల షాపుకి వెళ్ళాను. షాపులో నలుగురు వుండగా వెళ్ళాను. "ఏం కావాలి!" షాపు అతను అడిగాడు.
    కాగితంమీద అప్పటికప్పుడు నాలుగు మక్కలు గీకి అతనికి మాత్రమే కనపడేలా కాగితంవుంచి "యీ నవలలు మొత్తం కావాలి" అన్నాను.
    "పక్కన మనుషులు వుండటంవల్ల కోడ్ రాసి చూపిస్తున్నాను. షాక్ నవల కావాలి. మన కోడ్ రుధిరమందారం."
    నేను రాసింది షాపు అతను చదివాడు.
    "మీరు అడిగిన నవలలు లేవు వకేవక నవలవుంది." అన్నాడు.
    "అదే ఇవ్వు" గంభీరంగా అన్నాను.
    కాగితంలో చుట్టి షాక్ నవల నా చేతిలో పెట్టాడు. పుస్తకం చేతికి ఇచ్చింతరువాత మరేదైనా కోడు అనాలేమో నాకు తెలియదు. అందుకే తెలివిగా "కొన్ని పాతపుస్తకాల విషయం మాట్లాడాలి. అర్జంట్ గా వెళుతున్నాను. సరీగా పావుగంటలో వస్తాను. డేంజర్ సిగ్నల్ అనే నవల మీదగ్గర వుందేమో తీసి వుంచండి" అని షాపులోంచి ఇవతలకి వచ్చాను.
    నా మాటల్లో అర్జంట్ డేంజర్ సిగ్నల్ వాడటంతో షాపు అతను నేను చెప్పింది నమ్మాడు. నా మాటలు నమ్మినట్లు ముఖమే చెపుతున్నది.
    కొన్ని కొన్ని అదృష్టాలు అలా కలిసి వస్తుంటాయి. మారువేషంతో నేను పరిశోధనకి బైలుదేరటం ఏమిటి! అద్దె పుస్తకాల షాపులో కూర్చుంటే సుందరి షాపు అతనితో "రుధిరమందారం" కోడ్ చెప్పటమేమిటి! చెమిటివాడిగా నటించి ఆ కోడ్ విని షాక్ నవల గురించి తెలుసుకోబట్టి ఈరోజు షాక్ నవల సంపాదించగలిగాను.
    ఇక్కడ మరోప్రమాదం లేకపోలేదు. వాళ్ళవాడు వచ్చి రుధిరమందారం కోడ్ చెప్పి షాక్ నవల అడుగుతాడు. దాంతో వాళ్ళిద్దరిమధ్యా కొద్ది ఘర్షణ జరుగుతుంది. కొత్తవాళ్ళకి పరాయి వాళ్ళకి కోడ్ తెలిసేది లేదు. కాబట్టి వాళ్ళవాళ్ళలో గాభరా మొదలవుతుంది. అక్కడ నుంచి అనుమానాలు అపోహలు కోల్డ్ వార్ అన్నీ మొదలవుతాయి. దాంతో తొందరపాటు ప్రదర్శిస్తారు. గాభరాతో అతి జాగ్రత్తతతో వ్యవహరించబోయి బైటపడతారు. వాళ్ళు అలా ప్రవర్తించినప్పుడే మాపని తేలిక అవుతుంది.
    ఇహ నేను చేయవలసింది. షాక్ నవల చదవటం నవలలో ఏదైనా కోడ్ వుంటే పట్టటం. వెంటనే హెడ్ కోర్టర్స్ వారితో కేసువిషయం సంప్రదించటం అన్ని చకచక జరిగిపోవాలి.
    ఇంటికి వచ్చింతరువాత నాయర్ ఇచ్చిన మసాలా టీ తాగుతూ, షాక్ నవల చదువుతూ కూర్చున్నాను.
    బీమ్...బీమ్...బీమ్...
    వాచీలో శబ్దం నా చేతి నరాల ద్వారా నాకు సంకేతం అందిస్తున్నది.

 Previous Page Next Page