యమర్జంట్ కి సంబంధించిన సిగ్నల్ అది.
హెడ్ కోర్టర్స్ పిలుపు అది.
నేను డ్యూటీమీద లేను. ఇంట్లో వున్నానని తెలుసు.నాతో మాట్లాడాలన్నా నన్ను పిలవాలన్నా పై నుండి ఫోను వస్తుంది. కానీ ఇది ఫోనులో మాట్లాడే విషయం కాదన్న మాట.
నేను ఏ పరిస్థితులలో ఎక్కడవున్నా సరే ఆఖరికి పెళ్ళి పీటలమీద వున్నా నా వాచీ బీమ్ బీమ్ మంటూ సిగ్నల్స్ అందిస్తే నేను వున్న పళాన పరుగెత్తుకు వెళ్ళాల్సిందే. అందుకే మాబోటివాళ్ళం పెళ్ళివిషయాలు లాంటివి వస్తే ముందే తెలియజేసి లీవ్ తీసుకుంటాం. అప్పుడు అర్జంట్ అయినా నాకు చెప్పే పని నా కొలీగ్ కి చెప్పి డ్యూటీలో నియమిస్తారు. దేశానికి సంబంధించిన అత్యవసర విషయం అయితే ముందుగా లీవ్ తీసుకున్నా మేము డ్యూటీకి వెళ్ళక తప్పదు.
బీమ్...బీమ్...వినంగానే స్ప్రింగ్ లా పైకిలేచాను.
సునీల్ భాయ్ కి ఫోన్ చేశాను. "ఓసారి మా ఇంటికి రాకూడదా! చాలాకాలం అయింది నిన్ను చూసి. నీ రాక కోసం ఎదురు చూస్తుంటాను" అని.
ఈ ఫోన్ కాల్ ఎవరు విన్నా ప్రమాదం లేదు. ఎందుకంటే ఇవి మామూలు మాటలు. కాని ఇవి మామూలు మాటలు ఎంత మాత్రం కావు. నేను వెంటనే బైలుదేరి హెడ్ కోర్టర్స్ కి వస్తున్నానన్న కోడ్ ఇది.
నేను ఫోను చేసి కోడ్ వినిపించిన క్షణాలలో ఈ విషయం హెడ్ కోర్టర్స్ కి అందుతుంది. దానికి వేరే మార్గాలున్నాయి. ఫోన్ చేయటానికి వీలు లేకపోతే అలా వున్న పళాన బైలుదేరి వెళతాం. వెళ్లటం అనేది తప్పని సరి.
అయిదు నిమిషాలలో తయారయి నాయర్ తో చెప్పి ఇంట్లోంచి బయటపడ్డాను.
షాక్ నవల నా కోటు జేబులో వుంది.
నేను ఎక్కిన టాక్సీ ముందుకు దూసుకు వెళుతుంటే సీటుకి తల వాల్చి కళ్ళు మూసుకున్నాను.
19
నేను షాక్ నవల గురించి, ఆ కేసు స్వరూప స్వభావాలు, కేసులో ఇంతవరకు తారసపడ్డ వ్యక్తులు అన్నీ వివరంగా చెప్పాను.
నేను గాక ఆ రూమ్ లో నా సహచరులు నలుగురు హెడ్ ఆనంద్ ప్రేమ్ దత్. మరో ఇద్దరం వున్నాము.
"మిష్టర్ విజయ్! నీవు చెప్పింది బాగా అర్ధం అయింది. నీవు సరదాగా పరిశోధించిన "రుధిరమందారం" కేసు చిన్నదని నేను భావించటం లేదు. మన దేశంలో తలలు పండిన పెద్దవాళ్ళని హత్యచేసి ఈ హత్యల వెనుక కేంద్రప్రభుత్వం హస్తం వుందని ప్రచారం చేసి, కుల మతాలను రెచ్చగొట్టి దాంతో ప్రజలను భయభ్రాంతులకి లోనుచేసి ప్రచ్చన్న యుద్ధం మనలో మనకేపెట్టి ఆతర్వాత డైరెక్టుగా రంగంలోకి దిగి మన మీద యుద్ధం ప్రకటించటానికి కొన్ని దేశాలు పొంచి వున్నాయి. విదేశీయులకి తొత్తులుగా మారిన కొందరు దేశద్రోహులు ఆనాడు మనలో ఉండబట్టే బ్రిటీష్ వాళ్ళు మనని పాలించారు. ఆ తర్వాత ఎందరో త్యాగధనుల ఫలితం కృషి ప్రాణదానం మరెన్నో జరిగింతరువాత మనం సర్వస్వతంత్రులం అయ్యాము. ఇది జగమెరిగిన సత్యం.
ఇప్పటికీ విదేశీయులతో చేతులు కలిపి మన దేశాన్ని అమ్మేసే ప్రబుద్ధులు వున్నారు. వాళ్ళల్లో ఇందాక నేను పేరు చెప్పాను. ఆ మంత్రివర్యుడు కూడా వుండటం యీ దేశ ప్రజల దౌర్భాగ్యం. ఆయన్ని రహస్యంగా కల్సుకోవటానికి ఇరువురు విదేశీయులు వస్తున్నారు. ఆ విదేశీయులు రహస్య శాఖలో కీలకమైన వ్యక్తులని మన "రా" డిపార్టుమెంట్ ద్వారా వార్త వచ్చింది. వాళ్ళూ వాళ్ళూ కలిసి ఏమి మాట్లాడుకుంటున్నారన్నది మనకి అత్యవసరం. అందుకే యీ పని నీకు అప్పగిస్తున్నాను.
చూడు యంగ్ మాన్! నీవు ఆ కేసు పూర్తి చేసుకుని వచ్చే లోపల "రుధిరమందారం" కేసు మరొకరు చూస్తారు. బహుశా నీ పని వారంలో అయిపోతుంది. ఆ తర్వాత ఆ కేసును నీవే చూద్దువుగాని. ఇంక లే నీవు వెళ్ళాల్సింది ఎక్కడికి. వేయాల్సిన వేషం, గుర్తులు అన్నీ చూసుకుందువుగాని పద." ఆనంద్ ప్రేమ్ దత్ ఛయిర్లోంచి లేస్తూ అన్నారు.
నేను ఛయిర్ లోంచి పైకి లేచి "నాకు నా దేశ శ్రేయస్సే ముఖ్యం" అన్నాను గంభీర్యంగా.
"గుడ్!" అని చిరునవ్వుతో తల పంకించి పక్క రూమ్ లోకి ప్రవేశించగానే ఆ గది తలుపులు వాటంతట అవే మూసుకుపోయాయి.
20
"నాకు తెలుసు విజయ్! యీ కేసు సాధిస్తావని నీవు చేపట్టిన కేసుకి అపజయం వుండదని. నా భుజం మీద ఆప్యాయంగా తట్టి అన్నారు ఆనంద్ ప్రేమదత్.
నేను నవ్వి ఊరుకున్నాను.
అయిదే అయిదు రోజుల్లో ఇంత పెద్ద కీలకమైన కేసుని బయటకులాగి వాళ్ళ ఆటలు కట్టించటమన్నది గొప్ప విషయమే.
ఇంక నేను ఇంటికి వెళ్ళవచ్చు, రుధిరమందారం కేసుని చేపట్టవచ్చు అనుకుంటుండగా చావుకబురు చల్లగా చెప్పారు ఆనంద్ ప్రేమదత్.
"విజయ్! యీ కేసు నీకు అప్పగిస్తున్నానంటే దానికి కారణం వుంది. కొంత వరకు కేసును బైటికి లాగాము. కాని విషయం మొదట్లోనే వుండిపోయింది. ఆ ముఠాలో ఓ వ్యక్తి బయటికి వస్తేగాని మొత్తం బయటికి రారు. అలా వచ్చే వ్యక్తి ఎవరూ బయటలేరు. లోపల నుంచి వాళ్ళంతట వాళ్ళే బయటపడాలంటే మనలో ఒకళ్ళు ఆ అవతారం ఎత్తాలి. వాళ్ళలో వకరి రూపం పోలికలు అలవాట్లు పట్టాము. అతని పేరు కూడా పూర్తిగా తెలియదు. అయినా రూపం మార్చుకుని అతనిలా తయారయి ఆ ఊళ్ళో నాలుగు చోట్ల నాలుగు రోజులు తిరిగితే చాటు వ్యక్తులు బయటకి వస్తారు. ఆ తర్వాత కధ నీ చాకచక్యంతో బయటకి లాగాలి. నీ రూపం మారిస్తే అతనిలా తయారవుతావు. ఆ పాత్రకి నీ ఎత్తు లావు మారిస్తే అతనిలా తయారవుతావు. ఆ పాత్రకి నీ ఎత్తు లావు కూడా సరిపోతుంది. కనుక ఆ కేసు నీవు చేపట్టాలి."
"అలాగే. కేసు వివరంగా చెప్పండి" అన్నాను.
ఆనంద్ ప్రేమదత్ పూర్తి కథ వివరించారు.