నా అంచనా తప్పుకాలేదు. అద్దె పుస్తకాలషాపు అతను సుందరి కూడా మాట్లాడుకున్నారు. "రుధిరమందారం" మంచిపేరే ఎన్నుకున్నారు. "రుధిరమందారం" అని కోడ్ చెప్పిన వాళ్ళకే షాక్ నవల ఇవ్వటం జరుగుతుంది. వారం తర్వాత షాక్ నవలలు మార్కెట్ మొత్తానికి వస్తాయి. ఈ లోపల మాత్రం "రుధిరమందారం" కోడ్ చెప్పినవారికి మాత్రమే షాక్ నవా ఇస్తారంటే అర్ధం ఈ నవలద్వారా ఎవరికో రహస్య సమాచారం అందిస్తున్నట్లు తేటతెల్లంగా తెలిసిపోతూనే వుంది. ఇది వాళ్ళు ఎన్నుకున్న కొత్తపద్ధతి కావచ్చు.
ఆ రహస్య సమాచారం ఏమిటి?
వాళ్ళు ఎవరు?
ఈ సుందరి వాళ్ళకి ఎంతవరకు సంబంధం వుంది?
ఇంత జాగ్రత్తగా నవలల్లో కోడ్ ఇరికిస్తున్నారంటే, ఆ నవలలు ఎంత జాగ్రత్తగా రాయాలి?
ఈ నవలలు ప్రింట్ చేసే పబ్లికేషన్ ఎక్కడవుంది?
కొంతమందికే సమాచారం అందాలంటే వీళ్ళు ఇంత శ్రమపడనక్కరలేదు. కనుక దీనిలో చాలామంది వున్నారు. ఇది చాలా పెద్దకేసు అన్నది తెలుస్తూనే వుంది. దీన్ని పట్టాలంటే రెండు రోజుల్లో అయ్యేపని కాదు. ఇది నా ఒక్కడి వల్లా అవుతుందా?
ప్రశ్నలు, ప్రశ్నలు అన్నీ ప్రశ్నలే.
ముందు నేను చేయవలసింది రెండు పనులు. సుందరి వెళ్ళిన మూడు ఇళ్ళ అడ్రస్ లు సంపాదించటం ఆయా ఇళ్ళలో నివసించేవారి వివరం వివరంగా తెలుసుకోటం పబ్లికేషన్ వుందోలేదో చూడటం.
మరో ప్రశ్న. ఈ కేసు నేనే తిరిగి సాధించాలా! ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలా!
నా వృత్తి రెండు రకాలు. కేసుని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటం అంటే కేసు వివరాలు, నా అనుమానం మా డిపార్టుమెంటులో పై అధికారులకు తెలియచేయటం అక్కడితో నాపని అయిపోతుంది. వాళ్ళు ఈ కర్సు తీరుతెన్నులు బాగా పరిశీలించి కేసు నాపైనా అప్పగించవచ్చు. మరెవరికైనా నాబోటివారికి అప్పగించవచ్చు. కానీ ఇక్కడ ఓ చిక్కువుంది. నేను స్వయంగా...
"అయ్యా! దిగండి" అన్న రిక్షా అబ్బి పిలుపుతో నా ఆలోచనలకి సడన్ బ్రేక్ పడింది.
నేను ఎంత ఆలోచిస్తున్నా పరిసరాలు మర్చిపోను. అలాంటిది రిక్షా ఆగింది కూడా గమనించలేదంటే ఈ కేసు నా మీద ఎంత ప్రభావం చూపిస్తున్నదో తెలిసిపోతున్నది.
రిక్షా దిగి రిక్షా అబ్బికి డబ్బులు ఇచ్చాను.
రిక్షా వెళ్ళిపోయింది.
నేను వెళ్ళాల్సింది పక్కవీధికి. సుందరి నిన్నటిరోజు వెళ్ళిన మొదటి ఇల్లు పక్కవీధిలో వుంది. అక్కడికి నడిచి వెళ్ళదలిచి ఇక్కడ రిక్షా దిగాను.
నే ఎక్కివచ్చిన రిక్షా పూర్తిగా కనుమరుగైందాకా చూసి ఆ తర్వాత వేగంగా నడుస్తూ పక్కవీధికి బయలుదేరాను.
17
నాయర్ భోజనం వడ్డిస్తుంటే అన్నాను "ఇలా తప్ప మరో రకంగా వంటచేయటం నీకు రాదా?"
నాయర్ ముఖం చిన్నబోయింది. "వంట బాగుండలేదా?" భయపడుతూ అడిగాడు.
"వంట బాగుండలేదని నేను చెప్పానా!"
"ఉహూఁ"
"పోనీ ఫలానా పదార్ధం బాగుండలేదని చెప్పానా?"
"ఉహూఁ"
నేను పక్కున నవ్వాను. అతడు తెల్లబోయాడు.
"ఈ రోజు అన్నీ ఒకదాన్ని మించి మరొకటి బాగున్నాయి. ఎన్నని తినను. రోజూ ఇలా కమ్మగా చేసిపెడితే గణపతిగారి బొజ్జ నాకు వచ్చేస్తుంది. శరీరంలో కిలోలకొద్దీ ఫ్యాట్ తయారయినా ఆశ్చర్యపోనక్కరలేదు. రేపటినుంచీ కాస్త ఉప్పు ఎక్కువ వేస్తుండు లేకపోతే పదార్ధాలు మాడపెట్టు."
"ఇదా విషయం. చేసినపదార్ధాలన్నీ చెడిపోయా ఏమోనని హడలి చచ్చాను" అతడు తృప్తిపడుతూ అన్నాడు.
భోజనం దగ్గర కొద్దిసేపు నాయర్ తో మాట్లాడి తృప్తిగా భోంచేసి లేచాను. అన్నీ పదార్ధాలూ బాగుండి కాస్త ఎక్కువ తిన్నానేమో భుక్తాయాసం అనిపించింది.
బెడ్ రూములోకి వెళ్ళి ఈజీచైర్ లో పడుకుని ఆలోచిస్తూ కళ్ళుమూసుకున్నాను.
అందాల సుందరి కళ్ళముందు ప్రత్యక్షమయింది.
సుందరి ఎంతచక్కనిది. ఈ అందాల సుందరి పేరు సాంతం తెలుసుకోలేకపోయాను. రూపానికి తగ్గ పేరువుందా? లేక అంకాళ్ళమ్మలాంటి పేరా? ఆమెది ఏ పేరయితేనేమి నేరస్తులతో చేయి కలిపింది. అందుకే ఆమె రూపం నన్ను ఆకర్షించినా నేరస్తురాలు అనిపించగానే మనసంతా చేదు తిన్నట్లు అనిపిస్తున్నది.
ఈ నాలుగు రోజుల పరిశోధనతో కొంత సమాచారం సేకరించగలిగాను. అందాల సుందరి మొదట వెళ్ళిన మేడ డాక్టర్ సుధీర్ ది. ఒక యాక్సిడెంట్ లో అతని చెయ్యి పూర్తిగా అతని నుంచి దూరం కావటంతో ప్రాక్టీస్ మానేసి వున్న డబ్బుతో తింటూ పెళ్ళాం బిడ్డలతో ఇంట్లో వుండిపోయాడు. ఆ మేడలో కింద భాగంలో వుండి పై భాగం అద్దెకి ఇచ్చాడుట.
అందాల సుందరి వెళ్ళిన రెండో ఇల్లు డాబా. దానిలో నివసించే ఆయన పేరు శ్యామలరావు బిజినెస్ చేస్తుంటాడు. పెళ్ళాంతప్ప బిడ్డలులేరు. వచ్చేపోయే బంధుజనాభా ఎక్కువట.
మూడు అందాల సుందరి నివసించే ఇల్లు. అయితే అది సొంతఇల్లు కాదు అద్దెకొంప. తండ్రి పక్షవాతంతో మంచాన పడ్డాడు. తల్లి వుంది. సుందరికి చెల్లెళ్ళు తమ్ముళ్ళు కూడా ఎక్కువే. తండ్రికి వచ్చే ఫింషన్ డబ్బులతో అందరూ తిండి తినటం ఈ కరువు రోజుల్లో అసాధ్యం. అందుకే బి.ఎ. పాస్ అయిన సుందరి యేదో కంపెనీలో ఉద్యోగం చేస్తున్నదిట. సుందరి అసలు పేరేమిటోగానీ అన్న ముద్దు పేరు వుంది. అందరూ బన్నీ అనే అంటారు.