"మీ ముఖం అంతా చెమటలుపట్టాయి. అందువల్ల అదోలా అనిపించి వుంటుంది."
"ఆ....మరే....మరే....అంతా అయివుంటుంది!" అంటూ సామ్రాజ్యలక్ష్మి పైటకొంగుతో గబుక్కున ముఖం తుడుచుకుని కాఫీ కలపటానికి వంటింట్లోకి వెళ్ళింది.
వంటగది గుమ్మం దగ్గరికి వచ్చాడు బోసుబాబు.
"వదినా! మనింట్లో ఎర్రసిరా బాటిల్ వుంది కదూ!" అడిగాడు సామ్రాజ్యలక్ష్మిని.
"ఆ....వుంది మీ అన్నయ్య గదిలో ఇప్పుడే కావాలా! తెచ్చి యివ్వనా!" డికాషన్ లా పాలువంచుతూ అడిగింది.
"వద్దులే! నేను తీసుకుంటాను. ఓ కప్పు సగానికి పంచదార కావాలి ఎందుకు? అని మాత్రం అడగవద్దు" అన్నాడు బోసుబాబు.
ఇంకేం కావాలో, ఈయనగారు ఇంకేం చెయ్యబోతున్నాడో అనుకున్న సామ్రాజ్యలక్ష్మి. కప్పులోసగానికి పంచదారపోసి, ఇటు కాఫీ, అటు పంచదార కప్పు రెండూ ఇచ్చింది.
బోసుబాబు కాఫీ తాగేసి, అన్నయ్య గదిలోకి వెళ్ళి ఎర్రసిరా బాటిల్ తీసుకున్నాడు. ఎర్రసిరా బాటిల్ తోనూ, పంచదార కప్పుతోనూ, తన గదిలోకి వెడుతూ, "వదినా! నా కోసం ఎవరయినా వస్తే నేను యింట్లో లేనని చెప్పు! గంటదాకా నన్ను పిలవద్దు!" అని తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసేసుకున్నాడు.
బోసుబాబు తన గదిలోకి తీసుకువెళ్ళిన ఈ వస్తువులతో ఎంత ఆలోచించినా సామ్రాజ్యలక్ష్మి బుర్రకి "అతను వాటితో ఏం చేస్తాడో" తెలియలేదు.
కాసేపు బోసుబాబు గదిముందు తచ్చాడింది. కాలుకాలిన పిల్లిలా అటూ ఇటూ తిరగటం తప్పించి ఏమాత్రం ఫలితం కనిపించలేదు.
బోసుబాబు గది తలుపులకి చెవి ఆనించి నిలబడి, లోపలి నుంచీ ఏమైనా శబ్దాలు వస్తాయోమో అని జాగ్రత్తగా ఆలకించింది.
"ఇస్ ....ఇస్ ...." అన్న శబ్దం మాత్రం మధ్య మధ్య నాలుగైదుసార్లు వినబడింది. ఆ తరువాత నుంచీ ఎటువంటి శబ్దమూ లేదు. ఆ గదికి అటు పక్కనున్న కిటికీ కాస్త ఎత్తులో వుంటుంది.
ఆ క్రితం రోజు ఆ కిటికీ తలుపుకి ఎవరూ చూడకుండా చిన్నకంత పెట్టింది సామ్రాజ్యలక్ష్మి ఆ కంతలోంచి బోసుబాబు గదిలోకి చూడాలని ఆమె ప్రయత్నం.
క్రింద కుర్చీపీట వేసుకుంటే కానీ, కిటికీ కంతలోంచి లోపలికి చూడటానికి వుండదు, ఆ పని వుత్తప్పుడు చేద్దామా! అంటే, ఇంటిలో ఎవరో ఒకరు వుంటూ వుంటారు. ఇప్పుడు సమయం కలిసి వచ్చింది.
గొప్ప రహస్యమేదో తను కనిపెట్టబోతోంది.
ఈ అదృష్టం తనకి మాత్రమే పట్టింది.
సామ్రాజ్యలక్ష్మి ఆనందంతో తబ్బిబ్బు అవుతోంది.
వెళ్ళి వీధి తలుపు గడియపెట్టి వచ్చింది. చడీ చప్పుడు కాకుండా కుర్చీపీట తీసుకువెళ్లి కిటికీ దగ్గర వేసింది.
కుర్చీపీట ఎక్కి తను అంతక్రితం రోజు కిటికీకి పెట్టిన కంత నుంచీ బోసుబాబు గదిలోకి చూడసాగింది.
ఇప్పుడు బోసుబాబు గదిలో కొంతభాగం కనిపిస్తోంది. ఆ కనిపించే భాగంలోనే బోసుబాబు వున్నాడు.
గదిలో వున్న బోసుబాబు వింతవింత పనులు చేస్తున్నాడు.
అవన్నీ గుడ్లప్పగించి చూస్తోంది సామ్రాజ్యలక్ష్మి.
గదిలో వున్న బోసుబాబు ....
బొగ్గు ముక్కల్ని చేతిలోకి తీసుకున్నాడు "వుఫ్....వుఫ్" అని వూదాడు. కప్పులో వున్న పంచదార పలుకుల్ని తీసుకుని బొగ్గు ముక్కలమీద వేశాడు.
ఆ తరువాత ఆ బొగ్గు ముక్కల్ని జాగ్రత్తగా ఓ ప్రక్కగా పెట్టాడు, ఒక చేత్తో విసనకర్ర పట్టుకుని, బొగ్గు విసురుతూ, ఒక్కోక్క కుంకుడు కాయనీ ఆ బొగ్గుల మీదకి వేయటం మొదలుపెట్టాడు.
ఆ తరువాత లేచి వంటికాలి మీద నుంచుని వేళ్ళను ముడిచి పాము ఆకారంలో పెట్టి, "ఇష్....ఇష్...." అన్నాడు.
ఈ తఫా,
పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. సబ్బుముక్కతో నిలువునా చెంచాగ్రుచ్చి, ఆ నిలువునా చెంచాతో సహా సబ్బు ముక్కని నడినెత్తిమీద పెట్టుకున్నాడు. గ్లాసు చేతిలోకి తీసుకొని ఎడంచేత్తో గ్లాసు పట్టుకుని నీళ్ళు వంపు కుంటున్నట్లుగా కుడిచేతిలోకి వంపుకుని ,చేతిలో నీళ్లు లేకపోయినా వుత్తుత్తిగా ఆ నీళ్ళని నోట్లో పోసుకుని పుక్కిలించి ఉమ్మేసినట్లు ఉమ్మేశాడు.
ఆ తతంగం కొద్దిసేపు సాగిన తరువాత, సబ్బు బిళ్ళని గోడ వారగా పెట్టి, దానికి సాష్టాంగ నమస్కారం చేశాడు. లేచి టపటపా చెంపలు వేసుకున్నాడు. ఉల్లిపాయ ముక్కల్ని టెంకాయ చిప్పలో పోసి ఆ ముక్కలమీద ఎర్రసిరా పోశాడు. సబ్బు ముక్క ఎదురుగా వాటిని పెట్టి నైవేద్యం పెట్టినట్లు చేతిని ఆడించాడు.
ఈ తతంగం పూర్తయిన తరువాత.
పీటని వాటికి అడ్డంగా పెట్టాడు. ఆ తరువాత లేచి నుంచొని నాలుక బయటకి చాపటం లోపలికి తీసుకోవటం చేస్తూ వుండిపోయాడు. కళ్ళు చక్రాల్లా తిప్పుతూ గాల్లోకి చేతులు ఆడించాడు. క్రాఫ్ లోకి చెయ్యి పోనిచ్చి రెండు అంటే రెండు వెంట్రుకల్ని పుటుక్కున త్రెంచి వాటిని చేతిలో పట్టుకుని తీక్షణంగా వాటికేసి చూస్తూ వుండిపోయాడు.
బయట నుంచీ బోసుబాబు చర్యలని గమనిస్తూన్న సామ్రాజ్యలక్ష్మి ముందు ఇదంతా పిచ్చివాడి చర్యలు అనుకుంది.
ఆ తరువాత ఇదేమిటబ్బా! అనుకుంది. కాసేపు అయ్యేసరికి గుర్తుకు వచ్చింది 'చేతబడి' అన్నమాట ఆమెకి__ మరిదిగారు క్షుద్ర శక్తుల్ని ఆరాధించటం లేదు గదా?"
ఆ ఆలోచన రాగానే.
సామ్రాజ్యలక్ష్మి అరికాళ్ళల్లో వణుకుపుట్టి, అది మాడుదాకా జరజరా ప్రాకింది, దాంతో ఒక్కసారిగా బిగుసుకుపోయింది.
ఆ ఆలోచన రానంతవరకూ, మరిది చేసే పనులు మహా క్యూరియాసిటీతో గమనించింది. ఎప్పుడయితే 'చేతబడి' గుర్తుకు వచ్చిందో. ఆమె శరీరం ఆమె ఆధీనంలో లేకుండా పోయింది.
సామ్రాజ్యలక్ష్మి వేసుకున్న కుర్చీ పీటకి ఒకకోడు సరీగా లేదు. బేలన్సుగా నుంచోకపోతే ఆ పీట ఒక పక్కకి ఒరిగే ప్రమాదముంది.
సామ్రాజ్యలక్ష్మి ముందు నుంచోడమయితే బాలెన్స్ తోనే నుంచుంది. కాళ్ళల్లో వణుకు బయలుదేరటం, కుర్చీపీటమీద సరీగా కాలు ఆనకపోవడంతో, కుర్చీపీటమీద నుండీ 'దభేల్' న క్రిందపడటం ఆ వెంటనే "వామ్మో!" అన్న అరుపు ఏకకాలంలో జరిగాయి ఇవన్నీ.
కుర్చీపీట పక్కకి పడింది.
కిందపడ్డ సామ్రాజ్యలక్ష్మి దొంగచాటుగా చూడడం అనే తప్పు చేసింది కాబట్టి గబుక్కున పైకి లేవబోయింది. నడుము మోకాలూ కలుక్కుమన్నాయి. దానితో క్రిందనుండి లేగాలేకపోయింది.
అదే సమయంలో బోసుబాబు గది తలుపులు తీస్తున్న చప్పుడు అయింది.
అదోరకం తెలివితేటలు ఎక్కువే వున్న సామ్రాజ్యలక్ష్మి, జెర్రిగొడ్డులాగా పక్కకి పాకింది. వీలైనంతగా ఆ గోడకి దూరంగా వెళ్ళింది. ఇప్పుడు అక్కడినుంచీ పైకిలేవాలంటే వృషభాసనమో, గజాసనమో వేసి అతి కష్టం మీద లేవాల్సిందే కానీ, టక్కున మాత్రం లేవలేదు.