Previous Page Next Page 
అడుగడుగునా... పేజి 20


    విపరీతంగా దాహం వేస్తున్నది అవంతికి. అయినా అలాగే పడుకుంది. శరీరం బాగా అలసిపోవటంతో కళ్ళు మూతలుపడ్డాయి. అరగంట తర్వాత....

    హఠాత్తుగా మెలుకువ వచ్చింది అవంతికి.

    కన్ను పొడుచుకున్నా కానరాని గాఢాంధకారం.

    అవంతి చటుక్కున లేచి కూర్చుంది. తను ఎక్కడ వున్నదో క్షణం అర్ధంకాలేదు. కళ్ళు ఒక్కసారి గట్టిగా మూసుకుని తెరిచింది. అంతా గుర్తుకు వచ్చింది.

    దీర్ఘంగా నిట్టూర్పు విడిచి లేచింది. తడుముకుంటూ పక్కగదిలోకి దారి తీసింది.

    నిద్రపోయింది అరగంట. కాని చాలాసేపు నిద్రపోయానేమో అనుకుంది అవంతి.

    తనకి ఎందుకు మెలుకువ వచ్చిందో అవంతికి అర్ధమైంది. నిద్రలో నోరు ఆర్చుకుపోవటం, ఫ్యాను వేసుకోక పోవటం వల్ల మూసివున్న గదిలోకి గాలి రాకపోవటం వల్ల శరీరమంతా చమటతో చిరాకుగా తయారయి మెలుకువ వచ్చింది.

    అవంతి పక్క గదిలోకి వెళ్ళి పదినిమిషాలు గోడని తడిమితే స్విచ్ బోర్డు తగిలింది. స్విచ్ ఆన్ చేసింది.

    ఛమక్

    గదంతా పరుచుకున్నట్లు వెలుతురు.

    అన్వేషణలో పడింది అవంతి.

    కిరసనాయిలు స్టవ్ కొన్ని డబ్బాలు సీసాలు, వాటిల్లో కొద్దిపాటి సరుకులు వున్నాయి. చాలా కొద్దిగా చిన్న సైజు వంట సామాన్లు వున్నాయి. కాఫీ పొడి, పంచదార, ఓ బిందే, ప్లాస్టిక్ బక్కెట్, కూజా లాంటివి కూడా వున్నాయి. అలాంటివే మరికొన్ని.

    అవంతి ముందుగా నాలుగు గ్లాసుల నీళ్ళు తాగింది. ఆకలి దంచేస్తుంటే అన్నీ తీసి చూసింది. కిలో పంచదార, పావుకిలో బెల్లం గడ్డ, అరకిలో పెద్ద వుల్లిపాయలు వున్నాయి. తినే పదార్ధాలు అవే. అవి తినటం ఎలా?

    హార్లిక్స్ సీసాలో అడుగున నాలుగు చంచాల హార్లిక్స్ పొడి కనపడింది. గబగబా స్టవ్ వెలిగించి గిన్నెకు సగానికి నీళ్ళు పెట్టింది. నీళ్ళు కాగింతరువాత మొత్తం హార్లిక్స్ వేసి రెండున్నర గ్లాసుల హార్లిక్స్ తయారు చేసుకుంది. వేడి వేడిగా మొత్తం హార్లిక్స్ తాగింది.

    అవంతి ప్రాణం యిప్పుడు హాయిగా వుంది. ఆ గదిలోంచి యివతలకి వచ్చింది. ఫుల్ గా ఫ్యాన్ వేసుకుంది.

    ఎటాచ్ బాత్ రూమ్ కావటంతో బాత్ రూమ్ కి కూడా వెళ్ళి వచ్చింది. బాత్ రూమ్ లో ఒక తొట్టి, రెండు బక్కెట్లు వున్నాయి. నీళ్ళు మాత్రం అరబక్కెటు వున్నాయి. దానిలోని రెండు చెంబులు నీళ్ళు ఇప్పుడు పారబోసింది.

    చీకట్లో అన్వేషణ అవంతికి నచ్చలేదు. చూసింది చాల్లే తెల్లారదా అన్నీ మరోసారి చూడకపోనా! అనుకుంది. మళ్ళీ వెళ్ళి ఆ గదిలో లైటు ఆర్పివచ్చి మంచంమీద హాయిగా పడుకుంది. ఫుల్ స్పీడ్ లో ఫ్యాన్ తిరగటం వల్ల కష్టం అనిపించలేదు. కడుపు నిండుగా చల్ల లేకపోయినా హార్లిక్స్ వుంది.

    అవంతి గ్రహించని పెద్ద చిక్కులు ఆ ఇంట్లో కొన్ని వున్నాయి. అదేం తెలియని అవంతి తెల్లారి గురించి ఆలోచిస్తున్నది.

    ఈ ఇంట్లో ఏమివున్నా లేకపోయినా కాసిని బియ్యం వున్నాయి. జయా పచ్చళ్ళు వున్నాయి. పాలు గట్రా లేవు కాబట్టి ఉదయం వేడిగా ఉత్త డికాషన్ తాగాలి. అన్నం ఒకటి వండుకుని పచ్చళ్ళతో ఆ కూడుని కడుపులోనికి పోనివ్వాలి. మధ్యాహ్నం రెస్ట్. సాయంత్రం బ్లాక్ కాఫీ. రాత్రికి అదే కూడు. అర్దరాత్రి చెక్కేయటం. బస్.

    అవంతి చాలా తేలిగ్గా ఆలోచించింది. ఈ ఇంటికి నేను మహారాణీని అనుకుంది. ఆపద తప్పిపోయి నిలవనీడ దొరకటంతో.

    ఆ రెండు గదుల్లో వున్నా నీళ్ళు....ఆ గదిలో పావు కూజా నీళ్ళు అనగా నాలుగు గ్లాసుల నీళ్ళు. బాత్ రూమ్ లో నాలుగు చెంబుల నీళ్ళు. అంతకుమించి నీళ్ళులేవు. పెరటి తలుపుతీస్తే తప్ప లోపలికి నీళ్ళు తెచ్చుకునే మార్గంలేదు. పెరటివేపు తలుపుకి తాళం వుంది. తాళం చెవులు లేవు. ఆ తాళం గాని తలుపులుగాని పగలగొడితే అవతల ఏముందో అవంతికి తెలియదు.

    పెరటివేపు తలుపు తీస్తే సన్నని చిన్నదారి వుంది. ఆ దారి ఇంటివాళ్ళ ఇంట్లోకి వెళుతుంది. ఆ ఇంట్లో సింహాలంత కుక్కలు, పులుల్లాంటి పదిమంది మనుషులు వున్నారు. ఓ పక్కగా కాస్త స్థలం మిగిలిందని చిన్న గెస్ట్ హౌస్ లా రెండుగదులు వేశారు. అవే ఇపుడు చంద్రకి అద్దెకొంప అయింది. ఇప్పుడు అవంతికి తాత్కాలికంగా రక్షణ ఇచ్చింది ఇదే.

    పెరటి తలుపుతీసి పారిపోవటానికి లేదు. పెరట్లో వీళ్ళగుమ్మం పక్కన బోరింగ్ వుంది. ఆ బోరింగ్ పంపుకొట్టి ఇంట్లోకి నీళ్ళు తెచ్చుకుంటాడు చంద్ర. బోరింగ్ పంపు కొడుతుంటే అక్కడ నుంచున్న వాళ్ళు ఇంటి వాళ్ళకి కనపడతారు. అవంతి తాళం పగలగొట్టో పెరట్లోకి వెళితే ఇంటివాళ్ళు చూడటం ఖాయం. పైగా ఆ బోరింగ్ కొడుతుంటే రాక్షసుడు కేక వేసినట్లు బండగొంతు ముసలాగు మూలిగినట్లు, గాడిద ఆరున్నొక్కరాగం ఆలపించినట్లు, మధ్యమధ్యలో పంటికింద రాయిలా కటక్ కటక్ లు. మొత్తానికి వింతధ్వనులు ఈ బోరింగ్ పంపుద్వారా నీళ్ళతోపాటు వెలువడుతుంటాయి. ఇంటివాళ్ళు తెలుసుకోలేదుగాని వింతసామానుల లిస్ట్ లో బోరింగ్ ని చేర్చేవారే.

    ఇదేమీ తెలియని అవంతి హాయిగా నిద్రపోవటానికి ప్రయత్నిస్తున్నది. తాత్కాలికంగా రక్షణ దొరికింది, తప్పించుకోవడానికి తొందరేముంది? ఒక్కరోజు అజ్ఞాతవాసంలో వుంటే కష్టాలు తీరిపోతాయి అనుకుంది అవంతి. అలా వుండటంకూడా ఒకోసారి ఆపదలకు మూలం అని అవంతి ఏమన్నా కలగందా? కొన్ని విషయాలలో అవంతి కూడా మామూలు మనిషే.    

 Previous Page Next Page