Previous Page Next Page 
అడుగడుగునా... పేజి 21

   
    అవంతి కొద్దిసేపు మంచంమీద అటూ ఇటూ దొర్లి ఆ తర్వాత గాఢ నిద్రలోకి జారుకుంది.


                           *    *    *


    పెళ్ళిపందిరి కళకళ లాడిపోతున్నది.

    పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఖరీదైన మనుషులు. ఇంపోర్టెడ్ స్ప్రేలు, కునేగా మరికొందరు, మల్లెల సౌరభాలు, నేతి పిండి వంటలు ఘుమఘుమలు, కూల్ డ్రింక్స్ తీయని వాసనలు. ఖరీదైన సిగరెట్ పొగలు. పట్టుచీరల గరగరలు. సిల్కు ధోవతులు జుబ్బాలు. సూటు బూతు వాళ్ళు గాక ఫాషన్ పెరేడ్ లో పాల్గొన్నట్లు వివిధ రకాల డ్రస్ లు. అక్కడ ఏది చూసినా ఎవరిని చూసినా డబ్బు ప్రవహిస్తున్నట్లు వుంది.

    ఎవరు ఏది కోరితే అది అందుబాటులో రెడీగా వుంది. అలా రెడీ చేస్తున్న నౌకర్లు నేతగుడ్డలు ధరించినా అవి ఒక రంగువి డ్రస్ గా కుట్టించినవి కావటంతో వాళ్ళు నౌకర్లని తెలిసిపోతున్నారు. వడ్డనకి సర్వర్ దుస్తుల్లో వేరే వాళ్ళు వున్నారు. దేనికీ యిబ్బందిలేదు. ఎవరికీ యిబ్బంది లేదు. సిబ్బంది దండుగా వుంది మరి. ప్రతి పనికొక హెడ్డు. అతనికింద పది మంది నౌకర్లు ఇక యింట్లో వాళ్ళు చేసేపని ఏముంది. అంతా వాళ్ళే చూసుకుంటున్నారు.

    పెళ్ళి కొడుకు తాలూకా వాళ్ళు పందిట్లోకి వచ్చే ముందు. సరదాగా మగాళ్ళంతా చిన్నా పెద్దా డాన్స్ మొదలు పెట్టారు. బ్యాండ్ మేళం డ్రమ్స్ లయగా మోగాయి. పెళ్ళి కొడుకు ముఖంలో పెళ్ళి కళకన్నా పీరియస్ నెస్ ఎక్కువగా వుంది. కళ్ళు చికిలించుకొని దీర్ఘాలోచన చేస్తున్నాడు. దేన్ని గురించో.

    ఇవన్నీ పెళ్ళి యింట్లో దర్జాగా చాలా సహజంగా వున్నాయి. ఎవరికీ తెలియనివి చాప కింద నీరులా చల్లగా మెల్లిగా జరిగి పోతున్నాయి. మంచి ఖరీదైన దుస్తులు ధరించి కొంతమంది పెళ్ళి వారిలో కల్సిపోయారు. వారి జేబుల్లో ఫవర్ ఫుల్ పిష్టల్స్ చిన్నవి వున్నాయి. అత్యంత శక్తివంతమైన రివాల్వర్లు ఆడవాళ్ళ వ్యానిటీబ్యాగుల్లో భద్రంగా వున్నాయి.

    పెళ్ళికి గంట ముందు పెళ్ళి కూతురు ఇంటి యిలవేల్పుకి పూజ చేయాలి. ఇష్టదైవం ఆ యింటి యిలవేల్పుకి పెళ్ళి కూతురు వంటరిగా ఆ గదిలో కూర్చుని పూజ చేస్తున్నది. మేలి ముసుగులో తల వంచుకుని కుంకుమ అక్షింతలు పూజ చేస్తున్న పెళ్ళి కూతురి మనసు చాలా ఆందోళనగా వుంది. మేలి ముసుగులో తలదించుకొని అటు తిరిగి కూర్చున్న పెళ్ళికూతురి ముఖ కవళికలు ఎవరికీ తెలియటం లేదు. మధ్యలో ఎవరో రావటం ఏదో మాట్లాడి వెళ్ళటం చేస్తున్నారు. ఆమె ఊ....ఆ....అంటున్నది అంతే.

    పెళ్ళి కొడుకు మండపంలోకి వచ్చాడు. పెళ్ళికూతురు మండపంలోకి రావాలి. రాగానే పెళ్ళి తంతు ఆరంభమవుతుంది.

    వాకిట్లో బాణాసంచా మోగుతున్నది. మండపం దగ్గర బ్యాండ్ మేళం సౌండ్ పెరిగింది. మండపం దగ్గరకు బులెట్ లు దూసుకువచ్చాయి.

    ఒక్కసారిగా ఆ ప్రదేశమంతా కంపించి పోయింది.

    ఢాం ఢాం లతో అక్కడంతా మారుమోగి పోయింది. అందరూ ఒక్కసారిగా లేచారు.

    ఏం జరిగింది!

    అటూ ఇటూ పరిగెత్తే వాళ్ళతో పందిరంతా పరిచిన కుర్చీలు అడ్డు తగలటంతో కొందరు ముందుకు తూలి పడిపోతూ చిన్నపాటి  ఆక్రందనలు చేస్తూ....అంతా అలజడి.... తారుమారు అయింది.

    పందిట్లో జరిగేది అందరికీ తెలియదా! బాణా సంచాలోని టపాకాయల మోత పెరిగిందేమిటి? బ్యాండ్ మేళం వాళ్ళ పిచ్చి పట్టిందా! వెర్రిగా డ్రమ్స్ బాదుతున్నారేమిటి? ఉన్నట్టుండి పందిరంతా దట్టంగా పొగ చుట్టుకుంది. గ్యాస్ బాంబులు స్మోక్ బాంబులు రంగంలోకి దిగి విజృంభించాయి. ఎవరిగోలలో వారు వున్నారు.

    "మేడమ్!" ఆమె వచ్చి పిలిచింది.

    అవంతి పైకి లేచింది.

    ఆమె రెండే రెండు ముక్కలు చెప్పి గిరుక్కున తిరిగి వెళ్ళిపోయింది.

    అవంతి ఒకే ఒక నిమిషంలో నిర్ణయం తీసుకుంది.

    రాకెట్ కన్నా వేగంగా పరుగు....పరుగు....పరుగు....ఎటు చూసినా గాడాంధకారం. ఎదురు రాళ్ళ దెబ్బలు కాళ్ళనిండా గుచ్చుకుంటున్న ముళ్ళు వంటి మీద పాకుతున్న కీటకాలు. చివరికి పెద్ద అగాధం. అందులో పడి....లోలోపలికి జారిపోతూ....ఆ మూర్తికి దూరంగా....బహుదూరంగా....కెవ్వుమని లేచి కూర్చుంది అవంతి.

    ఫ్యాను ఫుల్ గా తిరుగుతూనే వుంది. శరీరమంతా ముచ్చెమటలు దిగజారుతున్నాయి. కళ్ళు పత్తి కాయల్లా తెరిచి వున్నా గాడాంధకారం. నోరు ఆర్చుకుపోతున్నది. గుండె చిక్క బట్టినట్లు మెదడంతా మొద్దుబారినట్లు....

    అవంతి కళ్ళు గట్టిగా మూసుకుని మనసుని ఆధీనంలోకి తెచ్చుకుంది.

    తను ఎక్కడ వుందో అవంతికి అర్ధమైంది. జరిగినదానికి కాస్త మార్పుగా కల. భయంకరమైన కల కంది అంతే.

    అవంతి అంతలోనే మామూలు మనిషి అయింది. లేచి తడుముకుంటూ పక్కగదిలోకి వెళ్ళి లైటు వేసుకుని కూజాలో వున్న నాలుగు గ్లాసుల నీళ్ళు ఒక్క చుక్క మిగల్చకుండా తాగింది. బాత్ రూమ్ లోకి వెళ్ళి కాళ్ళూ చేతులూ కడుక్కుని బొక్కెటలో నీళ్ళు కూడా ఖాళీ చేసింది. పక్క గదిలో లైటు ఆర్పి వచ్చి చాలా నెమ్మదిగా కిటికీ తెరిచి ఆ కొద్ది సందులోంచి బైటికి చూసింది.

 Previous Page Next Page