Previous Page Next Page 
అడుగడుగునా... పేజి 19


    "మా మేనకోడలు పెళ్ళి దుస్తులతో పారిపోయింది."

    ఆ మాట వినంగానే అవంతికి వాళ్ళెవరో అర్ధమైంది. ఊపిరి బిగపట్టి అలానే వుండిపోయింది.

    "మీరు చెప్పేది ఎలా వుందంటే బోడిగుండుకీ మోకాలుకీ మధ్య ముడి పెట్టినట్లుగా వుంది. మీ మేనకోడలు పారిపోవటానికి నాకూ సంబంధం ఏమిటి?"

    "విషయం అది కాదండి. ఆ పిల్ల మా గడుగ్గాయి. ఇటే పారిపోయి వచ్చింది. మా కంట పడకుండా మీ యింట్లో దూరిందేమో అని!...."

    ఇదా మీ అనుమానం మీ మేనకోడలు మా యింట్లో దూరి ఏ మంచం కిందనో నక్కి వుండవచ్చు కాని....

    చంద్ర చెపుతుంటే అవంతి అరివీర సాహస భయంకర స్త్రీమూర్తి గువ్వలా ముడుచుకుని మరింత బీరువా మూలకి నక్కి భయంతో బిగుసుకు పోయింది.

    చంద్ర చెబుతూ కాని....దగ్గర ఆగిపోయే సరికి డేగ కళ్ళు వాడు "ఊ.... కానీ తర్వాత ఏమిటండీ ఆతృతగా అడిగాడు.

    "కానీ తర్వాత అర్ధణా కాని కిందది దమ్మిడి. మీ మేనకోడలు మా యింట్లో దూరి నక్కిందని మీ అనుమానం అయితే నే వుండే ఈ రెండు గదులూ మీరు అంగుళం అంగుళం సోదించవచ్చు. కాని అయ్యా! నేను పది నిమిషాల క్రితం స్నానానికి వెళ్ళేముందు వీధి తలుపు అంటే యిది లోపల గడియ వేసి వెళ్ళాను. స్నానం చేసివచ్చి ఇల్లు కాస్త సర్దుకుని ఇప్పుడు ఊరికి వెళ్ళటానికి పెట్టె సర్దుకుంటున్నాను. మరో పది నిముషాలలో తలుపు తాళం వేసి బస్సు స్టాండుకి వెళ్ళాలి. ఈ పది నిమిషాలలో నేను సామానులు సర్దుకుంటాను. మీకు అనుమానం తీరకపోతే నే వుండగానే ఈ రెండు గదుల్లోనూ మీ నల్లపూసంత మేనకోడల్ని వెతుక్కోండి. నాకు అభ్యంతరం లేదు" అంటూ చంద్ర గుమ్మం పక్కకు తొలగి నుంచున్నాడు.

    బీరువా చాటున నక్కిన అవ్మతి దైవం మీద భారం వేసింది. మీదు మిక్కిలి వస్తే ప్రాణ రక్షణకి రంగంలోకి దిగాల్సిందే తప్పదు అనుకుంది. మరోసారి ఈ కవికుమారుడికి నావల్ల తలనొప్పి తప్పదు అని కూడా అనుకుంది.

    చంద్ర గుమ్మం పక్కకి తొలగి గదులన్నీ వెతుక్కోండి అనటంతో వాళ్ళిద్దరూ కనుసైగ చేసుకొన్నారు. చంద్ర చెప్పిన తీరులో నిజాయితీ వుంది. యింకా లోపలి దూరి వెతకటం టైమ్ వేస్ట్. తాము తలుపు తట్టింతర్వాతే అతను తలుపు తీశాడు. ఇప్పుడు తాళం వేసుకొని ఊరికి వెళుతున్నాడు. తాము యిక్కడ టైమ్ వేస్ట్ చేస్తే ఏ మూలన్నాదాక్కున్న పిట్ట ఎగిరిపోవడం ఖాయం. తాము త్వరపడాలి.

    "మీ మీద నమ్మకం వుంది. వెళ్ళివస్తాం" డేగ కళ్ళవాడు అన్నాడు.

    "మళ్ళీ వస్తారా, ఇంకా నాపై అనుమానమే!" చంద్ర నవ్వుతూ అన్నాడు.

    వాళ్ళూ నవ్వి "మీరు భలే తమాషాగా మాట్లాడతారు" అని వెళ్ళిపోయారు.

    చంద్ర లోపలికి వచ్చి తలుపు గడియ వేశాడు.

    అమ్మయ్య అనుకుంది అవంతి.

    పెట్టెలతోను గుడ్డలతోను మాట్లాడటానికి యిప్పుడు చంద్రకి టైము లేకపోయింది చకచక సర్దుకున్నాడు.

    చంద్ర బైట తాళం వేసి వూరికి వెళ్ళిపోతాడు. తను హాయిగా ఓ రెండు రోజులు యింట్లోనే వుండి పెరటి దోవన వెళ్ళిపోతుంది.

    నిజంగా యిది చాలా సేఫ్ టీ ప్లేస్. తను భయపడ్డట్లు ఏ చిన్న అపకారం కూడా జరగదు. అంతా మేలే అనుకుంది అవంతి.   

    ఆ నిమిషాన అవంతికి తెలియంది ఒకటుంది. అది అవంతి కంట పడాలి. తెలియాలి. అందాకా ఆ ప్రమాదం నివురుగప్పిన నిప్పులాగానే వుంటుంది. అంతే చంద్ర సర్దుకోవటం అయింది.

    పెరటి వేపు తలుపుకి లోపల గడియ సరీగా లేదు. రెండు దెబ్బలు వేస్తే వూడి వస్తుంది. అందుకే చంద్రగాని ఇందర్ గాని బైటికి వెళ్లేటప్పుడు పెరటి వేపు తలుపులకి గొళ్లెం తగిలించి తాళం వేస్తారు. ఎటాచ్ బాత్ రూమ్ లాంటి బాత్ రూమ్ కి ఈ గదిలోంచి తప్ప అటు నుంచి దారిలేదు. చంద్ర లోపల అటు తలుపుకి తాళం వేశాడు. లైట్లు ఫ్యాను ఆర్పేశాడు. సూట్ కేస్ తో బైటికి వచ్చి బైట తాళం వేసి కీస్ జేబులో వేసుకున్నాడు. వీధి చివరిదాకా నడిచి అక్కడ రిక్షా చేసుకున్నాడు.

    చంద్ర వెళ్ళిపోయిం తరువాత కొద్దిసేపు అక్కడే నుంచుంది. ఆ తర్వాత యివతలికి వచ్చి చీకట్లో తడుముకుంటూ వెళ్ళి మంచం అందుకుంది. యింక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మంచం మీద అడ్డంగా పడుకుంది.

    ఇప్పుడు శరీరం విశ్రాంతి తీసుకుంటూ మంచంమీద వుంది. ఏ భయం ఏ గోల లేకుండా తాపీగా ఆలోచించవచ్చు. ప్రస్తుతం కావాల్సిన ఆ రెండూ అవంతికి లభ్యం అయ్యాయి.

    అలసిపోయిన అవంతికి బాగా దాహం అవుతున్నది.

    ఆ రెండు గదుల్లో ఏవి ఎక్కడ వున్నాయో అవంతికి తెలియదు, చీకట్లో తడుముకుంటూ వెళ్ళినా కాలికేదైనా తగిలి దొర్లిందంటే చప్పుడు కావటం ఖాయం. అది మంచి పని కాదు. స్విచ్ నొక్కితే లైటు వెలుగుతుంది. అది అంతకన్నా మంచి పని కాదు. తలుపు కింద సందులు వుంటే ఆ సందు ద్వారా లోపల వెలుగు బైటకి కనపడుతుంది.

    ఓ అరగంట ఇలాగే పడుకుని లేచి ఆ తరువాత పక్కగదిలో లైటు వెయ్యాలి. వీధి గది తలుపుకి కిటికీకి ఏదైనా సందు వుందేమో చూడాలి. వుంటే వాటికేమైనా అడ్డుపెట్టాలి అనుకుంది. ఆలోచిస్తూ పడుకుంది. 

 Previous Page Next Page