Previous Page Next Page 
సరస్వతీ మహల్ పేజి 19

                                           వెన్నెల్లో గంగమ్మ

    అంతరిక్షం నుండి ధారగా కురుస్తోంది వెన్నెల. ఆ నెల నిండిన నాటి వెన్నెల పుచ్చ పువ్వులా వుంది. అచ్చ తెనుగులా వుంది. పచ్చి తేనెలా వుంది. ఆ వెన్నెల్లో - ఆమాఘ మాసంలో పున్నమివాడు - తొలి జాము దాటిన ఆరున్నొక గడియకు జొన్న చేల వైపు బయలుదేరాడు. శివుడు, తెల్లని ధోవతి- దాని మీద మరింత తెల్లని చొక్క - భుజంమీద చలవ చేసిన పొందూరు ఖద్దరుపై పంచె - లోకాన్ని చీకాకు పరిచే మన్మధుడు సంధించిన మల్లెపూల బాణంలా వున్నాడు శివుడు.

    శివుడి చెత్తమంతా ఆ చిన్న 'దాని మీదే' వుంది. నిన్న రాత్రి-నిన్న రాత్రి జొన్న చేని కావలికి వెళుతూ రాంభద్ర రాజుగారి చేలో - మంచె మీద ఆ మంచు వన్నెల చిన్నదాన్ని చూసినప్పటి నుంచీ అదో విధంగా వున్నాడు ఉదయం మధ్యాహ్నమై, మధ్యాహ్నం సాయంకాలమై, సాయం రాత్రయ్యే దాకా అతని గుండెల్లో కుదురేసుక్కూర్చుంది ఆ చిన్నది ----

    ఊరి చివర మాధవ స్వామి దేవళం. సత్యభామా సమేతుడయిన సామికి విరహం వియోగ విరహం ఏమీ తెలియనట్టే వున్నాడు. శయనింపు భోగమై పోతూవుంది.

    ఊయల్లో వేసి వూపుతూ పాడుతున్నాడు తంబళి సుబ్బయ్య
    ఎంత పేదవాడే - వేణు గోపాలుడెంత పేదవాడే

    అంత పేద గాకుంటే అలనాడు కుచేలుని అటుకులకు చేసాచునా - ఓ చెలులారా ఎంత ... కర్ణ పర్వంగా వుంది ఆ పాట.

    అదయ్యాక చేతులు జోడించి మనసారా నమస్కారం చేసి "జొన్న చేనికి పోయి సొగసు కత్తెను చూస్తి నిన్నటాలనుండి నిద్రలేదు దాన్ని గూర్చి దయచూడు మాధవా పొగడపూల దండపూజ చేతు" అని మొక్కుకున్నాడు శివుడు.... ఆరాధ్యుల వారి అఖరబ్బాయి ఊరు దాటాడు.

    అడుగుతీసి అడుగు వేస్తూ వుంటే అది తన గుండె మీద వేస్తున్నట్టుంది. ఉద్వేగం క్షణక్షణానికి పెరుగుతోంది. తోపు దాటాడు ఏరు దాటాడు. తోట దాటాడు. వక్కలేరు దాటాక అన్నీ జొన్న చేలే. కంకి విడిచిన జొన్న చూలాలి సోయగాలు పోతోంది.

    అదే కరణంగారి చేను అది మహంతులవారి పొలం ఆ ప్రక్కనే ఆరాధ్యుల వారి పదెకరాల పసిమి జొన్న చేను. ఆ పైరుకే కాపుగా వెళుతున్నాడు శివుడు, వారం రోజులై కమతం నారాయణ వొంట్లో నలతగా వుండి ఇంట్లో పడకేస్తే పంట కొచ్చిన చేను కాపలాకి పైడి ఘంటంలా పిట్టల్ని పారదోల్తే మహంతుల వారి పొలం కాపు కాస్తోంది ఆ వయ్యారి.

    ఈ చివర్నించి ఆ చివరిదాకా వెళ్ళేందుకు గడియ కాలం పడ్తుంది. కరణంగారి పొలం నిలువు - మెల్లిగా నడుస్తున్నాడు శివుడు.

        నా మగడు వాడకెళ్ళే
        నాకూ తోడెవరూ లేరు
        కోడి కూసే జాముదాకా
        తోడురారా వన్నె కాడా...
        ఓ వయ్యారి వన్నె కాడా!

    గుప్పుమని సంపెంగలు విరిశాయా! జల్లుమని మల్లెలు కురిశాయా నెమళ్ళు కదను తొక్కాయా! కోకిలలు గళం విప్పాయా! పాటకు రూపం వుంటుందా! పాటకు జీవం వుంటుందా! రంగుంటుందా! నిలబడి పోయాడు శివుడు.

    'ఏమిటయ్యో బాపనయ్యా!' అద్దరేతిరి కాడ నీ మద్దెల దరువుకా యిట్టోస్తాన్నావ్ సుబ్బరంగా నిద్దరోక ఈ షికార్లేంటి?

    శివుడి గొంతు పెగల్లేదు.

    "బాపన కప్పల్లే ఏట్లో తానం జేస్తా మంతరాలు సదుగుతుంటావే! పలకవేం బెల్లం కొట్టిన రాయిలా?"

    "ఎవరూ"

    'ఆహా మసకెన్నెలైనా గాదె - నన్ను జూచి చూపు తప్పిందేం సావి'

    'గంగాయ్----'

    "ఆ గంగాయినే - ఎందటా సంగతి?"

    "గంగా"

    'ఆ గంగనె - ఏందటా నిలువు గుడ్లేసుకుజూత్తన్నావ్ ఎన్నడన్నా ఎన్నెల్లో ఆడపిల్లను చూసినావా లేదా?"

    "గంగీ!"

    "ఏందీ? గంగీ అంటున్నావ్. వొల్లెటుందేం?"

    "తిమ్మిరి తిమ్మిరిగా వుంది గంగీ---"

    "సింతపండు రసంతాగు---పైత్తెంతగ్గి పోనాది---"

    "చింత ---- పండు ఆలోచనలోనే వచ్చాను రంగీ!"

    "ఏందయ్యా బ్యామ్మడా!"

    "గంగి - నా మాటింటివా!
    వేళ జూడా వెన్నెలాయే - వెండికట్ల చిన్నదాయే
    మల్లెపూలా సొగసులాయే - జొన్న చేసే పందిరాయే
    వయ్యారి రావె - మననవ్వులోనే తెల్లవారూనూ---"

    పకపక నవ్వింది గంగి! పైన వెన్నెల - కిందా వెన్నెల అటు వెన్నెల ఇటు వెన్నెల ఎటుచూస్తే అటు వెన్నెల అన్నట్టు నవ్వింది గంగి---

   
    సెబాస్ కుర్రోడా - సెపుల పొగూలవాడా!
    మాబావ విన్న - కన్నా - మరి యేధ దక్కునా
    మంచదిగను - నేను కంచె దాటి రాను
   
    గంగి పాట విని గంగు వెర్రులెత్తింది శివుడికి పసుపున పాదాలు కడిగి పచ్చా పట్టంగీ తొడిగి నిన్నే పెళ్ళాడతాను - ఓ చిన చిలకా - అని ప్రమాణం చేశాడు---
    వలపు కలుగదా నీకో సఖియా
    మనసు పుట్టదా నాపై నీకు?

    తగిన వాడనే కానా సఖియా నను చేకొనవా చెలియా! అన్నాడు దీనంగా.
    చప్పున దిగివచ్చింది గంగి, శివుడు నెత్తి నెక్కింది. ఒళ్ళో వొదిగింది వొయ్యారాలు వొలికింది. వగలు చిలికింది. శివుడు చిదానందుడైనాడు.

    ఎల్లొస్తనోయ్ బావమళ్లొస్తనోయ్
    మళ్లొస్తనోయ్ బావ యెళ్లొస్తనోయ్
    కళ్ళు తెరి సీ తలికి కళ్ళెదుట వుంటాను
    వళ్ళుయిరిసీ తలికి వళ్లోన వుంటాను.

    అంటూ వేకువన కోడికూస్తే దానితో పాటే కుహు కుహుమంది
    శివుడు మళ్ళీ తెల్లారు తోందని దిగులుపడ్డాడు
    ముక్కుతూ మూలుగుతూ
    ముడుచుకొని తొంగోకు
    మురిసినా తలచినా
    మాపటికి వస్తాను.... అంటూ హామీ ఇచ్చింది గంగి
    రసగంగలో తానాలాడిన శివుడు కోరమీసం మెలేశాడు
    చేతిలో చెయ్యేశాడు  తాళికట్టి ఏలుకుంటానని బాస
    చేశాడు సరిగా అప్పుడే సూర్యుడు తూర్పునెర్రబేశాడు.
    అది గంగి నుదుట కల్యాణ కుంకుం బొట్టయి మెరిసింది.


                                                    ---*---

 Previous Page Next Page