Previous Page Next Page 
నవ్వితే నవ్ రత్నాలు - 1 పేజి 20

     "పిల్లి రాలేదా?... మరి మ్యావ్ ... అని వినిపించిందే ఇప్పడు ?!"ఆశ్చర్యంగా  అడిగాడు పరంధామయ్య.
      నాగమణిసిగ్గుపడింది.
     "అదా?...అదీ ...అలాగా మరేమో ...పిల్లిలాగా నేనే అరిచాను ...."
     "ఏం?... మిమిక్రీ  చెయ్యడం నేర్చుకుంటున్నావా? ఇహ ఈవాల్టి నుండి నీ కూతల్తో మేం  చావాలన్నమాట!!..."మొహం చిట్లిస్తూ అన్నాడు  పరంధామయ్య.
     "నేనేం మిమిక్రి   చెయ్యడం నేర్చుకోవడంలేడదుగా..." అంది నాగమణి మెలికలు తిరుగుతూ .
     "మరెందుకు అలా అరిచావ్?..."
     "మరి నేను మీ దగ్గరికి అడుగులు వేస్కుంటూ వచ్చాను కదా ...అందుకే అలా పిల్లిలా అరిస్తే బాగుంటుందని అరిచాను ..."
     "పిల్లి లా ఎందుకు అడుగులు వేస్కుంటూ వచ్చావ్ ?"మళ్ళీ ప్రశ్నించాడు   పరంధామయ్య.
     "హి..." అంది నాగమణి సిగ్గుపడ్తూ.
      "అది  మిమ్మల్నేదో అడగాలని అనుకుంటుంది" అంది శాంతమ్మ.
       "ఏంటో చెప్పు..." కళ్ళేగురవేశాడు పరంధామయ్య.
       "మీ చేతిలోని  నవల..."చెప్పబోయింది నాగమణి.
     "హమ్మా ... ఈ నవల నేన్నీకిస్తానేం?...నేను చదివిన తర్వాత ఇస్తాను... అయినా కాలేజికి వెళ్ళే దానివి క్లాసు పుస్తకాలు చదవాలి గానీ  నీకు నవల్లెందుకూ?..."కోపంగా అడిగాడు.
      "నేనేం నవల చదవడానికి అడగడం లేదు. దాన్ని పక్కన పెట్టేసి నేను చెప్పేది శ్రద్దగా వినమంటున్నాను ..."అంది నాగమణి చీర కొంగు చింపేస్తూ.
      "హయ్యో ...హయ్యో ... బంగారంలాంటి చీరనెందుకలా చింపేశావ్!...నువ్విలా చీరలు చింపేస్తూ ఉంటే మేం కొత్త  కొత్త  చీరలు కొంటూ ఉండాలనా?" రుసరుసలాడింది శాంతమ్మ.
    నాగమణి ఫక్కున నవ్వింది.
     "అయ్యో... నువ్వెంత అమాయకురాలివే అమ్మా... నేనేం చీరని కావాలని చింపలేదు.చీరకొంగుని వేలుకేసి చుడ్తూంటే అలా చిరిగిపోయింది..."అంది నాగమణి సిగ్గుపడుతూ.
      "భలేదానివే...ఏదైనా అడిగేప్పుడు చీరకొంగుని వేలుకి మామూలుగా మెల్లగా చుట్టాలిగానీ మరీ అంత గట్టిగానా?...నా పిచ్చి  తల్లి ...అడుగమ్మా అడుగు..." అంది ప్రేమగా కూతురు తల నిమురుతూ శాంతమ్మ.
       నాగమణి హఠాత్తుగా దబ్బున కింద పడింది. శాంతమ్మ కంగారుగా కూతుర్ని లేవనెత్తింది.
     "అదేంటే...ఎందుకలా కిందపడియావ్? అడిగాడు పరంధామయ్య ఆందోళనతో.
         నాగమణి ముసిముసిగా  నవ్వింది.
     "ఎందుకంటే...మరేమో నేను సిగ్గుతో మెలికలు తిరిగానుగా...అందుకే చీర కాళ్ళకి చుట్టుకుపోయి దబ్బున  పడ్డానన్నమాట!!...హి!"
      "సిగ్గుపడేప్పుడు మరీ అంతెక్కువగా మెలికలు తిరక్కూడదమ్మా..." కూతురు తల నిమురుతూ అంది శాంతమ్మ.
      "అంత సిగ్గుపడే పని యేం చేశావమ్మా?" పరంధామయ్య కుతూహలంగా అడిగాడు. తను ఉహించిన విషయం గానీ కాదు కదా? అనుకున్నాడు మనసులో.
      "నేను రమేష్ ని ప్రేమించాను నాన్నా..." దబ్బున నేలమీదకి పడిపోతూ అంది నాగమణి.
      శాంతమ్మ నెత్తి బాదుకుంటూ కూతుర్ని లేవనెత్తింది. "మరోసారి గనుక  నువ్విలా దబ్బున పడితే నేను లేవనెత్తను...కాస్త తక్కువగా మెలితిరుగు ..." కోపంగా అంది ఆమె.
      "రమేషంటే ఎవరూ?..." పరంధామయ్య  కూతురు వంక కొరకొరా చూస్తూ ప్రశ్నించాడు.
       "రమేషంటే మనింటికి వెనుకలైన్లో కుటుంబరావుగారు లేరూ ...వాళ్ళబ్బాయి  నాన్నా... నన్ను ఆయన పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు  నాన్నా ఆయన మా పెళ్లి గురించి వాళ్ళ నాన్నకి  చెప్తే ఆయన కూడా ఏమీ అభ్యంతరం  పెట్టకుండా ఒప్పుకున్నాడు . వచ్చేవారం కుటుంబరావు పెళ్లి సంబంధం మాట్లాడడానికి  మనింటికి వస్తారట నాన్న..."నాగమణి  నేలమీద దబ్బున పడిలేచి నిల్చుంది.
      "వీల్లేదు...ఆయన మనింటికి రావడానికి వీల్లేదు... పెళ్లి మాటలు మాట్లాడడానికి  వీల్లేదు...మీ ప్రేమని నేనొప్పుకోను... పెళ్ళికి అంతకంటే  ఒప్పుకోను ..."
       "నాహాన్నా..." బాధగా మూలిగింది నాగమణి."రమేష్ ని పెళ్లి చేసుకోవడానికి మీ కభ్యంతరం ఉండకూడదు  నాన్నా..."
       "ఎందుకుండకూడదు?..."ఆశ్చర్యంగా అడిగాడు పరంధామయ్య.
       "వాళ్ళ  కులం  మన కులం ఒకటే నాన్నా ..."
      "ఒకటే అయితే మాత్రం అడ్డమైన వాడ్నీ పెళ్లి చేస్కోవడానికి నేనోప్పుకుంటానా?"
      "ఆయన అడ్డమైనవాడు కాడు నాన్నా...నిలువుగా సన్నగా ఉంటాడు...ఫారిన్ రిటర్నుడు డాక్టర్...అందంగా ఉంటాడు...ఆస్థి కూడా ఉంది..."
      "నువ్వెన్నైనా చెప్పు...ఈ పెళ్ళికి నేనొప్పుకోను " రంకేవేశాడు పరంధామయ్య.
     "పోనీ ఒప్పుకొండీ...మంచి సంబంధమేగా " అంది శాంతమ్మ.
      "నోర్ముయ్...నీకు తెలీదు...దాని పెళ్లి నా ఇష్టప్రకారం నేను చూసిన వాడితో జరగాలి..."
      నాగమణి తండ్రిని కాళ్ళవేళ్ళ  బ్రతిమలాడింది. ఆయన్లేకపోతే బ్రతకలేనంది...అయతే చావు అన్నాడు పరంధామయ్య. నాగమణి కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. అయినా పరంధామయ్య కరుగలేదు.ఆయన్ని కన్విన్స్ చేయడానికి రమేష్ వస్తే గెటవుట్ అన్నాడు పరంధామయ్య.
      ఆ రోజు పార్కులో ...
     "మనం లేచి పోదాం రమేష్ ..."అంది నాగమణి.
      "ఇంకా ఆరేగా అయ్యింది?...మనం ఏడుదాకా కూర్చోవచ్చు పార్కులో "అన్నాడు రమేష్ వాచ్ వంక చూస్తూ.
      "నేనంటుంది  ఇక్కడ నుండి లేచివెళ్ళడం గురించి  కాదు అంటుంది ....ఎక్కడికైనా లేచి వెళ్ళిపోయి పెళ్లి చేస్కుందామంటున్నా..."
     నాగమణి రమేష బుగ్గమీద పొడిచింది.
     "పెళ్లి  కాకముందే  నువ్విలా  బుగ్గపోట్లు పొడిస్తే పెళ్లయ్యాక నన్ను చావగొడ్తావేమో!...ఇలాగైతే నేను ఒప్పుకోనంతే..."అన్నాడు రమేష్ బుగ్గ తుడుచుకుంటూ.
      "సర్లే ...సర్లే ...పెళ్ళయ్యాక చూద్దాం .."అంది నాగమణి.
     నాగమణి తండ్రి ఎటూ వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోడని వాళ్ళు రిజిస్టర్ మ్యారేజి గుట్టు చప్పుడు కాకుండా చేస్కున్నారు.
       పెళ్ళైన  నెల రోజుల్లోనే పరంధామయ్య వాళ్ళని క్షమించేసి ఇంటికి ఆహ్వానించి చక్కగా మాట్లాడాడు. అంతేకాదు మొదటి పండక్కి అల్లుడిని పిలిచి ఖరీదైన బట్టలు పెట్టాడు.
    "ఆ రోజు అది రమేష్ ని చేస్కుంటే దాన్ని గుమ్మం తొక్కనివ్వనని  అన్నవాళ్ళు ఈ రోజు ఇంత ఇదిగా ఎలా కల్సిపోయారండి?...భర్తని అడిగింది శాంతమ్మ ఒక రోజు.
       "ఓసి పిచ్చి మొహమా... అది రమేష్ ని పెళ్లి చేసుకోవడం నాకిష్టమేనే... బంగారంలాంటి సంబంధం అది. అది చెప్పినప్పుడు నేను వెంటనే ఒప్పుకుంటే రమేష్ వాళ్ళ నాన్న పెళ్లి మాటలకి వచ్చి కట్నం ఇంత...లాంఛనాలు ఇంత అంటూ బేరాలు ఆడేవారు. లక్షలు వదిలేవి. నేను ఒప్పుకోలేదు కాబట్టే  వాళ్ళు లేచెల్లిపోయి కాణీ ఖర్చు  నాకు లేకుండా పెళ్లి చేస్కున్నారు ..."
       చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు పరంధామయ్య.

 Previous Page Next Page