Previous Page Next Page 
నవ్వితే నవ్ రత్నాలు - 1 పేజి 21


                                                                      భక్తుడు 

       రాంబ్రహ్మం దేవుడి పటాల ముందు భక్తి పారవశ్యంతో కళ్ళు మూసుకుని  మంత్రాలు చదువుతున్నాడు. దాదాపు పావుగంట నుండి సాగుతుందా పూజా కార్యక్రమం.
       "దుందుం  బ్రంతం పంచిం...స్వాహా...ఓం... ప్రప్రితం  పంజం భంబ్రబ్రహంతం బం సమపర్పయామీ...తంత్రం పబమండం  ఙాఇఛీ స్వాహా..."
     (అదేంటో...ఎవరేప్పుడు మంత్రాలు చదివినా నాకు పై విధంగానే వినిపిస్తుంది. అందుకే అలా రాస్తున్నా.)
      రాంబ్రహ్మం  హారతి వెలిగించి దేవుడి పటాల చుట్టూ తిప్పుతూ గంటకొట్టాడు.
      "త్రంభంబో పభిజ్ఞజాజా..."
      "ఠాప్" కొబ్బరికాయ పగలకొట్టి చెక్కలు విడదీసి  దేవుడి పటం ముందు పెట్టి  భక్తి పారవశ్యంతో చేతులు జోడించి నిలబడ్డాడు.  
     రెండు నిముషాల తర్వాత కళ్ళు తెరిచి చూసిన  రాంబ్రహ్మం  దారుణమైన దృశ్యం కనిపించింది.
      రాంబ్రహ్మం  మూడేళ్ళ కొడుకు బాబ్జీ దేవుడి పటం ముందున్న కొబ్బరి చిప్ప  తీసి కొరకడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
     "రేయ్..." గది గోడలు కంపించేలా అరిచాడు  రాంబ్రహ్మం .
      అతని అరుపుకి  గోడలు అదిరి దేవుడి పటం ఒకటి కిందపడిపాయింది.
     "అపచారం అపచారం..."గట్టిగా చెంపలు  వాయించుకుని దేవుడి పటం తీసి కళ్ళకి అద్దుకుని యధాస్థానంలో  పెట్టాడు రాంబ్రహ్మ.
      మళ్ళీ బాబ్జీ వంక చూసి ఈసారి తగ్గు స్థాయిలోపళ్ళు బిగించి "రేయ్..." అని అరిచాడు దేవుడి పటాల వంక భయంగా చూసి అవి పడనందుకు తృప్తిగా నిట్టూర్చాడు  రాంబ్రహ్మం.
      బాబ్జీ గుడ్లురిమి చూస్తున్న తండ్రి వంక భయంగా చూస్తూ "కొబ్బరి తింతున్నాను  నాన్నా ..." అన్నాడు.
     "అపచారం...అపచారం..." గట్టిగా చెంపలేస్కుని హబ్బా! అని చెంపలు  తడుముకుని "పూజకాకుండానే దేవుడి దగ్గర కొబ్బరి చిప్పలు  ఎంగిలి చేస్తావురా  దొంగలం...ఇలాతే"అంటూ చెయ్యి చాపాడు రాంబ్రహ్మం.
    "ఊ....ఊ... నాకు కొబ్బలి కావాలీ ఈఈ..."
    "దొంగలం...ఇలాతే... కళ్లు  పోతాయిరా పాపిష్టిపీనుగా..."
    బాబ్జీ చేతిలోంచి కొబ్బరిచిప్ప లాక్కుని ఎడమ కాల్తో బాబ్జీని ఒక్కతన్నుతన్నాడు రాంబ్రహ్మం.
    ఆ తన్నుకి రెండుగజాల దూరం ఎగిరిపడ్డాడు బాబ్జీ. తల నేలకి కొట్టుకుని ఫట్ మని శబ్దం వచ్చింది. ఒక్క పెట్టున పెద్దగా ఏడుపు లంకించుకున్నాడు.
    రాంబ్రహ్మం పిల్లాడిని తన్నడం హాల్లోంచి చూసిన జానకమ్మ లబ్బున మొత్తుకుంటూ గదిలోకి పరుగెత్తుకుని వచ్చి బాబ్జీని ఎత్తుకుంది.
    "హయ్యో...హయ్యో... చంటిపిల్లాడు. పాపం కదండీ..." అంది జాలిగా బాబ్జీవంక చూస్తూ.
    "పాపం ఎవరికే! కళ్లు పోతామని చెప్పు వెధవకి... దేవుడి దగ్గరి కొబ్బరికాయని ఎంగిలి చేస్తున్నాడు పూజ కాకుండా ... ఓం... త్రంభం జాతే మామాతే భంభజ్ఞఇఇజా..."
    "వా... కొబ్బలీ... వా..." బాబ్జీ ఏడుపు తారాస్థాయిని అందుకుంది.
    "రాంబ్రహ్మం గుడ్లురిమిచూశాడు.
    "నేను పూజ చేస్కుంటుంటే ఏంటే వెధవ డిస్టర్బెన్సూ... ఆ వెధవని అవతలకి తీస్కెళ్లు".
   "వా... కొబ్బలీ... వా... ఇచ్చెయ్యి... వా..." జుట్టు పీక్కున్నాడు బాబ్జీ.
    "హయ్యో...హయ్యో... వాడు పిక్కున్న జుట్టు ప్రసాదం మీద రాల్తుంది... వాడ్ని దూరంగా తీస్కెళ్లవే లం..."
    "నాకు ప్రసాదం కూడా కావాలీ ... వా... కొబ్బరి కూడా కావాలీ... వా..."
    "పోనీ ఇచ్చెయండీ ..."
    "పూజకాందే! పాపం... కళ్లు పోతాయ్!!"
    "వాహా..." స్థాయి పెంచాడు బాబ్జీ.
    రాంబ్రహ్మం ఎడమ కాల్తో జానకమ్మ నడ్డిమీద తన్నేడు. ఆమె బాబ్జీతోసహా గుమ్మం దగ్గరికి ఎగిరిపడింది. ఒక రెండు నిముషాలు అలాగే కూర్చుండిపోయి మూలుగుతూ లేచి ఏడుస్తున్న బాబ్జీతో "పూజకాంగానే నీకు ప్రసాదం, కొబ్బరి ఇస్తానులేమ్మా... ఊరుకో..." అంటూ వాడిని అక్కడనుండి తీసుకెళ్లిపోయింది.
    రాంబ్రహ్మం మళ్లీ  భక్తి పారవశ్యంతో కళ్లుమూస్కున్నాడు.
    పక్కగదిలోంచి బాబ్జీగాడి ఏడుపు వినిపిస్తుంది.
    "దొంగముండకి పిల్లాడిని ఊఋకోబెట్టడం కూడా చేతకాదు... బ్రంబ్రం తేదేజా... ఓం... సచ్చినోడు రాన్రాను వట్టి పేచీకోరుగా తయారౌతున్నాడు... క్షభ్సంత్వ జియిషీ"...
    "ఠాప్..." మరో కొబ్బరికాయ కొట్టాడు.
    "రెండు కొబ్బరికాయలకీ ఆర్రూపాయలైంది... చంభంజ్ఞ స్వాహా...
    ఓం... బంబ్రజం జాహా... వచ్చేవారం నుండి ఒక కొబ్బరికాయ కొడ్తే చాల్లే... ఓం నమంత్రజ్ఞాహా...
    అలా భక్తి పారవశ్యంతో కళ్లు మూసుకునే ఉన్నాడు రాంబ్రహ్మం. దేవుడి ముందు అలా నిల్చునేసరికి అతనికి తన కోరికలన్నీ గుర్తుకువచ్చాయ్.
    "భక్తుల కోరికతీర్చే ఓ దేవా... నాకు బాగా డబ్బును ప్రసాదించుస్వామీ. నాకు లాటరీలో పదిలక్షలు తగిలేలా చూడుస్వామీ... నాకు పదిలక్షలు తగిల్తే నీ హుండీలో ఒక లక్ష (నాలుక కొరుక్కున్నాడు)... ఓ యాభైవేలేస్తా స్వామీ...(పక్క గదిలోంచి జానకమ్మ మాటలు వినిపించాయ్) నా జీవితంలోకి ఇదొక శనిలా దాపురించింది... ఛీ... స్టెనో లీల ఎంత బాగుంటుంది. లీల నా భార్య అయితే... ఓహ్... స్వామీ... జానకిని నీలో కలిపేస్కో స్వామీ... దానికే మాయదారి రోగమో,రాకూడదా?... లీలా నేనూ పెళ్లి చేసుకున్నాక నీ కొండకి వస్తాం! అవునూ...లీల నన్ను పెళ్లి చేస్కుంటుందని గ్యారంటీ ఏమిటి?... లీలకి నేనంటే యిష్టం ఉందోలేదో... ఇష్టం ఉంటే మాత్రం?లీల భర్త ఎక్కడికిపోతాడు?... స్వామీ!...లీల భర్తని కూడా నీలో కలిపేస్కోస్వామీ... వాడికి ఏదైనా మాయదారి రోగం వచ్చేలా చూడుస్వామీ... లీలకి నామీద ప్రేమ కలిగేలా చూడు స్వామీ... అన్నట్టు నా ప్రమోషన్ సంగతి మర్చిపోయాను. స్వామీ... సెక్షను ఆఫీసరు పోస్టు ఒకటి ఖాళీగా ఉంది స్వామీ. కానీ నాకంటే వీరాస్వామి సీనియరు స్వామీ... ఆ పోస్టు వాడికే వస్తుంది స్వామి... వాడిని కూడా నీలో కలిపేస్కుంటే ఆ పోస్టు నాకే వస్తుంది స్వామీ... నీకు నిలుపు దోపిడీ ఇచ్చుకుంటా స్వామీ ...నేను సెక్షనాఫీసరు అవుతే లిల్లీ నామీద మోజుపడ్తుందా?... నన్ను సెక్షనాఫీసర్ని చెయ్ స్వామీ..."
    మరో అయిదు నిమిషాల పాటు ఇలాంటి కోరికలన్నీ కోరి పూజ గదిలోంచి బయటికి వచ్చాడు రాంబ్రహ్మం.
    "మీరు కొట్టిన దెబ్బలకి వీడికి జ్వరం వచ్చేలా ఉంది చూడండి..." ఎత్తుకున్న బాబ్జీని రాంబ్రహ్మం ముందుకు చాపుతూ అంది జానకమ్మ.
    "చావనీ వెధవని... పూజ చేస్కుంటే వెధవ గోలా వాడూను!... నాకు అన్నం పెట్టెయ్... ఆఫీసుకు టైమైపోతూంది..."
    భోజనం చేసి ఆఫీసుకు బయలుదేరాడు రాంబ్రహాం.
    గుమ్మందాటి పక్కింటివైపు చూశాడు. పక్కింటావిడ వీధిలో కూరగాయలు బేరం చేస్తుంది.
    "ఆవిడ నన్ను ప్రేమిస్తే ఎంత బావుణ్ణు!... వాళ్ళాయన క్యాంపుకి వెళ్ళినప్పుడు రాత్రికి నన్ను రమ్మనకూడదా?... ఆ కూరగాయలమ్మేది కూడా బాగానే ఉన్నట్టుంది.జానకి పుట్టింటికి వెళ్లినప్పుడు దానిదగ్గర కూరగాయలు కొనాలి... కొంటూ కొంటూ..."

 Previous Page Next Page