Previous Page Next Page 
తీరం చేరిన నావ పేజి 19


    వాణి కన్నతల్లితో చెప్పుకొన్నట్టు తన మనసులో సందేహాలు, భయాలు, పనివాళ్ళ మాటలు అన్నీ అమాయకంగా రుక్మిణితో చెప్పేసింది.
    "మీరేం అనుకుంటే అనుకోండి, అమ్మా నీవు తిట్టినా సరే-వాణికేం ఖర్మ ఆ రాజారావుగార్ని రెండోపెళ్ళి ఎందుకు చేసుకోవాలి, వాణికేం లోటు- అసలు మీరు ఎలా వప్పుకున్నారో నాకు అర్ధంకాదు- మీ కిద్దరికీ ఎంత తేడా వుంది వయసులో ఎంత డబ్బుంటే మాత్రం ఏమిటి?" రేణుక తన అయిష్టాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది.
    రుక్మిణి గాభరాగా- ఆ నీమొహం- నోరు మూసుకో నీ అభిప్రాయం ఎవరూ అడగలేదు. వాణి బాగోగులు చూడడానికి వాళ్ళ పెద్దవారున్నారు- వాళ్ళ యిబ్బందులు ఏమిటో.. చెప్పినంత సుళువుకాదు ఆడపిల్ల పెళ్ళి...." సర్ది మాట్లాడసాగింది.
    రేణుమాటలతో వాణి మనసు మరింత కృంగిపోయింది.
    వాణి వాడిపోయిన మొహంచూసి రుక్మిణి ఆప్యాయంగా భుజంమీద చెయ్యివేసి "అదేమిటి దిగులుపడ్తున్నావా- లోకులు కాకులు ఏదో అంటారు అవన్నీ మనసులో పెట్టుకోకు. అన్నీ చక్కపడతాయి" ఓదార్పుగా అంది.
    కిషోర్ కూరలు కొన్ని ఓ బుట్టలో పెట్టించి తీసుకువచ్చాడు. "వెళ్దామా యింక" అన్నాడు వాణివంక చూసి.
    మౌనంగా అందరూ బండి ఎక్కారు. తోవలో రేణు మాత్రం ఏదో అప్పుడప్పుడు అంటూవుండేది.
    వాణి పరధ్యానంగా అన్యమనస్కంగా ఊకొడుతూ కూర్చుంది.
    యింటిముందు బండి ఆగగానే- "మళ్ళీ లోపలికి ఎందుకు, వెళ్ళిపోతాను యింక" అంది వాణి.
    "ఆహా-అలాకాదు, దిగి వచ్చి పసుపు కుంకం తీసి కెడుదువు గాని రా అమ్మా" అంది రుక్మిణి.
    వాణి కాదనలేక దిగింది. రుక్మిణి రేణుకచేత వాణికి బొట్టు పెట్టించి చీర, రవికగుడ్డ యిప్పించింది.
    "యిదేమిటండీ, యివన్నీ ఏమిటి?" అంది మొహమాటపడ్తూ వాణి.
    "తీసుకోమ్మా-నీ పెళ్ళికి మేంరాలేం అందుకు యిస్తున్నాను. మొదటిసారి వచ్చావు-మళ్ళీ వస్తావో లేదొ పెళ్ళయితే. అందుకే యిచ్చాను.....నిన్ను చూశాక నా రేణులా అనిపించావు. అందుకే యింట్లో రేణుకోసం కొన్న చీర యిచ్చాను, అంత ఖరీదు కాదనుకో" అంది రుక్మిణి ఆప్యాయంగా బుజంతట్టి.
    ఆ అభిమానానికి వాణికళ్ళు చెమర్చాయి. చటుక్కున వంగి ఆమె పాదాలకి నమస్కరించింది. వారిని వదలి వెళ్ళాలంటే మనసు వప్పలేదు. అయినా తప్పదు.... స్నేహంగా రేణు చేయినొక్కి "మీరు ఒకసారి తప్పకరావాలి. మరిచి పోకూడదు. మరి వెళ్ళొస్తా" అంటూ బయటికి వచ్చింది వాణి.
    బండి బయలుదేరింది వాణి, కిషోర్ లతో.
    కిషోర్ ప్రోత్సాహంమీద, అతను అడగకుండానే పాట అందుకుంది. కిషోర్ వాణి వంక అలా చూస్తూండి పోయాడు. కాస్సేపు- తరువాత అతనికి తెలియకుండానే కళ్ళు మూసుకున్నాడు తన్మయత్వంతో.
    ఓ అరగంట...తరువాత....వాణి గొంతు ఆగిపోవడం విని కళ్ళు తెరిచి..... ఆవేశంగా "వాణీ...వాణీ నీవు నాకు ముందెందుకు కనపడలేదు....ఒక నెలముందు నా కెందుకు తెలియలేదు వాణీ నీవు..." అన్నాడు ఆవేశంగా వాణి చేతులు పట్టుకుని. ఆ క్షణంలో కిషోర్ తననితాను మరిచిపోయాడు.
    వాణి ఆశ్చర్యచకితురాలై చూసింది.
    ఆ ఆవేశం, భావోద్వేగం క్షణంలో తగ్గిపోయిం తర్వాత కిషోర్ చటుక్కున వాణి చేతులు వదిలేశాడు. "క్షమించండి.... నన్ను....నన్ను నేను మరిచిపోయాను. ఏమి అనుకోకండి ప్లీజ్...." అన్నాడు వణికే గొంతుతో. జేబు లోంచి రుమాలు తీసి మొహం అంతా తుడుచుకుని..."ఏయ్....హే..." అంటూ ఎడ్లని అదిలిస్తూ లేచి తొట్టెలోకి పెళ్ళి కూర్చున్నాడు.
    అతని ఆవేశం అర్ధమయింది వానికి. కిషోర్ మాటలకి అర్ధం తెలిశాక ఆమె గుండెలు బరువెక్కి, దిగులుగా కూర్చుంది కిషోర్ అవును కిషోర్....నీవు నా కెందుకు ముందు కనపడలేదు. కిషోర్ ముందు తెల్సివుంటే ఎంత బాగుండేది. ఇప్పుడు ఏం లాభం... టూ లేట్ అయి పోయిందా....? ఎన్నడూ లేనంత దిగులు అనిపించింది వాణికి.
    బండి యిల్లు చేరేవరకు యిద్దరూ ఏమీ మాట్లాడలేదు..... యిల్లు చేరాక కిషోర్ బండిదిగి వెనక్కివచ్చాడు.
    వాణి బండిదిగి కిషోర్ మొహంలో ఏదో వెతుకుతున్నట్టు చూసింది. కిషోర్ ఈ అరగంటలో మళ్ళీ మామూలు అయ్యాడు.
    "వస్తాను. థాంక్స్-లోపలికివస్తే ఆలశ్యం అయిపోతుందని రాలేదని పెద్దమ్మగారికి చెప్పండి-మరి వెళ్ళనా-" అంటూ వాణి వంక చూశాడు.
    వాణి కిషోర్ మొహంలో భావం వెదక ప్రయత్నించి విఫలురాలై.... ఏమీ మాట్లాడలేక తల ఊపింది.
    బండిలోంచి కూరల బుట్టదింపి వరండాలో పెట్టాడు....
    "మళ్ళీ ఎప్పుడు?" అంది వాణి నెమ్మదిగా.
    కిషోర్ ... సందిగ్ధంగా ...."వస్తాలెండి రేణు, నేను-" అంటూ గబగబ బండిలో కూర్చున్నాడు.
    
                                        *    *    *
    
    వాణి, బరువుగా లోపలికి అడుగుపెట్టింది.
    రెండురోజుల తరువాత-
    "వాణి, యివాళ ఊర్లో పెద్దింటి ఆడవాళ్ళు నిన్ను చూడడానికి వస్తామన్నారు నాల్గుగంటలకి - కాస్త తయారవ్వు...." అంది అనసూయమ్మ.

 Previous Page Next Page