మాధవి ఒక్కొక్కసారి చూసీ చూడనట్టు వదిలేస్తూ, ఒక్కొక్కసారి మందలిస్తూ కాస్త కంట్రోల్ లో పెట్టడానికి ప్రయత్నించేది. మరీ కట్టడి చేస్తే కోపగిస్తే మొండి కేస్తారని, అబద్దాలు మొదలు పెడతారేమోనన్న భయం వుండేది మాధవికి. "పిల్లల్ని పెంచడం, అందులో అమెరికాలో, కత్తి మీద సాము లాంటిది బాబూ" అనేది మాధవి భర్తతో. నవీన్ నందితలా ప్రాబ్లమేటిక్ చైల్డ్ కాడు. తన చదువు తన పుస్తకాలు తప్ప, ఎక్కువ ఫ్రెండ్స్ లేకుండా ఒకరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ తో మాత్రం వుండేవాడు. అట్టే మాటకారి కాడు. ఇచ్చిన పాకెట్ మనీయే ఖర్చు పెట్టకుండా దాచుకుంటే, నందిత యిచ్చిన దానికి నాలుగు రెట్లు లాగి ఖర్చు పెట్టేది.
నందిత కాలేజీ లెవల్ కి వచ్చేసరికి మరింత మంది ఫ్రెండ్స్ , అందులో బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువయ్యారు. అందులో నలుగురయిడుగురు అమెరికను బాయిస్ వుండేవారు. అది చూసి మాధవిలో కంగారు మొదలైంది. దానికి తోడు ఆ టర్మ్ ఎగ్జామ్స్ లో మార్కులు బాగా తక్కువ వచ్చాయి. మాధవి కోపంగా నిలేస్తే , "ఇట్స్ ఒకే మమ్మీ, ఒకసారి కాస్త మార్కులు తక్కువ వస్తే కొంప మునిగి పోయినట్టు హడావుడి చేస్తావేం. ఈసారి బోరు కొట్టి చదవాలనిపించలేదు." నిర్లక్ష్యంగా అంది.
"కొడ్తుంది కొడ్తుంది . నీకీ మధ్య మరీ ఫ్రెండ్సు, తిరగడం ఎక్కువయింది. నీ వరస చూస్తున్నాను. కాస్త ఫ్రెండ్సు ని తగ్గించు. ఆ అమెరికన్ అబ్బాయిలతో నీకేమిటి స్నేహం ....' నందు దొరికిందని సాధించింది మాధవి.
"ఏం అమెరికన్స్ అయితే. మా కాలేజీ మేట్స్ వాళ్ళు. అమెరికాలో వుంటూ, అమెరికా తిండి తింటూ, అమెరికన్ ఫ్రెండ్స్ మాత్రం వుండకూడదేం.... యూ టాక్ అల్ రబ్బీష్" హేళనగా ఎత్తి పొడిచింది నందిత. అలా మాట్లాడే కూతురిని యింకా ఏమన్నా అంటే మరీ నోరు పారేసుకుని యిన్సల్ట్ చేస్తుందని అప్పటికి వూరుకుని , తర్వాత భర్తతో కంప్లయింట్ చేసి, "మీరు దాన్ని కేకలేస్తారా లేదా" అంటూ హటం సాగించింది మాధవి. ప్రకాశరావు నందితని పిలిచి తల్లితో అలా మాట్లాడినందుకు, చదువు పాడుచేసుకుని స్నేహితులతో తిరుగుడు ఎక్కువయిందని మందలించాడు. ఎప్పుడూ అనని తండ్రి కేకేలేస్తే కాస్త భయపడింది నందిత. ఓ పది పదిహేను రోజులు కాస్త ఫ్రెండ్స్ ని తగ్గించింది. తరువాత మళ్ళీ మామూలే. కూతురికి యిరవై వచ్చిందగ్గిరనించి పెళ్ళి చేసేయాలన్న ఆరాటం పట్టుకుంది మాధవికి. ఇంతవరకు స్నేహితులంటూ గ్రూపులో తిరగడం తప్ప, ప్రత్యేకంగా ఏ ఒక్కడితోనూ డేటింగులు అవీ జరపలేదు. అదేదో చేసేలోగా, ఎవడినో ప్రేమించాననేలోగా చెయ్యి జారిపోయేలోగా కూతురికి మంచి సంబంధం చూసి చేసేయాలన్న ఆరాటం మొదలైంది. ఇండియా వెళ్ళినప్పుడల్లా అన్న అక్క అందరూ ఎన్నో సంబంధాలు చెప్పేవారు. అమెరికాలో వున్న తెలుగు వాళ్ళెవరున్నారో , వాళ్ళ అబ్బాయిల చదువులు, తమకంటే వాళ్ళకే బాగా తెలుసు. అమెరికాలో వున్న తెలుగు వాళ్ళు చాలా మంది తమ అబ్బాయిలకి , అమ్మాయిలకి యిండియా కెళ్ళినప్పుడల్లా సంబంధాలు చూసి చేసుకువచ్చేసేవారు. అమెరికాలో అబ్బాయిలు వున్నా తమ సంప్రదాయం ప్రకారం యిండియాలో మంచి కుటుంబం నించి వచ్చిన పిల్లల్నే కొడుకులకి చూసేవారు. తాము అమెరికన్ సిటిజన్స్ కనక పెళ్ళవగానే "వీసా" అదీ తొందరగా వచ్చేస్తుంది కనక చాలా మంది నందితని చేసుకుంటాం అని వాళ్ళే కబురు పంపారు. యిరవై ఏళ్ళన్నా లేకుండా ఏం పెళ్ళిలే అని యిన్నాళ్ళూ సీరియస్ గా ఆలోచించలేదు. కాని నందిత వరస చూసి ఆమె చెయ్యి దాటిపోక ముందే పెళ్ళి చెయ్యాలని నిర్ణయించుకుని మంచి సంబంధం చూడమని తనవాళ్ళకి రాసింది మాధవి. అన్నింట్లోకి యీ యింజనీరు అబ్బాయి సంబంధం బాగుందని చూద్దాం అంటే కూతురు వాడెవడో ముక్కూ మొహం తెలియదు ఎలా చేసుకుంటాను అని వాదిస్తుంది. దీన్నెలా వప్పించడం? తండ్రి చెప్పినా వింటుందో లేదోనని మనసులో మధనపడసాగింది.
* * * *
'నందూ వాట్ హేపెండ్ , వై ఆర్ యూ లుకింగ్ సో డల్ సిన్స్ టూ డేస్ . ఆర్ యూ అల్ రైట్. " జేనెట్ ఆదుర్దాగా అడిగింది.
"నథింగ్ , ఐ యాం ఒకే....' నందిత నవ్వి అంది. ఆ నవ్వులో జీవం లేదని జేనెట్ గుర్తించింది.
కమాన్ డియర్, ఐ నో సమ్ థింగ్ యీజ్ రాంగ్ ...... బిఏ గుడ్ గర్ల్ అండ్ టెల్ మి.'
జేనెట్ , నందిత యిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ . ఐదో క్లాసునించి కాలేజీ వరకు క్లాస్ మేట్స్ . ఒకరి దగ్గిర ఒకరికి రహస్యాలు లేవు. ఒకరి సమస్యలు ఒకరు చెప్పుకుంటారు, చర్చించుకుంటారు. రెండు రోజుల నించి నందిత మొహం వాడిపోయి వుందని కనిపెట్టి అడిగింది జెన్.
'ఏం లేదు, మమ్మీ డాడీ పెళ్లి పెళ్ళి అని బోరు కొట్టి చంపుతున్నారు..... ఎవడో యిండియాలో యింజనీరింగు చదివి ఏమ్.ఎస్ చేయడానికి వస్తాడుట. వాడ్ని చేసుకోమని చంపుతున్నారు. ఇన్నాళ్ళూ మమ్మీయే అనుకుంటే యిప్పుడు డాడీ కూడా అమ్మ పక్షమే మాట్లాడుతున్నారు. నిన్న ఓ అరగంట లెక్చరిచ్చి చంపారు....' విసుగ్గా అంది.
'హౌ లక్కీ యూ ఆర్....దీనికోసమా మొహం అలా పెట్టావు. చక్కగా అమ్మానాన్నా మంచివాడ్ని తెచ్చి చేసుకోమంటే నీకెందుకీ బాధ...."
నందిత జేనెట్ వంక ఆశ్చర్యంగా చూసింది. "ఏమిటి మాట్లాడుతున్నావు నువ్వు? వాడెవడో ముక్కు మొహం తెలియకుండా పది నిమిషాలు చూసి ఎలా చేసుకోను. అతనేలాంటి వాడో , టెస్ట్ లు, ఏమిటో, ఐడియాలు , అభిప్రాయాలు కలిస్తాయా? లేదా తెలియకుండా ఎలా చేసుకోను..... అసలు తెలియకుండా ఎలా చేసుకోమని సలహా యిస్తున్నావు. మీరంతా చక్కగా డేటింగులు చేసి నచ్చినవాడ్ని చేసుకుంటారు. నేను యిండియన్ ని అనా యిలాంటి సలహా యిస్తున్నావు" నిష్టూరంగా అంది నందిత.
"నందూ డియర్ , చూడు అమెరికా అమ్మాయిగా నేను చెప్తున్నాను. ఈ డేటింగులు, ఈ లవ్ లు, ఈ టెస్టులు, ఐడియాలు కలవడం అంతా బుల్ షీట్ అంటాను. యిట్స్ షీర్ నాన్సెన్స్ , నధింగ్ ఎల్స్. ప్రతి మగవాడూ అమ్మాయి స్వంతం అయేవరకు చాలా జంటిల్మన్ లాగ, నమ్రతగా మన మాటలతో ఏకీభవిస్తాడు. కాస్త అందమైన, డబ్బున్న అమ్మాయి అయితే యింకా ఎక్కువ నటిస్తాడు. ఈ మగాళ్ళ అసలు రంగులన్నీ పెళ్ళయ్యాక గాని బయటికి రావు. కొత్త మోజులో కొన్నాళ్ళు మనమాట విన్నట్టు నటిస్తారు. ఆ తరువాత చూపుతారు తమ ప్రతాపాలు. ఏదన్నా అందేవరకే అపురూపం తరువాత రొటీన్ అయి పోయి ఏ థ్రిల్లు వుండదు. అడదయితే సేక్యూరీటీ కోసమో, పిల్లాల కోసమో , పరువు కోసమో కాపురం కొనసాగించాలనే అనుకుంటుంది. మగవాడికి ఆ అవసరం ఏముంది. డేటింగుల పేరుతొ అమ్మాయిలని వెంటాడుతారు. నచ్చకపోతే నాలుగురోజుల తర్వాత వదిలేస్తారు....' నందిత ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది.
"ఔనూ నందూ.....చక్కగా నీకా బాధ, రెస్పాన్స్బిలిటీ లేకుండా అమ్మ, నాన్న నీమంచి అలోచించి అబ్బాయిని తెచ్చి చేసుకోమంటే ....రియల్లీ! నాకు నిన్ను చూస్తె అసూయగా వుంది. మాకు అలాంటి అదృష్టం లేదు నందూ. మా పెళ్ళి బాధ్యత పెద్దవాళ్ళు తీసుకోరు. మంచొ చెడో మేమే ఎవడినో వెతుక్కోవాలి. మా భవిష్యత్తు మేమే డిసైడ్ చేసుకోవాలి. అదృష్టం బాగుండి మంచివాడయితే సరే, లేకపోతే వచ్చే ప్రాబ్లం ని మేమే సాల్వు చేసుకోవాలి. మాకు కాస్త వయసు వచ్చిందగ్గిర నించి రెక్కలొచ్చిన పక్షులని గూటిలోంచి తరిమేసినట్టు మావాళ్ళెం మా గురించి పట్టించుకోరు. మా భవిష్యత్తుకి వాళ్ళా పూచీ ఏమీ లేదు. మీ ఇండియన్ గర్ల్స్ ఎంత అదృష్టవంతులు. మీ బాధ్యత అంతా అమ్మా నాన్న తీసుకుంటారు. మంచి వరుడ్ని చూసి పెళ్ళి చేస్తారు. పెళ్ళి అయిన తరువాత కూడా మీ మంచి చెడ్డలు చూస్తూనే వుంటారు. మీ భవిస్యత్తులో వారి అండ మీకుందన్న నిబ్బరం మీకిస్తారు. ఇంతకంటే యింకేం కావాలి నందూ, ఏ ఆడపిల్లకైనా...."
"కాని....మనకీ ఓ ఆభిప్రాయాలుంటాయి, ఐడియాలుంటాయి , కోరికలుంటాయి. అవి కలవని భర్తతో కాపురం ఎలా చేయమంటావు. మీకయితే నచ్చనివాడితో విడిపోయే అవకాశాలు సుళువు. మాకు ఆ అవకాశాలు తక్కువ. అందుకే ముందే బాగా చూసుకుని...."
"నీ పిచ్చి గాని ఏం చూసుకుంటావు. నేను ముందే చెప్పినట్టు మనిషి సహజగుణాలు లోపాలు కల్సి బతకడం అరంభించాక గాని బయటికి రావు. ముందు ఎంతో మంచివాడిలా నటించి తరువాత మారిపోతే ఏం చెయ్యగలవు. నందూ ....యీ పెళ్ళిళ్ళు గాంబెల్ అనుకో. అదృష్టం బాగుంటే, కాస్త మంచివాడు దొరికితే సర్దుకుపోయి బతుకుతాం. లేదంటే బతుకు నరకం , విడిపోయి , డైవర్సు తీసుకుని మేం సాధించింది ఏమిటంటావు. ఫేమిలీ లైఫ్ లేక, సేక్యూరీటి లేక, పిల్లలంటే వారికి తల్లి, తండ్రి యిద్దరిలో ఎవరిదో ఒకరి ప్రేమ కరువయి, మరిన్ని బరువు బాధ్యతలు నెత్తిన పడి నలిగిపోతుంది అమెరికా స్త్రీ. డైవోర్సు లు తీసుకున్నాక మళ్ళీ పెళ్ళి చేసుకుంటే ఆ రెండో మొగుడు తిన్నగా వుంటాడని ఏముంది....'