Previous Page Next Page 
కాదేదీ కథకనర్హం పేజి 18


    "ఏం అనమంటావు. అంటే, నీకు వచ్చిన జవాబు నాకూ వచ్చేది. అనకపోబట్టి నా గౌరవం మిగిలింది. మధూ, ఈ కాలం పిల్లలని కాస్త జాగ్రత్తగా టాకిల్ చెయ్యాలి, టెంపర్ లూజ్ చేసుకుని మనం చేయగల్గింది ఏమీ లేదు.
    "ఆ.....అన్నీ అయ్యాయి, శాంతంగా చెప్పాను, చిలక్కి చెప్పినట్టు నచ్చచెప్పాను. మంచి చెడ్డ విడమరిచి బోధపరిచాను. అసలు నా మాటంటే దానికి లెక్కలేదు."
    "మనం సజెస్ట్ చేసినట్టు చేసి వదిలెయ్యాలి. ఆలోచించుకునే చాన్సు వాళ్ళకే వదిలేస్తే అప్పుడు కాస్త వింటారు. అంటే మనమే అలోచించి, నిర్ణయించేసినట్టు మాట్లాడితే వాళ్ళ "ఇగో" దెబ్బ తింటుంది. దాంతో వాదన, మొండి జవాబులు యిస్తారు. అది నీవు గ్రహించావు గదా---"
    "ఏమిటండి గ్రహించేది --- నేనేం దాన్ని విషం తీనమన్నానా -- మంచి సంబంధం పెళ్ళి చేసుకోమన్నాను. అడ్డమైన వెధవలతో డేటింగులు చేసి, ఏ తల మాసిన వాడినో , ఏ అమెరికన్నో కట్టుకుంటానంటే వూరుకోమంటారా " కోపంగా అనేసింది.
    "అంతదాకా వస్తే మనం చెయ్యగల్గింది ఏమీ లేదనుకో. బలవంతంగా పెళ్ళికి ఈ కాలం పిల్లలని ఎలా ఒప్పించగలం. మంచి సంబంధం అని, అన్ని విషయాలు చెప్పావు ------ దానికి కాస్త అలోచిన్చాడానికి టైమివ్వు. ఊరికే పదిసార్లు చెప్పి దాన్ని ఊరికే సాధిస్తుంటే అది మరింత పెట్రేగిపోతుంది. రెండు మూడు రోజులు టైమిచ్చి దాంతో నేను మాట్లాడతాను ఈసారి. నీవింక ఈ ప్రసక్తి దాని దగ్గర తేవద్దు.
    "ఏమిటో ఈ అమెరికా వచ్చి పొరపాటు చేసేమేమో అనిపిస్తుంది. ఇండియాలో వుంటే ఇంతలా పిల్లలు మరీ మితిమీరిపోవడం లేదు. యిక అందరినీ చూసి వీళ్ళూ ఇలా తరారవుతున్నారు. ఏదన్నా అంటే 'జనరేషన్ గ్యాప్" అంటూ పెద్ద కబుర్లు...."
    'మధూ నీవొక సంగతి మరిచిపోకూడదు. వాళ్ళకి జ్ఞానం వచ్చి రాకముందు మనం వాళ్ళని యిక్కడికి తీసుకొచ్చాం. వాళ్ళ చుట్టూ వాతావరణం, భాష, ఫ్రెండ్సు, క్లాసు మేట్స్ , యీ టీ.వీ లు యివన్నీ ఆ పసివాళ్ళ మనసుల మీద ముద్ర వేయవంటావా. ఈ దేశంలో వుంటూ ఈ అలవాట్లు అలవరచు కోవద్దంటున్నాం. అమెరికన్ సిటిజన్స్ అయినా యింక యిండియాలో లాగే వుండాలని మనం అనుకుంటున్నాం గాని యిక్కడ చిన్నప్పటి నుంచి పెరిగి యిండియా వాతావరణానికి దూరంగా వున్న పిల్లలు ఈ ప్రదేశపు అలవాట్లని అనుసరించి చూస్తారు. మనం అంటే ఇండియాలో పుట్టి ముప్పై ఏళ్ళు పెరిగాం. మన రక్తంలో ఆ భావాలు జీర్ణించుకువున్నాయి. మన పిల్లలు అలా కాదు కదా చుట్టూ వున్న వాతావరణం వాళ్ళని యిన్ ప్లూయన్స్ చేయదా.'
    "ఆ ఇన్ ప్లుయన్స్ వుంటుందనేగా నా బాధ. ఆ యిన్ ప్లుయేన్స్ వీళ్ళ మీద పడకుండా ఉండాలనే గదా నా తాపత్రయం. మంచి నేర్చుకున్నా తప్పులేదు, కాని మన వాళ్ళు వాళ్ళ బాడ్ హేబిట్స్ తొందరగా నేర్చుకుంటున్నారు. వాళ్ళలా పదిహేనేళ్ళు వచ్చేసరికి స్వతంత్రులై పోయినట్టు యిష్టం వచ్చినట్టు తింటూ, తిరుగుతూ , డేటింగుల పేరిట అడ్డమైన వాళ్ళతో తిరుగుతూ పెళ్ళి కాకముందే సెక్స్, ఎబార్షన్..... వాడు నచ్చకపోతే షర్టు మార్చినట్టు యింకోడ్ని మార్చడం.....అది కాకపొతే ఏ వెధవనో కట్టుకుని నాల్గురోజులు కాపురం చేసి డైవర్సులు యిక్కడ ఫేమిలీ లైప్ లు చూస్తుంటే మన పిల్లలు అలా తయారవుతారేమోనని భయపడడం తప్పంటారా...."
    "నీవు తప్పుగా ఆలోచిస్తున్నావని, నీ ఆలోచన అత్యాశని అనను. కాని వాళ్ళ ఆలోచనలు ఇలా వుండవు గదా. "మమ్మీ డాడీ అమెరికాలో వుండాలి యిక్కడి డబ్బులు పనికి వస్తాయి గాని అమెరికన్స్ లా వుండకూడదంటారు అంతా నేరో థింకింగ్ అంటూ ఎత్తి పొడుస్తారు. వాళ్ళనీ తప్పుపట్టలేం మనం. మన ఆలోచనలకి వాళ్ళ ఆలోచనలకి మధ్య జనరేషన్ గాప్ అనే వారధి వుంది. దేశం, భాష, మతం, అచారణ సంస్కృతీ అన్నీ వేరయినా దేశంలో పొట్ట కూటి కోసం వున్నాం అనుకుంటున్నాము.....మన వాతావరణానికి దూరంగా పెరిగిన పిల్లల మనస్తత్వం అర్ధం......"
    'అర్ధం చేసుకున్నానండీ బాబు, అందుకే భయం నాకు. ఎక్కడిది తప్పటడుగు వేస్తుందో అనే ఆదుర్దా , నన్నంటారు గాని రేపు మీ అమ్మాయి ఏ అమెరికన్నో పెళ్ళాడుతానంటే , అంగీకరిస్తారా మీరు, బాధపడరా...." నిలేసింది.
    "ఎలా అంగీకరిస్తాను. ఎప్పటికీ అంగీకరించను. కాని మన అంగీకారంతో అది సంబంధం లేదనుకుంటే మనం ఏమీ చెయ్యలేమనే నేను చెప్పేది. అంచేత ప్రిపేర్ యువర్ సెల్ప్ ఫర్ ది వరస్ట్ " అంటున్నాను.
    'అది అంత దూరం వెళ్ళక ముందే కంట్రోల్ చేయడం మన బాధ్యతకదా తల్లిదండ్రులుగా, యిప్పటి కింకా దానికి ఎకనమికల్ యిండిపెన్ డేన్స్ రాలేదు గనుక కాస్త మన మాట వినే స్టేజిలో వుంది. ఇంకా పూర్తిగా చెయ్యి దాటి పోక ముందే మూడు ముళ్ళు వేయించేస్తే .....' మాధవి తల్లి మనసు ఆరాటం అర్ధం అయింది ప్రకాశరావుకి. మాధవితో అన్ని విధాల ఏకీభవించడానికి అతనికేం అభ్యంతరం లేదు. ఎటొచ్చి కూతురి సంగతి తెల్సిన అతను యిరవై ఏళ్ళు నిండకుండా గ్రాడ్యుయేట్ పూర్తీ కాకుండా తమ మాట విని పెళ్ళికి వప్పుకుంటుందా యిప్పుడు....అతనికేం నమ్మకం లేదు. భార్య అన్నట్టు అన్నీ వున్న మంచి సంబంధాలు అనుకున్నప్పుడల్లా దొరకవు --- ఆ సంగతి పిల్లలకి అర్ధం కాదు. అర్ధం చేసుకుంటే వాళ్ళు అదృష్టవంతులే....
    "మీరొకసారి పిల్చి చెప్పండి" మాధవి అంది.
    "ష్యూర్.... కాని రెండు రోజులు వూరుకుని మాట్లాడుతాను ---- ఈలోగా దాన్ని కాస్త ఆలోచించుకొనియి. ఈలోగా నీవు మళ్ళీ దాని దగ్గర ఈ ప్రసక్తి తేవద్దు. భార్య చేతి మీద చెయ్యి వేసి అనునయంగా అన్నాడు. మాధవి తల ఆడించింది.

                                          *    *    *    *
    ప్రకాశరావు పన్నెండేళ్ళ క్రితం అమెరికా వచ్చాడు. ప్రకాశరావు ఏమ్ .టెక్ చదివాడు. భారత్ హెవీ ఎలక్రికల్స్ లో మంచి జాబ్ చేస్తుండేవాడు ---- అనుకోకుండా అమెరికా వెళ్ళే చాన్సు వచ్చింది. ఎంత మంచి జాబ్ లో వున్నా పన్నెండేళ్ళ సర్వీసు వున్నా ఇండియాలో సంపాదన ఖర్చులకే సరిపోతుంది. అమెరికా వెళ్లి నాలుగయిదేళ్ళు , వుండి కాస్త డబ్బు కూడపెట్టుకుని రావాలన్న ఉద్దేశంతోనే అమెరికా వెళ్ళినప్పుడు, అక్కడ సెటిల్ అవ్వాలన్న ఉద్దేశం లేదు. అప్పుడు నందితకి ఎనిమిది, నవీన్ కి ఆరేళ్ళు -- అమెరికా వచ్చాక అదృష్టం తన్నుకొచ్చి చాలా తొందరగా పైకి ఎగబాకి పోయాడు. మంచి కంపెనీల నుంచి చాలా మొత్తంలో జీతాలతో ఆఫర్లు వచ్చి వుండి పొమ్మని బలవంతం పెట్టారు. అమెరికా వచ్చాక అక్కడి డబ్బు, అక్కడ కంఫర్టు వదులుకుని ఇండియా వెళ్లాలనిపించలేదు. నాలుగైదు ఏళ్ళు అనుకుని వచ్చినా డబ్బు వస్తున్నా కొద్దీ యిండియా తిరిగి వెళ్ళాలన్న యావ తగ్గిపోయింది. దానికి తోడు రెండేళ్ళకి ఓసారి శలవులకి యిండియా కెళ్ళినప్పుడు పిల్లలకి అసలు అక్కడి వాతావరణం నచ్చేది కాదు. అమెరికాలో సదుపాయాలు, లేక టి.వి. లు అవి లేక బోర్ అనేవారు. ఆరోడ్ల మీద దుమ్ము ధూళి అవన్నీ చూసి మేం యిండియా రాం.' అనేవారు వాళ్ళు . వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ వాళ్ళలో అభిప్రాయం మరింత బలపడింది. నందిత అయితే "నేను చచ్చినా రాను మీరు వెళ్ళినా నేను యిక్కడే వుండి చదువుతాను" అని వాదించేది. ఈలోగా కంపెనీ వత్తిడి చేసి సిటిజన్ షిప్ ఏర్పాటు చేసి యిప్పించారు. ఇండియాలో ఆస్తులు అమ్ముకుని బంగారం చేసుకుని అమెరికా వాసులాయిపోయారు. ఏడాదికి మిలియన్ డాలర్లు, పెద్ద ఫోర్ బెడ్ రూము, ఆధునిక సదుపాయాల ఇల్లు మూడు కార్లు .....ప్రకాశరావు చాలా బిజీగా పెద్ద హోదా గల వ్యక్తిగా అయిపోయాడు. అక్కడ నందిత చిన్నప్పటి నించి అందరితో కొత్త పాత లేకుండా గలగల మాట్లాడేది. అతి తొందరగా స్నేహం చేసుకునే స్వభావమేమో నందితకి ఎంతో మంది ఫ్రెండ్సు, స్కూలు ఫ్రెండ్స్ యిరుగుపొరుగు ఫ్రెండ్స్ , ఫేమిలీ ఫ్రెండ్స్ లో ఆమె యీడు పిల్లలు యిలా రకరకాల స్నేహితులుండేవారు. టీనేజ్ కి వచ్చాక యింకా ఫ్రెండ్స్ సర్కిల్ పెద్దదయి పోయి ఎప్పుడూ అబ్బాయిలూ, అమ్మాయిలతో సినిమాలు, యింట్లో పెద్ద షేటిల్ కోర్టు ఉండేదేమో గేమ్స్ లని, పార్టీలని తెగతిరిగేది. ఎంత తిరిగినా స్వతహాగా తెలివైనది అవడం వల్ల క్లాసులో రేంకు తెచ్చుకునేది. వయసు తో పాటు రకరకాల షోకులు ఫేషన్లు పెరిగాయి. ఫ్రాకులు, మిడీలు, బాబ్ లు, లిప్ స్టిక్ లు, జీన్స్, హైహీల్స్ -- అమెరికన్ ఎసతో యింగ్లీషు, ఆ అమ్మాయి అచ్చు అమెరికా పిల్లలా మారిపోయింది. శలవ వస్తే బ్యూటీ క్లినిక్కులు, ఫేషియల్స్, అంటూ ఏవేవో చేసేది. ప్రకాశరావు డబ్బు పుష్కలంగా సంపాదిస్తున్నాడేమో, కోరిన డ్రస్సల్లా , రకరకాల షూస్, బ్యాగులు ఏది కావాలంటే అవి కొనేది. మాధవికి కూతురి వేషాలు , కూతురి  ఫ్రెండ్స్ సర్కిల్ చూసి యీ పిల్ల ఎలా తయారవుతుందిరా భగవంతుడా అని బెంగపడేది. ఎంత డబ్బున్నా మరీ అంత నీళ్ళలా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తుంటే మండలిస్తూనే వుండేది. "నీపాకేట్ మనీ యింతకంటే యివ్వను" అనేది. కాని నందిత తండ్రి దగ్గర గారాలు పోయి డబ్బులు లాగేది. "పోనీద్దూ యీ ఏజ్ లో కాకపొతే యింకేప్పుడు సరదాలు పిల్లలకి తీరుతాయి. పెళ్ళయ్యాక మనం యిచ్చినా తీసుకుంటుందా అనేవాడు ప్రకాశరావు.

 Previous Page Next Page