Previous Page Next Page 
కాదేదీ కథకనర్హం పేజి 20


    "అంటే అమెరికాలో మేరీడ్ లైఫ్ బాగోలేదంటావా , ప్రేమించుకుని పెళ్ళి చేసుకుని ఎందరు హాయిగా లేరు?"
    'అమెరికాలో పెళ్ళిళ్ళు చేసుకోడం లేదని, సంసారాలు చేయడం లేదని నేననను. కాని హాయిగా సంసారాలు చేసుకుంటున్న వాళ్ళ పర్సంటేజ్ కంటే ప్రేమించుకుని పెళ్ళిళ్ళు చేసుకున్నాక ప్రాబ్లమ్స్ స్టార్ట్ యి విడిపోయే వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ. మీ యిండియాలో కష్టమో సుఖమో , ఒకసారి పెళ్ళయ్యాక అంత సుళువుగా విడిపోరు. ఆవిధంగా అక్కడి ఆడవాళ్ళకి సెక్యురిటీ వుంది. ఏదన్నా యిటు అటు అయితే ఆదుకోడానికి పెద్దవాళ్ళు వుంటారు.....అక్కడి పిల్లలకి యింకేమున్నా లేకపోయినా తల్లిదండ్రుల ప్రేమాభిమానాలు పుష్కలంగా దొరుకుతాయి. వాళ్ళు పెరిగి చదువులై, ఉద్యోగం వచ్చేవరకు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీలు లేవు. టెన్షన్స్ లేవు. యిక్కడిలా పదిహేనేళ్ళు వచ్చిందగ్గరి నించి ఏదో చేసి డబ్బు సంపాదించాలన్న బాధ, బాధ్యత అక్కడి పిల్లలకి లేదు. అమ్మ, నాన్న హాయిగా చూసి పెళ్ళి చేస్తారు. యిక్కడి పిల్లలతో పోలిస్తే మీ యిండియన్ పిల్లలు అన్ని విధాల అదృష్టవంతులంటాను. మాకున్న డబ్బు లేకపోవచ్చును, కంఫర్ట్ లేకపోవచ్చును ఇండియాలో, కాని అక్కడి సెక్యూరిటీ యిక్కడ ఏ స్టేజి లోనూ లేదు మాకు. అందుకే యిప్పుడు మా థింకింగ్ లో మార్పు వస్తుంది. ఈ పెళ్ళిళ్ళు , ఊ...... అ.... అంటే విడిపోవడం , పిల్లలు మద్యన నలిగిపోవడం, అది చూస్తూ ఫేమిలీ లైఫ్ కోసం సర్దుకు బతకాలనే ఆలోచన మా వాళ్ళలోనూ వస్తుంది. ఆ ఫ్రీడమ్ , ఆ స్వేచ్చలో శాంతి, భద్రతలు కరువయ్యాయి అని అర్ధం అయ్యాక అందరూ యిదివరకటి ఫామిలీ లైఫ్ మంచిదన్న నిర్ణయానికి  వస్తున్నారు......ఇద్దరు కొత్త వ్యక్తులు ఒక యింట్లో కల్సి బతికినపుడు రకరకాల ప్రాబ్లమ్స్ , అభిప్రాయ బేధాలు రాక తప్పవు. ప్రేమించి చేసుకున్నంత మాత్రాన బతుకంతా పుస్తకాలలో మాదిరి ప్రేమ తిని బతకరు. లైఫ్ లో వుండే కష్ట నిష్టూరాలు ఎలాగో భరించాలి. ఒక యింట్లో వుంటే వయస్సు వచ్చాక , తల్లీ కూతుళ్ళ మధ్యే మాటా మాట వస్తాయే, అలాంటిది పుట్టిన యిరవై ఏళ్ళ వరకు పరిచయం లేని మనిషితో అభిప్రాయబేధాలు ఎందుకు రావు. ఆ మాత్రం దానికోసం ఎవరైతేనేం? సెక్యూర్ డ్ , ఫేమీలీ లైఫ్ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఇండియన్స్ ఎలా అడ్జస్ట్ అవుతున్నారో ఆపద్దతే నచ్చుతుంది మావాళ్ళకి. ఇదంతా ఎందుకు చెపుతున్నానో నందూ నీకు తెలుసా. అమెరికాలో వుండి మిమ్మల్ని చూసి మా పద్దతులు మంచివనుకుని నువ్వీ తప్పటడుగు వేయద్దు. నీ మంచికోరి చెప్పే నీవాళ్ళ మాట విని మంచి చదువు, కుటుంబం నుంచి వచ్చిన అతన్ని చేసుకో. నీ స్నేహితురాలిగా యిది నా సలహా....."
    నందిత సందిగ్ధంలో పడ్డట్టు, ఆలోచనలో పడింది. "నందూ నీ మనసులో విషయం నాకు తెలుసు. నీవు మైక్ గురించి అలోచిస్తున్నావని నాకు తెలుసు. ఈ మధ్య మీ యిద్దరినీ గమనిస్తున్నాను. నీవు అతని పట్ల అట్రాక్ట్ అవుతున్నావు. కానీ నందూ ఆ మైక్ నీకు తగినవాడు కాడు.' జేనెట్ మొహంలో మారిన రంగులు చూస్తూ ఆశ్చర్యపడింది నందిత.
    "ఎందుకు....ఎందుకలా అంటున్నావు. మైక్ చాలా సరదాగా వుంటాడు'.... స్మార్ట్ గా ....చదువులో కూడా బ్రిలియంట్ కదా.....' అనుమానంగా చూసింది నందిత.
    'చెపితే నాకు జెలసీ అనుకుంటావని చెప్పలేదు. ఎన్నోసార్లు నీతో  చెప్పాలనుకున్నాను గాని  నామీద నీకు సదభిప్రాయం పోతుందని చెప్పలేదు. సరే నీవింకా డేటింగులు, ప్రేమలు ఆరంభించలేదు గదా, మీ స్నేహం ఎలా దారితీస్తుందో చూసి చెప్పచ్చు అనుకున్నాను. ఆ మైక్ ఒట్టి రోగ్.'
    "ఏమిటి.....ఆశ్చర్యంగా అడిగింది.
    'నందూ ఈ మైక్ నిన్ను చూడకముందు మా అక్కతో డేట్ చేసేవాడు. మీ ఫాదరు మాకంటే డబ్బున్న వాడని, నీవు అక్క కంటే బాగుంటావని అక్కని వదల్చుకుని నీవెంట తిరగడం మొదలు పెట్టాడు తెలుసా. దాంతో ఎనిమిది నెలలు తిరిగాడు. అది వీడిని సీరియస్ గా తీసుకుని మనసుతో పాటు శరీరం యిచ్చింది. అమ్మ నాన్నకి చెప్పింది. పెళ్ళి డేట్ నిర్ణయించేలోగా మొహం చాటుచేయడం ఆరంభించాడు. అక్క ఎన్నిసార్లు ఫోను చేసినా వుండి లేడనిపించేవాడు. ఒక్క నెలలో అక్కను వదల్చుకున్నాడు. తరువాత నీతో స్నేహం మొదలుపెట్టాడు. అక్క పాపం ఎంత ఏడ్చిందో ....నీకు కావాలంటే వాళ్ళు రాసుకున్న ఉత్తరాలు, ఫోటోలు అవీ చూపిస్తాను."
    నందిత మొహం తెల్లగా పాలిపోయింది. "నిజమా......"అంది నమ్మలేనట్టు.
    "నేను గత నాలుగైదు నెలల నించి నిన్ను గమనిస్తున్నాను . నిన్ను హెచ్చరించాలనుకుంటూనే నీవు నన్ను అపార్ధం చేసుకుంటావని చెప్పలేదు. వాడిని నీ అందం, నీ డాడీ డబ్బు ఆకర్షించింది అంతే. లవ్ గివ్ నమ్మకు.'
    మైగాడ్ మైక్ దంతా నిజమైన ఇంటరెస్ట్ ని నమ్మాను. నయమే ముందుగా చెప్పావు. ఎన్నోసార్లు డేటింగ్ కి రమ్మని పిలిచాడు , అమ్మ, నాన్న భయంతో నేను యింకా సాహసం చెయ్యలేదు. ఇంకా నా యింటరెస్టు మమ్మీ, డాడీకి చెప్పి, మైక్ ని యింట్రడ్యూస్ చేద్దామనుకున్నాను."
    'నందూ.....అందుకే నాకు ఈ డేటింగులు అవీ నమ్మకం లేదు. ఎన్నో కేసులు యిలాంటివి చూసాను. మనకి టెన్తూ క్లాసు మేట్ విక్టోరియా నీకు గుర్తుందా . సూయిసైడ్ కమిట్ చేసింది. ఎందుకో తెలుసా, లవ్ ఎఫైర్ ఫేలయి, అది తట్టుకోలేక చచ్చిపోయింది. వాడు దీన్ని మోసం చేసి, డబ్బు ఖర్చు పెట్టించి మొహం మొత్తగానే వదిలిపోయాడు. యిలాంటివి చాలా తెలుసు నాకు. ఫర్ గాడ్ సేక్, నీవు యిలాంటి వాటిలో యిరుక్కోకు నందూ చక్కగా మీ అమ్మ నాన్న చూపించిన అబ్బాయిని చేసుకో. ఈ డేటింగులు , ఈ టెన్షన్స్ --- అవీ వద్దు నీకు స్నేహితురాలిగా యిది నా సలహా.' నందిత చేయి పట్టుకుని అంది జేనెట్.
    

                                           *    *    *    *

    "వాళ్ళ దగ్గిర నించి ఉత్తరం వచ్చింది నందూ. ఏం రాయమన్నావు వాళ్ళకి. యిదే నిన్ను ఆఖరిసారి అడగడం, ఏదో ఒకటి జవాబు చెప్పు ముభావంగా అంది మాధవి.
    "నందూ.....ఈ అబ్బాయి నచ్చకపోతే యింకోకరిని చూస్తాం. నీ అభిప్రాయం స్పష్టంగా చెప్పు' ప్రకాశరావు అనుమానంగా అన్నాడు.
    'ఒకే డాడీ ......యిండియాకి టికెట్స్ బుక్ చేయండి.' నందిత అంది. మాధవి ప్రకాశరావు నమ్మలేనట్టు మొహాలు చూసుకున్నారు. కూతురు కోపం వచ్చి అలా అంటున్నాదని అనుకున్నారు....."నిన్నేం అబ్బాయిని చూడకుండా చేసుకోమనడం లేదు. చూసి నచ్చితేనే ....' మాధవి ఏదో అనబోయింది.
    "ఫోటో చూసాను.....మీరు చూసారు. మామయ్యా వాళ్ళంతా చూసారుగా మీ అందరికీ నచ్చిందిగా.'
    "మేం చూడడం వేరు. నీవు చూడకుండా చేస్తామా నందూ....మేం నీ మంచి కోసం చెపుతున్నాము. మామీద కోపంతో లైఫ్ లో ముఖ్యమైన విషయాన్ని తొందరపడి నిర్ణయించుకోనక్కర లేదు.'
    "కమాన్ డాడీ---- యిన్నాళ్ళూ నేను ఒప్పుకోలేదని కేకలేశారు. యిప్పుడు సరే అంటే మీరెందుకు తటపటాయిస్తున్నారు....నేను వప్పుకుంటున్నానని చెప్పాగా యింకా ఎందుకు అర్గ్యు,మెంట్స్....."
    భార్య భర్తలిద్దరూ మొహాలు చూసుకున్నారు. మళ్ళీ ---- 'మేం అన్నామని కోపంతో అంటున్నావేమోనని ...."
    "కోపం ఏం లేదు డాడీ.....నా మంచి కోసమే చెప్తున్నారుగా మీరు యూ కెన్ ప్రొసీడ్ విత్ దిస్ మాచ్. ఇంతకంటే ఏం చెప్పాలి." నందిత అక్కడి నుంచి వెళ్ళిపోతూ అంది.
    కూతురు ఇంత సుళువుగా వప్పుకుంటుందని ఆశించని వారిద్దరి మొహాలు సంతోషంతో వికసించాయి.

                                                                                   (వనిత మాసపత్రిక ) ***

 Previous Page Next Page