Previous Page Next Page 
వివాహబంధాలు పేజి 19


    అన్ని మాటలు అన్నాక ఆయన వూరుకుంటారా? ఆయన కసితీరా కొట్టారు. వళ్ళు మరిచి నేను అరచినట్లు వళ్ళు మరిచి ఆయన కొట్టారు.
    ఆ దెబ్బలకి, ఆ తిట్లకి ఆ రోజు నాకు భవిష్యత్తు పట్ల మినుకు మినుకుమనే ఆశ కాస్త ఆరిపోయింది. యింకేందుకు బతకాలో తెలియదు. ఈ యిల్లు వదిలి వెళ్లేదారి లేదు. వెడితే భవిష్యత్తు అగమ్యం. నా వాళ్ళకి నేను సమస్య అవడం యిష్టంలేక ఇంతకంటే గత్యంతరం కనపడక ఈ నిర్ణయానికి వచ్చాను డాక్టరుగారూ-చెప్పండి డాక్టర్! యిప్పుడు చెప్పండి నేను తొందరపడ్డానా? నేను చేసింది తప్పా? నా సమస్యకి పరిష్కారం ఏదన్నా వుందంటారా? చావుతప్ప మరో మార్గం నాకుందంటారా? ఇప్పుడు జవాబు చెప్పండి డాక్టర్! నన్ను బతికించి నా కెంత ద్రోహం చేశారో ఇప్పటికయినా అర్ధమయిందా డాక్టర్-" ఆవేశంగా సవాల్ చేస్తున్నట్లు అడిగింది శారద.
    విజయ సాలోచనగా శారద వంక చూస్తూండి పోయింది ఒక నిముషం. ఏదో నిశ్చయించుకొన్న దానిలా స్థిరంగా తలెత్తి-
    "ముందే చెప్పానుగా శారదా! ప్రతి సమస్యకి పరిష్కార మార్గం వుంటుందని."
    శారద ఆశ్చర్యంగా చూసింది.
    "అవును శారదా- నీ సమస్యకి పరిష్కారం నీవు ఆయనని ఎదుర్కోగలగడమే. అణిగి మణిగి పడివున్నన్నాళ్ళూ మరింత అణచాలనే స్వభావం మనిషిది. అందులో నీ భర్త లాంటిమగవాళ్ళకి భార్య అంటే అణిగి పడివుండేదని, ఎక్కడికి పోలేదని చచ్చినట్లు ఏమన్నా భరిస్తుందని వాళ్ళ వూహ. వాళ్ళ అపోహ తొలగించి- భార్య అంటే బానిస కాదు, భార్య అంటే ఆ సంసారంలో భర్త కెంత స్థానం వుందో భార్యకి అంతే స్థానం వుందని అతనికి తెలియచెప్పడం నీ బాధ్యత. భార్య స్థానం భర్తపాదాల దగ్గర కాదు హృదయంలో అని నిరూపించాలి నీవు- అవసరమైతే ఎదిరించాలి."
    "మీకు నేను చెప్పింది సరిగా అర్ధం అయినట్టు లేదు. ఆయనని ఎదిరించకపోతేనే నాగతి ఇలా ఉంది. ఎదిరిస్తే. బతకనిస్తారా" ఆశ్చర్యంగా అడిగింది శారద.
    "అవును బతకనీయడు, ఇంట్లోంచి పొమ్మంటారు? సరే వెళ్ళిపోతున్నాను అను" విజయ నిబ్బరంగా చెపుతూంది.
    శారద విచిత్రంగా చూసింది.
    "ఎక్కడికి పోను? మీకు చెప్పానుగా నన్ను స్వీకరించే స్థితిలో మా వాళ్ళు లేరని. మరి ఎక్కడికి వెళ్ళను ఏ అండ చూసుకొని ఆయన్ని ఎదిరించను?" బేలగా అంది శారద.
    "పిచ్చి శారద బతకదలుచు కొంటే మార్గమే కనపడలేదా నీకు ఇన్నాళ్ళు -ఆయనింట్లో చేసే వంట ఏ ఇంట్లో చేసినా ఆ మాత్రం తిండి పెట్టి -మరో నలభయ్యో ఏభయ్యో సంపాదించుకో గలవు. అంతకంటే గౌరవంగా బతకగలవని ఆయనకీ తెలియచెప్పు. అలా తెగేసి, తెగించి నిర్ణయాలు చేయడం చెప్పినంత సులువు కాదని నాకు తెలుసు. అంటే నిన్ను వంటపని చెయ్యమని చెప్పడం కాదు నా ఉద్దేశ్యం - ఆయన నిన్ను మనిషిగా. భార్యగా గౌరవంగా చూడకపోతే ఇల్లు విడిచి వెళ్ళగలవన్న భావం ఆయనకి కలిగించు ఏదన్నా అంటే నీవు వెళ్ళిపోతావన్న భావంతో భయంలో ఆయన్ని వుంచాలి నీవు-"
    శారద అర్ధం కానట్లు చూసింది- 'అదెలా నేనలా జవాబిస్తే సర్లే పో అంటే ఎక్కడికి పోను? ఆయన నా బెదిరింపు ఉత్తి బెదిరింపే అని గ్రహిస్తే... ..."
    "అది బెదిరింపు కాదని ఆయనకి తెలిసెలా నీ మీద మళ్ళీ చెయ్యి చేసుకొంటే ఇల్లువదిలినాదగ్గరికి రా-ముందుగా ఆయనకి ఇకముందు కొట్టి కొట్టి హింసిస్తే పడి ఉండనని, గౌరవంగా భార్యకీయాల్సిన స్థానం ఇవ్వకపోతే ఆ రోజుతోనీకూ నాకూసరిఅన్న ఉద్దేశం మాటలతో తెలియజెయ్యి. అప్పటికీ లెక్క చెయ్యకపోతే చేతలతో చేసి చూపించు. శారదా, అలాంటి సమయం వచ్చినప్పుడు నీకు నేను అండగా నిలుస్తాను, సంఘ భయంతో నీ తల్లిదండ్రులు నిన్ను ఆదరించలేక పోవచ్చు. కాని సాటి స్త్రీగా నిన్ను నేను ఆదుకుంటాను శారదా- యేదో ఉద్యోగం దొరికాక నీ బతుకు నీవు బతకలేకపోవు."
    "డాక్టర్" నమ్మలేనట్టు చూసింది శారద. "మీరు మీరు నన్ను ఆదుకుంటారా" కృతజ్ఞతా భావంతో ఆమె గొంతు మూగ పోయింది. "మీకు నేనేం అవుతానని ఇంత దయ చూపిస్తారు డాక్టరుగారూ. కన్నతల్లి తండ్రులే నా కర్మానికి నన్ను వదలగా - మీరు.... నన్ను ఆదరిస్తారా." శారద కళ్ళు చెమ్మగిల్లాయి.
    "శారదా ముందే చెప్పాను గదా. ఏ స్త్రీ అయినా భర్త ఆదరణకి దూరం అయి బతకడం అంటే అదెంత నరకమో నాకు తెలుసు. అలాంటి దురవస్థనించి ఒక్క స్త్రీని రక్షించినా అంతకంటే సంతృప్తి నాకేం ఉంటుంది. శ్రీధర్ నేను డాక్టర్లుగా రెండు చేతులా ఆర్జిస్తున్నాము. నీకో బతుకు తెరువు దొరికేవరకు నిన్ను ఆదుకోడం మాకేం కష్టం కాదు."
    "కాని. డాక్టరుగారూ. లోకం ... నా స్థానం..."
    "లోకం, వెధవ లోకం సంగతి మరిచిపో. నీ భర్త నిన్ను హింసిస్తూంటే యేం చేసిందా లోకం నీకు? చూడు శారదా! లెక్క చెయ్యని వాళ్ళ జోలికి రాదు లోకం. భయపడుతుంటే మరింత లోకువకట్టి సాధిస్తారు మనుష్యులు. ఎన్నాళ్ళు అంటారు, రెండు రోజులు వింతగా చెప్పుకుంటారు మూడోరోజు అలవాటయి మానేస్తారు. ఒక ఆడది ఎంత నరకం కాకపోతే సంసారం వదులు కుంటుంది అన్న యింగిత జ్ఞానంతో అలోచించ లేని మనుష్యుల గురించి నీవు పట్టించుకోవద్దు..."

 Previous Page Next Page