Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 20

                                 


                        వివేకానందుడు - విలాసపురుషులు

           

    గార్డు ఈలవేసి పచ్చజెండా చూపినాడు. రైలుబండి కూతవేసి గుప్పుగుప్పుమని బయలుదేరినది. అంతలో పొడుగైన కోటు ధరించి తలగుడ్డ చుట్టుకొని యున్న ముప్పదియేండ్ల పురుషుడు పెట్టెతలుపు నెట్టుకొని గబగబా లోనికి వచ్చెను.
    అది మొదటి తరగతి పెట్టె. ఆ పెట్టెలో ఇరువురు విలాస పురుషులు ఒకవైపు సీటుమీద కూర్చుండి యుండిరి. మరొక ప్రక్కసీటుమీద వారిప్రక్కచుట్టలు ఉండెను. క్రొత్తగా వచ్చిన మనుష్యుడు కూర్చుండుటకు చోటులేకపోయెను. ఆయన ఆ విలాస పురుషుల వైపు చూచుచు కొంచెముసేపు అట్లే నిలబడియుండెను.
    విలాసపురుషులు విదేశీ దుస్తులను వేసికొని యుండిరి. వింత వింత దొర టోపీలను తలలపై ధరించియుండిరి. వారి చేతిలోని సిగరెట్టు పొగలు ఆ రైలు పెట్టెలో చిన్నచిన్న మేఘములను సృజించుచుండెను. వారిరువురు ఒకమాటు ఆ నూతన పురుషునివైపు నిర్లక్ష్యముగా చూచి మరల సరససల్లాపములలో మునిగిరి.
    నూతన పురుషుడు కొంచెముసేపు అట్లే నిలుచుండి వారిని చూచి "అయ్యా! ఈ ప్రక్క చుట్టాలు కొంచెము మీ ప్రక్కగా పెట్టుకొందురా!" అనెను.
    నవనాగరికులేమియు మాటాడలేదు. నూతన పురుషుని ప్రార్థన వారి చెవికెక్కినట్లు లేదు. వారు మరల తిరస్కారముగ చూచి తమ్ము కాదన్నట్టు మొగములు త్రిప్పుకొనిరి. మన క్రొత్త మనుష్యుడు "స్వామీ, సామాను తీయు"డని తిరిగి వారిని కోరెను.
    కాని విలాసపురుషులు వినిపించుకొనలేదు. ఆ క్రొత్త మనుష్యుడు "అయ్యా! ఈ పక్కచుట్టాలు మీవా కావా?" అని గట్టిగా ప్రశ్నించెను. పెద్ద మనుష్యులు మిన్నకుండిరి. వెంటనే మన నూతన పురుషుడు ఓహో! ఈ సామాను మీదికాదు కాబోలు. ఎవరో పాపము వీని నిక్కడ వదలిపెట్టి దిగిపోయి యుందురు" అని చటుక్కున ఒక పక్కచుట్ట నెత్తి క్రింద పడవేయబోయెను.
    అదిచూచి విలాసపురుషులు ఉలిక్కిపడిరి. వారు కొంప మునిగిపోయినట్లు లేచి, "అయ్యో! అయ్యో! పడవేయకుము! పడవేయకుము! ఆ సామాను మాదే" అని పలికి పక్కచుట్టలు తీసి తమ బెంచీపై నుంచుకొనిరి.
    నూతన పురుషుడు మందహాసము చేయుచు ఖాళీయైన సీటుపై కూర్చుండెను. అతడెవ్వరోకాదు. సుప్రసిద్ధుడయిన మన వివేకానందుకే!

                                         *  *  *  *

 Previous Page Next Page