Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 21

                                 


                                      రాజు - రజకుడు

           

    పూర్వము విజయసేనమను పట్టణమును వీరవర్మ యనురాజు పరిపాలించుచుండెను. ఆయన చాలా తొందరపాటు మనిషి. చీటికిమాటికి సేవకులపై కారణములేకయే కారాలు మిరియాలు నూరుచుండును.
    అప్పుడే తెల్లవారినది. తూర్పు దిక్కున బాల భాస్కరుని అరుణ కాంతులు అలనల్లన ప్రసరించుచుండెను. గవాక్షము నుండి సూర్యకిరణములు మీదబడి ఒడలు చురుక్కు మనగానే రాజుగారు హంస తూలికా తల్పము నవరోహించిరి.    
    ఆయన పక్కదిగి కనులు నులుముకొనుచు శయన మందిరము నుండి వెలుపలకు వచ్చెను. సరిగా అదే సమయమునకు గుడ్డలు కొనిపోవుటకై చాకలి సుబ్బన్న కోటలోనికి వచ్చుచుండెను.    
    రాజు చాకలి సుబ్బన్న ముఖము చూచుచు పరధ్యానముగ అడుగు ముందుకు వేసెను. ఆ తొందరలో ద్వారబంధము కమ్మి "ఠపీ"మని రాజుగారి తలకు కొట్టుకొనెను. ఆ దెబ్బకు ఆయన తల దిమ్మెక్కెను. కన్నుల నీరు గ్రమ్మెను.
    రాజుగారికి కోపము వచ్చెను. ఆయన ఆగ్రహావేశముతో రాజభటులను పిలచి "ఆ రజకుని తక్షణము పెడరెక్కలు విరచికట్టి తీసుకొని రం"డని ఆజ్ఞాపించెను. రాజభటులు చాకలి సుబ్బన్నను బంధించి రాజుగారి సమక్షమునకు తీసుకొనివచ్చిరి.
    వీరవర్మ పండ్లు పటపట కొరుకుచు "ఈ దుర్మార్గుని తీసుకొనిపోయి వీని తల కొట్టివేయుడు" అని కఠినముగా శాసించెను. రాజుగారి శాసనము విని సుబ్బన్న గుండె గుభిల్లుమనెను.
    అతడు గడగడ వణుకుచు "దొరగారూ! నేను చేసిన అపరాధమేమి?" అని జాలిగా ప్రార్థించెను. రాజు కోపముతో "నీ అపరాధమేమియులేదా? నిర్భాగ్యుడా! ప్రొద్దుననే లేచి నీ పాపిష్టి ముఖమును చూచుటచేత నా తలకు ఎంత పెద్ద దెబ్బ తగిలినదో చూడుము" అని గద్దించెను.
    సుబ్బన్న చేతులు నలుపుకొనుచు "దొరగారూ! నా మనవి చిత్తగింపుడు. నేను కూడా ఈ రోజు ఉదయముననే దేవరవారి మొగము చూచితిని. నా పాపిష్టి మొగము చూచుటచే తమ తలకు దెబ్బ తగిలినది. ఇక తమ బంగారు మొగము చూచుటచేత నా తలయే యెగిరిపోవుచున్నది" అని పలికెను.
    రజకుని మాటలకు రాజు సిగ్గుపడి వెంటనే వానిని బంధవిముక్తుని గావించెను.

                                         *  *  *  *

 Previous Page Next Page