Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 19

                                 


                                                         అలెగ్జాండరు - దొంగ

           

    అలెగ్జాండరు యవనదేశపు చక్రవర్తి. అతడు ప్రపంచమంతయు జయింపవలెనని తలంచెను. ఆ శూరాగ్రేసరుడు దేశము తరువాత దేశమును స్వాధీనము చేసికొనుచు, క్రమముగా ఈరాను దేశమునకు వచ్చెను.
    ఒకనాడు గ్రీకు సైనికులు ఇనుప గొలుసులతో బంధించియున్న యొక దొంగను తమ చక్రవర్తియగు అలెగ్జాండరు వద్దకు గొనివచ్చిరి.
    అలెగ్జాండరు : ఓరీ నీవెవ్వడవు?
    దొంగ : నన్ను "సిద్ధి"యని పిలుతురు. నేను ఈరాను దేశస్థుడను.
    అ    : నీవు కొమ్ములు దిగిరిన గజదొంగవట! నిజమేనా?
    సిద్ధి  : నిజమే ప్రభూ! దొంగతనమే నా బ్రతుకుదెరువు. అది లేనిచో రోజు గడచుట కష్టము.
    అ    : మంచిది. సైనికులారా! ఈ చోరుని తీసికొనిపోయి పది కొరడా దెబ్బలు కొట్టి వదలిపెట్టుడు.
    సి    : ఆగండి, నేను దొంగనే! కాని చక్రవర్తుల వారు నాకంటె పెద్ద దొంగలు. నా తలదన్నిన దొంగలు.
    అ    : నీవు నోటికి వచ్చినట్లు ప్రేలుచున్నావు. నేను గ్రీకుదేశ సార్వభౌముడను! విశ్వ విజయమునకై బయలుదేరిన అలెగ్జాండరు చక్రవర్తిని.
    సి    : నిజమే ప్రభూ! అందులకే తమరు నాకంటె పెద్ద దొంగలని మనవి చేసుకొనుసున్నాను. నేను చిన్న చిన్న పల్లెలు మాత్రమే దోచుకొందును. తమరో పల్లెలు, పట్టణములు గూడ దోచుకొనుచున్నారు. నేను ముగ్గురు నలుగురు మనుష్యులను మాత్రమే చంపియుందును. తమరో లక్షలకొలది మనుష్యులను నిర్దాక్షిణ్యముగా వధించుచున్నారు. నేను నా బ్రతుకు తెరువుకై నాయాలు బిడ్డల కడుపు కక్కుర్తికై ఈ పని చేయుచున్నాను. తమరో కీర్తి కాంక్షతో, రాజ్యవాంఛతో ఈ మహాకార్యమున కుపక్రమించినారు. నాకును తమకును ఎంతో భేదములేదు. నేను చిన్న దొంగను. తమరు పెద్ద దొంగలు. కొంచెమెచ్చు తగ్గుగా దోపిడీలో యిరువురమును సమానులమే.
    సిద్ధి వాక్యములు విని అలెగ్జాండరు చక్రవర్తి నివ్వెరపోయెను. ఆయన వెంటనే అటునిటు చూచి సిద్ధిని బంధవిముక్తుని చేయుడని తన సేవకుల కాజ్ఞాపించెను.

                                         *  *  *  *

 Previous Page Next Page