ఏం లేదు. " అన్నాడు సారధి . తను మరీ అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నాడు!
భోం చేశాక ఓ అరగంట బీచ్ లో కూర్చున్నాక, "సినీమాకి వెడదామా! 'సోనేకి చిడియా ' అని హిందీ పిక్చరు పాతదే అనుకో. నేను చూడలేదు. ఆ పిక్చరు ఓ సినీతార కధేట. నూతన్ చాలా బాగా యాక్ట్ చేసిందట." అంది తార సారదీ చూడలేదు.
"పద, సినిమా అంటే ఎప్పుడూ రెడీయే మనం" సారధి లేచి నిల్చున్నాడు.
ఆ సినిమా చూస్తున్నంత సేపూ! "చూశావా....... చూశావా ....అచ్చు నా కధ లాగే లేదూ. చూశావా -- డబ్బు కోసం తల్లి దండ్రులు , అన్నదమ్ములు సయితం ఎలా మారిపోతారో, చూశావా, నే చెపితే నమ్మవా? చూశావా , ప్రేమించాను, ప్రేమించాను అన్నవాడు కూడా ఆ తార డబ్బు లేదు అనగానే ఎలా తప్పుకున్నాడో చూశావా! నే చెప్పలేదూ. ఎవరన్నా నన్ను పెళ్ళి చేసుకుంటే డబ్బు కోసమే అని చెప్పానా లేదా. అబ్బ! ఎంత బాగుంది ఈ సినిమా. నా కధే తీసినట్టున్నారు." అంటూ ఎక్సైట్ అయిపోతూ తార మాట్లాడుతూనే వుంది. కళ్ళనీళ్ళు తుడుచుకుంది మధ్య మధ్య.
"ఇంకా నా కధ కొంత నయమే. కొట్టేంతవరకూ రాలేదు మావాళ్ళు. ఏమో అదీ జరుగుతుందేమో! అలా నా జీవితంలోకి, నన్ను నన్నుగా ప్రేమించే మనిషి ఎప్పటి కన్నా వస్తాడంటావా?" సినిమా జరుగుతున్నంత సేపూ ఎమోషనల్ గా మాట్లాడుతూనే వుంది తార. ఆ సినీ నాయిక కధకి సారధి కూడా చలించాడు. "వండర్ ఫుల్ పిక్చర్, చాలా బాగుంది కదూ" అన్నాడు.
"నెమ్మదిగా అంటావేమిటి , హేట్స్ ఆఫ్ టూ నూతన్. నిజంగా యిలా జరగబట్టే కదా సినిమా వచ్చిందీ. నాలాంటి వాళ్ళు కొందరన్నా ఇంకా నాతోడు వున్నారంటే నాకేదో ఓదార్పు అన్పిస్తుంది." అంది కారులో తార నవ్వుతూ.
"చాలా బాధగా గడిచింది ఈ సాయంత్రం. అప్పుడప్పుడు ఇలా తిరిగి వస్తుందాం ఏం?" అంది తార సారధిని డ్రాప్ చేస్తూ.
"ష్యూర్ " అన్నాడు సారధి.
ఆ తరువాత సారధి తార చాలా సాయంత్రాలు, రాత్రిళ్ళు -- అనుకున్నట్టే సినిమాలకి, షికార్లకి , బీచ్ కి, హోటళ్ళ కి తిరిగారు. తార వెంట వీలున్నప్పుడల్లా షూటింగు లకి కూడా వెడుతుండేవాడు సారధి ..... ఆరు నెలల్లో తార సారధి చాలా సన్నిహితులైనారు. రోజులు చాలా తొందరగా గడిచిపోతున్నాయి నీవు వచ్చాక అనేది తార. తారతో పరిచయం అయ్యాక ఆమె వెంట సినిమాలకీ, పార్టీలకి పిక్చరు ప్రీవ్యూలకి వెడుతుండడం బాగాబే వుందనిపించింది సారధికి. క్రొత్తక్రొత్తలో మొహాలు, క్రొత్త క్రొత్త పరిచయాలు, తను చూడలేని , తన బోటి వాడికి అందని స్థలాలు , మనుష్యుల మధ్య తిరగడం ఓ వింత అనుభవంలా అన్పించింది. తార వెంట వున్న సారధి కి ఆమెతో పాటు మర్యాదలు ముట్టేవి. ఎవరెలా అనుకున్నా వెనక గాని, మొహం ముందు ఎవరూ అనరు గదా!
తారతో తిరుగుతుంటే సారధికి మిత్రుల మధ్య ఆఫీసులో పరపతి, గౌరవం ఎక్కువయ్యాయి. అంత ప్రముఖ నటితో తిరిగే అతని అదృష్టానికి అసూయపడే వారు కొందరు, అభినందించేవారు. మా కొకసారి ఆమెని చూపించవా అని కూడా అడిగేవారు. నటిగా ఆమెని అభినందిస్తూ మాట్లాడే వారందరూ కూడా వ్యక్తిగా ఆమెని గురించి రకరకాలుగా మాట్లాడుతుంటే .... గౌరవం యీయకుండా అది, ఇది అంటూ చర్చిస్తుంటే అలాంటప్పుడు అనే వాళ్ళని ఎమనలేక, అవి వినలేక, బాధపడేవాడు సారధి. ఆమె గురించి అలా మాట్లాడే అందరూ, తన వెనక -- ఆమెతో తిరిగే తన గురించి నీచంగా హేళనగా మాట్లాడుతారేమో ననిపించేది. ఏమయినా తార కంపెనీ, తార స్నేహం వదులుకోడం - దూరం చేసుకోలేని బలహీనతో , బంధమో అతన్ని కట్టేసింది. తార గ్లామర్ కి, అతనూ లోబడ్డాడని చెప్పక తప్పదు.
అతనూహించినట్టే సినీ పత్రికలలో -- పేరు చెప్పకుండా ప్రఖ్యాత నటీమణి కాబోయే భర్తేవరో తెలుసా, ఫలాన ఎవరో తారతో తిరిగే అతనికీ ఆమెకి సంబంధం ఏమిటి?........ ఓ ప్రముఖ నటీమణి విహారాలు -- మొదలైన ప్రశ్నార్ధకాల శీర్షికలు, మీకు తెలుసా అంటూ వార్తలు పత్రికలలో పడడం ఆరంభించాయి. కొన్ని పత్రికలయితే పబ్లిక్ గానే'నయన తార పెళ్ళి భోజనం త్వరలోనే తినచ్చు వివాహం అయ్యాక నటిస్తుందా, మానేస్తుందా .......' అంటూ వ్యాఖ్యానించేవి.
ఆ ఫలానా తార ఎవరో, ఆమెతో తిరిగేది తనేనని సారధికి ఆ పత్రికలలో వార్తలు తెలిసేసరికి కొన్నాళ్ళు పట్టింది. ఫ్రెండ్స్ అందరూ హాస్యాలు , వేళాకోళాలు అరంభించాక స్పష్టంగా తెల్సింది. తెలిశాక సిగ్గు, అభిమానం ఎవరి మీద చూపించాలో తెలియని కోపం అన్నీ కలిసి సారధి మనశ్శాంతిని హరించాయి.
ఆరోజు తార ఇంటికి వెళ్ళినప్పుడు "చూశావా ...... పత్రికలలో ఎలా రాస్తున్నారో .... మన గురించే కదూ...." అనడిగాడు. తార అవన్నీ చదువుతుందో, లేదో, చదివితే అంత నిర్వికారంగా ఎలా వుండగలుగుతుందో అర్ధం కాలేదు సారధికి. మగాడు తనకే ఆ వార్తలు ఇంత అలజడి కలిగించాయి కదా తార బాధ పడటం లేదా! ఆమెకి తెలియదేమో! చదవలేదేమో ! అన్న అనుమానంతో ఆ ప్రసక్తి కావాలనే తెచ్చాడు సారధి.
తార నిర్లక్ష్యంగా నవ్వింది ...... "ప్చ్, రాయనీ ..... రాసుకుంటారు. అంతకంటే మననేం చేస్తారు?" అంది అతి మాములుగా . సారధి తెల్లపోయి చూశాడు.
"ఇలాంటి మాటలన్నీ లెక్క చేస్తే అయినట్టే. రోజుకి లక్షా తొంభై వార్తలు రాస్తుంటారు మా గురించి. ఇదిగో పులంటే అదిగో తోక అనేసి, అసలు వున్నదానికి పోలిక లేని వార్తలు వెలువరిస్తాయి ఈ పత్రికలు. తమ పత్రికలు అమ్ముకోడానికి ఏవో ఇలాంటి వేడి వేడి తాజా వార్తలు ప్రచురిస్తూనే వుంటారు. ఎన్నని పట్టించుకుంటాం మేం, ఎన్నింటికని బాధపదగలం? ...... అలవాటయిపోతుంది ఇలాంటి వన్నీ చదవడం ---" నవ్వుతూ అంది తార.