Previous Page Next Page 
నయనతార పేజి 21

 

    నిజమే ఇప్పుడు ఇన్వాల్ అయింది తను గాబట్టి బాధపడ్తున్నాడు కాని, ఇదివరకు తనూ ఇలాంటి వార్తలు ఇంటరెస్టింగ్ గా చదివినవాడే ...... ఫ్రెండ్స్ మధ్య తారల గురించి చర్చించినవాడే! ఫలానా తార ఎవరితో తిరుగుతుందో, ఏఏ తార ప్రియులేవరో, వారి ప్రణయ గాధలు, వగైరాలు అన్నీ చాలాసార్లు చదివాడు. అంతదాకా ఎందుకు- యీ నయనతార గురించీ చదివినట్టే గుర్తు . ఇందులో నిజానిజాలు ఎంతో ఆ భగవంతుడికే తెలియాలి?
    "ఎవరితో నన్నా ఏ సినిమాలోనో , ఏ హోటలు లోనో టిఫినూ తింటూ కనిపించినా, ఎవరి కారులో కనిపించినా, ఏ హీరో తో కాస్త సరదాగా నవ్వుతూ మాట్లాడినా, ఊహాగానాలు చేసి రాసేస్తుంటారు. అలాంటిది మనం ఇద్దరం క్లోజ్ గా షికార్లు,  సినిమాలు తిరుగుతున్నాం -- అలాంటప్పుడు రాయకుండా వుంటారా ......" తారే అంది మళ్ళీ, అదోలా వున్న సారధి మొహం చూస్తూ "ఎందుకలా ఏదో కొంప మునిగినట్టు మొహం పెట్టావు ...... ఇవన్నీ లెక్క చేస్తున్నావా?" బాధపడ్తున్నావా ....?"
    సారధికి ఏం అనాలో అర్ధం కాలేదు. "నీ పేరు రాయలేదుగా.......నీవేనని ఎవరికీ తెలియదులే భయపడకు."  
    "తెలియకపోవడం ఏమిటి ..... ఆఫీసులో , వూర్లో ఫ్రెండ్స్ అందరికీ తెలుసు ." ఎర్రబడ్డ మొహంతో అన్నాడు సారధి.
    "అయితే ఏమిటంటావు? .... చిన్నతనంగా వుందా, నాతో తిరిగి చెడ్డ పేరు తెచ్చుకున్నానని బాధపడుతున్నావా?" తార అతని వంక పట్టి పట్టి చూస్తూ అంది.
    సారధి జవాబు చెప్పలేకపోయాడు. "మొగాడివి నీకెందుకో యీ బాధ ..... ఏం ఇలాంటి దానితో తిరిగితే పెళ్ళి కాదని భయమా ఏమిటి? ..... బెంగ పెట్టుకోకు అంతగా నీకు పెళ్ళి కాకపొతే నేను చూస్తూ వూరుకోనులే...." హాస్యంగా అంది. సారధి మొహం మరింత కందింది ఆ హాస్యానికి.
    ఆ పూట ఎందుకో ఎప్పటిలా సరదాగా తారతో మాట్లాడలేకపోయాడు. ఆమె చలోక్తులని అనందించలేక పోయాడు. అలా ఓ గంట కూర్చుని రూముకి వచ్చేశాడు తార ఎంత ఆపినా ఆగకుండా.
    నెలరోజులు గడిచాయి. ఆ నేలా తార దగ్గరికి వెళ్ళలేదు సారధి. వెళ్ళకుండా వుండటానికి చాలా ప్రయత్నం చేశాడనే చెప్పాలి. ఎందుచేతో తార కూడా ఓ పది హీను రోజులు ఫోన్ చెయ్యలేదు. తర్వాత ఫోను చేసింది 'రావడం లేదేం' అంటూ. ఏవేవో కుంటిసాకులు చెప్పి తప్పించుకున్నాడు సారధి. వస్తానని రెండుసార్లు చెప్పి వెళ్ళడం మానేసాడు. అలా ఒక నెల గడిచిపోయింది.
    అసలు తారని తనెందుకు తప్పించుకుంటూన్నాడో తనకే అర్ధం కాలేదు సారధికి. అసలు తార పట్ల తన కే భావం వుందో కూడా ఇన్నాళ్ళు గడిచినా సారదికే అంతు బట్టలేదు. తార మీద తన భావం తనకే అర్ధం కాకపోయినా తన మీద తారకి ఏం భావం వుందో చాలా సందర్భాలలో గ్రహించగలిగాడు సారధి. అందుకే వెళ్ళడం మానేయాలనే నిర్ణయానికి వచ్చాడు సారధి.
    తార......తనని ప్రేమిస్తుందా! తనని కోరుతుందా! అందుకేనా తనని రమ్మనడం? అందుకేనా తనని ఆహ్వానించడం? తార చనువులో అర్ధం ఇదేనా? ఏం లేకపోతే తన మీద ప్రత్యెకాభిమానం ఎందుకు చూపుతుంది? ఇంత మంది వుండగా, ఎంతెంతమందో ఆమె కోసం ఆరాటపడే వాళ్ళుంటారు -- వాళ్ళందరి మీద లేని ప్రత్యెక ఇంటరెస్ట్ కి అర్ధం ఏమిటి? తనకోసం ఫోన్ల మీద ఫోన్లు చెయ్యడం రాకపోతే కార్లు పంపుతుండటం , తను రాగానే ఆమె ముఖం వికసించడం. కళ్ళలో వెలుగుకి అర్ధం ఏమిటి? తనని కార్లలో ఎందుకు త్రిప్పుతుంది, తన కంపెనీ ఎందుకు కోరుతుంది! నిన్ను చూస్తె ఎవరో అప్తుడిని చూసినట్టు వుంటుందని పదేపదే ఎందుకు అంటుంది! తనతో ఎన్ని సార్లు హస్యాని కన్నట్లే అంటూ పెళ్ళి ప్రసక్తి ఎందుకు తెస్తుంది!?
    "పెళ్ళి చేసుకోవా ఏమిటి. ఏం, అమ్మాయి ఎవరూ దొరకలేదూ ------- ఎవరూ లేకపోతే అక్క మొగుడే గతి అన్నారు. అలా నేనున్నాలే భయపడకు సారదీ.... నీ కాబోయే భార్య ఎలా వుండాలనుకుంటున్నావు ! అందానికి ప్రాముఖ్యం ఇస్తావా , డబ్బుకా , మనసుకా నీకేం కావాలి ? పెళ్లి చేసుకో సారధి . బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా పనికిరాదు ..... సారదీ ఒకటడుగుతాను చెపుతావా. ఆరోజు ..... అదే సుందరిగా నీ దగ్గిరకు వచ్చి పెళ్ళి చేసుకోమని అడిగిన రోజున ఏమనుకున్నావు?....... ఒకవేళ ఇప్పుడు తారగా అదే ప్రశ్న అడుగుతాననుకో .....ఆహా ... అనుకో - అనుకో సరదాకి. అబ్బ వూరికే అడుగుతున్నాను -- ఏం జవాబు చెపుతావు .... అదే చెపుతావా?"
    ఇలాంటి మాటలు, ప్రశ్నలు ఎన్నో సార్లు ఎందుకు వేస్తుంది. జవాబు చెప్పలేక తడబడే తనని మళ్ళీ హస్యానికన్నానులే అనీ నవ్వే తారని గురించి ఏమనుకోవాలి? ఇంట్లో గొడవలు, ఇంటి రహస్యాలు, తన ఆవేదనలు, తన బాధలు   అన్నీ ఎందుకు విప్పి చెపుతుంది తనతో! డబ్బు కోసం చూడక తనని తనుగా ప్రేమించే మనిషి కోసం చూస్తున్నానని చెప్పిందే. ఎందుకు తనతో చెప్పడం? తన ప్రక్కన కూర్చున్నప్పుడు కారులో,  సినిమాలో ఎన్నెన్ని సార్లో తనని   కావాలని తాకుతుండటం కనిపెట్టలేనంత అమాయకుడు కాదు తను! తనకోసం ప్రత్యేకంగా అలంకరించుకోడం , తనని కొంటెగా కవ్విస్తూ చూడడం లాంటి వాటికి అర్ధాలు తెలుసుకోలేనంత మూర్ఖుడా తను! ఇవన్నీ ఏం చెప్తున్నాయి --- తనని తార ప్రేమిస్తుందని తెలియజెప్పడం లేదూ ---
    పదేపదే యీ ప్రశ్నలు, సందేహాలు వచ్చేవి సారధికి. అయితే ఇవన్నీ అనుమానాలు తప్ప స్పష్టంగా తారేప్పుడూ తనని అడగలేదు. అడిగితే తనేం జవాబు చెప్తాడో చెప్పాలో కూడా సారధికి తెలియడం లేదు. తార అంటే ఏదో అభిమానం వుంది. ఆమెతో తిరగడం, ఆమె కంపెనీతో బాగానే టైం గడిచిపోతుంది. అన్న భావం, ఆమె గ్లామరుకి ఆకర్షితుడవడం -- వీటిని ప్రేమ అంటారా? కాదు........ అన్నది సారధికి తెలుస్తుంది. 

 Previous Page Next Page