"మరేం లేవు ఇంట్లో " అయ్యరు మొహం మటమటలాడించుకుంటూ అన్నాడు. తార నోరు తెరచి ఒక్క మాట మాట్లాడడానికి అవకాశం యీయకుండా ఇంతమంది, ఇన్ని మాటలు ఒక్క నిమిషంలో మాట్లాడేసారు. సారధి తెల్లపోయి చూడసాగాడు. తార మొహం సిగ్గుతో కోపంతో ఎర్రబడిపోయింది.
"ఏమీ లేవు ------ అదిగో అందుకే మరో కూర చెప్పలేదు గాబోలు ......... ఇంతమంది నౌకర్లున్నారు. ఒక్కరూ వేళకి కనపడడు. సాయంత్రం కూరలు తెప్పిద్డామనుకున్నాను. ఎక్కడ చచ్చారో ఒక్కడూ కనపడితేనా" సుందరి తల్లి మళ్ళీ ఆరంభించింది.
"అమ్మా ! .......నీకో నమస్కారం. ఇంక వూరుకుంటావా? ..... ఇదేం మొదటిసారి కాదు ఇలా జరగడం, నాకేం క్రొత్త కాదు అనవసరంగా నీవెందుకు హైరానా పడతావు. ఇష్టం వుంటే తింటాను లేకపోతే పోతాను ...." సుందరి కుర్చీ నెట్టి లేచి నిల్చుంది.
"అదేమిటమ్మా . వుండుండు .....అయ్యో ......కూరలేక పోతేనేం .....సాంబారు అవీ వున్నాయి గదమ్మా, భోజనం ముందునించి లేచి వెళ్ళిపోకూడదమ్మా. "తండ్రి.
"నేను తినేది ఒక కూరే నన్నసంగతి తెలియనట్లు మాట్లాడుతావేమిటి నాన్నా. రొట్టెలలోకి కూర కూడా లేకుండా ఎలా తింటాను ------- సారదీ ------ ఎక్స్ జ్ మీ -- పద .... అలా ఏ హోటలు కెనా వెళ్ళి భోజనం చేద్దాం ------- నిన్ను కూడా పిల్చాను అనవసరంగా ------- రా , వెడదాం ------- ఈ యింటి భోజనం కంటే , డబ్బు పారేస్తే పది రకాలు క్షణాల్లో పెడతాడు హోటలు వాడు. " "తారా !" సారధి ఏదో చెప్పబోయాడు. తార విన్పించుకోకుండా విసవిస మేడ మీదికి వెళ్ళింది. సారధి ఏం చెయ్యాలో, ఏం అనాలో తెలియకుండా లేచి హల్లో కి వచ్చాడు. డైనింగు రూములో అందరూ గట్టిగా ఒకరిని ఒకరు నిందించుకుంటూ మాట్లాడుకుంటున్నారు. తార హేండ్ బ్యాగు కేసుతో దిగివచ్చి ----- "రా, సారదీ" అంది.
"నీవు తొందరపద్దావు సుందరీ, ఒకపూట ఎలాగో సర్దుకుంటే పోఎదానికీ, యింత గొడవ ఎందుకు?" కారులో కూర్చున్నాక, తార ఆవేశం కాస్త చల్లబడిందనిపించాక నెమ్మదిగా అన్నాడు.
"ఒక్క పూట? ఇలాంటి పూటలు ఎన్ని ఇదివరకు అయ్యాయో నీకేం తెలుసు! ఇంట్లో వున్న అందరూ ఎవరికి కావలసినవి రకరకాలు చేయించుకోడం ఎవరూ మరిచిపోరు. ఒక్క నాకు కావలసినవి చేయించడానికే అందరికీమరుపు. నాన్నకి కారం పడదు, చప్పిడి వంటలు, అమ్మకి షుగర్ గోదుమన్నం, వదినకి కారం కావాలి , అన్నయ్యకి మధ్య రకం, మరొకరికి వేపుళ్ళు యిష్టం, ఇంకొకరికి అవకూర లిష్టం -- ఇలా ప్రతివాళ్ళు ప్రతీ పూట అరడజను పదార్ధాలకి తక్కువ కాకుండా చేయించుకుంటారు --- ఆ వంటవాళ్లు ఏడుస్తారు ఇన్ని రకాలు చేయడానికి, వాళ్ళ మీద అధార్టీ చేయిస్తారు. ఎంత డబ్బిచ్చినా యిన్నేసి రకాలు ఎవరు చేస్తారు. అస్తమానూ వాళ్ళు మానేస్తుంటారు. అప్పుడు యింత మంది వున్నా ఒక్కరూ ఒకపూట వండరు తెలుసా.... సరే, పోనీ ఎవరికీ కావల్సినవి వాళ్ళని చేయించుకోవద్దని అనలేదు, నాకు కావాల్సినవి ఆపాటి చూడకూడదా అన్నదే నా భాధ ----- చూశావుగా ఇంట్లో రాద్ధాంతం , ప్రతి విషయానికీ ఇలాగే జరుగుతుండు సీను ----- ఆఖరికి మళ్ళీ మామూలే రేపటి నుంచి. .... ఇదేం మొదటిసారి గాదు నాకీ అనుభవం ! ......" తార కసిగా అంది. సుందరి ఇదివరకు చెప్పినట్టే జరగడం కళ్ళారా చూశాక తారదే తప్పనలేకపోయాడు సారధి.
హోటలు "దానప్రకాష్ " లోకి కారు పోనిచ్చింది తార. హోటలంతా దేదీప్యమానంగా వెలిగిపోతుంది. తార కారు దిగి లోపలికి అడుగు పెడుతుండగానే మేనేజర్ సమంభ్రమంగా లేచి ఎదురొచ్చి నమస్కారం చేసి లోపలికి ఆహ్వానించాడు. " రూప్ గార్డెన్ లో టేబిలు ఎరేంజ్ చేయించండి....... ఎవరూ లేకుండా వుండే చోటుంటే మంచిది" అంది తార. చకచక ఆమె అజ్ఞ పాటించడానికి ఆర్డరు వెళ్ళింది. మేనేజరు వినయంగా మాటలాడుతూనే పైకి తీసికెళ్ళాడు.
ఎవరో రెండు మూడు టేబిళ్ళని ఆక్రమించుకుని కూర్చుని వున్నారు భోజనాలు చేస్తూ. "వారంతా వచ్చి చాల సేపయింది. వెళ్ళిపోతారు. ఇక్కడ కూర్చోండి మీకేం ఇబ్బంది వుండదు." అన్నాడు మేనేజర్. సర్వర్లు చకచక టేబిల్ అమర్చారు. ఒక్కొక్కటి సర్వ్ చేయడం ఆరంభించారు. "అన్నీ తీసుకొచ్చి పెట్టేయండి ఒకసారే మీరు వెళ్ళండి. పాపం మీకు పనుండదూ! నాకింకేం అక్కరలేదు లెండి" అంది తార. మేనేజరు మరోసారి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. సర్వర్లు దూరంగా వెళ్ళిపోయారు.
"అమ్మయ్య ఇంక హాయిగా భోం చేద్దాం........ ఊ....... ఆరంభించు ఇంటి కంటే గుడి పదిలమది. చూశావా , డబ్బు పారేస్తే ఎన్ని రకాలు అమర్చారో . ఇక్కడ డిషెస్ కూడా బాగుంటాయి. ఎప్పుడన్నా ఇలా ఇక్కడికే వస్తుంటాను నేను, మేనేజరు మంచివాడు. నే రాగానే స్పెషల్ గా మరిన్ని వడ్డిస్తాడు. ఇన్ని రకాలు మనం ఎక్కడ తినగలం" భోం చేస్తూ తార మాట్లాడుతూనే వుంది. తార వెంట వున్న తనని మేనేజరు ఎలా ఎగాదిగా ఎవరీ క్రొత్త పిట్ట అన్నట్టు చూసినట్టు , దూరంగా సర్వరు తమ వేపే చూసి నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నట్లు అనిపించింది సారధికి. "ఒక్కర్తివే వస్తుంటావా ఇక్కడికి ఫ్రెండ్స్ తో వస్తావా" అన్నాడు సారధి.
"ఏమో, ఎవరన్నా ఆ వేళకి వెంట వుంటే సరే, లేక పొతే ఒక్కర్తినే. సాధారణంగా ఒక్కర్తినే వస్తాను.... ఏం?"
"ఏం లేదు. వూరికే అడిగాను." అందుకే కాబోలు ఈరోజు అందరూ తనని అలా చూస్తున్నారు కుతూహలంగా! "ఫలానా తార ఇంట్లో తరచూ కనిపించే ఆ యువకుడు ఎవరు?" అంటూ క్వశ్చన్ మార్కులు సినిమా పత్రికలూ కురిపిస్తాయి గాబోలు ; తార వెంట వెళ్ళి పత్రికలలో తన పేరు ఎక్కి నందుకు గర్వించాలా? సిగ్గు పడాలా?
"ఏమిటి ఆలోచిస్తున్నావు?"