Previous Page Next Page 
ఫాలాక్షుడు పేజి 19


    "ఆదిత్య రూమ్ లో అహోబలపతి చాలాసేపు వున్నాట్ట సార్..."

 

    "నీ ఇన్ ఫర్ మేషన్ కరక్టేనా?" గుండును పావుకుంటూ, సీరియస్ గా అడిగాడు పెద్దబ్బాయి.

 

    "సెంట్ పర్సెంట్ కరెక్ట్ సార్... అహోబలపతి ఆదిత్య రూమ్ లో కెళ్ళడం చూసిన వాళ్ళున్నారు సార్... అందులో మన కుర్రాడొకడున్నాడు" చెప్పాడు బాలయాదవ్.

 

    ఆ మాట వినగానే పళ్ళు పట పట కొరికాడు గుర్రం పెద్దబ్బాయి.

 

    ప్యాకెట్లోంచి లంక పొగాకు చుట్టతీసి వెలిగించి, పొగవదుల్తూ-

 

    "అహోబలపతిగాదు చాలా జీనియస్ కదూ! అందుకే... అటు సి.ఎం.ని పై లోకానికి పంపిస్తూ, ఇటు నన్నూ కదలకుండా చేశాడు. వాడు సి.ఎం. అయిపోయాడు. వాడిని మనం దెబ్బకొట్టలేమా?"

 

    "నిన్నటివరకూ అహోబలపతి వేరు... ఇప్పుడు వేరు..." బాలయాదవ్ అన్నాడు.

 

    "ఒరే వెర్రి సన్నాసీ! ఆ వేరుని నరికేస్తే చెట్టు కుప్పకూలి పోతుందిరా" గొంతు పెంచి అన్నాడు గుర్రం పెద్దబ్బాయి.

 

    "వాడు... మన పిస్టల్ తో పాత సి.ఎం. ని చంపాడు. ఇప్పుడు... వాడి వేళ్ళతో వాడి కళ్ళే పొడుచుకోవాలి." వాడుపయోగించుకున్న ఆదిత్యే వాడిని పదవిలోంచి దింపెయ్యాలి. వాడి ఆయుధం మనకు ఆయుధమైపోవాలి. ఆదిత్యను మన గ్రిప్ లోకి తీసుకోవాలి. ఏవర్ లాబీలో నేనే కావాలని నా పిస్టల్ ఆదిత్యకు యిచ్చినట్లు యిచ్చి అది పోయినట్లు కంప్లైంట్ యిచ్చినట్లు రూమర్స్ పుట్టించాడు. సాక్ష్యాలు లేకపోబట్టి బతికిపోయాను." ఉగ్రంగా అన్నాడు గుర్రం పెద్దబ్బాయి, లేచి చుట్ట కాలుస్తూ, పచార్లు చేస్తూ.

 

    "ఆ ఆదిత్యగాదు మనక్కావాలి ఎలా... వాడు జైల్లోంచి తప్పించుకోవాలి. అంటే... జైల్లో తప్పించుకునే పరిస్థితులు కల్పించాలి..." అరగంటక్రితం, జైలు సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యంతో మాట్లాడిన మాటలు జ్ఞాపకానికొచ్చాయి.

 

    దెబ్బతిన్న పులిలా అటూ ఇటూ తిరుగుతున్నాడు గుర్రం పెద్దబ్బాయి... అతని మెదడులో అహోబలపతిని పదవిలోంచి దింపే పథకమొకటి క్రమంగా ఊపిరి పోసుకోసాగింది.


                                                *    *    *    *    *


    రాత్రి పన్నెండు గంటలు దాటింది.

 

    విశాలమైన జైలు ప్రాంగణం, నిద్రపోతున్న కొండచిలువలా వుంది.

 

    అక్కడక్కడ వెలుగుతున్న మసక దీపాలు.

 

    జైలు గోడలకు నాలుగు వైపులా వున్న సెర్చ్ లైట్లు కాంతి లేసరీ బీమ్స్ లా పర్యవేక్షిస్తున్నాయి.

 

    విశాలమైన వరండామీద జైలు సూపరింటెండెంట్, సుబ్రహ్మణ్యం వెనక జైలర్ జియావుల్, ఇద్దరు వార్డర్లు నడుస్తున్నారు. వాళ్ళ బూట్ల శబ్దం తప్ప, వాతావరణమంతా ప్రశాంతంగా వుంది.

 

    రెండో బ్లాక్ కి చివర... ఒంటరిగా వున్న సెల్ వైపు నడిచారు వాళ్ళు.

 

    సెల్ తలుపు తీస్తున్న చప్పుడుకి-

 

    మగతగా నిద్రపోతున్న ఆదిత్యకు మెలుకువొచ్చింది. కళ్ళు చిట్లించుకొని చూశాడు.

 

    వచ్చిన వాళ్ళెవరో సులభంగానే గుర్తుపట్టాడు ఆదిత్య. ఆ సమయంలో వాళ్ళెందుకొచ్చారు?

 

    ముందుగా లోనికి జైలు సూపరింటెండెంట్ వచ్చాడు...

 

    "చేతులూ, కాళ్ళూ కట్టెయ్యండి..." ఆజ్ఞాపించాడతను. మరో క్షణంలో వార్డర్లు ఆదిత్య చేతులూ, కాళ్లూ కట్టేశారు...

 

    "వీడ్ని స్టోర్ రూమ్ కి తీసికెళ్ళండి..."

 

    పేరుకే అది స్టోర్ రూమ్... నిజానికది 'టార్చర్ రూమ్' అక్కడ ఏం జరిగినా బయటకు వినబడే అవకాశాలు తక్కువ.

 

    ఆదిత్యను స్టోర్ రూమ్ లోకి తీసుకొచ్చాక కట్లు విప్పేశారు.

 

    "నిన్నిక్కడకు తీసుకొచ్చింది మాకు కావాల్సిన ఇన్ ఫర్ మేషన్ కోసం మంకుపట్టు పట్టక విషయం చెప్పేయ్..." ఆజ్ఞాపించాడు సుబ్రహ్మణ్యం.

 

    ఆదిత్యకు చూచాయగా విషయం అర్ధమౌతోంది.

 

    "ఏ ఇన్ ఫర్ మేషన్ కావాలి..."

 

    "గుర్రం పెద్దబ్బాయి పిస్టల్ నీకెవరిచ్చారు? ప్రస్తుత సి.ఎం. అహోబలపతికీ, నీకూ వున్న సంబంధం ఏమిటి? నువ్వు స్టూడెంట్ గానే వుంటూ... అహోబలపతి ముఠాలో మెంబర్ గా వుంటున్నావా? ఇంతకు పూర్వం చట్టానికి దొరక్కుండా... నువ్వేమైనా క్రైమ్ చేశావా?" కర్కశంగా వుంది సుబ్రహ్మణ్యం గొంతు.

 

    అంటే జైల్ సూపరింటెండెంట్ గుర్రం పెద్దబ్బాయి వర్గమా?

 

    మసక చీకట్లో ముఖాలు అస్పష్టంగా కన్పిస్తున్నాయి.

 

    అహోబలపతే తనకు పిస్టలిచ్చాడని చెప్తే... అహోబలపతికి ఆ విషయం తెలిస్తే... ఆ వర్గం తనను బ్రతకనివ్వదు.

 

    చెప్పకబోతే? తానిప్పుడు ఇద్దరికీ పావయ్యాడన్న నిజం మింగుడు పడలేదు ఆదిత్యకు.

 

    "నీ లాంటి వాళ్ళని నా కెరీర్ లో చాలామందిని చూశాను.

 

    నువ్వు... రెండు పొలిటికల్ గ్రూపుల మధ్య యిరుక్కున్న వాడివి...

 

    ఈ పొలిటికల్ గ్రూప్స్ గురించి నీకు తెలీదు... అవసరం వరకే వాళ్ళతో నీ పని. అవసరం తీరిపోయాక... అందితే నిన్ను కుక్కలా కాల్చి చంపేస్తారు. అందకపోతే... తరిమి తరిమి కొడతారు. ఎలాగూ నీ స్టూడెంట్ కెరీర్ నాశనమైపోయింది. జైల్లోనైనా నువ్వు సుఖంగా వుండాలనుకుంటే-

 

    నీకు తెల్సిన విషయాలన్నీ నాకు చెప్పు. నువ్వు చెప్పిన విషయం నీకు, నాకు తప్ప మరెవ్వరికీ తెలీదు" సిగరెట్ తాగుతూ, నెమ్మదిగా చెప్పాడు సుబ్రహ్మణ్యం.

 

    "నేను చెప్పే ఇన్ ఫర్ మేషన్... గుర్రం పెద్దబ్బాయికి పాసాన్ చేస్తారు. అంతే కదా..." ధైర్యంగానే అన్నాడు ఆదిత్య.

 

    సుబ్రహ్మణ్యం తెలివైనవాడిని చూసి, తెలివితక్కువ వాడు నవ్వినట్టుగా నవ్వాడు.

 

    "ఇంక క్రిమినల్ జీనియస్ వే నువ్వెలాగయ్యా దొరికిపోయావ్? నువ్వు దొరికిపోయి... మమ్మల్ని చంపుతున్నావ్. ఎప్పుడెవడు నీ గురించి వస్తాడో తెలీదు. నీ గురించి ఇన్ ఫర్ మేషన్ అడుగుతాడో తెలీదు. నీకేదైనా అయితే నా జాబ్ ఊడుతుందయ్యా బాబూ! నా మంచి కోరి... నాక్కావాల్సిన ఇన్ ఫర్ మేషన్ చెప్పెయ్..."

 

    "చెప్పకపోతే" తన పాచికల్ని కదిలించటం మొదలెట్టాడు ఆదిత్య.

 

    "అలా మొండికెత్తకయ్యా బాబూ! మామూలు క్రిమినల్స్ లా నిన్ను టార్చర్ చెయ్యగలమటయ్యా... పిస్టల్ కి ట్రిగ్గర్ లాంటివాడివి... నువ్వు ట్రిగ్గర్ నొక్కితే ఏది పేలుతుందో, ఎప్పుడు పేలుతుందో తెలీదు" వేళాకోళంగా అన్నాడు సుబ్రహ్మణ్యం.

 Previous Page Next Page