ఈలోగా ఒక ఆడది వచ్చిందక్కడికి. వక్కిపోయిన చెంపలు, పీక్కుపోయిన కళ్ళు, రాలిపోయిన జుట్టూ. అయినా, కాస్త పౌడరు వేసుకుంది. పుక్కిట తమలపాకుంది. అక్కడక్కడ మాసికలు వేసిన నైలాను చీర కట్టింది. బీడీ తాగుతూ వచ్చింది. దాన్ని చూచి ముగ్గురూ లేచి కూర్చున్నారు "వచ్చిందా ఛీనాల్ మళ్ళీ" అన్నాడు పొట్టివాడు "తన్నండి" అని ప్యాంటు దులుపుకుంటూ లేచి పరిగెత్తాడు. ఆవిడమీదికి చారల బ్లూషర్టువాడు పోచయ్య లేచి కూర్చున్నాడు. ఆవిడ జుట్టుపట్టుకొని వీపుమీంది వేశాడొక్కటి. ఏడుస్తూ అక్కడే కూలబడ్డది ఆవిడ, "నీ పెళ్ళం ముండమొయ్య నీ ఇంట్ల పీనిగెళ్ల" అని తిట్తూ ఇంకో రెండు అంటించాడు. ఇంకా యేడ్చింది. ముగ్గురూ వచ్చి వాణ్ణి వారించారు. "ఏందే నీ ఏడుపింతకూ?" అడిగాడు పొడుగువాడు "ఇవ్వాళ గిరాకి దొరకలేదు ఒక్క పైసలేదు. ఒకడు దొరికాడు ముదనష్టపోడు డబ్బు లివ్వకుండానే పోయాడు. ఈడేమన్న గిరాకి దొరకుద్దేమని వచ్చిన మీరేమో కొట్టి చంపుతున్నారు" అని ఏడ్చింది. ముగ్గురూ ఒకరి ముఖాలు ఒకరు చూచుకున్నారు "ధూ _ రోగాలు తగుల్తె" అని ఊసి వెళ్ళిపోయాడు ప్యాంటువాడు "పైసలేమన్న ఉన్నాయిరా" - అడిగాడు పొడుగువాడు "ఆరా నున్నది పైసలిచ్చి పంపిచ్చు దానెంటపోయేవు - చస్తవురో" అని హెచ్చరించాడు పొట్టివాడు "నువ్వు ఆరా నియ్యిబే, నీతులు చెప్తాన్నవు" అని కసిరాడు పొడుగువాడు. జేబులోంచి అర్ధరూపాయి తీసి, చాచిన పొడుగువాని చేతిలో పెట్టాడు పొట్టివాడు. ఆ అర్ధరూపాయి మీద ఉన్న నెహ్రూ తల వీధిలిటుకు చమక్కుమంది "ఆరా నున్నది, ఏమంటావ్?" అన్నాడు పొడుగువాడు. చేయి చాపిందావిడ. చేతి కందించాడు. ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు.
తెల్లవారింది. నలుగురూ పంపు దగ్గర ముఖాలు కడుక్కున్నారు. పొట్టివాడి దగ్గర మిగిలిన డబ్బుతో రొట్టె తిని, చాయ్ తాగారు. సిగరెట్లు వెలిగించి పొగ ఊదుతూ బాతాఖానీ కొడ్తూ కూర్చున్నారు నలుగురూ.
సుమారు పది గంటల సమయానికి ఒక కారు వచ్చి ఆగింది ఫుట్ పాత్ వద్ద తమ కొరకే అని గుర్తించారు. ముగ్గురూ ముగ్గుర్నీ అనుసరించాడు పోచయ్య. ముందు సీటులో ఒక నడివయసు మనిషి కూర్చొని ఉన్నాడు. ఎర్రని రంగు, ముడుతలు పడుతున్న గుండ్రని ముఖం, ముక్కు లావుగా ఉంది. కణతల దగ్గరా, చెవులపైనా వెంట్రుకలు తెల్లబడ్డాయి. హాఫ్ షర్టు వేసుకున్నాడు. చేతికి బంగారపు గొలుసు గల గడియారం ఉంది. నిరంతరం సిగరెట్టు పీలుస్తూనే ఉంటాడు. సింధీ వానిలా ఉన్నాడు.
నలుగురూ వెనుకసీట్లో సర్దుకొని కూర్చున్నారు. కారు ఒక హోటలు దగ్గర ఆగింది. సింధీవాడు పది రూపాయిలిచ్చాడు పొట్టివాడికి. నలుగురూ హోటల్లోకి వెళ్ళి బాగా తిని వచ్చేశారు, ముంజేతితో మూతులు తుడుచుకుంటూ కారు మొహమ్ క్రేక్ దగ్గర నిలిచింది. సముద్రంలో ఒక పడవ సిద్ధంగా ఉంది. దానిమీద పడవ నడిపేవాడు అరబ్బు వాని రూపంలో ఉన్నాడు.
డ్రైవరు డిక్కీలోంచి ఒక్కొక్కటే తీసుకెళ్ళి పడవలో పెడ్తున్నాడు. పోచయ్య సహితంగా నలుగురూ అందుకొని సామానంతా పడవలో చేర్చారు. చేర్చిన సామానులో ఒక ట్రాన్సిస్టరు, ఆరు బీరు సీసాలూ, ఒక స్కాచ్ విస్కీ సీసా, ఒక ఫ్లాస్కులో మంచు ముక్కలు, ఒక టిఫినులో సేండ్విచ్చులు, నీళ్ళ సీసా, విస్తాలు, టార్చిలైటూ గోల్డు ఫ్లేక్ టిన్నులు మూడూ వున్నాయి.
సింధీవాడు పడవ ఎక్కాడు. అతడు ఎక్కగానే మిగతా నలుగురూ ఎక్కారు. పడవ నడిపించాడు అరబ్బు. పడవ మధ్య ద్వీపం వైపు సాగింది. సింధీ బీరు తాగుతున్నాడు, ఎడతెగని సిగరెట్లు కాల్చి వేస్తున్నాడు.
మధ్యాహ్నం అయింది, సూర్యుడు నెత్తిమీదికి వచ్చాడు. తన కిరణాల్లో కాల్చేస్తున్నాడు ఓడలోనివారిని. సముద్రంలోకి చూస్తే నల్లని ఆకాశం, చెదురుతున్న అనేకమంది సూర్యులు కనిపిస్తున్నారు. పైకి చూస్తే నల్లని ఆకాశంలో తెల్లని సూర్యుడు వెలుగుతున్నాడు. చూసేవారికి సముద్రంలో ఒక ఆకాశంపై ఒక ఆకాశం ఉన్నట్లు కనిపిస్తూంది.
సింధీ సేటు మౌనంగా బీరు తాగుతున్నాడు. అతడు మౌనంగా ఉన్నప్పుడు ఎవరికీ మాట్లాడే ధైర్యం లేదు. మౌనంగా క్షణాలు గడియల్లా గడుస్తున్నా కాలచక్రం ఆగుతుందా? సూర్యుడు అస్తమించాడు. ఆకాశంలో చంద్రుడూ నక్షత్రాలూ వెలిగాయి. పడవ ప్రయాణం చేస్తూనే ఉంది. సింధీ సేటు బీరు అయిపొయింది. చివరి సీసాను విచిత్రంగా సముద్రంలోకి రువ్వాడు. అది తరంగంమీద ఊయలలూగి మునిగిపోయింది. మళ్ళీ కనిపించలేదు. స్కాచ్ విస్కీ కలుపుకున్నాడు. చప్పరిస్తూ సిగరెట్టు కాలుస్తూ సముద్రంవైపు చూస్తున్నాడు. గడియారం చూచాడు. రాత్రి పన్నెండయింది. పడవ సాగిపోతూంది. అతని ముఖంలో చిడుముడిపాటు కనిపించింది.
అమాంతంగా ఒక టార్చిలైటు వెలుగు కనిపించింది. పిస్టోలు సరిచేసుకున్నాడు. సేటు దీక్షగా చూచాడు. టార్చివైపు తన టార్చి వెలిగించాడు. ఆ టార్చి వెలుగు వచ్చినవైపు చూపాడు. టార్చి వెలుగు అటూ ఇటూ తిరిగింది. సేటు కూడా అటూఇటూ తిప్పాడు. పడవ వేగంగా సాగింది. దూరంగా మరో పెద్ద పడవ కనిపించింది. పోచయ్య కూర్చున్న పడవ వేగంగా ముందుకు సాగింది. సేటు హుంకరించాడు. పడవ వేగం హెచ్చింది. ఆ పడవ దగ్గర్లోకి చేరింది. పడవలోంచి "విక్టరీ" అనే కేక వినిపించింది. సేటు "డాన్" అని కేకపెట్టాడు. "డాన్, డాన్, డాన్" అని కేకలు పెట్టాడు. ఆ వచ్చిన పడవవాళ్ళు ఈ పడవను గుర్తించారు. చేతులూపారు. సేట్ జేబురుమాలు ఊపాడు సేటు పడవ ఆ పడవ దగ్గిరికి చేరింది. పడవలోనివాళ్లు సేటును పడవలోనికి తీసుకున్నారు. ఏవో గుసగుసలు జరిగాయి. వాళ్ళు పొడుగైన తోలు సంచులు ఇచ్చారు. సేటు పడవమీద ఉన్న నలుగురినీ పిలిచాడు. వాళ్ళు ఎక్కారు. నలుగురికీ నాలుగు సంచులు ఇచ్చాడు "జాగ్రత్త! వీటిని వార్సొవా దగ్గరున్న హనుమంతుని గుళ్ళో ఇవ్వాలి అని ఇవ్వగానే తలా నూరూ రూపాయీ లిస్తారక్కడ, పట్టుబడితే ఏ విషయమూ చెప్పకూడదు చెప్పారా?" అని పిస్తోలు చూపాడు, "బొంబాయి నిండా మావాళ్లున్నారు ప్రాణాలతో బయటపడ్డం కష్టం _ విన్నారా? వెళ్ళండి" అని చెప్పాడు.
నలుగురూ పొడవైన తోలు సంచులను వీపులకు కట్టుకున్నారు. అలా కట్టుకోవడానికి అనువుగా వాటికి బెల్టులూ, బకిల్స్ ఉన్నాయి. నలుగురూ పడవలోకి దిగారు. పడవ వెనక్కు తిరిగింది. వార్సొవా వైపు వేగంగా సాగింది. పోచయ్యకు ప్రాణం బిక్కు బిక్కుమంటూంది. ఎవరూ మాట్లాడటంలేదు. పొడుగువాడు సిగరెట్లిచ్చాడు. అందరికీ సిగరెట్లు కాల్చవద్దన్నాడు అరబ్బువాడు, సిగరెట్టూ నిప్పు దూరంగా ఉన్నవానికి కనిపిస్తుందని. అయినా కాల్చారు సిగరెట్లు నిప్పు కనిపించకుండా చేతులు అడ్డంపెట్టి సిగరెట్లు పీల్చుతున్నారు. చారల బ్లూషర్టువాడు పోచయ్యను చూచి నవ్వాడు "జాగ్రత్త! అవసరం అయితే ఈదుకుంటూ ఒడ్డుకు చేరాలి. సంచితో ఎక్కడికైనా పోయావా _ ప్రాణాలు దక్కవు. సేటు దాదాలు బొంబాయి నిండా ఉన్నారు. పట్టుబడితే ఎవరి విషయమూ చెప్పొద్దు, చెప్పినా, చెప్పకున్నా జేలు తప్పదు కాని, జేలు నుంచి వచ్చాక ప్రాణాల్తో పోలేవు. అలా పోయిన వారిని ముగ్గుర్ని చంపించాడు. సేటు వాడు రాక్షసుడు. కొత్తవాడివి కాబట్టి చెప్తున్నా, జాగ్రత్తగా సంచి చేరవేశావో వందరూపాయలు దొరుకుతాయి. అందులో దాదాలకు యాభై ఇవ్వాలి. ఇవ్వకపోయావో పోలీసులకు పట్టిస్తారు. మళ్ళీ వారానికో పది రోజులకో ఇలాంటిపనే తగుల్తుంది. ఒక్కనాటిపనికి యాభై రూపాయలు. ఏం తక్కువా?" అన్నాడు.