"అమ్మా" అని నాంచారమ్మను కావిలించుకొని ఏడ్చింది లచ్చమ్మ.
నారాయణస్వామి కళ్ళవెంట టపటపా కన్నీరు రాలింది.
కొంతసేపు ఏడ్చి లచ్చమ్మను ఓదార్చింది నాంచారమ్మ. "బియ్యం తెచ్చి పెడ్తనుండు" అని వసారాదాకా పోయింతరువాత గాని తాను లచ్చమ్మను తాకి మైలపడ్డాననే విషయం గుర్తుకు రాలేదు. "ఏమండీ బియ్యం తెచ్చిపెట్టండి లచ్చమ్మకు" అని దూరంగా నుంచుంది.
నారాయణస్వామి బియ్యం సహితంగా సామాగ్రి సాంతం మూటకట్టి తెచ్చి అందించారు. బియ్యపు మూట లచ్చమ్మ చేతిలో పెట్టి తల నిమురుతూ "ఇగ చూడు, ఏమన్నా కావలిస్తేవచ్చి అడుక్కుపో, పొట్టలో బిడ్డను చూసుకొని ఒక ముద్ద తిను, వస్తుండు" అని గుమ్మందాకా సాగనంపింది. "నేను గురువయ్య నడుగుతలే" అన్నారు స్వామి. లచ్చమ్మ బెదిరి వెనక్కు తిరిగి "వద్దయ్యగారూ, వద్దు. ఆడగొద్దు" అన్నది బ్రతిమిలాడుతున్నట్లు. ఆ కళ్ళల్లోని భీతాహం గమనించారు స్వామి.
"అడగనులే లచ్చమ్మా!" అన్నారు.
లచ్చమ్మ సాగిపోతుంటే భార్యాభర్త లిద్దరూ గుమ్మంలో నుంచొని చూస్తున్నారు. తమ ఇంటినుంచి ఆడపిల్ల కటికవాని ఇంటికి పోతున్నట్లనిపించింది వారికి.
అల్లుడు కటికవాడవుతే తల్లిదండ్రులు మాత్రం ఏం చేయగలరు? కసాయికి అప్పగించాల్సిందే!
రాత్రి బాగా పొద్దుపోయింది. తలుపు తట్టిన చప్పుడవుతే లేచి తలుపు తీసింది నాంచారమ్మ. లచ్చమ్మ గుమ్మంలో నుంచొని ఉంది.
"ఆయనింక ఇంటికి రాలేదుండి" అన్నది లచ్చమ్మ. లోపలికి వెళ్ళి నారాయణస్వామిని లేపింది. "ఏమండీ! గురువయ్యింక ఇంటికి రాలేదట. లచ్చమ్మొచ్చి నిలబడ్డది" అని చెప్పింది. కప్పు తీసివేసి బయటికి వచ్చారు నారాయణ స్వామి.
"గురువయ్య ఇంటికి రాలేదా?" అడిగారు.
"రాలేదుండి."
"ఎక్కడికి పొయ్యుంటడు?"
"ఎట్ల తెలుస్తది?"
"ఇప్పుడేం చేస్తమంటవ్!"
"ఏమో తెలుస్తలేదండి"
"రోజియ్యాల్టికి ఇంటికొచ్చెటోడా?" నాంచారమ్మ అడిగింది.
"పొయ్యెటోడే గాని ఇంతసేపు పొయ్యెటోడు కాడుండి."
"పోతే పొయ్యిండు పోనీ దెబ్బలే తప్పేవాడు నిన్నేమన్న సుఖపెడ్తున్నడా?"
"అట్లనకండి అమ్మగారూ! ఏడ పోయిండో? ఆయిన కేమైందో? గుబులు గుబులు గున్నదండి."
"సరే పా ఎత్తుకుదం పా" అని లాంతరు అందుకొని బయలుదేరారు నారాయణస్వామి.
"లాంతరక్కడ పెట్టుండి, బాంచెను. పట్టుకొస్త" అన్నది లచ్చమ్మ.
లాంతరక్కడ పెట్టి, లోనికి పోయి బాణాకర్ర తీసుకొని బయల్దేరారు. ముందు లాంతరు పట్టుకొని లచ్చమ్మ, వెనుక కర్ర పట్టుకొని నారాయణస్వామి సాగిపోతున్నారు. నాంచారమ్మ గుమ్మానికి ఆనుకొని నుంచుంది___వారు వెళ్ళిన వైపు చూస్తూ.
రాత్రి___చీకటి.
ఇద్దరూ ఊరు దాటారు.
"ఎక్కడికి పోదమంటవు?" నారాయణస్వామి నడుస్తూనే అడిగారు.
"తాళ్ళల్ల చూద్దాముండి మొదలు" సాగిపోతూనే అన్నది లచ్చమ్మ.
ఊరు దూరం అవుతున్నది.
చిమ్మున చీకటి. చుక్కల వెలుగు తప్పలేదు. కీచురాళ్ళ రొదలు. దూరం నుంచి నక్కల ఊళలు. చీకటి గుంపుల్లా గబ్బిలాలు. వాతావరణం భయం భయంగా ఉంది.
నారాయణస్వామి తాటి వనానికి ఎప్పుడూ వచ్చి ఎరుగరు. వారి కిది కొత్త. తాను! తాటి వనంలో!! ఏదో కించగా తోచింది. ఎవరైనా చూస్తారేమో ననుకొన్నారు. తాను తాటి వనానికి పోవడం ఏమిటి? వారికే అర్ధం కాలేదు. ఇవన్నీ కలిసి బుగులు మొదలైంది అయ్యవారికి.
ఇద్దరూ మౌనంగా సాగిపోతున్నారు. కాలవ-కాలవ ప్రక్కన చింతచెట్టు కనిపించాయి.
చింతచెట్టు కింద చిక్కని నీడ!
"లచ్చమ్మా నిలబడు."
లచ్చమ్మ నుంచొని నారాయణస్వామి వైపు తిరిగింది. లాంతరు చేత్తో ఎత్తుగా పట్టుకొని.
నారాయణస్వామి వచ్చేశారు.
"ఈ చీకట్లో ఎక్కడని ఎతుకుతం?" తాటివనంలో ప్రవేశించటానికి సందేహం వ్యక్తపరుస్తూ అన్నారు.
"ఎట్లనన్న ఎతకాల్నుండి" స్వామి సందేహం లచ్చమ్మకు అర్ధం కాలేదు. లచ్చమ్మ ఆతురతతో ఉంది. ఆమె కేమీ అర్ధం అయ్యేట్లులేదు. ఆమె నారాయణస్వామి జవాబుకోసం కూడా ఎదిరి చూడలేదు. లాంతరుతో ముందుకు సాగింది.
నారాయణస్వామి చూచారు. నిండు చూలాలు! నిస్సత్తువగా ఉంది! ముందు నడుస్తూంది. పాపం ఆమె కేమన్నా అవుతే!
"లచ్చమ్మా!"
ఈ తడవ ఆమె ఆగలేదు. "ఊఁ" అని సాగిపోతూంది.
తాటిచెట్లు దట్టంగా ఉన్నాయి చీకట్లో దయ్యాల్లా కనిపిస్తున్నాయి.
"లచ్చమ్మా! నిలబడు."
లచ్చమ్మ నిలిచింది. లాంతరు పట్టి స్వామికి దోవ చూపిస్తూ నుంచుంది.
"లచ్చమ్మా! అడవిలో కొచ్చినం, పురుగో బూచో, లాంతరు నాకియ్యి నేను ముందర నడుస్త."
"బతికి మాత్తరం చేసిడి దేమున్నదుండి. చస్తెనే నయం. నాకు చావురాదు లేరి. మొండిదాన్ని అని సాగిపోయింది.
చుక్కలు మిలమిలా మెరుస్తున్నాయి. లాంతరు వెలుగు తప్ప ఏమీ లేదు. చీకటి స్తంభాల్లా ఉన్నాయి తాటిచెట్లు. ఒకదారి లేదు___డొంకలేదు___ఎక్కడా చూడ్డం? ఎలా చూడ్డం?
లచ్చమ్మ లాంతరు పట్టుకొని అటూ ఇటూ తిరుగుతూంది___అది వెర్రి తిరగడమేనని గ్రహించారు స్వామి. అయినా ఆమె వెంట తిరిగారు. ప్రయోజనం లేకపోయింది. లచ్చమ్మ అలసిపోయింది. లాంతరు కిందపెట్టి నేలమీద కూలబడ్డది.
"ఏం చేస్తమంటవు?" నారాయణస్వామి లాంతరు ముందు నుంచొని అడిగారు.
"ఏమన్న చెయ్యాల్నుండి. ఈన్నే యాన్నో ఉంటడనిపిస్తున్నది. పేరుపెట్టి పిలుస్తే మాట్లాడ్తడేమో!" ఉపాయం అమాంతంగా తోచినట్లు నారాయణస్వామిని చూచింది.
లచ్చమ్మను చూచారు నారాయణస్వామి. బాగా అలసిపోయింది. అసలే నీరసంగా ఉంది. ఇంక ఆమె లేవగలిగే స్థితిలో కూడా లేనట్లుంది.
"అయితే నువ్విక్కడ్నే వుండు. నేను పిలిచి చూస్త" అని బయల్దేరారు.
"గురువయ్యా! ఓ గురువయ్యా" అంటూ తిరగడం మొదలుపెట్టారు. చెట్టు చెట్టూ వెదకడం-పిలవడం-ఇదీపని!
ఎంత వెదికినా దొరకలేదు ఎంత పిలిచినా పలకలేదు.
తిరిగి వస్తున్నారు నారాయణస్వామి లచ్చమ్మ దగ్గరికి___కేక వేస్తూనే వస్తున్నారు.
ఎక్కడో మూలుగు వినిపించింది.