పరుగులాంటి నడకతో పాసెంజర్సు కేబిన్ లోకి వెళ్ళింది అనుపమ. అంత త్వరగానూ తిరిగి వచ్చింది. ఆమెకి ఊపిరి అందటంలేదు.
"ఏమయింది?" అన్నాడు శతృఘ్న, అసహనంగా.
"ఆయన కూడా పడిపోయి ఉన్నాడు." కోపం అదుపు తప్పింది శతృఘ్నకి.
"ఆయనకి కూడా ఇచ్చావా డ్రింక్?"
"ఆయనకి, మరి కొంతమందికి కూడా ఇచ్చాను."
"ఏడవలేక పోయావ్!" అన్నాడు పరుషంగా.
అనుపమ కళ్ళలో నిజంగానే నీళ్ళు తిరిగాయి.
బయటనుంచి పెద్దగా అన్నాడు ఇక్బాల్. "షాట్ గన్! ఏం చేస్తున్నావ్? పైలట్ల పని పట్టడానికి సాయం కావాలా?"
అతని చేతిలోని రివాల్వరు ప్రయాణీకులని గురిచూస్తూనే ఉంది. జరుగుతున్నదేమిటో అంతుపట్టక వాళ్ళందరూ అయోమయంగా చూస్తున్నారు.
"షటప్!" అని విసుక్కుని, అనుపమ జబ్బని గట్టిగా పట్టుకుని ఈడ్చుకుంటూ పాసెంజర్సు కేబిన్ లోకి వచ్చాడు శతృఘ్న.
అప్పటిదాకా చెక్కబొమ్మలా నీలుక్కుపోయి చూస్తున్న రాజేందర్, ఎండిపోయిన పెదాలనీ, గొంతునీ తడుపుకోడానికి చేతిలో గ్లాసు ఎత్తి పెదిమలకి ఆనించుకో బోయాడు.
"బ్లడీ ఫూల్! అది తాగకు! కిల్లర్ డ్రింక్ అది!" అని కేకవేసి, కాలితో బలంగా ఆ గ్లాసును కొట్టాడు శతృఘ్న. అది ఎగిరి, నాలుగు సీట్ల అవతల పడింది. అందులోని ద్రవం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి మీదా చిందింది.
రెండు అంగల్లో మైకు దగ్గరికి చేరుకున్నాడు శతృఘ్న. ప్రయాణీకులకు అనౌన్స్ మెంట్స్ చేయడానికి విమానం సిబ్బంది ఉపయోగిస్తారు దానిని.
"అందరూ వినండి! ఇందాక మీలో కొంతమందికి సర్వ్ చేసిన డ్రింక్స్ లోనో, స్నాక్స్ లోనో విషం కలిసి వుండవచ్చు. తాగొద్దు. ఇప్పటికే తాగిన వాళ్ళెవరన్నా ఉంటే చేతులెత్తండి."
వెంటనే ఏడుపు గొంతులతో హాహాకారాలు. ఒకళ్ళిద్దరు ఖాండ్రించి ఉమ్మేశారు అక్కడే. నాలుగు చేతులు లేవడం అతనికి కనబడింది. మరి రెండు చేతులని లెఖ్ఖ పెట్టింది మోనికా.
"పాసెంజెర్స్ లో ఎవరన్నా డాక్టర్ ఉన్నారా" అన్నాడు శతృఘ్న.
ప్రతివాళ్ళూ ఆ ప్రశ్న తమని కాదన్నట్లు తక్కిన వాళ్ళని చూస్తున్నారు. ఎవరూ సమాధానం చెప్పలేదు.
"డాక్టర్స్ ఎవరూ లేరా? ఒక్కళ్ళూ?"
సమాధానం లేదు.
శతృఘ్న మొహం అప్రసన్నంగా అయింది.
"పోనీ... బై ఎనీ ఛాన్స్... పాసెంజెర్స్ లో పైలట్స్ ఎవరన్నా ఉన్నారా? ఎనీబడీ?"
జవాబు లేదు. కానీ చాలామంది మొహాల్లో ఆందోళన కనబడింది. పైలట్సా? ఎందుకు?"
"పైలట్స్ కాకపోతే, కనీసం విమానం గురించి తెలిసిన వాళ్ళయినా సరే!"
ప్రయాణీకుల మొహాల్లో ఆందోళన ఎక్కువయింది. కానీ ఎవరూ నోరెత్తడానికి సాహసించలేదు.
ఒక్క మనిషి మాత్రం తన సీట్లోనే ఇబ్బందిగా కదలడం గమనించాడు శతృఘ్న. అతను రాజేందర్.
"హలో దేర్!" అన్నాడు శతృఘ్న "నీకు విమానాలతో పరిచయం ఉందా?" అతని మొహంలో సన్నటి ఆశారేఖ కనబడింది.
సందేహంగా అన్నాడు రాజేందర్. "ఉంది, కానీ ఇంత పెద్ద జెట్ విమానాలతో కాదు."
"మరి?"
"చిన్న పుష్పక్ విమానాలు నడిపేవాణ్ణి. ఫ్లయింగ్ క్లబ్ మెంబర్ని నేను."
హతాశుడయ్యాడు శతృఘ్న. పుష్పక్ విమానం అంటే ఎంత ఉంటుందో అతనికి తెలుసు. పసుపు రంగులో ఉండి, హైదరాబాద్ నగరం మీద చక్కర్లు కొడుతుంటే చిన్న చిన్న బొమ్మ విమానాల్లాంటివి అవి. రెండే సీట్లు ఉంటాయి వాటిలో. విమానాలు నడిపించడం నేర్చుకోవాలనే కుతూహలం ఉన్న ఔత్సాహికుల కోసం హైదరాబాద్ లో ఫ్లయింగ్ క్లబ్బు ఉంది. మెంబర్ల దగ్గర గంటకు ఇంత అని ఛార్జ్ చేసి ఆ చిన్న విమానాలలో ఎగరడం నేర్పిస్తారు. నిర్ణీతమైనన్ని గంటలపాటు ఫ్లయింగ్ పూర్తి చెయ్యగలిగినవాళ్ళు పరీక్షలు పాసయి, సివిల్ పైలట్లుగా లైసెన్సు సంపాదించి, ఏ ఎయిర్ లైన్స్ సంస్థలోనన్నా పైలట్లుగా చేరవచ్చు.
ఇతను ఇంత పెద్ద ఎయిర్ బస్సుని ఏం హ్యాండిల్ చెయ్యగలడు!
కానీ విమానాల గురించి ఇతనికంటే ఎక్కువ తెలిసినవాళ్ళు ప్రస్తుతం లేరు.
"ఒకసారి కాక్ పిట్ లోకి పద!" అన్నాడు శతృఘ్న.
"ఎందుకు?" అన్నాడు రాజేందర్ అనుమానంగా.
"పైలట్లకి అసిస్టెన్స్ కావాలిట" అన్నాడు శతృఘ్న, క్లుప్తంగా, అంతేగానీ పైలట్లు అపస్మారక స్థితిలో ఉన్నారని చెప్పలేదు. అలా చెబితే, భయంతో వెర్రెత్తిపోయిన పాసెంజెర్సు ఎలా ప్రవర్తిస్తారో చెప్పడం కష్టం!
కళ్ళు విప్పార్చి, ఇదంతా ఆసక్తిగా గమనిస్తోంది స్మిత. జరుగుతున్నదేమిటో చూచాయగా గ్రహించగలిగినది అంతమంది ప్రయాణీకులలో తనొక్కతే.
అందుకు కారణం ఉంది.
ఒక ఇంగ్లీషు నవల తాలూకు కథ గుర్తొస్తోంది, స్మితకు ఇదంతా చూస్తుంటే. దాన్లోనూ ఇంతే! పైలట్లు ఏదో విషాహారం తిని పడిపోతే, అమెచ్యూర్ పైలట్ ఒకతను ఆ విమానాన్ని కాపాడతాడు.