Previous Page Next Page 
హైజాక్ పేజి 21

కాని -
స్మితకు తెలియదు.
ఆ కథకూ, జరుగుతున్న డ్రామాకూ పోలిక అంతవరకేనని.
అందుకే ధైర్యంగా ఉంది తను. ఎవరికీ తెలియని సస్పెన్సు నవల తాలూకు ముగింపు తనకు ముందే తెలిసిపోయిన పాఠకురాలిలా ఉత్సాహంగా కూడా ఉంది.
గుసగుసగా సుజాతతో చెప్పింది స్మిత. "డోంట్ వర్రీ అక్కా! ప్లేన్ సేఫ్ గా లాండ్ అవుతుంది నాకు తెలుసు!"
కళ్లు తెరుచుకుని ఇదంతా చూస్తూనే ఉంది సుజాత. స్మిత చెప్పేది వింటూనే ఉంది. కానీ, తన మనసు దేనినీ రిజిష్టర్ చేసే స్థితిలో లేదు. ఇంద్రియాల మధ్య కో ఆర్డినేషన్ తప్పిపోయినట్లు చూస్తున్నదీ, వింటున్నదీ, మనసుకెక్కడం లేదు. తన పమిట జారి ఒళ్ళో పడిపోయి ఉందన్న విషయం కూడా గమనించలేక పోతుంది తను.
అనాసక్తిగా సీట్లోనుంచి లేచాడు రాజేందర్. అతన్ని రివాల్వర్ తో కవర్ చేస్తున్నాడు ఇక్బాల్. మిగతా పాసెంజెర్సు అందరినీ కర్చీఫులో ఉన్న గ్రెనేడ్లతో బెదిరిస్తున్నాడు విక్టర్.
శతృఘ్న వెనకాతలే కాక్ పిట్ లోకి నడిచాడు రాజేందర్. పడిపోయి ఉన్న పైలట్లని చూడగానే అతని కళ్ళు పెద్దవయ్యాయి. "గుడ్ గాడ్! వీళ్ళని చంపేశావా?" అన్నాడు తడబడుతూ.
"నేను చంపలేదు. వాళ్ళే పడిపోయారు. ఫుడ్ పాయిజనింగ్ అయి ఉండవచ్చు." అన్నాడు శతృఘ్న కరుగ్గా.
రాజేందర్ కి నిలువు గుడ్లు పడ్డాయి.
"అంటే...యూ మీన్... మన ప్లేన్ కి పైలట్ లేడా ఇప్పుడు? లేకుండానే వెళ్ళిపోతోందా ఈ విమానం?" అంటూ అప్రయత్నంగా ఇన్ స్ట్రుమెంట్స్ పానెల్ వైపు తిరిగాడు. కొద్దిక్షణాల తర్వాత, ఆల్టిట్యూడ్ చూపించే డయల్ ని గుర్తుపట్టగలిగాడు.
భూమికి నాలుగు మైళ్ల ఎత్తున ఉన్నారు తాము!
ఇంత ఎత్తు నుంచి ఈ విమానం కూలిపోతే, కనీసం కళేబరాల తాలూకు ముక్కలు కూడా మిగలవేమో అంత్యక్రియలు జరపడానికి!
ప్రాణభయంతో అతని వళ్ళు జలదరించింది.
"ఈ సీట్లో కూర్చో!" అన్నాడు శతృఘ్న. సవ్యసాచిని పక్కకిలాగే ప్రయత్నం చేస్తూ. సవ్యసాచి చాలా భారీ మనిషి. కష్టంగా ఉంది అతన్ని కదిలించడం.
"ఇది ఇంపాజిబుల్!" అన్నాడు రాజేందర్ పెదిమలు తడి చేసుకుంటూ. "బొమ్మ విమానం లాంటి పుష్పక్ ని నడిపినంత మాత్రాన ఈ నాలుగు ఇంజన్ల జెయింట్ విమానాన్ని నడపగలనా నేను! నో! గుర్రపు స్వారీ వచ్చినంత మాత్రాన పులిమీద ఎక్కి సవారీ చెయ్యగలమా? ఇది అసంభవం!"
"అసంభవాన్ని సంభవం చేస్తేనే ప్రమాదంలోనుంచి బయటపడేది! చూడు! ఇక్కడున్న ఇంతమందిలో ప్లేన్స్ గురించి కొద్దో గొప్పో తెలిసింది నీకొక్కడికే! ఫర్ హెవెన్స్ సేక్! డూ సమ్ థింగ్! ఏదో ఒకటి చెయ్! లేకపోతే అన్యాయంగా చస్తారు మీరందరూ!"
"నువ్వు చావవా!" అన్నాడు రాజేందర్ తిక్క కోపంతో. టెన్షన్ తో అతనికి మతి పోతున్నట్లు ఉంది.
"చావడానికి ప్రతిక్షణమూ సిద్ధమే నేను!" అన్నాడు శతృఘ్న నిర్లక్ష్యంగా.
కొద్దిక్షణాలు అతని మొహంలోకి తేరిపారచూసి, పైలట్ సీట్లో కూర్చున్నాడు రాజేందర్. ఒణుకుతున్న చేతులతో హెడ్ ఫోన్స్ అందుకుని, తలకి పెట్టుకున్నాడు.
వెంటనే 'టూవే రేడియో'లో కంట్రోల్ టవర్ ఇన్ ఛార్జు మాటలు వినబడ్డాయి.
"సవ్యసాచీ... సవ్యసాచీ... కమ్ ఆన్... కమ్ ఆన్... ఏమయింది? ప్లీజ్ రిపోర్టు... ఓవర్!"
"ఫ్రెండ్!" అన్నాడు రాజేందర్ శ్మశాన వైరాగ్యంతో "నువ్వెవరో నాకు తెలియదు గానీ, నేను సవ్యసాచిని కాను. అతను ఎవరో కూడా నాకు తెలియదు."
"సవ్యసాచి మీ ఫ్లయిట్ కి పైలట్! ఏమయ్యాడు అతను? నువ్వెవరు?" అన్నాడు కంట్రోల్ టవర్ ఇన్ ఛార్జు కంగారుగా.
"పైలట్లు ఇద్దరూ, ఫ్లయిట్ ఇంజనీరూ స్పృహతప్పి  పడిపోయి ఉన్నారు. ఆహారంలోనో, డ్రింక్స్ లోనో విషం కలిసి ఉంటుందని అనుమానం. నా పేరు రాజేందర్. నేను ఇందులో పాసెంజెర్ని. ప్రస్తుతం దీనికి పైలట్ ని నేనే!"
"మైగాడ్" అన్నాడు ఇన్ ఛార్జ్. "మైగాడ్! నీకు ఫ్లయింగ్ వచ్చా?"
విషాదంగా నవ్వాడు రాజేందర్. "నేను ఫ్లయింగ్ క్లబ్ లో మెంబర్ని."
"అసలేం జరిగింది? చెప్పు!"
శతృఘ్నని ఓరకంట చూశాడు రాజేందర్.
అది గ్రహించాడు శతృఘ్న. వెంటనే, ఆ హెడ్ ఫోన్స్ లాగేసి తన తలకు పెట్టుకుని, "నా పేరు షాట్ గన్! నేను ఈ విమానాన్ని హైజాక్ చేస్తున్నాను. ముందర ఈ రాజేందర్ ని గైడ్ చేసి ప్లేన్ ని నేలమీద దిగేలా చూడు! లేకపోతే అందరూ మిడతల్లా చస్తారు" అన్నాడు పౌరుషంగా.
"ఒక్క నిమిషం!" అన్నాడు కంట్రోల్ టవర్ ఇన్ చార్జ్. అతని మొహానికి చెమటలు పట్టేశాయి. కర్చీఫ్ తో తుడుచుకుంటూ, ఆ వార్తని అధికారులకి పంపించాడు.
క్షణాల్లో ఎయిర్ పోర్టు అంతా అలర్టు అయిపోయింది.
అదృష్టవశాత్తు, ఎయిర్ బస్ లు నడిపే అనుభవం ఉన్న పైలట్ ఒకతను ఆ సమయంలో ఎయిరు పోర్టులోనే ఉన్నాడు. నిమిషాలమీద అతన్ని కంట్రోల్ టవర్ కి రప్పించాడు. అతనిపేరు మెహతా.
వచ్చీ రావడంతోనే రేడియోలో రాజేందర్ తో మాట్లాడటం మొదలెట్టాడు అతను. "ఆల్ రైట్ రాజేందర్! నేను మెహతాని! అయామ్ ఏ పైలట్! నౌ! ఫస్ట్ థింగ్స్ ఫస్ట్! డోంట్ పానిక్! భయంతో వెర్రెక్కిపోనవసరం లేదు! అది ముఖ్యంగా గుర్తుంచుకో! మిమ్మల్ని కరెక్టుగా గైడ్ చేసి, సురక్షితంగా భూమి మీదకు దింపడానికి ఇక్కడ మేమంతా ఉన్నాం. ఎయిర్ పోర్టులోని ప్రతిమనిషీ అలర్టుగానే ఉన్నాడు. ఓకే?"

 Previous Page Next Page