"అందరూ చేతులు పైకెత్తే ఉంచండి!" అన్నాడు విక్టరు రివాల్వరు చూపుతూ.
ప్రయాణీకులందరూ, అనుకోని ఈ పరిణామానికి నిర్ఘాంతపోయి కొయ్యబొమ్మల్లా కూర్చుండిపోయారు.
"విన్నారా? ఈ ప్లేన్ ని హైజాక్ చేస్తున్నాను నేను! నేను చెప్పినట్లు చెయ్యకపోతే కాల్చేస్తాను!" అన్నాడు శతృఘ్న, రివాల్వరుని పైలట్ల వైపు గురిపెడుతూ.
పైలట్లు కదలలేదు సమాధానం చెప్పలేదు.
అనుమానంగా, కొంచెం ముందుకి ఒంగి చూశాడు శతృఘ్న.
వాళ్ళు కదిలే స్థితిలో, సమాధానం చెప్పే స్థితిలో లేరు!
విరిగిపోయిన బొమ్మల్లా సీట్లలో పడి ఉన్నారు.
నిశ్చేష్టుడై చూస్తూ ఉండిపోయాడు శతృఘ్న.
ఆ సమయంలో, ఆ ఎయిర్ బస్ విమానం, రెండు వందల డెబ్బయ్ ఎనిమిదిమంది ప్రయాణీకులతో, ఏడుమంది సిబ్బందితో, నూటముప్ఫయ్ టన్నుల లగేజీతో ఆకాశంలో నాలుగుమైళ్ళ ఎత్తున, గంటకి నాలుగువందల మైళ్ళ ప్రచండ వేగంతో దూసుకుపోతోంది!
దానిని కంట్రోల్ చేసే పైలట్లు అపస్మారక స్థితిలో పడి ఉన్నారు.
స్పృహ తప్పి పడిపోయి ఉన్న పైలట్లని చూడగానే కొద్దిక్షణాలసేపు శతృఘ్న మెదడు పనిచెయ్యడం మానేసింది.
పైలట్లను ఎలా బెదిరించి విమానాన్ని హైజాక్ చెయ్యాలా అని తను ఆలోచించాడు గానీ, ఇలాంటి విచిత్రమైన పరిస్థితి ఎదురవుతుందని ఊహించలేదు.
పైలట్లు లేకుండా అగమ్యంగా వెళ్ళిపోతుందా ఈ విమానం! ఏం చెయ్యాలి ఇప్పుడు?
ఏం చెయ్యాలో వెంటనే స్ఫురించింది అతనికి. ఫ్లయిటు ఇంజనీర్ ని తీసుకురావాలి. తక్షణం! ఎక్కడ ఉన్నాడో అతను?
శతృఘ్న పాంటు కొనని ఎవరో బలహీనంగా గుంజినట్లయింది. ఉలిక్కిపడి, కిందికి చూశాడు.
మోకాళ్ళ మధ్య తల పెట్టుకుని, కడుపు చేతితో పట్టుకుని ఉన్నాడు ఫ్లయిట్ ఇంజనీర్ మూర్తి. అతని పెదిమలు అస్పష్టంగా కదులుతున్నాయి.
"చెప్పు! ఏమయింది? వాట్ ద హెల్ హాజ్ హేపెండ్?" అన్నాడు శతృఘ్న అర్జెంటుగా.
ఏదో చెప్పడానికి నోరు తెరిచి, వెంటనే సహింపరాని బాధతో సుళ్ళు తిరిగిపోతూ తల వాల్చేశాడు అతను. శతృఘ్న పాంటుని పట్టుకుని ఉన్న చెయ్యి పట్టు వదిలేసి, జారిపోయింది.
జరుగుతున్నది ఏమిటో అర్థంకాలేదు శతృఘ్నకి. తను రివాల్వర్ చూపించి బెదిరించగానే స్పృహతప్పి పడిపోయారా వీళ్ళు?
అది అయి ఉండదు. ఇంకేదో జరిగి వుండాలి. కానీ, ఏమిటది?
ఎవరి కంట్రోలులోనూ లేని విమానం విపరీతమైన వేగంతో దూసుకుపోతోంది ఆకాశంలో.
కంట్రోలు తప్పిపోతున్న తన మనసుని అతికష్టం మీద అదుపులోకి తెచ్చుకున్నాడు శతృఘ్న. పక్కకి తిరిగి చూశాడు. అతని పక్కనే నిలబడి ఉంది ఎయిర్ హోస్టెస్ అనుపమా గంగూలీ. తెల్లకాయితంలా పాలిపోయి ఉంది ఆమె మొహం.
"ఏమిటిది?" అన్నాడు శతృఘ్న, తన కోపాన్నంతా ఆమె మీదికి మళ్ళిస్తూ. భయంగా చూసింది అనుపమ.
"నాకూ అర్థం కావడం లేదు - సర్!"
ఒంగి, సవ్యసాచి గుండెమీద చెయ్యిపెట్టి చూశాడు శతృఘ్న. గుండె కొట్టుకుంటూనే ఉంది. "థాంక్ గాడ్!"
"ఎంతసేపటి నుంచి ఇలా పడి ఉన్నారు వీళ్ళు!" అన్నాడు కఠినంగా.
అనుపమ కళ్ళలో బెదురు కనబడింది. "ఇందాక నేను డ్రింక్స్ సర్వ్ చేసినపుడు బాగానే ఉన్నారు."
మెల్లిగా దొర్లుతూ వచ్చి అతని పాదాలని తాకింది ఒక గ్లాసు. దాని వెంటనే మరొకటి... మరొకటి...
మూడు గ్లాసులూ ఒకదాన్ని ఒకటి తాకుతూ ఉంటే సన్నటి శబ్దాలు - ఎవరో అస్పష్టంగా మాట్లాడుతున్నట్లు -
కాదు -
రహస్యాలు చెబుతున్నట్లు!
చటుక్కున వంగి చూశాడు శతృఘ్న.
ఫ్లయిట్ ఇంజనీర్ మూర్తి పెదాల పక్కన అంటుకుని...అతని షర్టు కాలరు మీద... ఏమిటది?
డామిట్! వాంతి చేసుకున్నాడు అతను.
ఒక గ్లాసు అందుకుని వాసన చూశాడు. ఇదమిద్ధంగా ఏమీ తెలియలేదు గానీ, పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఉండాలి. లేదా ఆ డ్రింక్స్ లో ఏదో విషపదార్ధం కలిసి ఉండాలి.
చివాలున వెనక్కి తిరిగాడు శతృఘ్న. "పాసెంజర్సులో ఎవరన్నా డాక్టర్స్ ఉన్నారేమో కనుక్కో! బీ ఫాస్ట్!" అన్నాడు అనుపమతో.
అప్పుడే స్పృహలోకి వచ్చినదానిలా చూసింది అనుపమ.
"ఒక డాక్టరు ఉన్నారు"