"మీ రంగా, సుగుణ మనతో యింత కల్సిపోతారనుకోలేదు సుమండీ" అంది ఓరోజు రాజేశ్వరి.
"అవును, నిజమే- మనం వచ్చి పొలం, యిల్లు తీసుకున్నామని ఫీలయి కోపరేట్ చేయడమోననుకున్నాను కాని రియాలిటీ గుర్తించి మనతో మంచిగా ఉండడమే తనకు లాభం అన్నది గ్రహించాడనుకుంటాను. యింతకీ మనం తనకి అన్యాయం ఏం చెయ్యలేదు గదా. ఇల్లు కట్టించి ఇచ్చాను. ఇన్నాళ్ళు శిస్తు సంగతి ఎత్తలేదు. యిప్పుడు కూడా ఆ పొలం మీద శిస్తు తనే తీసుకోనీ. యిన్నాళ్ళు మన ఇల్లు, పొలం చూశాడు గదా పాపం."
"అవును. మనకెందుకులెండి ఈ డబ్బు - వాళ్ళకి పాపం ఈ పొలం శిస్తేగా ఆధారం. సుగుణకి పాపం ఈ సంగతులు తెలియవు. ఏదో తన ధోరణి తనది" అంది రాజేశ్వరి. రంగాకి యిద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల. పెద్దవాడు బి.కాం. చదివి బ్యాంక్ పరీక్ష రాసి ఉద్యోగం చేస్తున్నాడు నూజివీడులో - రెండోవాడు బి.కాం. చదివి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. పిల్లకి పదహారేళ్ళు. రేణుక రోజూ బస్సులో వెళ్ళి పక్కవూరిలో హైస్కూల్లో టెన్త్ చదువుతూంది. రేణుక అంటే రాజేశ్వరికి మంచి అభిమానం కలిగింది ఈ కొద్దిరోజుల్లోనే-" రేణూ అత్తయ్యా బి.ఎస్సీ అనర్స్ తెలుసా నీకు. లెక్కలు, సైన్సు అవి ఏమన్నా కావాలంటే అడుగు చెపుతారు అన్నాడు రంగా ఓసారి. అప్పటినుంచి శని, ఆదివారాల్లో తెలియనివి చెప్పించుకోవడానికి రావడం మొదలుపెట్టింది.
పిల్లలు పెద్దవాళ్ళయి దూరమైన ఈ వయసులో మనవరాలిలా దగ్గరకి వచ్చి వెంటవెంట తిరుగుతుంటే రాజేశ్వరికిముచ్చటగానే ఉంది. పరికిణి, ఓణీ, మంచి నొక్కుల జుత్తు, చామనఛాయ అయినా పెద్ద కళ్ళు, కళ గల ముఖం చూసి రాజేశ్వరికి రేణు అంటే ప్రేమ, అభిమానం కలిగాయి.
కేశవరావుకి కూడా ఆడపిల్లలంటే ఇష్టం. కొడుకు కంటే కూతురంటే ప్రాణం ఆయనకి. తను తనకూతురిని అచ్చతెలుగింటి అమ్మాయి డ్రస్సులో చూడాలన్న కోరిక ఆయనకి తీరలేదు. ఇంట్లో తిరిగే రేణుని చూస్తే ఆయనకి మనవరాలు తిరుగుతున్నట్టే అన్పించేది.
మొత్తానికి ఓ నెలరోజులలోనే ఈ కుటుంబం ఆ కుటుంబం ఒకే కుటుంబంలా కలిసిపోయి ఆప్యాయతానురాగాలు పంచుకోవడం మొదలుపెట్టాయి.
* * *
డాక్టర్ కేశవరావు ముఖ్యమంత్రితో, మిగతా అధికారులతో మాట్లాడి తనకు కావాల్సిన అన్ని విషయాలు సమగ్రంగా తెలుసుకుని పెట్టాల్సిన దరఖాస్తులు పెట్టి, ఆఫీసర్ల నుంచి పొందాల్సిన క్లియరెన్స్ కాగితాలు పట్టుకుని, తనవెంట ఓ అగ్రికల్చర్ ఆఫీసరు, ఓ రోడ్ల బిల్డింగు శాఖల అసిస్టెంటు యింజనీరుని వెంటబెట్టుకుని వచ్చారు.
ముఖ్యమంత్రి కేశవరావుకి ఏ ఏ క్లియరెన్స్ కావాలో, ఏ కాగితాలు మీద సంతకాలు పెట్టాలో తత్సంబంధిత ఆఫీసర్లతో మాట్లాడి గంటల్లో పని జరిపించాడు. డిస్ట్రిక్ కలక్టర్ కి ఫోను మీదే కేశవరావు ఏదడిగినా వెంటనే సహకరించమని చెప్పారు. "జన్మభూమి" పథకం కింద గ్రామస్థులు పాల్గొనే ఏ కార్యక్రమానికన్నా ప్రభుత్వం యిచ్చే గ్రాంటు ఎంత ఇవ్వవలసి వుంటుందో వెంటనే రిలీజ్ చెయ్యమని ఆదేశాలు ఇచ్చారు.
"సార్! మీకేం కావాల్సిన అధికార్ల సంతకాలు గానీండి, గ్రాంటులు మీ లిమిట్ లో యివ్వాలి అన్నవెంటనే యిప్పిస్తాను. మీరు కోరిన సమాచారం వెంటనే యిచ్చే ఏర్పాటుచేస్తాం. మీరు కోరిన విధంగా అగ్రికల్చర్ ఆఫీసరు, రోడ్లు, భవనాల ఇంజనీరుని పంపిస్తాను. గ్రామంలో "గ్రామీణ సహకార బ్యాంకు" తెరిపించేందుకు ప్రయత్నించండి- కొంత మీరంతా కల్సి పెట్టుబడిపెట్టాలి. ఎంత అన్నది బ్యాంకు వారిని మీ దగ్గరకి పంపిస్తా మాట్లాడమని. రైస్ మిల్ పర్మిట్ వెంటనే గ్రాంట్ చేయమని కలక్టర్ కి చెప్పా- మీ వెనక నేనున్నాను సార్... గో ఎ హెడ్-" అంటూ షేక్ హాండ్ ఇచ్చారు ముఖ్యమంత్రి.
అగ్రికల్చర్ ఆఫీసర్ వూరిలో నాలుగురోజులు మకాం పెట్టి మునసబు, కరణం సహకారంతో సేద్యపు భూమి ఎంత వుంది, ఎంత మంది చిన్న, పెద్ద రైతులు- వారికి వున్న భూమి ఎంత, ఆ భూమికి సాలు సరి పంట సుమారు ఎంత - ఏ ధర వస్తుంది - ధాన్యం అమ్మితే వచ్చే డబ్బు - తాము రైస్ మిల్లు పెట్టి బియ్యం చేసి డైరెక్టుగా మార్కెట్ చేస్తే వచ్చేది ఎంత - ఇన్ని ఎకరాలకి విత్తనాలు ఎంత - ఎరువులు, మందుల ఖర్చులు ఏమాత్రం వుంటుంది వగైరాలన్నీ పట్టికలు, వివరాలు తయారుచేసి యిచ్చాడు. ఏ సీజన్ లో ఏ పంట, ఎరువుల మోతాదు- ఏ చీడని ఏమందు వగైరా వివరాలు కూడా కేశవరావు కోరిక మీద వివరంగా రాసి ఇచ్చాడు.
రోడ్లు భవనాల ఇంజనీరు - వూరిలో మొత్తం రోడ్లు తారు రోడ్డు చెయ్యాలి హైవే వరకు. ఎస్టిమేట్, మెటీరియల్ ఎంత. కాస్ట్ ఎంత- అందులో ప్రభుత్వం యిచ్చేది ఎంత వగైరా లెక్కలు కట్టి యిచ్చాడు. మెటీరియల్ ఎక్కడనుంచి తెచ్చుకోవచ్చో లాంటి సందేహాలు కూడా యిచ్చాడు.
ప్రెసిడెంటు, కేశవరావు, రంగా, చౌదరి, ఎమ్మెల్యే అంతా కూర్చుని ఆ లెక్కలన్నీ పరిశీలించి సందేహాలు, ప్రశ్నలు, జవాబులు అయ్యాక తమపని పూర్తిచేసి ఆఫీసర్లు వెళ్ళారు.
వెళ్ళేముందు అగ్రికల్చర్ ఆఫీసరు కేశవరావుని పక్కకు పిలిచి-
"సార్ మీరు చేపట్టే ఈ సహకార సేద్యానికి సలహా సంప్రదింపులకి మీకు ఒక అగ్రికల్చర్ చదివిన వారి సాయం తీసుకుంటే బాగుంటుంది. వెయ్యి పైన ఎకరాలు... రైతులకి తెలుస్తుంది అనుకోండి- కాని నవీన పద్ధతులలో, హారెస్టింగ్ మిషను, ట్రాక్టర్లు, మోటర్లు, మందులు, ఎరువులు ఇవన్నీ చూసుకోడానికి ఒకరిని అపాయింట్ చేసుకుంటే మంచిది సార్."
"నేనూ అదే అనుకుంటున్నాను. మీకు తెల్సిన ఎవరన్నా...."
"ఎవరో ఎందుకు సార్. మళ్ళీ నెలకు రిటైరవుతున్నాను. నా సర్వీసు మీకు కావాలంటే అందించడానికి రెడీ సార్" కృష్ణమూర్తి అన్నాడు.
"మీరు గవర్నమెంటు ఆఫీసర్. ఇదంతా చూడగలరా...రిటైరయ్యాక యిదంతా చూసే ఓపిక మీకు... ఈ వూరిలో ఉండగలరా ఈ వయసులో మీరు.
"సార్! గవర్నమెంటు రివైండింగ్ వయసి ఏభై ఎనిమిది... ఈ రోజుల్లో ఏభై ఎనిమిది అంటే ముసలి వయసు కాదు. రిటైరయ్యాక అంతా తలోపని చేస్తూనే వున్నారు.
ఎవరిదాకానో ఎందుకు సార్. మీరు ఈ వయసులో ఇంత ఎజర్జిటిక్ గా, ఉత్సాహంగా ఈ వూరిని బాగుపర్చడానికి తాపత్రయపడుతున్నారు. మీలాంటి వారే సర్ మాకు ఇన్స్పిరేషన్. మిమ్మల్ని చూశాకే అంత గొప్ప డాక్టరు, అన్ని కోట్లున్నాయన అమెరికా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి ఏదో చెయ్యాలని తాపత్రయపడుతుంటే ఎంతసేపూ సిటీలే పట్టుకుని వేళ్ళాడుతున్నాం. హాయిగా రిటైరయి ఓ పల్లెటూరిలో సెటిల్ అవుదాం అన్న ఆలోచన వచ్చింది నాకు ఇక్కడికి వచ్చాక. మిమ్మల్ని చూడకపోయివుంటే రిటైరయ్యాక ఏదో పార్ట్ టైమ్ జాబ్ లేక కన్సల్టెన్సీ లాంటిది చేద్దామనుకున్నాను సిటీలోనే వుండి. ఈ వారం రోజులు యిక్కడ వుండి మిమ్మల్ని చూశాకే నా అభిప్రాయాలన్నీ మారిపోయాయి. మీరు నాకు ఛాన్సు ఇస్తే మీకు అన్నివిధాల సహకరిస్తూ ఈ వూర్లో అగ్రికల్చర్ ప్రాబ్లెమ్స్ అన్నీ చూసుకుంటాను.
"మీ జీతం వగైరాలు...మేం అంత ఇచ్చుకోగలమా. నేను ఏదో కొత్తగా ప్యాసయిన యువకుడిని అపాయింట్ చేద్దామనుకున్నాను. మీ ఎక్స్ పీరియన్స్ కి తగిన జీతం..." కేశవరావు సందేహంగా అన్నాడు.
"సార్, ఈ వూరిలో నేను, నా భార్య వుంటాం. పిల్లలంతా పెళ్ళిళ్ళు, చదువులయ్యాయి. మా యిద్దరికీ సంసారం గడవడానికి సరిపోయే జీతం చాలు. నా పెన్షన్ ఎలాగో ఉంటుంది. ఈ ఆఖరిరోజులలో ఏదో నేనూ మీతో చేతులు కలిపి ఓ మంచి పనిచేశానన్న తృప్తి యివ్వండి చాలు."
అతని మాటలు యింప్రెస్ చేశాయి కేశవరావుని.
"ఓ.కే. కృష్ణమూర్తిగారు. మీకు రిటైరవ్వగానే తెలియచెయ్యండి అఫీషియల్ గా. మిమ్మల్ని ఇక్కడ అపాయింట్ చేస్తున్నట్టు ఉత్తరం పంపిస్తాను. అడ్రస్ ఇచ్చి వెళ్ళండి."
* * *