Previous Page Next Page 
జన్మభూమి పేజి 19

    కేశవరావు హైదరాబాదు వెళ్ళినరోజున వూర్లో ఆడవాళ్ళందరిని సుగుణ కబురుచేసి పోగుచేసింది. పొలాల నుంచి వచ్చినవాళ్ళు, యిళ్ళల్లో వుండేవారు అందరూ ఎందుకోనని కుతూహలంగా రాజేశ్వరి దగ్గిరకు వచ్చారు. అందరినీ ఇంటిముందు తోటలో కూర్చోబెట్టింది సుగుణ.
    "చూడండమ్మా, ఈ గ్రామంలో సాయంత్రం పూట ఓ గంట ఆడవాళ్ళకి చదువు చెప్పాలని నిర్ణయించుకున్నాను. మీలో చదవడం, రాయడం ఎంతమందికి వచ్చో చేతులు ఎత్తండి" అంది రాజేశ్వరి.
    కూర్చున్న నలభైమంది స్త్రీలలో ఓ పదిమంది మాత్రం చేతులు ఎత్తారు. "మీరంతా ఎంతవరకు చదివారమ్మా...ఒక్కొక్కరు చెప్పండి. ఒకరు ఒకటో క్లాసు, ఇంకోరు రెండు మూడు అని సిగ్గుపడుతూ చెప్పారు. అంటే సంతకం మాత్రం చేయడం వచ్చినవాళ్ళు కూడబలుక్కుని అక్షరాలు చదవగలరేమో."
    "చూడండమ్మా...ప్రతివారికి చదవడం, రాయడం అన్నా రావాలి. ఇంట్లో స్త్రీ చదువుకుంటే పిల్లలకి నాలుగక్షరం ముక్కలు నేర్పచ్చు. ఓ ఉత్తరం రాయాలన్నా, ఓ పత్రిక చదువుకోవాలన్నా కాస్త చదువుంటే లోకంలో జరిగే సంగతులు తెలుసుకోవచ్చు. కాస్త జ్ఞానం అలవర్చుకోవచ్చు. మీరు చదువుకుంటానంటే సాయంత్రం ఓ గంట మీరు వస్తే నేను, సుగుణ చెపుతాం - నాకిబ్బంది అయిన రోజున మన ప్రెసిడెంట్ గారి భార్య, మాష్టారిగారి భార్య యిలా ఎవరో ఒకరు చెపుతాం. రోజూ స్కూలు దగ్గిరకి మీ ఇంటిపని అయ్యాక రండి. పలకలు, పుస్తకాలు నేను కొనిస్తాను.
    "అమ్మా! పొలం కాడనుంచి వచ్చేసరికి చీకటి పడ్తుంది. కుండ కడుక్కుని వంట వండుకోవాలి అమ్మా... పిల్లలు ఆకలంటారు, మొగాళ్ళు పొలం నుంచి రాగానే తిండెట్టమంటారు..." యిద్దరు ముగ్గురు అన్నారు.
    అవును పాపం ఉదయం నుంచి కష్టపడి యిల్లు చేరేసరికి ఆకలవుతుంది. "పోనీ అంతా అన్నాలు తిన్నాకే రండి - ఏడు గంటలకి రండి - ఓ గంట చదువుకుందురుగాని..."
    "తినగానే కళ్ళు కూరుకుపోతాయమ్మా..." ఎవరో సన్నగా గొణిగారు.
    రాజేశ్వరి నవ్వింది. "చూడండి, నిజంగా మీరు చదువుకోవాలంటే ఇవన్నీ అడ్డు రావు. ఓ గంట నిద్రని త్యాగం చెయ్యండి. చదువంటే అక్షరం ముక్కలే గాదు- ప్రపంచంలో జరిగేవన్నీ కూడా మీకు నచ్చినట్టు కథల్లా చెపుతాను. మనదేశంలో ఏం జరుగుతుందో చెప్పుకోవచ్చు. అక్షరాలు నేర్చుకోవడం ఓ ఎత్తు, తన జ్ఞానం అలవర్చుకోవడం ఓ ఎత్తులా ఓ గంట చదువుకుందురుగాని- కొన్నాళ్ళు వస్తే మీకే రావాలనిపిస్తుంది, చదువుకోవాలనిపిస్తుంది- ఏం వస్తారా.  
    "ఇదివరకు ప్రభుత్వం 'అక్షరాస్యత' పథకం కింద గ్రామ సేవికల్ని పంపారు కొన్నాళ్ళు. కొందరు నాల్గు రోజులు, కొందరు నెల, రెండు నెలలు వచ్చిరావడం మానేసారండి..." మాష్టారు సాంబశివరావుగారి భార్య అన్నపూర్ణ అంది.
    "అదే కేవలం అక్షరాలు నేర్పుతాం అంటే వీళ్ళకి ఇంటరెస్ట్ వుండదు. చదువు చదువులా కాకుండా కథల్లా చెప్పాలి వీళ్ళకి... మీరే చూడండి నాల్గురోజులు. నేను చెప్పింది నచ్చకపోతే మానేద్దురుగాని..." రాజేశ్వరి అంది.
    "నేను అమెరికాలో వుండగా పిల్లలు స్కూలులో ఎంతో బాగా చెపుతానని పేరుండేది నాకు. మీరూ విని ఆమాట నిజమో, కాదో చెప్పండి. ఏం..." రాజేశ్వరి నవ్వుతూ అంది.
    అంతా నవ్వారు. "ఏం వస్తారా రేపటి నుంచి- నేను మీరు ఊ అనేవరకు వదలను" ఈ వూరిలో ఏదో సాధించే వరకు ఆయన, నేను నిద్రపోం...వస్తారా మరి..."
    "అలాగే అమ్మా! మీరింతగా చెపుతుంటే...వస్తాంలే అమ్మ!"
    "మీరొక్కరే కాదు - మీ మగవాళ్ళలో చదువురాని వాళ్ళని కూడా తీసుకురావాలి. రేపటినుంచి మీ పిల్లలు స్కూల్లో చదువు చెప్పడానికి స్కూలుకి వెళుతున్నాను. వాళ్లకి అక్కడ ఇంగ్లీషు, పాటలు, పద్యాలు, చిన్న కథలు అన్నీ చెపుతాను. చదువంటే కేవలం పుస్తకాలు చదవడం, రాయడం కాదు - ముఖ్యంగా పిల్లలకి కుతూహలంగా చెప్పడానికి ట్రైనింగ్ అయ్యాను. మీ పిల్లలకి ఏడాదిలో ఇంగ్లీషు మాట్లాడేట్టు చేస్తాను చూడండి." అంతా కుతూహలంగా విన్నారు.
    "వాళ్ళకి సరే. ఇంగ్లీషు మాట్లాడడం మాకూ నేర్పాలి! ప్రెసిడెంటు భార్య పద్మావతి అంది. అవునవును, మాకూ కాస్త ఇంగ్లీష్ నేర్పండి...రాయడం, చదవడం కాస్త వచ్చుకాని మాట్లాడడం రాదు మాకు" సుగుణ అంది.
    "అలా అయితే మధ్యాహ్నం మూడు గంటలకి ఇంగ్లీషు నేర్చుకోవాలనుకున్న అందరూ ఓ గంట రండి" స్పోకెన్ ఇంగ్లీషు చెప్తాను.
    "మాకొస్తుందా ఇప్పుడు ఈ వయసులో..." అన్నపూర్ణ సందేహం.
    "భాష నేర్చుకోడానికి వయసు అడ్డం ఏమిటి? మీరు శ్రద్ధగా రోజూ వస్తే ఓ ఆరేడు నెలల్లోనే మాట్లాడే ఇంగ్లీషు వచ్చేస్తుంది."
    "అయితే వస్తాం..." ఉత్సాహంగా అన్నారు అంతా. "ఇంట్లో చెప్పద్దు...మగాళ్ళు నవ్వుతారు!"
    "ఎందుకు నవ్వుతారు? మీరు చక్కటి ఇంగ్లీషు మాట్లాడితే గర్వపడతారు, నవ్వరు. అయితే సరే - రేపటి నుంచి పొద్దుట స్కూలు, మధ్యాహ్నం ఇంగ్లీషు క్లాసు, సాయంత్రం ఆడవాళ్ళ చదువు- ఇంక రోజంతా కాలక్షేపమే. రాజేశ్వరి నవ్వుతూ అంది. వచ్చిన అందరికీ టీ, బిస్కట్లు యిచ్చింది. తమకి వారితో సమంగా కప్పులతో టీ ఇవ్వడం పల్లెపడుచులందరికీ సంతోషం కల్గించింది. రాజేశ్వరి తెల్లని రంగు, చక్కని మొహం, నీటుగా కట్టిన మడత నలగని చీర, అట్టే నగలు లేకుండా సింపుల్ గా, హుందాగా వున్న ఆమె అందం అందరినీ ఆకర్షించింది.
    ఆమె గొంతు కూడా ఎంత బాగుందోననిపించింది. రాజేశ్వరిని చూడగానే అందరికీ ఇష్టం కలిగింది. ఆమె బాగా చెపుతుంది అన్న భావన కలిగించింది ఆమె మాట తీరు - గ్రామ సేవికలు చదువు చెప్పడం ఏదో డ్యూటీ, మొక్కుబడిగా చెప్పినట్లు తప్ప వాళ్ళలో ఇంటరెస్ట్ కలిగించలేదు. రాజేశ్వరి లాంట ఆవిడ ఆయన విదేశాల్లో వుండి తమ ఊరికోసం వచ్చి ఇక్కడ మకాంపెట్టి ఎన్నో మంచి పనులు చెయ్యాలనుకోవడం భర్తల ద్వారా విన్నవాళ్ళందరికీ గౌరవం కలిగించింది. "రేపొస్తాం అమ్మా. యింటికి పోయి కూడొండాలి" అని అంతా లేచి శలవు తీసుకున్నారు.
    "సరే మేమూ వెళ్ళివస్తాం...రేపట్నించి రమ్మంటారా ఇంగ్లీషుకి" పద్మావతి లేస్తూ అంది.
    "మరి వేరే ముహూర్తం ఎందుకు. శుభస్య శీఘ్రం అన్నారుగా పెద్దలు, రండి రేపు" అందరినీ నవ్వుతూ సాగనంపింది.
    "ఆంటీ... నిజంగా మీరు ఈ వూరు రావడం మా అదృష్టం. మీరు వచ్చారు వూరికి కళ వచ్చింది ఈ ఇరవై రోజులలో..." మనస్పూర్తిగా అంది సుగుణ. రాజేశ్వరి అభిమానంగా సుగుణ భుజం తట్టింది. మీరు ఈ ఊరిలో వుండడం మాకు చాలా సాయంగా వుంది సుగుణా. నీవుండబట్టి నేను కొత్తగా ఫీలవడం లేదు. మనవాళ్ళు అన్న వాళ్ళున్నారన్న భావం తృప్తినిస్తుంది" అంది రాజేశ్వరి.
    నిజంగానే రాజేశ్వరికి అన్ని పనుల్లో మాటసాయమే కాక, చేతిలోపని అందుకుంటుంది సుగుణ. ఇంట్లో పనికి పొలం కూలి రత్తయ్య భార్య సీతాలుని కుదిర్చిపెట్టింది. రత్తయ్య రోజూ సాయంత్రం వచ్చి మొక్కలకి నీళ్ళు పోస్తాడు, పెరడు పూడుస్తాడు. చెట్లకి గొప్పులు తవ్వుతాడు. రాజేశ్వరికి అరిసెలు, జంతికలు లాంటివి చేసి పట్టుకొచ్చి ఇచ్చేది సుగుణ. నిమ్మకాయ వూరగాయకి తోటలో కాసాయి అని నిమ్మకాయలు తెచ్చి తరిగి ఊరగయ పెట్టింది. మిరప పళ్ళ సీజను, చింతకాయ సీజను అంటూ మిరపపళ్ళు పచ్చడి ఎలా పెట్టాలో చూపించింది.  
    మధ్యాహ్నం అయితే రోజూ ఒక గంటన్నర కూర్చుని వెడుతుంది. ఓ రోజు గుమ్మడికాయ పొలంలోది అంటూ సీతాలు చేత తరిగించి మినపప్పు నానవేయించి పొద్దుటే వచ్చి రుబ్బించి వడియాలు పెట్టింది. గేదె ఈనింది అంటూ పాలు తెచ్చింది. జున్ను చేయడం రాదంటే అప్పటికప్పుడు వండి చూపింది. గడ్డలా వున్న ఆ జున్ను ఫ్రిజ్ లో పెట్టుకుని నాల్గురోజులు తిన్నారు రాజేశ్వరి, కేశవరావు. సుగుణ కలుపుగోలుతనం, అమాయకత్వం రాజేశ్వరికి చాలా నచ్చింది. తను కట్టుకోడం మానేసిన ఎన్నో చైనా సిల్క్ చీరలు కొత్తగా వున్నాయని యిస్తే అపురూపంగా తీసుకుని కట్టుకుంది- బేషజం లేకుండా తనకి ఎంతో గౌరవం ఇచ్చేది. సుగుణ అంటే రాజేశ్వరి, కేశవరావుకి ఎంతో అభిమానం. అమెరికాలో ఒంటరిగా వుండివచ్చిన రాజేశ్వరికి సుగుణ తోడు సంతోషమే యిచ్చింది.

 Previous Page Next Page