Previous Page Next Page 
నా జీవితం నీ కౌగిలిలో పేజి 19


    "తొందరలో ఎవరో పల్లెటూరు కస్టమర్ కి అనాసిన్ బదులు అయోడిన్ యిచ్చానట... నాకేం తెల్సు... కేండిడేటు గల్లంతయాట్ట... అంతే... ఓనర్ చీవాట్లేశాడు-పోరా పో... అని యస్వీ రంగారావు స్టయిల్లో 'రాజీనామా' నోటితో చెప్పేసి వచ్చేశాను. అది కాదు గురూ నీ పెళ్ళాం ప్రాబ్లమ్ గురించి ఏమాలోచించావ్..."

 

    "ఆలోచించడవేంటి... దాని గురించే తలపట్టుకొని ఛస్తున్నాను... ఎన్నాళ్ళిలా దొంగల్లా అర్ధరాత్రికి గదికి చేరుకొని, తెల్లవారుజామున బైటికొచ్చేయటం? ఈలోపు ఆమె చూసిందంటే కొంపకొల్లేరే... భుజంగరావు గారేమో మనం, నా లేని పెళ్ళాన్ని తీసుకురావడం కోసం ఊరికెళ్లామని చెప్పారట. ఆయన అబద్ధం ఆడమనటం- నువ్వూ ఒకటికి లక్ష అబద్ధాలు ఆడటం ఛీ... ఛీ..." అన్నాడు ఆంజనేయులు చిరాగ్గా.

 

    "అలాగయితే రూమ్ ఖాళీ చేద్దామా? చేయమంటే చేద్దాం... నీ యిష్టం" అన్నాడు ఆనందం అంతకంటే చిరాగ్గా.

 

    "అమ్మో... నా ఉద్యోగమో...? నాకు బాధ్యతలున్నాయి- అప్పులున్నాయి. అవితీరేదాకా తప్పదురా. కానీ యిలా ఎన్నాళ్ళు...?" ఆంజనేయులు డీలాపడిపోతున్నాడు.

 

    "అవ్వా... బువ్వా... రెండెలా?"

 

    "బాబ్బబు... నువ్వే ఏదో చూడరా..." బ్రతిమిలాడాడు ఆంజనేయులు,

 

    ఆనందం ఒకింతసేపు ఆలోచిస్తూ వుండిపోయాడు.

 

    ఆంజనేయులు దిగులుగా కూర్చుండిపోయాడు.

 

    "అమ్మాయిని తెచ్చి నాటకం ఆడటం నీకు నచ్చదు. అమ్మాయి రాకపోతే ఆమె ఊరుకోదు. దీనికి ఒక్కటే పరిష్కారం..." అన్నాడు ఆనందం.

 

    "ఏమిటది...?" ఆత్రుతగా అడిగాడు ఆంజనేయులు.

 

    "ప్రస్తుతానికి ఏదో ఒక అమ్మాయి ఫోటో తీసుకెళ్ళి ఆమెకు చూపిద్దాం. తుఫాను కొన్నాళ్ళు సర్దుకుంటుంది. ఆపైన భుజంగరావు గారి సపోర్టు ఎలాగో వుందిగా. పదా చెబుతాను" అంటూ ఆనందం మేరీ కేసి ఓరగా చూస్తూ బయటకు నడిచాడు.

 

    క్రమంగా ఆనందం మెదడులో మరో పథకం ఊపిరి పోసుకో సాగింది.

 

    "ఆ... మేరీని తెచ్చి కొన్నాళ్ళు నాటకమాడితే...?" నడుస్తూ నడుస్తూ సడన్ గా ఆగిపోయి అన్నాడు ఆనందం.  

 

    "అదోరకం టైపు... పట్టుకుంటే వదలదు. పైగా  మా ఓనరు బావమర్ది మేరీ కోసం తెగ వర్రీ అయిపోతున్నాడు. మనం నువ్వన్నట్లుగా చేస్తే, వాడు వాడి బావకి చెప్పి, నా ఉద్యోగం పీకించేస్తాడు" అన్నాడు ఆంజనేయులు నీరసంగా.

 

    ఇద్దరూ తిరిగి నడక మొదలెట్టారు.


                                                       *    *    *    *


    ఓ పాతిక నిమిషాల తర్వాత యిద్దరూ అబిడ్స్ ట్రాఫిక్ ఐలాండ్ దగ్గర అటూ ఇటూ చూస్తూ నిలబడి నాంపల్లి స్టేషన్ రోడ్ వేపు నడిచారు.

 

    పుల్లారెడ్డి స్వీట్స్ షాపు ముందు భారీ ఫోటో షాప్ కనబడటంతో అందులోకి దూరారు.

 

    టేబిల్ మీద కొన్ని ఆల్బమ్స్ వున్నాయి.

 

    వాటిని తిరగేస్తున్నాడు ఆనందం. ఒకటా, రెండా కొన్ని వందల ఫోటోలు.

 

    ఆల్బమ్ ని తిరగేస్తున్న ఆనందం చూపులు ఒకచోట చిక్కుపడి పోయాయి.

 

    అక్కడొక అమ్మాయి ఫోటో. చూడగానే పల్లెటూరి అమాయకత్వం- అతన్నెంతో ఆకర్షించింది. చెవులకు లోలాకులు, ముక్కుకు ముక్కుపుడక, విశాలమైన కళ్ళు, సిగ్గుపడుతూ నిల్చుంది ఆ అమ్మాయి.

 

    "పల్లెటూరి ప్రెటీ సిస్టర్ వండ్రఫుల్... నీ టేస్ట్ కి తగ్గట్టుగా వుంది. ఎవరో పాపం... ఎక్కడుందో... ఏం చేస్తోందో..." ఆంజనేయులికి వినపడేలా అన్నాడు ఆనందం.

 

    ఆంజనేయులికి అదంతా చిరాగ్గా వుంది.

 

    అందుకే కనీసం ఆల్బమ్ కేసి కూడా చూడటం లేదు.

 

    "ఈ ఫోటో బావుంది. లేపేయనా?" ఆనందం అడిగాడు.

 

    "నీ చావేదో నువ్వే చావ్-ఒక్క అబద్ధం ఆడితే ఎన్ని అబద్దాలకి దారితీస్తోందో...? నేనెళ్ళి బయట నించుంటాను. లేదంటే ఫోటో దొంగిలించినందుకు నీతోపాటు, నన్నూ ఉతికేస్తారు..." అంటూ తలుపు దగ్గర కెళ్ళి నిల్చున్నాడు ఆంజనేయులు ఒకింత భయంగా.

 

    అంతలో అటుగా ఏం కావాలంటూ ఆ స్టూడియో కుర్రాడు వచ్చాడు.     

 

    "పాస్ పోర్ట్ ఎంతండి?" తను ఆంజనేయులు కోసం ఎన్నుకున్న ఫోటోని గుర్తుపెట్టుకుంటూ అడిగాడు ఆనందం.

 

    "నాలుగు రూపాయలు"

 

    "కేబినెట్ సైజ్?"

 

    "ఎనిమిది రూపాయలు"

 

    "ఫుల్ సైజో?"

 

    "యాభై"

 

    "టెన్ ఇంటు ట్వెల్"

 

    "డెబ్భై"

 

    ఆంజనేయులికి ఆ సంభాషనంతా వినిపిస్తూనే ఉంది.

 

    "పాస్ పోర్ట్-కేబినెట్ కలిపెంత?"

 

    "పదహారు"

 

    "కేబినెట్ ఫుల్ సైజో?"

 

    "ఇరవై ఎనిమిది"

 

    "ఫుల్ సైజ్-పాస్ పోర్ట్"

 

    తికమకపడిపోయాడా కుర్రాడు.

 

    ఆనందం అదే అదననుకున్నాడు.

 

    "పాస్ పోర్ట్-టెన్ ఇంటూ ట్వెల్ ఎంత? కేబినెట్, రెండు పాస్ పోర్ట్ లెంత? నాలుగు ఫుల్ సైజ్ లు, ఒక కేబినెట్ ఎంత...?" అంటూ గుక్క తిప్పుకోకుండా యాభై కాంబినేషన్స్ అడగటంతో ఆ కుర్రాడు బిక్క మొహం, ఆ పైన ఏడుపు మొహం పెట్టేశాడు.

 

    "ఇప్పుడూ... కేబినెట్... కేబినెట్టే... పాస్ పోర్ట్..." అంటూ ఆనందం అంటుండగానే అతను భోరుమని ఏడ్చేసి - "వాడు పోయాకే చెప్పు బయటకొస్తాను" అంటూ అతను లోనికి పరుగునవెళ్ళి అక్కడున్న కుర్రాడికి చెప్పాడు. వాడు సయితం ఆనందాన్ని చూసి బయటకొచ్చేందుకు భయపడ్డాడు.

 

    ఆనందం నవ్వుకొని అలా ప్రశ్నలేసి అవతలి వ్యక్తికి పిచ్చేక్కించే పాత్రని కనుగొన్న ముళ్ళపూడి వెంకటరమణగార్కి నమస్కరించి, ఫోటో దొంగిలించి బయటపడ్డాడు.

 

    ఆనందం తెలివితేటలకు ఆంజనేయులు పిచ్చెత్తిపోయి చూశాడు.


                                                   *    *    *    *

 Previous Page Next Page