Previous Page Next Page 
అశ్వభారతం పేజి 20


    పనిలోకి వెళ్ళబోతున్నా భార్యవేపు చేతులు చాపుతా కాంక్షగా చూసాడు చక్రవర్తి.

    అర్ధం చేసుకున్న శారద క్షణంలో భర్త కౌగిలిలో వాలిపోయింది. అతని కదలికలకు అనుగుణంగా తన శరీరాన్ని తిప్పుతూ అరగంట తరువాత లేచి విడిన జుట్టు ముడివేసుకొని మంచం దిగుతూ భర్త పెదాలమీద సుతారంగా ముద్దెట్టుకొని, మంచం మధ్యకి వచ్చిన దిండును తలక్రింద సర్ది ఫాన్ గాలి తగిలేలా తిప్పి, వెళ్ళనా అన్నట్లు భర్తవేపు చూసి, ఆ సంజ్ఞ భర్త నుంచి రాగానే బాత్ రూమ్ వేపు వెళ్ళింది తృప్తిగా.


                           *    *    *


    1.30 అయింది. ఎండ తీవ్రరూపం దాల్చింది అప్పటికే, ఈ ఎండ, ఏ వానా....తుఫాను ఏం ఆపగలదు? రేస్ క్లబ్ ఫస్ట్ ఎన్ క్లోజర్ లో నుండి చీమల్లా బారులుతీరి వెళ్తున్నారు వంటర్స్.

    అటెండర్స్ దగ్గర్నుంచి ఐ.ఏ.ఎస్. ఆఫీసర్స్ వరకు_మిక్చర్ బండి వాడి దగ్గర్నుంచి కార్ల కంపెనీ ఓనర్ వరకు అందరూ కేటగిరీని బట్టి వారి వారి కౌలరీల్లోకి వెళ్ళిపోతున్నారు.

    ఫస్ట్ రేస్ కరక్టుగా 2 గంటలకు. 20 ఎకరాల్లో విశాలంగా, వృత్తాకారంలో నిర్మించిన రేస్ గ్రౌండ్.

    గ్రౌండ్ లోపల అంచుల్లో గుర్రాలు పరిగెత్తేందుకు నిర్మించిన ట్రాక్. ఆ పక్కే కారు వెళ్ళగలిగేంత వైశాల్యంతో మరో ట్రాక్.

    గ్రౌండంతా సందడిగా ఉంది.

    గ్రౌండ్ కి ఆనుకొని ఉన్న రేస్ క్లబ్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ లో హార్సెస్ ఓనర్స్. ట్రైనర్ లు జట్లు జట్లుగా విడిపోయి గుసగుసలాడుకుంటున్నారు.

    ఫస్టు రేస్ లలో పాల్గొనే గుర్రాలు, వాటి జాకీలు ఓ ప్రక్క సిద్ధంగా ఉన్నాయి.

    గ్రౌండ్ మధ్యలో, ట్రాక్ కి దగ్గర్లో మూడు నిలువుల ఎత్తులో రిజల్స్ బోర్డు నల్లగా పంటర్స్ అదృష్టాలకి ప్రతిబింబంగా.

    పంటర్స్ ఉత్కంఠతో క్షణాల్ని కూడా లెక్కిస్తున్నారు. తమ సెలక్షన్ ఏమవుతుందోనని ఆందోళన.

    రెండువారాలుగా కష్టపడి రేస్ బుక్ దగ్గర పెట్టుకొని, రేసుల్లో పాల్గొనే గుర్రాల పెడిగ్రి, గతంలో వాటి వేగం, వయస్సు, దాన్ని పరిగెత్తించే జాకీ, అతని బరువు, అతను గతంలో గెల్చిన వివరాలు, అతని ట్రైనర్, హార్స్ ట్రైనర్ వివరాలు, అతడు టైవింగ్ ఇచ్చిన గుర్రాల వివరాలు, అప్పటివరకు అతను ఎన్ని గుర్రాలు గెలిపించాడు అనే వివరాల్ని క్షుణ్ణంగా మదించి ఎంచుకున్నా సెలెక్షన్ ఏమవుతుందోనన్న ఆందోళన__టెన్షన్__

    అదో ప్రపంచం....ఆశా ప్రపంచం....అద్భుత ప్రపంచం.... నా దగ్గరకొస్తే జాగ్రత్త. నాశనమవుతావని చెబుతూనే ఆకర్షించే మాయా ప్రపంచం....

    ముప్పై ఎకరాల ఆవరణలో....కట్టుదిట్టమైన ప్రహరీగోడల మధ్య చట్టపరిధిలో.... చాపక్రింద నీరులా.... ఎందరో ఆశాజీవుల పేరాశ సమాధులకు పునాదిరాళ్ళను అందిస్తూ....

    సరిగ్గా 1.55కి ఓనర్స్ గాలరీలోకి వచ్చాడు శశాంక. సరీగ్గా అదే సమయానికి శుక్రాచార్య పంటర్స్ గేలరీలోకి ఎంటర్ అయ్యాడు.

    ఎనౌన్సింగ్ రూమ్ నుంచి గేలరీల్లోకి కనెక్షన్ ఇచ్చిన మైకులు గరగరమన్నాయి,

    పంటర్స్ ఎలర్ట్ అయిపోయి చెవులు రిక్కించారు.

    ఆఖరుగా భరత్ "జాకీ వెయింగ్ మెషిన్" మీంచి దిగాడు.

    ఫస్ట్ రేసులో పాల్గొనే ఏడుగుర్రాల్ని వాటి జాకీలు ఎక్కి కూర్చున్నారు.

    భరత్ పట్టుదలగా ఉన్నాడు. ఎలాగైనా ఫస్ట్ రావాలని.

    అప్పుడు తన గురువు అనంత్ చెప్పే పాఠాల్ని, మెలుకువల్ని గుర్తుకు తెచ్చుకుంటున్నాడు.

    తను ప్రస్తుతం ఎక్కింది కింగ్స్ గర్టు_ఉత్తమజాతి అశ్వం. చాలా ఇరిటేటివ్_ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా మొరాయించవచ్చు. గేంపింగ్ లోనే తన అంచనాలకి అనుగుణంగా పరిగెత్తించాలి.

    జీవితంలో పాల్గొనే మొదటి రేసు అనే టెన్షన్ కి తోడు శశాంకి కోరిక__    

    ఇవి గెలిస్తే శశాంకి చాలా రకాలుగా తనమీద నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకంతో చాలా పనుంది.

    ఎనౌన్స్ మెంట్ మొదలయింది.

    "ఫస్ట్_ఫస్ట్ రేస్

    ది వెల్ కమ్ ప్లేట్

    రూ. 18,000 టుది విన్నర్

    రూ. 7,200 సెకండ్ విన్నర్

    రూ. 3,600 థర్డు విన్నర్

    క్లాసు టూలో ఉన్న హార్సెస్ కి అర్హత

    దూరం 1400 మీటర్సు....

    ఎనౌన్స్ మెంట్ అయిపోతుండగా ఏడు గుర్రాల్ని హుందాగా నడిపించుకుంటూ వచ్చి 5 మీటర్ల వెడల్పున్న రేస్ బిగినింగ్ పాయింట్ వద్ద వరుసగా నిల్చోబెట్టారు జాకీలు.

    పంటర్స్ లో కోలాహాలం.... చప్పట్లు....ఈలలు. ఎవరుకాసిన పందెం గుర్రం పేరు వారు ఉచ్చరిస్తూ....పెద్దగా కేకలు.

    శుక్రాచార్య తలతిప్పి ఓనర్స్ గేలరీవేపు చూసాడు. శశాంక ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తూ కనిపించాడు. పక్కనే ఆ రోజు అబిడ్స్ వచ్చి తనను కారులో తీసుకెళ్ళిన యువతి.   

    చిరుమందహాసం చేశాడు శుక్రాచార్య.

    ఆనందరావు ఆనందంగా కింగ్స్ గార్డు మీద ఆసీనుడై ఉన్న భరత్ వేపు చూస్తున్నాడు.

    ఒక్కొక్క క్షణం దగ్గరవుతోంది.

    అందరూ ఊపిర్లు బిగబట్టారు. చూపులన్నీ గుర్రాలపైనే.... మరికొద్ది క్షణాల్లోనే అదృష్ట దురదృష్టాలు తేలిపోతాయి.

    గ్రౌండ్స్ లో ఉన్న ప్రతి ఒక్కరిలో ఏదో ఉత్కంఠ, ఉద్రిక్తత.... ఆందోళన.... ఆశ.... ఆనందం....

    ఎనౌన్స్ మెంట్ కంటిన్యూ అవుతూనే ఉంది.

    రిజల్స్ బోర్డుమీద ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా వివరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

    జాక్ పాట్ రేసెస్: 1, 3, 4, 5, 7.

    (జాక్ పాట్ ఆ రోజు ఉన్న ఏడు రేసుల్లో ఐదు రేసుల్ని క్లబ్ కి చెందిన బోర్డ్ ఆఫ్ స్టే వార్డ్సౌ నిర్ణయిస్తుంది. ఆ ఐదు రేసుల్లో ఫస్టు వచ్చే గుర్రాల్ని గుర్తించగలిగి పందెం కాస్తే_జాక్ పాట్ కోసం పూల్ అయిన బెట్టింగ్స్ మొత్తాన్ని ఇస్తారు. ఎక్కువమంది ఈ కాంబినేషన్ మీద కాస్త టోటల్ పూల్ ఎమౌంట్ ని అందరికి సమంగా పంచుతారు. ఇది సాధారణంగా టోటల్ బెట్టింగ్స్ ని బట్టి ఉంటుంది, హైద్రాబాద్ అయితే జాక్ పాట్ ఎమైంట్ సాధారణంగా 40,000 నుంచి 1,25 వేల దాకా ఉండవచ్చు. అదే బొంబాయిలో లక్షల్లో ఉంటుంది. జపాన్, ఆమెరికాలాంటి దేశాల్లో మిలియన్స్ లో వుంటుంది.

    జాక్ పాట్ పూల్ 80 వేలు.

    (ఎంత ఎమౌంట్ పూల్ అయిందనేది రేస్ కి ముందే క్లబ్ వివరాలు అందిస్తుంది.)

    ట్రిఫుల్ 1,3,4

    ట్రిపుల్ టోటల్ పూల్ 30 వేలు.

    (ద్రిపుల్; ఆ రోజు వున్న ఏడు రేసుల్లో మూడు రేసుల్ని ట్రిఫుల్ కి క్లబ్ నిర్ణయిస్తుంది. ఈ మూడింట్లో మాత్రమే ఫస్టు వచ్చే గుర్రాల్ని గుర్తించి పందెం కాస్తే ట్రిపుల్ అవుతుంది)

    తనాలా

    తనాలా టోటల్ పూల్ 25,000

    [ఒక రేసులోనే ఫస్టు, సెకండు, థర్డు వచ్చే గుర్రాల్ని గుర్తించి పందెం కాయటం]

    విన్....

    విన్ 20 వేలు.

    [ఒక రేసులో ఫస్టు, సెకండ్]

    క్వినిల్లా....

    క్వినిల్లా 15 వేలు....

    [ఒక రేసులో రెండు గుర్రాల్ని గుర్తిస్తే వాటిల్లోనే ఏదో వకటి ఫస్టు మరొకటి సెకెండ్ రావాలి]

    పంటర్స్ కి బోర్డుమీద కనిపించే ఈ మొత్తాలు కళ్ళు జిగేలుమనిపించేలా చేస్తున్నాయి.

    2.00 అయింది.

    గేట్స్ ఓపెన్ అయ్యాయి. అంతే అప్పటివరకు కళ్ళాలు బిగించి ఆపుతున్న జాకీల చేతుల్లోని గుర్రాలు సర్రున ముందుకు దూకాయి.

    సంధించిన బాణాల్లా విన్ పోస్టువేపు దూసుకుపోతున్నాయి.

    కమాన్....కమాన్....కింగ్ గార్డ్ 

    కమాన్....సింథిల్ ...కమాన్

    కమాన్....స్నైర్....కమాన్

    కమాన్__లెండర్స్__లెండర్స్ కమాన్

    కమాన్__ప్రిన్స్__ప్రిన్స్ కమాన్__ఐ__సే__

    గ్వాలియర్ .... కమాన్ ...ప్లీజ్ కమాన్....

    రాబిన్ సన్ క్రూసో.... కమాన్.... కౌండ్లీ కమాన్....

    ఎవరి గుర్రాల పేర్లతో వాళ్ళు__

    కేకలు....

    అభ్యర్ధనలు....

    ఆకాంక్షలు....

    అర్థింపులు....

    మమ్మల్ని గెలిపించవా....!

    అప్పనంగా వచ్చే డబ్బు ఇప్పించవా....?

    రెపరెప లాడుతున్న ఆశ....అరుపులు గేలరీ హోరెత్తేలా కేకలు....

    రెండొందల మీటర్స్__400మీటర్స్....600మీటర్స్ 1000మీటర్స్ 1200మీటర్స్ 1400మీటర్స్ (విన్ పోస్టు)

    ట్రాక్ పొడవునా నిలబెట్టిన డిస్టెన్స్ స్టాండ్స్....ముందు 209మీటర్స్ ని తమ గుర్రం దాటిందా....వేరేదా....? ఇలా ప్రాణాలు బిగబట్టి....ఓ ప్రక్క అరుస్తూ....లేచి నిలబడి.... తామే పరిగెడుతున్నంత ఫీలింగ్ పంటర్స్ లో.

    ముందు సింథిల్.

 Previous Page Next Page