భర్త అప్పుడప్పుడు "మనం మంచి ఇల్లు కట్టుకోవాలి" టీ.వీ, వి.సి.ఆర్....స్టీరియో ఏ.సి. బెడ్ రూమ్....ఉంటే బావుండును కదా....అంటుంటాడు.
అప్పుడే భయమేసేది శారదకు.
ఆదాయానికి, ఆశలకి పొంతన ఉంటే అంతగా భయపడక్కర్లేదు. తన జీతం అవిపోను వెయ్యి తన భర్తకి పదకొండు వందలు. నెలకు వచ్చే 2100తో, ఇద్దరు పిల్లలతో అవన్నీ ఎప్పటికి తీరేను....?
వాటి గురించి అదే పనిగా ఊహా సౌధాలు నిర్మించుకుంటున్న తన భర్త ఎప్పుడన్నా ఏదైనా ప్రలోభాలకు లోనైతే....? లంచమంటు ఎరుగని భర్త దానికి పాల్పడితే....ఇప్పుడు తాము అనుభవిస్తూన్న తృప్తి ఉంటుందా....?
వీటికి తోడు ఈ మధ్య పక్కింటి ఆనందరావుతో తిరుగుతున్నాడు. తిరగటం స్నేహమని సరిపెట్టుకున్నా, అతనికున్న రేసెస్ పిచ్చి పట్లే తన భయం.
ఎప్పుడూ ఆ పాటికి స్నానం చేసి తెల్లతెల్లచీర కట్టుకొని, మల్లెపూలు పెట్టుకుని భర్తకు అందంగా రతీదేవిలా కనిపిస్తూ చక్రవర్తిని మయమరిపించే శారద ఈ రోజు దిగులుగా. దేన్నో కోల్పోతున్నదానిలా. పొద్దుటి నుంచే ఏమీ తినకుండా పిచ్చిదానిలా భర్తకోసం ఎదురుచూస్తూ అలాగే కూర్చుండిపోయింది.
సరిగ్గా ఇదే సమయంలో చక్రవర్తి ఆనందరావుతో కలిసి అబిడ్స్ లో వున్న బుక్ మేకర్ దగ్గరున్నాడు.
(బుక్ మేకర్. ఇతన్ని క్లబ్ ఆఫీషియల్ గా నియమిస్తుంది. అందుకు గాను ఇతని దగ్గరకు పంటర్స్ (పందెం కాసేవాళ్ళు) వచ్చి రాబోయే రేసుల్లో ఏ గుర్రం ఫస్ట్ వస్తుందో, ఏది సెకండ్ వస్తుందో చెప్పి బెట్ ఎమౌంట్ ఇచ్చేసే అతను పంటర్ చెప్పిన నెంబర్లు నోట్ చేసి ఇస్తాడు. ఈనోట్ చేయటం అనేది ఈ మధ్య సాఫ్ట్ వేర్ కంప్యూటర్స్ ద్వారా చేస్తున్నారు. ఇక తరువాత పంటర్స్ రేస్ క్లబ్ కి వెళ్ళి తమ అదృష్టాల్ని పరీక్షించుకుంటారు)
బుక్ మేకర్ నిరంజన్ లోనగదిలో పెద్ద పంటర్స్ తో మాట్లాడుతున్నాడు. చక్రవర్తి, ఆనందరావు ఎదురుచూస్తూ కూర్చున్నారు బయట హాల్లో.
(హైదరాబాద్ రేస్ క్లబ్ కి 30మందిదాకా అఫీషియల్ బుక్ మేకర్స్ వున్నారు. బుక్ మేకర్ కావటానికి కొన్ని లక్షలు ఖర్చుపెట్టినవారున్నారు....ఆ తరువాత వాళ్ళు కోటీశ్వరులవుతారు గనుక. ఈ సంఖ్య క్లబ్ క్లబ్ కి టోటల్ పంటర్స్ సంఖ్యనుబట్టి, బెట్టింగ్స్ నిబట్టి మారుతుంది)
"రోట్లో తలపెట్టి రోకలికి దడిస్తే ఎలా....?" అన్నాడు ఆనందరావు భయపడుతున్న చక్రవర్తి వీపు నిమురుతూ.
రోట్లో తలపెట్టడం అనేదాన్ని రేసెస్ తో పోల్చినప్పుడన్నా చక్రవర్తి స్పృహలోకి రాలేదు.
చక్రవర్తి భయపడితే ఏమవుతామో అన్నది కాదు. ఆ భయాన్ని ఆనందరావు క్రమంగా పోగొడుతూ వచ్చాడు. నీవు కోరుకొనే విధంగా గెలిచి ఇల్లు కట్టుకోవచ్చు. టీ.వి కొనొచ్చు__లాంటివి చెబుతూ. అతని భయమల్లా భార్యపట్ల.
అది కూడా భయంకాదు. గిల్టీ, తననంతగ ఆనందపర్చే తన శారద_తనను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే తన భార్య_ తనకే కష్టం వచ్చినా విలవిల్లాడిపోయే తన బెటరాఫ్_ఏదీ దాచకుండా ఒకరికి ఒకరు చెప్పుకునే తమ జంట అలాంటిది తన భార్యకు చెప్పకుండా, వెయ్యి రూపాయలు ఇంట్లోంచి తీసుకురావడం_ వీటిపట్లే గిల్టీ.
ఇదే అభిప్రాయాన్ని ఆనందరావు దగ్గర వ్యక్తపర్చినప్పుడు.... నీ భార్యకు ఆ డబ్బుతో రెండు రోజులదాకా అవసరం రాదని నీవే చెబుతున్నావు. ఈ లోపు రేస్ ఆడి ఓ లక్ష గెలిస్తే ఆ వెయ్యి యధాస్థానంలో పెట్టవచ్చు....అన్నాడు.
మరి 99వేలు ఎక్కడివని అడిగితే....?
"లాటరీలో వచ్చిందని చెప్పు"
"లాటరీ టిక్కెట్ ఎప్పుడూ కొనరుగా?
చిల్లరలేక మొన్ననే కొన్నాను.
చిల్లర అవసరం ఏం వచ్చింది....?
వక్కపొడి కోసం.
అదేమిటి అది తినరుగా!
నోరు బాగోలేక తినాలనిపించింది.
నోరెందుకు బాగోలేదు....అంటూ ఆందోళన పడితే....
జ్వరంగా వుందను.
అమ్మో నాకు జ్వరమంటే తను ఏడుస్తుంది.
"నీకు పెళ్ళామంటే ప్రేమ. అదెంత ప్రేమంటే నీకు నిజంగా జ్వరమొచ్చినా నీ భార్యకు చెబితే అల్లాడిపోతుందని దాచేసేంత ప్రేమ. కాని డబ్బు కావాలి. అదీ త్వరగా....అన్నీ ఒక్కసారి కొనుక్కొనేంత త్వరగా ఆ కొనాలనుకోవటంలో మరలా నీకు నీ భార్యమీద ప్రేమ వాటి ద్వారా నీ భార్యను మరింత సుఖపెట్టాలని....వీటన్నిటి అడుగున మరలా ఆశ....ఎలా....?
హఠాత్తుగా లక్షాధికారిని కావాలంటే ఈ భయాలు, కంగార్లు ఉండకూడదు.
"కాని ఐదు అబద్ధాలు ఆడాలి__"
"మరి ఎలా....నీ భార్య బాధపడకూడదు. నీకు డబ్బు కావాలి. అవునా?"
"అవును."
"అయితే రోజులో కొంతకాలం, వారంలో రెండు రోజులు నెలలో ఎనిమిది రోజులు, సీజన్ లో ఓ 30 రోజులు. నీ భార్యను మర్చిపో.... భార్య పట్ల నీ ప్రేమను తగ్గించుకో."
చక్రవర్తి మవునం....
ఆ మౌనం వెనుక తప్పు చేస్తున్నానేమోనన్న గిల్టీనెస్.... గెలిస్తే తన ఆశలన్నీ నెరవేరతాయనే పేరాశ....
మనిషి కదా మౌనమే గెలుస్తుంది. ఆ మౌనంతో బలహీనతల పట్ల మొగ్గు.
ఇవి మధ్య తరగతి మిధ్యాజీవుల మౌనాలు....పతనానికి సోపానాలు. నిజంగా స్వర్గానికే తీసుకెళుతున్నామనే భ్రమింపజేసే సోపానాలు.
లోపలున్న బుక్ మేకర్ నిరంజన్ వచ్చేలోపే చక్రవర్తి కంగారుగా లేచి బయటకొచ్చాడు. అతని వెంటనే ఆనందరావు రాక తప్పలేదు.
ఆనందరావు నచ్చజెప్పినా చక్రవర్తి వినలేదు. "నీ యిష్టం అదృష్టదేవత పిలుస్తున్నా వెళ్తున్నావా.... రేపు కింగ్స్ గార్డ్ అనే గుర్రం గెలిచి తీరుతుంది. నా సెలక్షన్ ఎప్పుడూ తప్పదు. కింగ్స్ గార్డు ఫెంటాస్టిక్ హార్స్. దాని జాకి భరత్ కూడా. నీ యిష్టం అదృష్టాన్ని అరంగుళంలో జారవిడుచుకుంటున్నావ్...." అన్నాడు ఆనందరావు.
నీ సెలక్షన్ అంత గొప్పదయితే ఇప్పటికి రెండు ఇళ్ళు ఎందుకమ్మావ్ అని అడిగే స్థితిలో లేడు చక్రవర్తి.
వడివడిగా వచ్చి స్కూటర్ ఎక్కాడు.
"ఎక్కడికెళ్ళారు? నాకెంత కంగారుగా ఉందో? మీకేమయిందోనని హడలి పోతున్నాను. కనీసం ఫోన్ అన్న చేయవచ్చుగా...." అంటూ తన గుండెలమీద వాలిపోయి వెక్కిళ్ళుపడుతున్న భార్యను చూసి తనూ ఏడ్చాడు లోలోపలే చక్రవర్తి.
కన్నతల్లిగా పెద్దాడ్ని వదిలేసి ఎక్కడికెళ్ళారు అని అడగలేదు.
బాధ్యత లేకుండా పోయిందేం అని గృహిణిగా మందలించలేదు.
డబ్బులేం చేశారని ప్రశ్నించలేదు.
మీకేమయిందని ఆందోళన ఏమీ కాకుండా క్షేమంగా ఇంటికి తిరిగొస్తే చాలనే ప్రార్ధన.
భర్తతో ఆకలితో తన ఆకలి.
భర్త కష్టాలలో పాలు....
భర్త బాధలతో భాగం....
పంచుకునే భార్య....
భార్య.
కనీసం ఈ పదానికి నిర్వచనం చెప్పగలడా తను.
నీళ్ళు కాయటం, బాతురూమ్ లో పెట్టడం, స్నానం చేసిరాగానే టిఫిన్ సిద్ధంచేసి దగ్గరుండి తన చేతులతో తినిపించింది. ఆ తినిపించటంలో ఎంతో కాలంగా దూరమయిన కొడుకు దొరికాడన్న సంబరం. పెద్ద ప్రమాదంలో ఇరుక్కుని క్షేమంగా తిరిగొచ్చాడన్న ఆనందం.
ఈ సంబరానికి ,ఆనందానికి లాజిక్ ఉండదు.
ప్రతిచర్యకు లాజిక్ ఆలోచించే మనిషి ఈ ప్రేమలో, అనుబంధంలో మాత్రం ఆలోచించడు. ఇక్కడ లాజిక్ కన్నా వేరే తృప్తి ఇస్తాయి గనుక.
టిఫిన్ పూర్తయ్యాక చిన్నపిల్లాడి నోరు తడిచేత్తో తుడిచినట్లు భర్త నోరును తుడిచి నేప్ కిన్ తో అద్దింది శారద.
ఆ పొంగిపొర్లే ప్రేమలో భర్త తన తిండి గురించి అడగలేదేం అనే ప్రశ్న ఉదయించలేదు శారదకు.
చక్రవర్తి మంచం ఎక్కాడు.
శారద బట్టలు ఉతికేందుకు భర్త విడిచిన ఫ్యాంట్ జేబుల్లో పేపర్స్ తీయబోయింది. అప్పుడు తగిలాయి వెయ్యిరూపాయలు!
వాటివేపు ఆశ్చర్యంగా చూస్తూ "డబ్బు ఇవ్వకుండానే తెచ్చారేం?" అంది అమాయకంగా.
కంగారుపడ్డాడు చక్రవర్తి. మంచంమీద లేచి కూర్చున్నాడు. ఏం చెప్పాలో తోచలేదు ఓ క్షణం.
ఆ క్షణంలో చేయబోయిన తప్పు, చెప్పిన అబద్ధాలు బయటపెట్టినా క్షమించగలిగేంత సౌమ్యురాలు. ఇది తెలిసినా బయటపడేందుకు ప్రయత్నించని బలహీనత.
"అవా....అవి....నేను వెయ్యి ఇచ్చాను. ఆ తరువాత మధ్యాహ్నం. ఓ అరగంట రిలాక్స్ అవుదామని ఫ్యాంటు విడిచి వాడి లుంగి కట్టుకొని అనుకోకుండా ఓ కునుకుతీశాను. ఈ లోపు వాడికి డబ్బు వచ్చి ఉంటుంది. ఆ వెయ్యి మరలా నా జేబులో పెట్టుంటాడు...." చాలా తేలిగ్గా చెప్పాలనుకున్నాడుగాని ఏదో జంకు-నమ్మిందా లేదా అనే సందిగ్ధత.
ఉత్తమ ఇల్లాలిపట్ల ఎలాంటి అబద్ధమైనా చెల్లుతుంది. సందిగ్ధత సమస్యలేదని తరువాతగాని తెలుసుకోలేకపోయాడు. (ఈ మాట సరికాదేమో....తెలుసుకోగలిగాడు అనేదే కరక్టు పదం)
శారద నమ్మేసింది.