విష్ణుమూర్తి దగ్గర అసిస్టెంట్లు ఎవరూలేరు. ద్వారాపాలకులు మాత్రం నిల్చునే నిద్రపోతూ తూలుతూ కాపలా కాస్తున్నారు.
వాళ్ళని ఆడగా పెట్టకుండానే ఆడవాళ్ళంతా లోపలికి వెళ్ళారు, పుట్టింటికి వెళ్ళినంత చనువుగా.
ముందే వాళ్ళంతా నిర్ణయించుకున్న ప్రకారం గజలక్ష్మిని ముందుకి నుంచోబెట్టారు.
గజలక్ష్మి పేరుకేకాదు ఆకారంలోను అంతే గజలక్ష్మి పసితనంలో వాళ్ళ అమ్మ నాన్న ముద్దుగా "గున్నూ! గున్నూ!" అని... "గజం...గజం" అని పిలిచేవాళ్ళు.
గున గున నడిచేది. అందుకని ముద్దుగా గున్ను అయింది. ఆ తర్వాత....తర్వాత...
గజగమనంతో నడిచేది. అందుకని "గజం!" అయింది.
గజలక్ష్మి కి ఓ అర్భకుడితో పెళ్లయింది. అతగాడు ఆకారంలో మరీ దర్భపుల్లలాగా వుంటాడు. అయితేనేం ఎంతయినా మగవాడు. ఒక ఆడదానికి మొగుడు అది చాలు వాడి ముఖానికో అర్హతగా.
"భారీగా కట్నం వస్తుందనిగజలక్ష్మిని పెళ్ళాడాడు. భర్త అయిం తర్వాత బాధాపూరితమైన భారీభారీ డైలాగులు పేలుతుండేవాడు.
"బాగా మందుకూరిన పెద్దసైజు చిచ్చుబుడ్డిలాగా వున్నావ్!" అంటూ అంగుళంసైజు సీమ టపాకాయలాగా గజలక్ష్మి మీద ఎగిరెగిరి పడేవాడు.
గజలక్ష్మి సహనవంతురాలు. ముఖంలో అమాయకత్వం చిరునవ్వు. లావు విషయం పక్కన పెడితే ఒక విధంగా అందంగానే ఉంటుంది.
గజలక్ష్మి మొగుడి ముఖం అలాకాదు. బొమికలమీద చర్మం కప్పిన అవతారం తోడు-నిప్పుమీద ఉప్పుపోసి చల్లినట్లు చిటపట లాడుతుంటుంది- "బాగున్నారా! ఇంట్లో అంతా కులాసానా?" అని ఎవరయినా అడిగితే "కులాసానే ఇంకా ఎవరూ చావలేదు-చాలా ఇంకా ఏమయినా సమాచారాలు కావాలా!" అంటూ ధుమ ధుమ లాడి పోతాడు.
అలాంటి మొగుడుతో కాపురం చేసి పిల్లల్నికంది. కాకపోతే అయిదుగురిని కంటే ఆ అయిదుగురు ఆడపిల్లలయారు గజలక్ష్మి తప్పుకాదే!
తరచు గజలక్ష్మి మొగుడు దుర్వాస మహామునిలా ధుమ ధుమ లాడుతూ "ఆడముండల్ని కనటం తప్ప ఒక్క మగ నలుసుని కనటం రాదా! చెప్పుకోవటానికి వున్నావ్. నా భార్య గజేంద్రమ్మ" అని అనేవాడు.
తన భారీకాయాన్ని అవలీలగా మోసే గజలక్ష్మి ఎంత చెడ్డా భర్త కదాని ఆ మాటల్ని తేలిగ్గా తీసుకునేది. అదే మరొ ఆడదయితే మరొ గయ్యాళి గంగమ్మ అయినా "ఒక్క మగ నలుసు నా కడుపున పడేయటం చేతకాని నీవేం మొగుడివి" అంటూ తనుకూడా మాటలతో ఎదురుదెబ్బ తీసేది కాని ఆమె అలాంటిమాట పొరపాటున కూడా కలలో కూడా అనుకోలేదు.
భర్తతో ప్రాణం విసిగి వేసారిపోయిం తర్వాత ఇప్పుడు ఆడాళ్ళ సంఘంలో చేరి వాళ్ళతోబడి ఇక్కడిదాకా వచ్చింది.
గజేంద్రమోక్షం గుర్తుకొచ్చిన లీడర్ లీలారాణి తెలివిగా ఆమెను విష్ణుమూర్తిముందుకు తోసింది.
ఆమె ఏడుపు స్వరంతో దీనాతిదీనంగా పాట ఎత్తుకుంది-
లావొక్కింతయులేదు. దైర్యంబు విలోలంబయ్యె-
స్త్రీలంతా థావుల్ తప్పె కష్టాలలో విలోచితులై-
ఇచట కేతెంచితిమి నీవే మాకు దిక్కుమొక్కు-
అన్నియున్ రక్షించుమా! కృష్ణా! విష్ణూ! అన్నా!...
గజలక్ష్మి పాట ఆపుజేసి రొప్పుతూ ఉండిపోయింది.
అలనాటి గజేంద్ర మోక్షంలో గజేంద్రుడి మొర ఆలకించి విష్ణుమూర్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈ నాటి గజలక్ష్మి గానం విని విష్ణుమూర్తి కరిగి నీరై దీనంగా తలఎత్తి చూశాడు.
ఆయన తల ఎత్తడమే ఆలశ్యంగా అందరు ఒక్కసారిగా కూడబలుక్కున్నట్టు నమస్కారం పెట్టేశారు.
"ఏమిటి కాంతామణులారా! ఇందరు ఒక్కసారిగా ఏదో దండయాత్రకొచ్చినట్లు ఇక్కడికొచ్చి పడ్డారేంటి? నగలు కావాలంటే లక్ష్మీ దేవి వుంది. సాహిత్యం కావాలంటే సరస్వతీదేవి వుంది. నాతో మీకేం పని? కొంపదీసి ఎ కృష్ణావతారమో ఎత్తమనరు కదా! అంత ఓపికా, సమయము నాకు లేవు" మొహమాటం లేకుండా చెప్పేశాడు విష్ణుమూర్తి.
"మీరు మాకోసం ఏ అవతారమూ యెత్తక్కరలేదు. మా కష్టాలు కోరికలు విన్నవించుకుని వరాలు పొందటానికి వచ్చాం"
చాలా దీర్ఘంగా ఆలోచించి "అట్లాగా?" అన్నాడు విష్ణుమూర్తి.
విష్ణుమూర్తి తన కాళ్ళు తనే వత్తుకోవడం చూసి అప్పల నరసమ్మకి ఓ అనుమానం వచ్చింది.
"అదేంటి స్వామీ! మీ కాళ్ళు మీరే వత్తుకుంటున్నారు? ఇదివరకు మీరు పాలసముద్రంపై శేషతల్పంమీద పవ్వళించి వుంటే శ్రీమహాలక్ష్మీ మీకాళ్ళు వత్తుతూ వుండేదికదా! ఇప్పుడేంటి మీకాళ్ళు మీరే వత్తుకుంటున్నారు?" అని అడిగేసింది.
"కాంతామణీ! ఈ సృష్టి కడు విచిత్రమైనది. ఏ నిమిషాన ఎవరి బ్రతుకులు ఎలా మారిపోతాయో తెలీదు మానవుడయ్యేది దేవుడయ్యేది కష్టాలు అందరూ సమానంగా పడాల్సిందే దేవతలు కష్టాలుపడ్డ కథలు లేవా! దేముళ్ళు కష్టాలుపడ్డ గాధల్లేవా.
పూర్వం ధనం విషయంలో కొందరు మాత్రమే కొన్ని కోరికలు మాత్రమే కోరేవారు. ఇప్పుడలాకాదు. నల్లధనం విపరీతంగా పెరిగిపోతున్నది. ఉన్న ధనం చాలక ఇతర దేశాలనుంచి బంగారపు బిస్కెట్లు కోటానుకోట్లు దొంగచాటుగా వచ్చిపడుతున్నాయ్. ప్రతివాళ్ళు పదిపైసలు వస్తాయంటే చాలు అడ్డదారుల్లో అడ్డమైన పనులు చేయడమే.
దానాదీన నా లక్ష్మికి క్షణం తీరుబడి లేకుండా వుంది. ఇంక నా కాళ్ళేం నొక్కుతుంది?" అంటూ విష్ణుమూర్తి చూచాయగా మాటలద్వారా తన గోడుని వెళ్ళబోసుకున్నాడు.
'ఆయన కళలు ఆయన వత్తుకుంటే తనకేం బాధ' అనుకున్న లీడర్ లీలారాణి 'తాము ఎందుకొచ్చింది' వివరంగా చెప్పింది. పైగా అందరు దేముళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చిన సంగతి కూడా పనిలో పనిగా చెప్పేసి-
అవసరానికి మోహిని అవతారం ఎత్తారు మీరు. ఆపద సమయంలో సుదర్శన చక్రం ఎన్నోసార్లు అడ్డువేశారు మీరు. ద్రౌపది సంరక్షణకోసం చీరల తానులన్నిటినీ ఒక్కసారిగా మీ దగ్గరికి రప్పించుకున్నారు.
మేము "కృష్ణా" అన్నా "రామా" అన్నా "విష్ణు" అన్నా ఆఖరికి "అన్నా" అన్నా పలికేది మీరే. మా కోర్కెలు తీర్చేది మీరే. మా కోర్కెలు తీర్చండి. మాకు వరాలివ్వండి" గడగడ లొడలొడా మాట్లాడేసింది.