"అచ్చమ్మా!" అని పిలిచేదే "అమ్మాయిగారు!" అన్న మాట విని అక్కడ వున్నవాళ్ళు తన గురించే మాట్లాడుకుంటున్నారని ముఖ్యంగ గుసగుసలాడుతూ రహస్య సమావేశమై ఏదో గూడుపుటాని చేస్తున్నారని గ్రహించి పద్మిని నెమ్మదిగ అటుకేసి నడిచి చెట్టు చాటు చేసుకొని వాళ్ళ మాటలు వింటూ నుంచుంది.
ఎలమందయ్య, అచ్చమ్మగాక మరి కొందరి గొంతులు వినబడుతున్నాయి. వాళ్ళు గాక ఇద్దరు ముగ్గురు వున్నారని కొత్త గొంతులను బట్టి పద్మిని గ్రహించింది. చెవి ఒగ్గి వినసాగింది.
వాళ్ళ మాటలు యిలా సాగుతున్నాయి.
"అవును అవి అన్ని దేశాలు లాంటివి కావు. గల్ఫ్ దేశాలని అంటారు. వారికి బోలెడు డబ్బుంటుంది. అందమైన ఆడపిల్లని కొనటానికి ఎంత డబ్బయినా ఖర్చు పెడతారు"
"వారి దేశంలో ఆడపిల్లలుండరా మామా!" ఆ గొంతు అచ్చమ్మది.
"చెపుతుంటే వినుకోక మద్దెలో పిచ్చి పెశ్న లేంటే పిచ్చి మొగమా?" ఎలమందయ్య మందలింపు.
"ఆడపిల్లలు వుంటారు. కాని తక్కువమంది ఆడపిల్లలు, యెక్కువమంది మగవారు వుంటారు. అందుకే మనదేశం ఆడపిల్లలని కొనటం...
"అమ్మాయిగారు ఇది పసిగట్టారంటే...!"
"పసిగట్టేటట్టు మనం చేస్తామేమిటి? అంతా గప్ చిప్ వ్యవహారం మీకెందుకు నేను చూసుకుంటాను గదా?"
"నా భయమల్లా అయ్యగారికి తెలిస్తే మనందరి కొంపలు మునుగుతాయని..."
"అయ్యగారికి యెలా తెలుస్తుంది! ఇక్కడ నుంచి కోపం వచ్చి వెళ్ళిపోయిందని చెపుతాము. రోజూ ఒక అబ్బాయి యిక్కడికొచ్చి అమ్మాయిగారిని కలిసి మాట్లాడేవాడని...వారిమధ్య ఇకఇకలు, పకపకలు సాగేవని అదని ఇదని నోటికొచ్చినట్లు చెప్పేద్దాం"
ఒకడు ఆ మాటలు అనంగానే రెండోవాడు అందుకున్నాడు.
"అమ్మాయిలని ఈ దేశంనుంచి పక్క దేశానికి తరలించే విషయంలో పోలీసులు సాయంకూడా మనకుంది. పెద్ద పెద్ద గూండాగాళ్ళున్నారు"
"గఫూర్ గాడు అమ్మాయిగార్ని ఇక్కడ చూడంగానే ప్లాన్ వేశాడు. బాగా డబ్బు రావాలంటే అమ్మాయిగారిలాంటి అందమైన అమ్మాయిలు వుండాలిట. వాడికెంత డబ్బు వస్తుందో, యెంతకి అమ్మేస్తున్నాడో మనకి తెలియదు. మనకి మాత్రం ఒక్కొక్కరికి పదివేలు యిస్తున్నాడు"
"ముందు డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళమను. ఆ గఫూర్ గాడు ఉత్త లఫూట్ గాడు"
"మీకాభయం అక్కర్లేదు. రేపు సాయంత్రం నీకో పదివేలు, మీ అయ్యకొక పదివేలు అందుతాయ్. దానితోపాటు చిన్నపొట్లం ఇస్తాడు. ఆ పొట్లంలో చిటికెడు తెల్లటి పౌడరు ఉంటుంది. ఆ పౌడర్ ని నీళ్ళల్లో కలిపిగాని, పాలల్లో కలిపిగాని లేక అమ్మాయిగారు తినే ఆహారంలో కలిపిగాని ఎలాగో అలా అమ్మాయ్ గారు తినేలా చూడ్డం నీ పని."
"ఆ పొగడరు ఏంటి?" అచ్చెమ్మ అడిగింది.
"అది చాలా పవర్ ఫుల్ మత్తుమందు. అది నోట్లో కెళ్ళింతర్వాత చచ్చేంత నిద్ర ముంచుకు వస్తుంది. ఆ పడుకోటం పడుకోటం మళ్ళీ ఉదయానికి గాని మెలుకువ రాదు."
"అప్పుడెలా? మెలుకువ వచ్చింతర్వాతనైనా జరిగిన మోసం తెలుసుకొని గోలచేస్తుంది గదా! మనందరి బతుకులు బైట పడ్తాయిగదా!"
"ఒసే అచ్చెమ్మా! నీకు పిచ్చి పిచ్చి ఆలోచనలు చాలానే వస్తున్నాయ్. నీకు చెప్పినా తెలిసి చావదు." వాళ్ళల్లో వకడు గసురుకున్నాడు.
"అర్ధమై చచ్చేలా చెప్పి చావకూడదేంటి?" అచ్చెమ్మ విసుగ్గా అంది.
"అమ్మాయ్ గారు మత్తుమందు తిని లేవకుండా నిద్రపోతారు గదా: అప్పుడు వాళ్ళొస్తారు. గప్ చిప్ గ భుజానేసుకొని పైన గొంగళి కప్పి గఫూర్ గాడొక్కడే వాడి ఆటోదాకా మోసుకెళ్తాడు. ఇక్కడ్నించి ఆటో వెళ్ళిపోతుంది. మధ్యలో అమ్మాయ్ గార్ని ఆటోలోంచి చిన్నకారులోకి మారుస్తారు. ఆ చిన్నకారు ఎక్కడి కెళుతుందో తెలుసా! ఎన్నో ఊళ్ళుదాటి అంచెలంచెలుగా ప్రయాణంచేసి బొంబాయి చేరుతుంది. ఈ లోపల అమ్మాయ్ గార్కి తెలివి రాకుండా వుండటానికి కార్లోనే మత్తు ఇంజెక్షన్లు ఇస్తారట. బొంబాయి తీస్కెళ్ళింతర్వాత అమ్మాయిలందర్నీ వాళ్ళకి రహస్యంగ వున్న వక యింట్లో దాస్తారట ఆ తర్వాత మంచి సమయం చూసి ఈ దేశం నుంచి పక్కదేశం పంపిచేస్తారు. మనకేమీ భయం లేదు. నువ్వు చెయ్యాల్సిందల్లా మత్తుమందు నీళ్ళల్లో వేసి అమ్మాయ్ గారి చేత తాగించడమే."
అచ్చెమ్మకి అన్నీ అనుమానాలే. "అమ్మాయ్ గారు తాక్కపోతేనో?" అంది.
"నేను, గఫూర్ వచ్చినప్పుడు ఆ విషయం మాతో చెబుతావు కదా! అప్పుడు మేము మత్తుమందు గుడ్డముక్కుకి చూపిస్తాం. అమ్మాయ్ గారు టప్పున తల వాల్చేస్తారు. చాలా! ఇంకేమైనా అనుమానాలున్నాయా!"
"అనుమానాలేం లేవులే. నాకిచ్చే పదివేల రూపాయల్లో వక్క పదిరూపాయలు తగ్గినా వూర్కోను." ఈ తఫా యలమందయ్య గొంతు స్పష్టంగ వినబడింది.
ఇంకా వాళ్ళమాటలు గుసగుసల రూపంతో సాగుతూనే వున్నాయ్.
ఇంక అక్కడవుండి వినదగ్గ మాటలేవీ కనిపించలేదు పద్మిని ప్రియదర్శినికి. చాలా వేగంగ ఇవతలకి వచ్చేసింది. మంచంమీద అడ్డంగా పడుకుండిపోయింది వస్తూనే.
జ్వరం సంగతి మర్చిపోయింది. చలి సంగతి మర్చిపోయింది. శరీరమంతా జ్వరంతో కాదు వాళ్ళమాటలతో వెళ్ళి మోసంతో భగభగమండిపోతోంది.
"వీళ్ళనా! మంచివాళ్ళని తను అనుకొంది. తన్ని మాయంచేసి ఇతర దేశాలకి అమ్మటానికి కొందరు మోసగాళ్ళు చూస్తున్నారని అచ్చెమ్మగాని, యలమందయ్యగాని ముందే తనతో చెప్పివున్నట్టయితే వాళ్ళ ముఖాన తను పదివేలేం ఖర్మ లక్షరూపాయలు పారేసేది. ఇంట్లోంచి బైటికి రావడం వల్ల తనకన్నీ అవమానాలే ఎదురయ్యాయ్.
వాడెవడో వచ్చి అర్దరాత్రిపూట మీద పడ్డాడు.
ముందు గౌరవంగ ఉండి తరువాత అగౌరవంలోకి దిగారు.
ముందు మర్యాదగ ఉండి తరువాత చిన్నచూపు చూడటం మొదలుపెట్టారు.
చివరకి
వాళ్ళ వాళ్ళల్లో వకడిని పెళ్ళాడాలని షరతు పెట్టారు.
ఆఖరికి నిక్షేపం లాంటి పేరుకూడా మార్చేశారు.
చివరకి
తన్ని అమ్మే ప్రయత్నం కూడా పూర్తి చేశారు. ప్లాను సిద్ధమైంది. బేరసారాలు పూర్తయ్యాయి. వాళ్ళు పన్నిన వలలో తను చిక్కుకోవటం వక్కటే మిగిలింది.
ఇప్పుడు తనేం చేయాలి? ఎలా తప్పించుకోవాలి?