Previous Page Next Page 
రుధిర మందారం పేజి 19

    ఇప్పుడు నేను ఈ మారువేషంతో చాలాచోట్ల తిరగవలసి వుంది. ముందుగా అద్దె పుస్తకాల షాపు దగ్గరకు బయలుదేరాను. ఆ రచయిత రాసిన షాక్ నవల ఈరోజే మార్కెట్ లోకి వచ్చేది.
    వీధి చివరికి వచ్చాను. దూరం నుంచి పుస్తకాల షాపు కనబడుతున్నది. ఇప్పుడే వెళదామా? కాసేపాగి వెళదామా? అక్కడే నుంచుని ఆలోచిస్తున్న నాకు ఇటు పక్కనుంచి సుందరి వస్తూ కనిపించింది.
    వెతకబోయిన తీగ కాళ్ళకి చుట్టుకోటం అంటే ఇదేనేమో! నేను ఇంక ఆలస్యం చేయదల్చుకోలేదు. వేగంగా నడిచి పుస్తకాల షాపుకి చేరాను. అప్పటికే రెండు పదులు నిండినా అబ్బాయి షాపు వాడితో మాట్లాడుతూ "షాక్" నవల ఈరోజు వస్తుందన్నారు వచ్చిందా?" అని అడుగుతున్నాడు.
    "రాలేదు. మరో రెండు రోజుల తర్వాత గాని రాదుట" షాపు అతను చెప్పాడు.
    "పోనీ మర్డర్! మర్డర్ నవల వుందా?"
    "వుంది" అంటూ నవల తీసి అతనికి ఇచ్చి పేరు రాసుకున్నాడు.
    అతను వెళ్ళిపోయాడు.
    మరికొద్ది సేపటిలో సుందరి ఇక్కడికి రాబోతున్నది. వెంటనే నేను రంగంలోకి దిగటం మంచిది.
    "శరత్ బాబు రాసిన విప్రదాసు నవల. యద్దనపూడి మీనా, రాకేష్ మోహన్ రాసిన "మాట్లాడే శిల్పం" కావాలోయ్" అన్నాను. ఆ అడిగే తీరు కాస్త చాదస్తంగా అడిగాను.
    "మూడూ లేవు. ఇప్పుడే ఎవరో తీసుకువెళ్ళారు" విసుగు దాచుకుంటూ చెప్పాడు షాపు అతను.
    "వెతికి ఇవ్వాలా? ఇవ్వు బాబూ!" చెముడు నటిస్తూ అన్నాను.
    "ఆ నవలలు లేవని చెప్పాను. పక్క వీధిలో ఒక షాపు వుంది. అక్కడికి వెళ్ళండి. తప్పక దొరుకుతాయి" కాస్త స్వరం హెచ్చించి గట్టిగా చెప్పాడు.
    నేను ఇక్కడ వుండటం సుందరి దగ్గరకు రాబోవడం చూసి కాస్త కంగారుపడి తెలివిగా చెప్పాడు.
    అది గ్రహించిన నేను తాపీగా అక్కడే కూర్చుంటూ.
    "కాస్త ఆలస్యం అయినా ఫరవాలేదు. ఈ సినిమా పుస్తకం తిరగేస్తుంటాను. వెతికి ఇవ్వు. ఈ కాలం మంచి నవలలు ఎవరికి కావాలి? అంతా చచ్చుబొక్కు సాహిత్యానికి ఉరుకులు, పరుగులు తీసేవాళ్ళే" అంటూ జ్యోతిచిత్ర తిరగేస్తూ కూర్చున్నాను.
    "ఇదిగో నిన్నే..."
    నేను వినిపించుకోనట్లు నటించాను.
    అందాల సుందరి షాపు దగ్గరకు వచ్చింది. వీడెవడు అన్నట్లు కళ్ళతో సైగ చేసి అడిగినట్లుంది. "చాదస్తం చెవిటి ముసలాడు. ఏవో పాతనవలలు కావాలిట. లేవయ్యా బాబూ! అంటే వెతికిస్తావా సరేలే కూర్చుంటానని ఇక్కడే కూలబడ్డాడు" అంటూ వివరించాడు షాపు అతను.
    "లేవు అన్నట్లు చేయి తిప్పి సైగ చేయాల్సింది!"
    "ఆ తెలివి నాకు ముందే లేకపోయింది."
    సుందరి వ్యానిటీ బ్యాగ్ జిప్ లాగి చిన్న పేకెట్ బైటికి తీసింది. "మొత్తం నాలుగు నవలలు" అంది అతనికి ఇస్తూ.
    "అన్నీ షాక్ నవలలే కదా!"
    "ఆ...షాక్ నవలని వారం రోజులు మార్కెట్ లోకి తీసుకురారట. ఇక్కడ మాత్రమే ఇస్తున్నారు. వాళ్ళ వాళ్ళు వచ్చి అడిగితే అట్టవేసి ఇమ్మన్నారు."
    "కోడ్!"
    "రుధిర మందారం."
    "సరే."
    "ఇంక నేను వెళతాను."
    "మళ్ళీ...!"
    "ఇదేరోజు. ఇదేటైము. అదైనా అవసరం పడితేనే."
    "సరే."
    సుందరి శలవు తీసుకుని వెళ్ళిపోయింది. ఆమె వెనుకనే నేను బైలుదేరడం మంచిది కాదు. తలకాయ జ్యోతిచిత్రలోకి దూర్చి ఓరకంటితో షాపువాడిని చూస్తూ వుండిపోయాను.
    షాపు అతను ప్యాక్ చేసిన షాక్ నవలలని అలాగే వుంచి తన వెనక వేపునున్న చిన్న పెట్టెలో పడేశాడు. ఆ తర్వాత మీనా నవలతీసి ఆ నవలతో నాచేతిమీద కొట్టాడు.
    నేను ఉలిక్కి పడినట్లు పడి తల పైకి ఎత్తాను.
    షాపు అతను నవల నా చేతిలో పెట్టాడు.
    నేను ముఖం విప్పార్చుకుని ఆప్యాయంగా నవల అందుకుంటూ "అమ్మయ్య దొరికిందా! మిగతా రెండు నవలలు ఏవి?" అన్నాను.
    షాపు అతను కాగితం మీద నాలుగు ముక్కలు గీకి నా చేతిలో పెట్టాడు.
    "ఆ రెండు నవలలు లేవు మీరు మాకు కొత్తగాబట్టి మీ పేరు చెప్పి నవలకి డబ్బుకట్టి తీసుకువెళ్ళండి. రేపు మీరు తిరిగి నవల ఇచ్చేటప్పుడు మీ డబ్బు మీకు ఇచ్చేస్తాము."
    మీనా నవలకి డబ్బుకట్టి అక్కడ నుంచి వచ్చేశాను.
    సందు మలుపు తిరిగిన తరువాత రిక్షా బేరం ఆడి రిక్షా ఎక్కాను.
    క్రితం రోజు సుందరి మొత్తం మూడు ఇళ్ళల్లోకి వెళ్ళింది. చివరికి వెళ్ళిన మూడో ఇంట్లోంచి బైటికి రాలేదు. ఇప్పుడు నేను ఆ మూడు చోట్లా సుందరి కోసం వెతకాలి. లక్కీగా సుందరి కనబడ్డదా సరేసరి. లేకపోతే మరో మార్గం చూడాలి.

 Previous Page Next Page