విరుల జేరి హరుని శిరసు నెక్కిన చీమ
చందమామతోడ సరస మాడె;
ఉత్తమాశ్రయమున నున్నతస్థితి గల్గు
లలిత సుగుణజాల! తెలుగుబాల! 24
నీట కుంజరమును నిలబెట్టు మొసలిని
బైట పిచ్చికుక్క పరిభవించు;
స్థానబల మఖండ శక్తి ప్రదమ్మురా
లలిత సుగుణజాల! తెలుగుబాల! 25
రావణుండు జనకరాట్పుత్రి గొనిపోవ
సింధువునకు గలిగె బంధనమ్ము;
ఖలుని తప్పు చెంత గలవారలకు ముప్పు
లలిత సుగుణజాల! తెలుగుబాల! 26
మద్యమునకు భ్రాంతి, మార్తాండునకు కాంతి,
క్షితికి క్షాంతి, మందమతికి క్లాంతి,
సజ్జనులకు శాంతి సహజధర్మంబులు
లలిత సుగుణజాల! తెలుగుబాల 27
కొంప గాలు వేళ, గునపంబు చేబూని
బావి త్రవ్వ నేమి ఫలము గలుగు?
ముందు చూపులేని మూర్ఖుండు చెడిపోవు
లలిత సుగుణజాల! తెలుగుబాల! 28
ప్రాత దైన మాత్ర ప్రతిది సాధువు గాదు;
క్రొత్తదనుచు విసరికొట్టరాదు;
అరసి మంచిచెడ్డ సరసుండు గ్రహియించు
లలిత సుగుణజాల! తెలుగుబాల! 29
పాలకడలిలోన ప్రభవించు మాత్రాన
హాలహలము మధుర మగుట గలదె!
కులము ననుసరించి గుణములు రావురా
లలిత సుగుణజాల! తెలుగుబాల! 30
రాజహంస వికచ రాజీవవని చేర
కాకి గూడు, గ్రద్ద కాడు చేరు;
ఎట్టి గుణమువారి కట్టి యాశ్రయ మబ్బు
లలిత సుగుణజాల! తెలుగుబాల! 31
కోకిలమ్మ చేసికొన్న పుణ్యం బేమి!
కాకి చేసికొన్న కర్మమేమి!
మధుర భాషణమున మర్యాద ప్రాప్తించు
లలిత సుగుణజాల! తెలుగుబాల! 32
కాక కోకిలమ్ము లేక వర్ణమ్ములే
సుంత తెలియదయ్యె నంతరంబు;
గుట్టు బైటపడియె గొంతెత్తినంతనే
లలిత సుగుణజాల! తెలుగుబాల! 33
పైడి గద్దెమీద పట్టంబు కట్టిన
సిగ్గులేని కోతి మొగ్గలేసె;
అల్పమతికి పదవి హాస్యాస్పదంబురా
లలిత సుగుణజాల! తెలుగుబాల! 34
కొలిమి నిడిన, సాగగొట్టిన నరికిన
కాంచన మ్మొకింత కష్టపడదు;
కుందనంబు కుందు గురిగింజతో తూయ
లలిత సుగుణజాల! తెలుగుబాల! 35
మూడు దశలు విత్తమునకు - దానమ్ము, భో
గమ్ము మఱియు నాశన మ్మనంగ;
మొదటి రెండు లేమి మూడవ దశ వచ్చు
లలిత సుగుణజాల! తెలుగుబాల! 36
పెట్టెనిండ కూడబెట్టిన సిరులకు
తగిన రక్షణమ్ము త్యాగ గుణమ్ము;
అలుగు పారి చెరువు జలముల కాపాడు
లలిత సుగుణజాల! తెలుగుబాల! 37
ముందువెనుక గనుము, తొందరపడకుము,
ఆపదలకు మౌఢ్యమాస్పదంబు;
అరసి చేయువాని వరియించు సంపదల్
లలిత సుగుణజాల! తెలుగుబాల! 38
అరుగుకొలది సురభియగును చందనయష్టి;
తరుగుకొలది రసము గురియు చెఱకు;
ఘనులు ప్రకృతి విడరు కష్టాలలో గూడ
లలిత సుగుణజాల! తెలుగుబాల! 39
ఇనుడు వెలుగు నిచ్చు; ఘనుడు వర్షము నిచ్చు;
గాలి వీచు; చెట్లు పూలుపూచు;
సాధుపుంగవులకు సహజలక్షణ మిది
లలిత సుగుణజాల! తెలుగుబాల! 40
చిన్ననాటి చెలిమిచే నారికేళంబు
మధురజలము లొసగు మానవులకు;
పరులమేలు ఘనులు మరువరు బ్రతు కెల్ల
లలిత సుగుణజాల! తెలుగుబాల! 41
మదము గురియుచున్న మత్తేభముల పైన
సింహశిశువు దుమికి చీల్చివైచు;
వరపరాక్రములకు వయసుతో పనిలేదు
లలిత సుగుణజాల! తెలుగుబాల! 42
హస్తిరాజ మెంత! హరికిశోరం బెంత!
గహన మెంత! అగ్నికణ మదెంత!
దేహయష్టి కాదు తేజస్సు ముఖ్యంబు
లలిత సుగుణజాల! తెలుగుబాల! 43
వీడు పరులవాడు; వాడు నావాడని
అల్పబుద్ది తలచు నాత్మయందు;
సాధుపుంగవులకు జగమే కుటుంబంబు
లలిత సుగుణజాల! తెలుగుబాల! 44
నరుడు మెచ్చునేని నారాయణుడు మెచ్చు
దీనులందు దేవదేవు డుండు;
మానవార్చనంబె మాధవార్చనమురా
లలిత సుగుణజాల! తెలుగుబాల! 45
క్రౌంచపక్షిబాధ గన్న వాల్మీకిలో
కరుణరసము పొంగి పొరలిపోయె;
రసము పొంగి పొంగి రామాయణంబయ్యె
లలిత సుగుణజాల! తెలుగుబాల! 46
బాదరాయణుండు భారతమ్మును జెప్ప
గంట మూని వ్రాసె గజముఖుండు;
ఘనత గన్న కవికి గట్టి వ్రాయసకాడు
లలిత సుగుణజాల! తెలుగుబాల! 47