Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 3


    గౌతమీ తరంగిణీ తరంగములకు
    తెలుగు భంగిమములు తెలిపినాడు;
    ఆంధ్ర కవుల కెల్ల అన్నయ్య "నన్నయ్య"
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                48

    హోమవేది ముందు సోమయాజియె గాని
    చేయి దిరిగినట్టి శిల్పి యతడు;
    "తిక్కనార్యు" పల్కు తియ్యదేనెలు చిల్కు
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                49

    స్నిగ్ధకావ్యరసము సీసాలలో నింపి
    రసిక శేఖరులకు నొసగినాడు;
    సిద్ధహస్తుడోయి "శ్రీనాథకవిరాజు"
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                50

    భాగవతము వ్రాసె బమ్మెర పోతన్న
    సహజ పాండితీ విశారదుండు;
    పలుకుపలుకులోన నొలికెరా ముత్యాలు
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                51

    కలము చేతబట్టి కావ్యమ్ము రచియించె
    హలము చేతబట్టి పొలము దున్నె;
    కలము హలములందు ఘనుడురా "పోతన్న"
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                52

    ఖడ్గమూని శత్రుకంఠాలు ఖండించె;
    'గంట' మూని వ్రాసె కావ్యములను;
    "తెలుగు సవ్యసాచి" మన కృష్ణరాయలు
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                53

    అష్టదిగ్గజముల నాస్థానమున నిల్పి
    రాజ్యమేలె కృష్ణరాయ విభుడు;
    తుంగభద్ర నాడు పొంగులెత్తినదిరా
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                54

    పల్లె పైరుగాలి పరిరంభణమ్ములు
    స్నిగ్ధమధుర వాగ్విజృంభణములు;
    పాండురంగవిజయు పదగుంభనమ్ములు
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                55

    "రామలింగ" డంచు "రామకృష్ణుం" డంచు
    జుట్టు జుట్టు పట్టి కొట్టుకొనిరి;
    లింగ కృష్ణులందు లేదురా భేదంబు
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                56

    ఐనవారి నెల్ల అవహేళనము చేసి
    కానివారితోడ కలియరాదు;
    కాకి, కేకులందు కలిసి కష్టము లందె
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                57

    పొంచి, బుజ్జగించి, పొగడి టక్కరిమూక
    మంచివారి మోసగించుచుండు
    కాకి జున్ను ముక్క కాజేసెరా నక్క
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                58
    
    సాటివానితోడ జగడమాడగరాదు;
    తీరుపులకు పరుల జేరరాదు;
    కొంటెకోతి గడ్డకొట్టె పిల్లులనోట
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                59

    ఆశపోతువాని కానంద మది కల్ల;
    ఆపదలకు లోభమాకరమ్ము;
    పసిడికంకణమ్ము బ్రాహ్మణు వంచించె
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                60

    బావినీటిలోని ప్రతిబింబమును చూపి
    సింహమును శశంబు సంహరించె;
    తగు నుపాయ మున్న తప్పు నపాయంబు
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                61

    రత్నమాల పుట్ట రంధ్రాన పడవైచి
    కాకి త్రాచుపాము గర్వ మడచె;
    పరుల నిట్లు యుక్తిపరులు సాధింతురు
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                62

    మదగజమ్ము వీడి, మనుజుని పోనాడి,
    నక్క చచ్చె వింటినారి కొరికి;
    హాని సంభవించు నతిసంచయేచ్ఛచే
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                63

    తనకు తగని పిచ్చిపనులకు పోనేల
    అడుసు త్రొక్కి కాలు కడుగుటేల
    కోతి మేకు పీకి కోల్పోయె ప్రాణాలు
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                64

    కష్టసాధ్యమైన కార్యమ్ము నెరవేర్ప
    నైకమత్యమే మహాబలమ్ము!
    పావురములు వలను పైకెత్తుకొని పోవె
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                65

    "కందుకూరి" "పానుగంటి" "కొమఱ్ఱాజు"    
    "చిలకమర్తి" "గిడుగు" "చెళ్ళపిళ్ళ"
    తెలుగు దిగ్గజములు "చిలుకూరి" "వేదము"
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                66

    కలిమి గలుగ నేస్తకాండ్రు వేలకు వేలు;
    కలిమి లేక చెలిమికాండ్రు లేరు;
    లేమివేళ మిత్రులే ప్రాణమిత్రులు
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                67

    భారతం బనంగ పంచమ వేదంబు;
    దాత యనగ తొమ్మిదవ గజంబు;
    ధరణి నల్లుడన్న దశమగ్రహంబురా
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                68

    ఆటలాడబోకు మల్లరి జట్టుతో;
    వేటలాడబోకు వెఱ్ఱి ప్రజల;
    మాటలాడబోకు మర్యాద విడనాడి
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                69

    వెతకి వెతకి వారి వీరి కావ్యాలలో
    గతికి గతికి కడుపు కక్కురితికి
    అతుకు లతుకు కుకవి బ్రతుకేమి బ్రతుకురా
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                70

    కలము పట్టగానె కవిశేఖరుడు గాడు;
    గద్దె నెక్కగానె పెద్ద గాడు;
    శాటి గట్టగానె సన్యాసి గాడురా
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                71   

 Previous Page Next Page