Previous Page Next Page 
ఆక్రోశం పేజి 3


    సక్సెస్ గాంబ్లింగ్ కాదు. టాలెంట్ ద్వారా, లక్ ద్వారా సక్సెస్ చేతికి అందదు.

 

    టాలెంటు వున్న వ్యక్తులు చాలామంది అనామకులుగా మిగిలిపోవడం మనం చూస్తూనే వున్నాం. అకస్మాత్తుగా కోటి రూపాయలు లాటరీ ద్వారా, గుర్రపు పందాల ద్వారా, ఇతర గాంబ్లింగ్స్ ద్వారా సంపాదించిన వ్యక్తులు కొన్నాళ్ళు మతాబుల్లా వెలిగి కనుమరుగైపోవడం మనకు తెలుసు.

 

    మన టాలెంటే మనల్ని ఎప్పుడో ఒకప్పుడు ఉన్నత శిఖరాలకు తీసుకెళుతుందని చాలామంది భావిస్తారు. వెతుక్కుని వచ్చే లక్ కోసం, కలిసివచ్చే కాలం కోసం ఎదురుచూస్తుంటారు.

 

    అలాంటి వాళ్ళకోసం ఆ లక్, ఆ కాలం, జీవితకాలం కూడా రావు.

 

    ప్రయత్నం లేనిదే ఫలితం లభించదు. కొంతమంది ప్రయత్నాన్ని ప్రారంభిస్తారు. ఏదో ఒక తప్పు జరిగిన వెంటనే ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటారు. తప్పటడుగు లేనిదే మనిషికి నడక ఎలా రాదో, తప్పు జరగనిదే మనిషికి జీవితం కూడా లేదు.

 

    అలాగే చాలామందిలో Natural Talents, Hidden Talents వుంటాయి. ఆ టాలెంట్సుకు ఎప్పుడో ఒకప్పుడు గుర్తింపు వస్తుందని వాళ్ళు భావిస్తూ ఎదురుచూస్తుంటారు. ప్రయత్నం లేని టాలెంటు యిచ్చే ఫలితం సున్న! తమలోని టాలెంటుని గుర్తెరిగి, నిరంతరం అభ్యాసం చేయనినాడు, ఆ టాలెంటు మనిషిలో గర్వాన్ని, అహంకారాన్ని పెంచి, మనిషి పతనానికి కారణమౌతుంది.

 

    మేథమెటిక్స్ లో అపారమైన ప్రజ్ఞను కనబరిచే శకుంతలాదేవి ఎంతటి కష్టసాధ్యమైన చిక్కు లెఖ్ఖనైనా బ్రెయిన్ లోనే కాలిక్యులేట్ చేసి పరిష్కరిస్తుంది!

 

    నీకూ అలా పరిష్కరించాలని వుంటుంది కానీ పరిష్కరించలేవు! వెంటనే నువ్వు చేయాల్సింది కాగితాన్ని, పెన్నుని తీసుకొని పరిష్కరించడానికి పూనుకోవడమే! లేనిపక్షంలో కంప్యూటర్ ని ఆశ్రయించడమే! కాగితాన్ని, పెన్నుని తీసుకోవడం గాని, కంప్యూటర్ ని ఆశ్రయించడంగాని నీ శక్తిని కించపరుచుకోవడం కాదు, ఏదో రకంగా నీ ప్రయత్నాన్ని ప్రారంభించడం!

 

    గుర్రంలా నువ్వు పరుగు తియ్యాలని కోరుకుంటున్నప్పుడు, ముందు పరిగెత్తడం నేర్చుకోవాలి. ఒకేసారి గుర్రంలా ఎగరాలనుకున్న ప్రతివాడూ బోర్లాపడటం ఖాయం!

 

    Every thing you Desire


    
    Is with in your Reach

 

    ఆధునిక సమాజంలో జీవించే తొంభై శాతం మంది ప్రజలకు బ్రతుకు వడ్డించిన విస్తరి కాదు... వెండి చెంచా కూడా కాదు!

 

    ఆశావహమైన జీవితాన్ని, సక్సెస్ ఫుల్ జీవితాన్ని కోరుకునే ప్రతివాడూ సున్నా దగ్గరే ప్రారంభమౌతాడు.

 

    జీవన మహాసముద్రానికి కేంద్రం బిందువే!

 

    లెక్కల్లో వెనక అంకెల బట్టి బిందువుకు విలువ! జీవితంలో బిందువుకు ముందు నిలిచేది మనిషి కృషి!

 

    ఆ కృషికి నేపధ్యం కాలం, అదృష్టం!

 

    కాలం, అదృష్టాలలో మనిషికి ఏది ముఖ్యం?

 

    బిలియనే డాలర్ లాంటి ఈ ప్రశ్నకు జవాబు వూహించగలరా?

 

    Do not believe that more and more self analysis is better and better!    

 

    ఈ విషయాన్ని కూడా మరిచిపోకూడదు.


                                              *    *    *    *


    స్పెయిన్ దేశం....

 

    కోస్టాడీ సోల్ నగరానికి రెండువందల మైళ్ళ దూరంలో వుంది ఆ సముద్రం.

 

    భారత కాలమానం ప్రకారం...

 

    సరిగ్గా సాయంత్రం నాలుగు గంటలైంది.

 

    మూడువేపులా చిక్కని నీలపు సముద్రం- ప్రక్కన కోస్టాడీ సోల్ బీచ్ ఏరియా, ఆ ప్రక్కనే ఎయిర్ పోర్టు...

 

    దాదాపు వందమైళ్ళ విస్తీర్ణంలో, ఖరీదైన పగడంలా మెరుస్తోంది ఆ ఎయిర్ పోర్టు.

 

    ఆ ఎయిర్ పోర్టులో ప్రతి పదిహేను నిమిషాలకు రాయల్ ఫ్లైట్స్ చార్టర్డు ఫ్లైట్స్, స్పెషల్ హెలికాఫ్టర్స్ వచ్చి ఆగుతున్నాయి.

 

    వాటిల్లోంచి దిగుతున్న అతి ఖరీదైన అతిథులనూ అక్కడున్న వ్యక్తులు అతి గౌరవంగా రిసీవ్ చేసుకుంటున్నారు.

 

    ఆ స్పెషల్ ఎయిర్ పోర్టుకు సమీపంలోనే వుంది మార్బెల్లా టౌన్!

 

    ఎయిర్ పోర్టులో అడుగుపెట్టిన అతిథులు వారికోసం సిద్ధంగా వున్న వింటేజ్ కార్లలో ఎక్కి మార్బెల్లా టౌన్ లో వారికోసం కేటాయించిన విలాస వంతమైన హోటల్స్ కు వెళుతున్నారు.

 

    మార్బెల్లా టౌన్ చుట్టూ అందమైన తోటల మధ్య వుంది.

 

    లేత బూడిదరంగు భవనాలు, విశాలమిన పొడవాటి రోడ్లు, ఆ రోడ్లకు ఇరువేపులా గెస్టులకు సెల్యూట్ చేస్తున్న ఆలివ్ గ్రీన్ కలర్ యూనిఫార్మ్ తో స్పెషల్ గార్డ్స్...

 

    మామూలు మనిషి ఊహించడానికి అసాధ్యమైన, అతి ఖరీదైన, అతి అద్భుతమైన ఆ సిటీలో జరిగే-

 

    వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్ కి వస్తున్న ఆ గెస్టులు, ఆర్డినరీ వ్యక్తులు కారు.

 

    ప్రపంచ రాజకీయ వ్యాపారకళా, సాంస్కృతిక రంగాలలో ప్రసిద్ధిచెందిన వ్యక్తులు.

 

    బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్, అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్, బిల్ క్లింటన్ తో ఎన్నికల్లో సవాల్ చేసిన అమెరికన్ నెంబర్ వన్ ఇండస్ట్రీయలిస్ట్ రాస్ పెరో, వరల్డ్ ఫేమస్ యాక్టర్ సీన్ కానరీ, బ్లూలాగూన్ నటి బుక్ షీల్డ్స్, వరల్డ్ క్రేజీ సింగర్ మైకేల్ జాక్సన్, ది సెక్స్ సెన్సేషన్ క్రియేటర్ మడోనా, పాలస్తీనా ప్రెసిడెంట్ యాసర్ అరాఫత్, విజయ అమృతరాజ్ బ్రదర్స్... వరల్డ్ ఫేమస్ నవలా రచయిత జెఫ్రీ ఆర్బర్, పాకిస్థాన్ ఎక్స్ ప్రైమినిస్టర్ బెనజీర్ భుట్టో... ఇండియన్ ఫేమస్ పొలిటికల్ లీడర్ చంద్రశేఖర్, ఇండియన్ హిందీ సూపర్ హీరోయిన్ డింపుల్ కపాడియా... దాదాపు అయిదువందలమంది ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు వస్తున్నారక్కడకు.

 

    మార్బెల్లా పోర్ట్ సిటీ అంతా కోలాహలంగా వుంది.

 

    ఆ సిటీలో జరిగే-

 

    అరుదైన ఫంక్షన్ గురించి రెండు నెలల క్రితమే వివిధ దేశాల్లోని రెండువేల డైలీ పేపర్లు ఎక్స్ క్లూజివ్ న్యూస్ ఐటమ్స్ ని ప్రచురించాయి.

 

    ముఖ్యంగా ఇండియాలోని అన్ని మేజర్ న్యూస్ పేపర్లూ సప్లిమెంట్స్ ని ప్రచురించాయి. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక లీడింగ్ డైలీ మన భూమి అరవై పేజీల బుక్ లెట్ ను ప్రచురించి, తన గౌరవ కృతజ్ఞతల్ని వ్యక్తం చేసింది.

 Previous Page Next Page