ఉషోదయం
- డి. కామేశ్వరి
"యువర్ ఆనర్, నా క్లయింట్ సునీతకి తొమ్మిదేళ్ళ క్రితం పెళ్లయింది.
ఇద్దరదీ ప్రేమ వివాహం. పెళ్లినాటికి ఆమె ఓ పెద్ద ఆర్కిటెక్ కంపెనీలో ఇంటీరియల్ డెకరేటర్ ఉద్యోగం చేస్తుండేది. అక్కడే ఆర్కిటెక్ ఇంజనీరుగా పనిచేస్తున్న రవీంద్రతో పరిచయం, ప్రేమగా మారి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.
ఎనిమిదేళ్ళ క్రితం ఓ బాబు, ఆరేళ్ళ క్రితం ఓ పాప - ఇద్దరు పిల్లలు కలిగారు. పిల్లలు పుట్టాక వారి ఆలనా పాలనా చూడడానికి, ఆయాలమీద వదలడానికి ఇష్టంలేక తన ఉద్యోగం వదులుకుని పూర్తిస్థాయి ఇల్లాలిగా, తల్లిగా మారింది.
రవీంద్ర ఆదాయం బాగుండడంతో ఆర్థిక సమస్యలు వారికి లేవు కనుక పిల్లలు కాస్త పెరిగాక కూడా ఆమె తిరిగి ఉద్యోగంలో చేరాలనుకోలేదు.
ఎనిమిదేళ్ళ వైవాహిక జీవితం అనుభవించాక, ఇద్దరు పిల్లలు కలిగాక గత సంవత్సరం నించి తన అసిస్టెంట్ రంజని అనే ఆమెతో ప్రేమాయణం మొదలుపెట్టి అక్రమసంబంధం పెట్టుకున్నాడు నా క్లయింట్ భర్త రవీంద్ర.
అందరికన్నా ఇలాంటి విషయాలు కట్టుకున్న భార్యకి ఆలస్యంగా తెలుస్తాయి. అతని ప్రవర్తనలో గత ఏడాదినించి మార్పు రావడం కనిపెట్టినా, ఇలాంటిది ఏదో వుందన్న అనుమానం ఆమెకి రాలేదు. ఈనోటా, ఆనోటా విన్నాక, స్నేహితులు, ఆఫీసు స్టాఫ్ హెచ్చరించాక వారిద్దరి సాన్నిహిత్యాన్ని స్వయంగా చూశాక, నా క్లయింట్ సునీత భర్తని నిలేసింది. అతను మరోదారి లేక అంగీకరించాడు.
"నీకేం లోటు చెయ్యను, ఏదో నాకు తెలియకుండానే అలా జరిగిపోయింది" అంటూ కుంటిసాకులు చెప్పాడు. ఇంత జరిగాక కూడా నా క్లయింట్ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఇకముందు ఇలాంటివి స్వస్తి చెప్పానని మాటఇస్తే క్షమించి సర్దుకుపోవడానికి అంగీకరించింది. అప్పటికి తప్పించుకోడానికి మాట ఇచ్చి, రంజని నించి ఒత్తిడికి తట్టుకోలేక నా క్లయింట్ కి విడాకుల నోటీస్ పంపాడు ఆమె భర్త.
అది సహించలేక నా క్లయింట్ ఆవేదనతో, ఆవేశంతో పిల్లలని తీసుకుని ఇల్లు వదిలి ఓ స్నేహితురాలింటిలో ఆశ్రయం పొందింది.
యువర్ ఆనర్! ఇప్పుడు నా క్లయింట్ కి, పిల్లలకి వుండడానికి ఇల్లు కావాలి. వారి పోషణకి డబ్బు కావాలి. విడాకుల కేసు తేలేవరకు ఆమెకు ఆ ఇంట్లో వుండే హక్కు కోర్టు కల్పించాలని...."
ప్రతివాది లాయర్ ప్రకాష్ లేచి నిల్చుని "అబ్జక్షన్ యువర్ ఆనర్, నా క్లయింట్ భార్యాపిల్లలని ఇల్లు వదిలి వెళ్ళమని చెప్పలేదు. ఆమే ఆవేశంతో ఇల్లు విడిచి వెళ్ళి ఇంట్లో వుండే హక్కు కావాలని అడగడంలో అర్ధంలేదు" అన్నాడు.
"అబ్జక్షన్ సస్టైన్డ్" జడ్జి అన్నారు.
"యువర్ ఆనర్! అతను నోటితో అనకపోయినా, ఆత్మాభిమానంగల స్త్రీ. ఇంకో స్త్రీతో సంబంధం పెట్టుకుని భార్యకి విడాకుల నోటీసు పంపిస్తే ఏ భార్య సహించగలదు? భర్త చేసిన పనికి ఆత్మాభిమానంతో ఇల్లు వదిలినా స్నేహితుల ఇళ్ళలో ఎన్నాళ్ళుండగలను? అసలు అలా వుండాల్సిన అవసరం ఏముంది? భార్యకి అతను విడాకులు ఇవ్వదలిస్తే, వివాహ సంబంధం రద్దు చేసుకోవాలనుకుంటే, ఆమెకి, పిల్లలకి ఆసరా కల్పించాల్సిన బాధ్యత అతనిది. వారి పోషణభారం అతను వహించాలి.
ఈ విడాకుల వ్యవహారం తేలేదాకా నా క్లయింట్ కి అ ఇంట్లో వుండే అధికారం, వారి పోషణ నిమిత్తం ఖర్చు, అంతేకాదు ఆమె తిరిగి తన కాళ్ళమీద తాను నిలబడేందుకు వీలుగా ఆ ఆఫీసులో ఆమె కూడా మునపటిలా తనపని తాను చేసుకునేందుకు కోర్టువారు పర్మిషన్ ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను" లాయర్ శారద తన వాదన వినిపించింది.
జడ్జి మహాలక్ష్మి, డిఫెన్స్ లాయర్ ప్రకాశరావు వంక చూసి "విడాకులకి మీ క్లయింట్ ఆప్లై చేశారా! వాది సంతకం చేసిందా?" అనడిగింది.
"లేదు యువర్ ఆనర్. విడాకుల ప్రసక్తి రాగానే ఆమె ఇల్లు వదిలింది."
"యువర్ ఆనర్! నా క్లయింట్ సునీత విడాకుల పత్రాలమీద సంతకం చెయ్యలేదు. ముందు అతని ఏ అభియోగంతో నా క్లయింటుకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నారో తెలియాలి. ముందు అభియోగం నిరూపించాలి. ఆ తర్వాత అతను భార్యాబిడ్డల పోషణక ఏ ఏర్పాట్లు చేశాడో అవన్నీ తెలియకుండా, తేలకుండా సంతకం ఎలా చేస్తుంది?
అందుకే అవన్నీ జరిగేలోగా ఆమె తన ఇంట్లో వుండే హక్కు వడులుకోదలుచలేదు. ఆఫీసు వాడుకునే హక్కు, పిల్లలపోషణ నిమిత్తం ఖర్చులు ఇప్పించాలని కోరుతూంది"అంటూ శారద వాదన వినిపించింది.
"అంటే, దీనికి మీ క్లయింట్ అంగీకరించిందా" ప్రతివాది లాయరు ప్రకాశరావుని జడ్జి ప్రశ్నించింది. "అవును యువర్ ఆనర్, ఒకసారి తనిష్ట ప్రకారం ఆమె ఇల్లొదిలి వెళ్లింది. మళ్ళీ రానక్కరలేదు. ఎలాగో విడాకులు తీసుకుంటాం కనుక ఇంక ఆమె ఈ ఇంట్లో వుండే ప్రసక్తి అనవసరం అని అతని ఉద్దేశం. అందుకే అంగీకరించలేదు."
"కాని యువర్ ఆనర్, అప్పటివరకు ఇద్దరు పిల్లలతో వీరింటా వారింటా ఎన్నాళ్ళుంటుంది? ఇద్దరు పిల్లలతో పుట్టింటికి వెళ్ళి వారికి భారం కాదలచలేదు. ఆమె హక్కుని ఆమె వదులుకోదలచలేదు నా క్లయింట్. విడాకులు మంజూరు అయ్యేవరకు అతని భార్యగా ఆ ఇంట్లో వుండే హక్కు, అధికారం, ఆమెకి వున్నాయి అని మనవిచేస్తున్నాను."
జడ్జి ఓ నిముషం ఆలోచించి తీర్పు రాసి వినిపించింది. "విడాకులకి అప్లై చేశాక, ఆరునెలల కాలం వారికి సమయమిస్తుంది కోర్టు. విడాకులు మంజూరు అయ్యేవరకు భార్యగా ఆమెకి ఆ ఇంట్లో వుండే హక్కు వారికి వుంది. ప్రతివాది తన జీవితంలో సగం భార్యాబిడ్డల పోషణ నిమిత్తం ప్రతినెలా ఇవ్వాలి.
వాది ఆర్థికంగా తన కాళ్ళమీద నిలబడి ఉద్యోగం చెయ్యాలనుకుంటోంది. కనుక అతని ఆఫీసులో పూర్వం మాదిరి ఆమె పనిచేసుకునే హక్కు కోర్టు ఇచ్చిందని ఇందు మూలంగా తెలియజెయ్యడమైంది" జడ్జి తన తీర్పు వినిపించి లేచి తన ఛాంబరులోకి వెళ్ళిపోయింది.