Read more!
Next Page 
జనవరి 5 పేజి 1

                                 

                                               జనవరి 5
                                   

                                                        -సూర్యదేవర రామ్ మోహనరావు
 

   
   
   
   
    మనం సాధించాలనుకున్నవి, గెలవాలనుకునవి మన కళ్ళముందే మామూలుగా తిరిగె వ్యక్తి హఠాత్తుగా సాధించినా, గెలిచినా మనం మనశ్శాంతిగా ఉండలేం. మనస్ఫూర్తిగా స్వీకరించలేం.
   
    అతనితో మనకు శతృత్వం లేకున్నా, అతను మనం చూస్తుండగానే అంచలంచెలుగా ఎదిగి పైకి వెళ్ళిపోయాడన్న ఒక్క కారణం చాలు అతనితో కయ్యానికి దిగడానికి-అతడ్ని ద్వేషించడానికి.
   
    ఎదుటివాడి విజయం మనల్ని న్యూనతా భావానికి గురిచేస్తుంది.
   
    మనలో అసూయను రగిలిస్తుంది.

   
    ద్వేషాన్ని పుట్టిస్తుంది.
   
    కసిని రేపుతుంది.
   
    ఎందుకంటే మనం మనుషులం కనుక.
   
    పోలిక మనల్ని అంధున్నయినా చేస్తుంది. అల్పున్నయినా పడదోస్తుంది. ఆ రెండు మైలు రాళ్ళను దాటగలిగితే పట్టుదలను రేకెత్తిస్తుంది. ఆ రెండు మైలు రాళ్ళు అంత తేలిగ్గా దాటగలిగేవి కావు.
   
    ఎవరి లక్ష్యమైనా జీవితంలో విజయం సాధించడమే!
   
    విజయం అంటే డబ్బు సంపాదించడమే కాదు-సంపదను కూడబెట్టటమే కాదు. మరేమిటి?
   
                       *    *    *    *    *
   
    అదో అప్పర్ మిడిల్ క్లాస్ కాలనీ.
   
    ఆ కాలనీ పేరు హిందూ నగర్.
   
    ఉదయం తొమ్మిది గంటల సమయం. కాలనీలో రెండో వీధిలో 9వ నెంబర్ యింటిలో చిన్న ఘర్షణ జరుగుతోంది.
   
    ఆ సమయంలో.....
   
    "మీ గారాబం మూలంగానే కదా అదలా తయారైంది. యింటికి పెద్దదని దాన్నలా పెంచారు. ఇప్పటికీ మూడు ఉద్యోగలకి తిలోదకాలిచ్చింది. ఇదైనా సవ్యంగా చేస్తుందనే ఆశ పోతోంది. "నలభై ఐదేళ్ళ వయస్సున్న ఆ ఇంటి యజమానురాలు, ఆ ఇంటి యజమానిపై విరుచుకు పడింది.
   
    బట్టలేసుకుంటున్న ఆయన ఓసారి తలతిప్పి ఆమెకేసి చూసి చిన్నగా నవ్వాడు.
   
    చేసింది తప్పని చెప్పకుండా మౌనంగా నవ్వడం ఆమెకు పుండుమీద కారం రాసినట్టయింది.
   
    "అదసలు ఆడపిల్లేనా?" ఆమె కోపంగా అడిగింది.
   
    "కన్నతల్లివి! నీకే ఆ సందేహం రావడం విడ్డూరం సుమా....?" ఆయన బెల్టు బిగించుకుంటూ అన్నాడు. అప్పుడూ ఆయన పెదవుల మీద చిరునవ్వు చెరగలేదు.
   
    తన ప్రశ్నకు సూటిగా సమాధానం రాకపోతే దాని గురించే ఆమె ఇరిటేట్ అవుతుంది తప్ప, భర్త మానసిక పరిపక్వత గురించి ఆలోచించదు.
   
    "ఇంతకీ దానికి భయం చెబుతారా లేదా?"
   
    "పిరికితనం వుంటేనే భయం నేర్పగలం."
   
    "పోనీ హెచ్చరించండి"
   
    "తప్పు చేయబోతోందని తెలిస్తేనే గాధ హెచ్చరించగలిగేది."
   
    "ఉద్యోగం పోతే ఎలా బతుకుతావని అడగండి."
   
    "ఆ ఉద్యోగం పోతే మరో ఉద్యోగం తెచ్చుకోగలనని యిదివరకే ప్రూవ్ చేసుకుంది. పోతే అన్న ప్రశ్న ఎలా వేయగలను?"
   
    "పోనీ అంత దూకుడొద్దని చెప్పండి"
   
    "దూకినా తనను బ్యాలెన్స్ చేసుకోగల పిల్లకు దూకితే ఏమవుతుందో చెప్పినా ప్రయోజనం వుంటుందా?"
   
    ఆమెలో సహనం పూర్తిగా చచ్చిపోయింది.
   
    విసురుగా అక్కడనుంచి వెళ్ళి కూతురు బెడ్ రూమ్ తలుపుని దడాలున లోపలకు నెట్టింది.
   
    రూమంతా నిశ్శబ్దంగా వుంది.
   
    ఆ గదిలో వుండాల్సిన కూతురు కనిపించకపోవడంతో ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి.
   
    ఓ అడుగు గదిలోకి వేసి నలువైపులా చూసింది. ఎటాచ్డ్ బాత్ రూమ్ తలుపులు తీసే వున్నాయి.
   
    అంతలోకే ఎపుడు వెళ్ళిపోయింది?

    ఆ విషయాన్ని భర్తకు చెప్పేందుకు వెనుదిరిగింది. అప్పుడా హాల్ కూడా ఖాళీగా కనిపించింది..... ఆమె నిస్సత్తువగా అక్కడే చతికిలబడి పోయింది.
   
    ఆయన ఎక్కినా స్కూటర్ వేగం పుంజుకొని ఆ వీధి మలుపు తిరిగేసరికి అక్కడికి దగ్గరలోనే వున్న బస్టాప్, అక్కడే నిలబడి వున్న కూతురు కనిపించి తన సహజ ధోరణిలో నవ్వుకున్నాడాయన.
   
    స్కూటర్ మరింత ముందుకెళ్ళాక తన కూతురు ఎవరో యువకుడితో మాట్లాడుతుండతన్ని గమనించి చూడనట్లే ముందుకెళ్ళిపోయాడు.
   
    "ఎంత వుందన్నావు?" ఆమె ప్రశ్నించింది.
   
    "చాలా" అని భయపడుతూనే అన్నాడు.
   
    "చాలా అంటే వింధ్య మొదలుకొని సేతువువరకు గల భూములా? దక్కన్ పీఠభూమి అంతా మీదేనన్నమాట? అమ్మో! అంత భూమి వుంటే నన్ను నువ్వు, నిన్ను నేను ప్రేమించుకునే టైమే దొరకదు. ఆ పొలాన్ని చూసుకోవడానికి మన సమయం అంతా వృధా అయిపోతుంది."
   
    "మరి నన్నేం చేయమంటావ్?"
   
    "ఓ పని చేయ్! మీకున్న పొలమంతా పోగొట్టుకుని ఐదారు ఎకరాలు మాత్రం మిగుల్చుకొనిరా! అప్పుడు చూద్దాం. అరె.... నా బస్ వచ్చింది. నే వెళ్తా" అంటూనే ఆమె అడగకుండానే వెళుతున్న బస్ వెనుక పరుగెత్తి ఫుట్ బోర్డ్ రాడ్ ని అందుకుని ఎగిరి బస్ లోకి దూకింది.

    అతను నిస్పృహగా తల విదిల్చి బస్టాప్ కు దగ్గరలో రోడ్డు వారగా పార్క్ చేసుకున్న తన కారు దగ్గరకు వెళ్ళిపోయాడు.
   
                      *    *    *    *    *
   
    మేఖల......
   
    సన్నగా, పొడవుగా, మెరుపు తీగలా వుంటుంది.
   
    హిమాలయాల మృదుత్వం ఆమె అణువణువునా తొణికసలాడుతుంటుంది.
   
    నల్లని పట్టుకుచ్చులాంటి అందమైన జుత్తు ఆమె వీపు మీద అల్ల నల్లన తారట్లాడుతుంటుంది.
   
    ఎక్స్ పోజ్ అయినట్లు కనిపించే ఆమె ఎత్తయిన ఎద.....
   
    వర్జిన్ ఐలాండ్ లాంటి క్రింది భాగం....
   
    హఠాత్తుగా వంపు తిరిగిన కొండ నడుములాంటి కటి ప్రదేశం...
   
    ప్రపంచంలోని ప్రకృతి అందాలకు ఆమె ఓ బ్లూ ప్రింట్ లా కనిపిస్తుంది సడన్ గా చూస్తే.
   
    ఒక్క మాటలో చెప్పాలంటే బ్రీత్ టేకింగ్ బ్యూటీ ఆమె.
   
    ఆమెను ఒక్కసారి చూస్తే చాలు పచ్చి మెటీరియలిస్ట్ కూడా అందం గురించి ఆ క్షణం నుండే పడిచస్తాడు.
   
    ప్రేమంటే తెలీని పిచ్చివాడు కూడా పిచ్చిగా ప్రేమిస్తాడు. ఆపై ఆరాధిస్తాడు. ఆపైన ఏ త్యాగం చేసైనా ఆమెను సొంతం చేసుకోవాలనుకుంటాడు.
   
    కళ్ళు తెరిచి చూస్తే ఆమె కనిపించదు- ఆమె అందం కనిపిస్తుంది.
   
    కళ్ళు మూసి కలగంటే మాడొన్నా ట్రూ బ్లూ ఆల్బమ్ ధ్వనిస్తున్నట్లనిపిస్తుంది.

Next Page