Read more!
 Previous Page Next Page 
అష్టావక్ర పేజి 2


    కారులో నుంచి ఆ అమ్మాయి ఇటువైపు దిగుతూ వుండగా, అటు నుంచి రాకేష్ దిగాడు. ఆరు అడుగుల ఎత్తు, గళ్ళ గళ్ళ షర్టు, నుదుటి మీదకు పడే జుట్టు- కారు దిగి ఆమెని అనుసరించి మెట్లు ఎక్కుతూ "సాయంత్రం ప్రోగ్రాం ఏం చేశావ్ గౌరీ" అని అడిగాడు.

    అతడి పక్కన నడుస్తూ వుంటే ఆమె భుజాల క్రిందకి వస్తుంది. అందువల్ల తల పైకెత్తి "చెప్పానుగా రాకేష్! అగ్రికోకి ఒక వ్యాసం వ్రాయాలని" అంది. ఆమె మాటల్లో ఇంత తొందరగా ఎలా మర్చిపోయావ్ అన్న మందలింపు వుంది.

    అతడు ఓరగా చూస్తూ "నువ్వేమన్నా చెప్పు! నాకు థియరీమీద నమ్మకం అంతగా లేదు గౌరీ" అన్నాడు. ఆమె తెలివైందీ, అర్ధం చేసుకోగలదనీ అతడు వూహించి నవ్వబోయాడు.

    అల్లరిగా విచ్చుకోబోయిన అతడి పెదవులు ఆమె మొహాన్ని చూసి ఆగిపోయాయి. అందులో ఆజ్ఞలేదు. తిరస్కారం లేదు. కోపం లేదు. ఆమె చాలా మామూలుగా చూసిందంతే. అందులో స్వచ్చత- అదీ అతడిని భయపెట్టింది. అదే ఒక కోటలాగా అతడిని దూరంగా ఎప్పుడూ నిలబెడుతూ వుంటుంది.

    అతడి తల్లి ఆమె తండ్రికి దూరపు వరస చెల్లెలవుతుంది. తల్లిదండ్రులు లేని అతడు పదహారేళ్ళ వయసులోనే వీళ్ళింటికి వచ్చి చేరాడు. కానీ అతడిని చూస్తే ఎవరూ అలా అనుకోరు. బంగారు స్పూను నోటిలో పెట్టుకుని పుట్టాడని అనుకుంటారు.

    డబ్బు విలువ అతడికి చిన్నతనంలోనే బోధపడింది.

    అతడూ ఆమే ఒకటే ఇయర్! నాలుగో సంవత్సరం... అగ్రికల్చరల్ యూనివర్శిటీలో-

    సగంమంది అబ్బాయిలూ అమ్మాయిలూ ఎమ్.బి.బి.యస్ లో సీటు రాకపోతే అగ్రికల్చర్ లో చేరతారు. కానీ ఆమే అలాకాదు. మొదటి నుంచీ ఆ కోర్స్ అంటే చాలా యిష్టం. ఎందుకో తెలీదు. చెట్లూ, లతలూ, పూలూ- వీటినే సన్నిహితులుగా భావించేది. నాలుగెకరాల స్థలంలో వుంది వాళ్ళ భవంతి. అందులో ప్రతీ మొక్కా ఆమెకి తెలుసు. తోటమాలికన్నా ఎక్కువగా... గులాబీల్నుంచి వాలాన్ తన్ అన్నూస్ వరకూ.

    ప్లాంట్ ఫిజియాలజీ అంటే ఆమెకి చాలా యిష్టం. ఎంటమాలజీ అంటే కూడా! రాత్రిపూట బాల్కనీలో లైటు వేసుకుని చదువుతూ తలెత్తేది. చుట్టూ మొక్కలన్నీ తనవైపు కళ్ళప్పగించి చూస్తున్నట్టు అనిపించేది. తన భావానికి తనే చిన్నపిల్లలా సిగ్గుపడేది.

    ఆమె బ్రిలియెంట్ స్టూడెంట్ కాదు.

    కానీ చదువుకొంటున్న కోర్సుపట్ల అంత ఆప్యాయత, ఇష్టం పెంచుకునేవాళ్ళు చాలా అరుదు. మనుష్యులకన్నా చెట్లపట్ల ఆమె ఆప్యాయత పెంచుకోవటానికి కారణం వుంది. అవి పిచ్చిగా గంతులు వెయ్యవు, నాట్యం చెయ్యవు, పరుగెత్తవు. మరీ ఆనందమొస్తే నెమ్మదిగా తలలూపుతాయి. అంతే...! కేదారగౌరీలాగా!

    ఆమె తండ్రికి ఆమె అంటే చాలా యిష్టం.

    లక్షాధికారి నుంచి కోటీశ్వరుడయ్యే స్టేజిలో భార్య చనిపోయింది. అప్పట్నుంచీ కొడుకునీ, కూతుర్నీ చూసుకుంటూ మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు. మధ్యలో కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళ తరువాత ఇదిగో- ఈ రాకేష్ వచ్చి మరో సభ్యుడిగా ఆ కుటుంబంలో చేరాడు.

    కాలేజీనుంచి రాగానే స్నానం చేయటం ఆమె అలవాటు. కానీ ఆ రోజు అలా చేయకుండా పడుకుంది. ఎవరు చెప్పారో ఏమోగానీ అయిదు నిముషాల్లో భవానీశంకరం కారువచ్చి ఆగింది. ఆయన హడావుడిగా లోపలికి వస్తూ "ఏమ్మా వంట్లో బాగాలేదా" అన్నాడు.

    ఆమె దానికి సమాధానం చెప్పకుండా, "నువ్వు నా మీద గూఢచారుల్ని పెట్టావా నాన్నా" అంది.

    భవానీశంకరం తెల్లబోయి "అదేమిటమ్మా" అన్నాడు.

    "ఈ రోజు నా దినచర్యలో వచ్చిన చిన్న మార్పుకూడా నీకు అయిదు నిముషాల్లో తెలిసిపోయిందీ అంటే అలాగే అనుకోవాలి మరి" అంది నవ్వుతూ.

    వచ్చి, మంచంమీద కూతురి పక్కన కూర్చుంటూ "ఇంతకీ నా ప్రశ్నకి జవాబు చెప్పలేదు" అన్నాడు.

    "ఏ విషయం నాన్నా?"

    "ఈ రోజు నువ్వు అదోలా వున్న సంగతి".

    "అబ్బే- ఏం లేదే...."

    "ఈ పరీక్షలయిపోగానే మీ పెళ్ళి చేసేద్దామనుకుంటున్నానమ్మా. ఏమంటావ్?"

    అసంబద్ధమూ ,అప్రస్తుతమూ అయిన ఆ విషయం అంత హఠాత్తుగా, ఊహించిన రీతిలో ఆయన వద్దనుంచి వచ్చేసరికి ఆమె తెల్లబోయింది. అది ఆమెకి ఎంత షాక్ అంటే- ఆమె వెంటనే సమాధానం చెప్పలేకపోయింది. ఆయనకా విషయం తెలుసు. అందుకే అలా అడిగాడు. అకస్మాత్తుగా అలా ఇరుకున పెట్టేస్తే అవతలి మనిషి మనసు స్వచ్చందంగా బయటపడుతుందని ఆయన అనుభవం నేర్పింది.

    "ఒకే ఇంట్లో వుంటూ ఇంక ఆలస్యం ఎందుకమ్మా? అంత మంచిదికాదు కూడానూ. ఆ చేసేదేదో తొందరగా చేసి అతడికి వ్యాపారం అప్పగిస్తే నాకూ సగం బాధ్యత తీరిపోతుంది" ఓరగా చూస్తూ అన్నాడు.

    ఆమె వెంటనే జవాబు చెప్పలేకపోయింది. ఏదో అస్పష్టమైన సందిగ్ధత.

    పది సంవత్సరాలుపైగా కలిసివున్నారు. అంతా సెటిల్ అయిపోయినట్టే. రాకేష్ లో వంక పెట్టడానికేమీలేదు. అయినా...అ...యి....నా....

    ప్రేమకి అన్నీ బావుండటమొకటే కాదు కావల్సింది. ఇంకేదో వుంది.

    ఆమె ఇబ్బందిగా తలెత్తి "ఇంకో ఆర్నెల్లు అయిన తరువాత సంగతి ఇప్పుడే ఎందుకు నాన్నా" అంది.

    ఆయన తేలిగ్గా వూపిరి పీల్చుకున్నాడు. ఆమెగానీ ఈ ప్రశ్నకు సిగ్గుపడుతూ "నీ ఇష్టం నాన్నా" అని అర్ధాంగీకారం తెలిపివుంటే అతడు చాలా ఇబ్బందిలో పడి వుండేవాడు. రాకేష్ మీద కూతురికి ఇంకా "స్పష్టమైన ఇష్టం" ఏర్పడకపోవటం ఆయనకి సంతోషాన్నిచ్చింది. ఈ రోజున తెలిసిన విషయాల గురించిన పూర్తి సమాచారం సేకరించటానికి ఈ మాత్రం సమయం చాలు. తేలికపడిన మనసుతో-

    "ఇంతకీ నేను అడిగిన విషయం చెప్పనేలేదు" అన్నాడు.

    "ఏమిటి నాన్నా?"

    "ఈ రోజు ప్రొద్దున్నుంచీ యిలా వున్నావేం?"

    "ఏం లేదు నాన్నా, చెప్పానుగా".

    "చూడమ్మా. చిన్నప్పటినుంచి నేనే నిన్ను పెంచేను. తండ్రిగా అదలా పక్కన పెట్టు. ఒక బిజినెస్ మెన్ గా అవతలివారి మనసుల్ని చదవటం మాకు వెన్నతో పెట్టిన విద్య. నీలో వెంట్రుకవాసంత మార్పు వచ్చినా అది నేను పట్టెయ్యగలను. కాదంటావా... ఇక చెప్పు."

    ఆమె తప్పదన్నట్టుగా "చాలా చిన్న విషయం నాన్నా" అంది. అతడు మాట్లాడకుండా, కొనసాగించమన్నట్టు మౌనం వహించాడు. ఆ నిశ్శబ్దంలో నుంచి ఆమె కంఠం సన్నగా వినిపించింది.

    "రాత్రి కలొచ్చింది నాన్నా. అంతా చెప్తాగానీ నవ్వకేం! నేనిలాగే పడుకుని వున్నానట. ఓ అర్ధరాత్రి ఆకాశమార్గాన వెళ్తూ వెళ్తూ బాల్కనీ కిటికీలోంచి పార్వతి నన్ను చూసి శంకరుడితో... అదిగో నవ్వుతున్నావు".

    "లేదు.... లేదమ్మా. చెప్పు".

    ".....'ఈ అమ్మాయికి నా పేరే పెట్టుకున్నారు. చూస్తే జాలేస్తుంది. ఏదైనా వరం ఇద్దామండీ' అందట. ఆయన సరే అని ఇద్దరూ క్రిందకి దిగారుట. నన్ను లేపి 'నీకేం కావాలో కోరుకో' అన్నారట. నేను మొదట్లో ఆశ్చర్యపోయినా, వెంటనే తేరుకున్నానట" అంటూ నవ్వింది... ఆమె కంఠంలో అకస్మాత్తుగా మార్పు వచ్చింది. కాస్త బాధ, కాసింత ఆర్ధ్రత మిళితమైన గొంతుతో నెమ్మదిగా పలికింది.

    "ఆ దేవదేవులముందు నేను మోకాళ్ళమీద ప్రణమిల్లి చేతులు జోడించి అన్నానట- 'ఏనాడు చేసుకున్న పుణ్యమో నాకు కాస్తో కూస్తో చదువు అబ్బింది. పోతే మంచి నాన్నగారున్నారు. డబ్బు సమస్య లేదు. నా కళ్ళకి కాస్త మెరుపు ఇవ్వండి చాలు... ఇంకా.... ఇంకా... వీలైతే నా కాలు బాగుచెయ్యండి చాలు...' అన్నానుట".

    పెదాలు బిగిస్తే ఏడుపు ఆగుతుంది కానీ రాలే చుక్కని కనురెప్ప ఆపలేదు. అంత పెద్ద బిజినెస్ టైకూన్ కూడా కదిలిపోయి, ఆమె తల మీద చెయ్యివేసి "బాధపడకమ్మా" అన్నాడు. 

    "కన్నీళ్ళతో నవ్వి, "బాధా! బాధెందుకు నాన్నా" అని వెనక్కివాలి, కిటికీలోంచి బోగన్ విల్లా కొమ్మని చూస్తూ అంది.... "నా కిలాటి కలవచ్చిందీ అంటే నా సబ్ కాన్షస్ మైండ్ లో ఎక్కడో నేను దీని గురించి ఆలోచిస్తున్నానన్నమాట! ఏ ఆలోచనైతే నేను దూరం చేసుకోవాలనుకుంటున్నానో ఆ ఆలోచన నన్ను వదిలిపోలేదన్నమాట. నా అందవిహీనత గురించి కాదు నాన్నా నా బాధ. ఆ ఆలోచన వచ్చినందుకు..."

    "కానీ-"

    "నన్ను కొంచెంసేపు ఒంటరిగా వుండనివ్వు నాన్నా".

    ఆయన ఏదో అనబోయి అంతలోనే మనసు మార్చుకుని, తలూపి అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు. ఆమె వంటరిగా మిగిలింది. తలదిండు వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది. రెండు నిముషాలయిన తరువాత సర్దుకుని, పక్కనే స్టూల్ మీద వున్న పుస్తకం అందుకుని విప్పింది.

    పుస్తకం తీసుకోబోతూ వుండగా ఆమె దృష్టి అప్రయత్నంగా కాలిమీద పడింది. తోటకూరకాడలా వేలాడుతున్న కాలుని పక్కమీదకు సరీగ్గా సర్దుకుని తిరిగి చదవటం మొదలుపెట్టింది!

    పేథాలజీ ఆమెకి చాలా కష్టమైన సబ్జెక్టు!!! రోగుల గురించి వివరించే శాస్త్రం అది. మనిషి ఆనందంగా వుండటం ఇష్టంలేక పేథాలజీ అవసరాన్ని సృష్టించినట్టున్నాడు భగవంతుడు. అదృష్టం ఏమిటంటే ఆమె చదువుతూన్న 'ప్లాంట్ పాథాలజీ'లో మాత్రం పోలియో గురించి వుండదు. తన కాలికున్న పోలియో గురించి తిరిగి ఆమెకు గుర్తుచేయటానికి.

   
                         3


    రాత్రి పదయింది.

    చిన్న సందు. ఆరేడు అడుగులకన్నా ఎక్కువ వెడల్పు వుండదు.

    సందు అంతా సిమెంట్ రాళ్ళు పరిచి వున్నాయి. సైకిళ్ళు వెళ్ళటానికి వీల్లేకుండా మరీ వాలుగా వున్నచోట్ల మెట్లున్నాయి. మురికి కాలువలోంచి బయటకు ప్రవహించిన నీళ్ళు రోడ్డుకి సగం వరకూ ఆక్రమించి వున్నాయి.

    నిజానికి అది సందుకాదు. నాలుగైదు అంతస్థులున్న భవంతులు అటూ ఇటూ వున్నాయి. వాటిమధ్య ఏర్పడిన సందు అది. మనుష్య సంచారం చాలా తక్కువ. ఎత్తయిన భవంతులు అవటంచేత వెలుగే పడటంలేదు. ఎప్పుడూ చీకటే నాట్యం చేస్తూ వుండటంవల్ల అక్కడ గాలి కూడా అదోరకమయిన వాసనని సంతరించుకుంది.

    ఆ సందులో ఇద్దరు నడుస్తున్నారు. ఒకడు పొట్టిగా లావుగా వున్నాడు. ఇంకొకరు పొడుగ్గా వున్నారు. చలిలేకపోయినా మొహం చుట్టూ మఫ్లర్లు కట్టుకున్నారు.

    "పరీక్ష చాలా కష్టంగా వుంటుందా?" పొడుగ్గా వున్న వ్యక్తి అడిగాడు.

    "అంత కష్టం వుండదు. కానీ మనసులో కల్మషం పెట్టుకుని వస్తే మాత్రం మరణం తప్పదు- నీకూ నాకూ ఎవరికైనా సరే. నమ్మకం ముఖ్యం. కొంతమంది దేవుణ్ణి నమ్ముతారు. కొంతమంది దెయ్యాన్ని నమ్ముతారు. ఇప్పటివరకూ వాళ్ళు రాజ్యమేలారు. ఇక మనం ఏలబోయే రోజు వచ్చింది".

    "ఎప్పుడు?"

    "దగ్గరకు వచ్చిందని తెలుసు. కానీ ఎప్పుడో తెలీదు. అది ఎప్పుడొస్తుందో, ఎలా వస్తుందో ఒకరికే తెలుసు".

    "ఎవరికీ?'

    పొట్టి వ్యక్తి మొహంలో అకస్మాత్తుగా మార్పు కనబడింది. 'అతడి'ని తలుచుకోవటంవల్ల వచ్చిన మార్పు అది. తనని తాను సంబాళించుకుంటూ నెమ్మదిగా అన్నాడు- "మహాదష్టకి".

 Previous Page Next Page