Read more!
Next Page 
మారనికాలంలో మారినమనుషులు పేజి 1

                                 


                   మారని కాలంలో మారిన మనుషులు
                                        __ కురుమద్దాలి విజయలక్ష్మి  

                           
    అయిదు గంటలయింది.
    శ్రీపతి ఆఫీసు నుంచి ఇంట్లో అడుగు పెడుతూనే బాత్ రూమ్ లోకి దూరాడు. కాఫీ అయినా తాగకుండ.
    శకుంతల మనసులో లీలగా అనుమానం ప్రవేశించింది. అలా వంటగదిలో కూర్చుండిపోయింది.
    శ్రీపతి స్నానం చేయటం అయింది కాబోలు. బెడ్ రూమ్ లోంచి కేకపెట్టాడు. "శకూ! కాఫీ తీసుకురా!" అని.
    శకుంతల కాఫీ కప్పుతోపాటు అరిటికాయ బజ్జీలు ప్లేటు నిండుగా పెట్టుకుని తీసుకు వచ్చింది.
    "ఇప్పుడు బజ్జీలెందుకు? అనవసరం శ్రమ, రెండేసి బజ్జీలు నోట్లో కుక్కుకుంటూ అడిగాడు శ్రీపతి.
    "కృష్ణవేణి సినిమాకి వెళదామని వంటచేసి మీకోసం రెడీగా కూర్చున్నాను. మీదే ఆలస్యం. మీకిష్టమైన బజ్జీలు చేసి కాకాపడదామనుకున్నాను. రెడీ కండి హాలు దగ్గరేగా. నడచిపోవచ్చు. అన్నట్లు యీ సినిమా ఇవాల్టితో ఆఖరట."
    శ్రీపతి గొంతులో కష్టంగా వెలక్కాయ బదులు అరటికాయ బజ్జీ పడింది. కప్పు వేడికాఫీ రెండు గుక్కల్లో తాగి కంఠం సవరించుకున్నాడు.
    "సుందరం బర్త్ డే యీరోజు, పార్టీ ఇస్తున్నాను. ఆఫీసునుంచి ఇటేవచ్చేయి అన్నాడు. శకూతో చెప్పి తప్పక వస్తానని మాట ఇచ్చి ఇలా వచ్చేశాను."
    "మీ ఫ్రెండ్ సుందరం మనింటికి నాలుగయిదుసార్లు వచ్చాడు. నాకేం కొత్తలేదు. అక్కడికి మీతోనన్నా తీసుకెళ్ళండి. లేకపోతే పిక్చర్ కన్నారండి," శకుంతల కళ్ళార్పకుండా శ్రీపతిని చూస్తూ అంది.
    "ఛా...ఛా...మొగాళ్ళ పార్టీకి నీవు రావటం ఏమిటి? కావాలంటే నీ ఒక్క దానివీ వెళ్ళు పిక్చర్ కి, అందులో అక్కడ నీబోటి__"
    "ఊ...అక్కడ ఎవర్నయినా డాన్స్ చేయటానికి పిలిచారా?" శకుంతల మధ్యలో అడ్డుతగిలి అంది.
    "అహ, అదికాదు......" నీళ్ళు నమిలాడు శ్రీపతి. 
    "అయితే ఏదో వుందన్నమాట__"
    "ఛా...యీ మధ్య నీకు అనుమానం ఎక్కువయింది." ఇస్త్రీ ఫాంటు మడత విప్పుతూ అన్నాడు.
    "అనుమానం ఎక్కువ కావటం కాదు. నిజం అయింది. నన్ను సినిమాకన్నా తీసుకెళ్ళండి, మీ ఫ్రెండ్ ఇంటికన్నా తీసుకెళ్ళండి." మొండిగా అంది శకుంతల.
    శ్రీపతికి కోపం వచ్చింది. పైకి వ్యక్తం చేయకుండా చిరునవ్వు ముఖాన పులుముకున్నాడు. శకుంతల దగ్గరగా వచ్చి నడుంచుట్టూ చేతులు పోనిచ్చి దగ్గరకులాక్కున్నాడు.
    "శకూ! మొగవాడు బైట తిరక్క చెడిపోతాడు. అవసరం వచ్చినపుడు వెళ్ళాలి. ఫ్రెండ్ పిలిస్తే పోవాలి. ఆఫీసరు కబురంపితే హాజరుకావాలి. ఎన్నో వుంటాయి. చీటికి మాటికి యిలా అనుమానం పడితే నేనేం చెయ్యను చెప్పు."
    భర్త చేతులు బలవంతాన వదిలించుకొని దూరంగా జరిగింది శకుంతల.
    "నా తలమీద చేయివేసి ప్రమాణం చేసి చెప్పండి మీరెక్కడికెళ్ళేది?"
    "ప్రమాణం చేయను. నమ్మితే నమ్ము, నమ్మకపోతే మానేయి, సుందరం బర్త్ డే పార్టీకి పోతున్నాను. శ్రీపతి బూటు లేసులు చకచకా ముడేసుకుంటూ అన్నాడు.
    ఆ పార్టీ ఏదో నాకు తెలియకపోలేదు. మీ స్నేహితులంతా కలిసి ఓ మగువను ఏర్పాటు చేసుకుంటారు. ఓ రాత్రి ఖుషీగా గడిపేస్తారు. దురలవాట్లు ఏమీలేవని మురిసిపోయాను. అన్నిటినీ మించిన పెద్ద అలవాటేవుంది. నాలో లోపం వుండి తిరిగినా అర్ధం వుంటుంది. ఏ విషయంలో మీకు లోటు చేశాను? చెప్పండి!"
    శకుంతల శ్రీపతికి అడ్డంగా నుంచుని భుజాలుపట్టుకుని ఆవేశంగా వూపుతూ అడిగింది.
    "నువ్వేం లోటు చేయలేదు శకూ! నేమటుకు నీకేమన్నా లోటు చేశానాచెప్పు? ఏ చీరకావాలంటే ఆ చీర, ఏ నగ కావాలంటే ఆ నగ నువ్వు కోరిన ప్రతికోర్కె తీర్చాను. ఫ్రెండ్ ఇంటికి పార్టీకి వెళుతుంటే అడ్డుతగలటం ఏం బాగుండలేదు" శ్రీపతి సానునయంగా అన్నాడు.
    "టీ పార్టీ అయితే అడ్డుపెట్టేటంత మూర్ఖురాలిని కాదండీ. మగువపార్టీ. అదే నా బాధ. మీకు నిద్దట్లో పైకి కలవరించే అలవాటుంది. మీ ఫ్రెండ్స్ తో మాట్లాడినప్పుడు విన్నాను. పక్కింటి సరోజ ఎవరినో అన్నట్లు మీ గురించి వ్యంగ్యంగా అంది. మీలాల్చీమీద కాటుక చారలు, బుష్ షర్టుమీద లిప్ స్టిక్ ముద్రలు, సెంటు పరిమళం మీవంటి మీద, మీ ఉంగరాల జుట్టులో ఇరుక్కున మల్లెపూవులు మీపార్టీకి గుర్తులు. ప్రమాణం చేయమంటే చెయ్యి వెనక్కుపోతున్నది. చెప్పండి. నా అనుమానం అబద్ధమే అంటారా!" శకుంతల ఆవేశపడిపోతూ అడిగింది.
    "నువ్వు పొరపడుతున్నావంటే నమ్మవు. ఎలా నమ్మించాలో నాకు తెలియటంలేదు. యీ ఒక్కసారికి వెళ్ళివస్తాను.ప్లీజ్ అన్నాగా! మా మంచి అమ్మాయి. నామాట వింటుంది" శ్రీపతి, శకుంతల గడ్డంపట్టుకున్నాడు.
    "మంచి అమ్మాయిని కాబట్టే, మీ నటనకి లొంగిపోయాను. ఇహపై విననూ వినను. మీ యిష్టమొచ్చిన చోటికి మీరు పొండి. నా యిష్టమొచ్చిన చోటికి నేపోతాను.
    "గుడ్ గరల్, లేకపోతే లోకం ఏమీ అనదు. నువ్వు పోతే లోకం కాకుల్లా పొడుస్తుంది. ఆడవాళ్లు గోరంతని కొండంతలుగా వూహించి తాను బాధపడేదిగాక ఎదుటి వారిని బాధపెడతారు. నువ్వూ అంతేనోయ్!"
    "ఇలా కబుర్లు చెప్పే యిన్నాళ్ళూ మీ యిష్టమొచ్చినట్లు తిరిగారు. ఇవాళ వూరుకోను. తాడోపేడో తేల్చి నా కంఠం నొక్కి వెళ్ళండి" శకుంతల తలుపుకి అడ్డంగా నుంచుని అంది.
    "నువ్వు మొండివయితే, నేను జగమొండిని శకూ! నీ వంటిమీద చెయ్యి వేయటం, నీ కంఠం పిసకటం పొరపాటున కూడా చేయను. సుందరంతో వస్తానని మాట యిచ్చాను కాబట్టి వెళ్ళక తప్పదు. ఆడినమాట తప్పటం నాకలవాటు లేదు" శకుంతల చెయ్యిపట్టుకు యితలకు గుంజి తలుపు తీసుకుని బైటకు వెళ్ళిపోయాడు శ్రీపతి.
    దృఢంగా ఎత్తుకుతగిన లావుతో వుండే శ్రీపతి, శకుంతల సన్నటి నడుంచుట్టూ ఎడంచేయి పెనవేసి గిరగిరా తిప్పేవాడు ఎన్నోసార్లు. శకుంతల మరోసారి శ్రీపతిని బైటకు పోనీయకుండా తలుపుకి అడ్డంనుంచున్నా ఎడంచేత్తో బొమ్మని ఎత్తినట్టు ఎత్తి పక్కనపెట్టి వెళ్ళగలడు శ్రీపతి.
    అందుకే ఏం మాట్లాడలేక ఎదురుతిరగలేక అవాక్కయి నుంచుండి పోయింది శకుంతల. చకచకా హుందాగా అడుగులేస్తూ వెళుతున్న శ్రీపతిని చూస్తూ.
    శ్రీపతి కనుమరుగయిందాకా చూచి, నిసృహగా వచ్చి మంచంమీద కూలబడింది శకుంతల.
    "వారు అన్నివిధాలా మంచివారే. యీ ఒక్క విషయంలో తప్ప. చెడు స్నేహమే. యీ విషయంలో దారితప్పించింది. ఏదడిగినా కాదనరు పార్టీ విషయంతప్ప, పోనీ అని వూరుకోటానికి ఏ వగలాడో మత్తుజల్లిందంటే తాళికట్టి ఇంటికి తీసుకువచ్చినా తీసుకువస్తారు. అప్పుడు చింతించి ప్రయోజనం లేదు. మార్చాలి__మార్చాలి__ఎలా?
    వారు ఇంటికి వచ్చేటప్పటికి ఓ లెటర్ రాయాలి. "నేను పుట్టింటికి పోతున్నాను మీరు మారి.....నా అవసరం వుందని గ్రహించిననాడు యీ యింట్లో కాలుపెడతాను అని" మారారా సరి లేకపోతే ఎవరిదారివారిదే.
    గడియారం "ఠంగ్, ఠంగ్,"మంటూ ఆరుగంటలు కొట్టింది.
    శకుంతల ఉలిక్కిపడింది. ఎవరో హెచ్చరించినట్లయి.    

Next Page