Next Page 
అనురాగ జలధి పేజి 1

                                 


                            అనురాగ జలధి

                                                                       __ యామినీ సరస్వతి

 

                                                     


   కర కరమని ప్రొద్దు పొడిచే వేళకి మెళుకువ వచ్చింది శ్రీకర్ కి. రైలు వేగంతో కలిగే ఉయ్యాల వూపులకి ఏ అర్ధరాత్రో గాఢంగా నిద్ర పట్టేసిందతనికి. అలసట కలిగితే స్థలంతో, పడకతో నిమిత్తం లేకుండా నిద్రపట్టేస్తుందనిపించిదతనికి.
    అలాగే పడుకుని పైకి చూశాడు. కంపార్టుమెంట్ పైకప్పు కనిపించింది.
    దానిని చూడగానే అతనిలో ఆలోచనలు కలిగాయి.
    "ఈ కప్పులాగే తన ధ్యేయానికి పరిమితం వచ్చేసింది. యెన్నెన్ని ఊహలతో, యెన్నెన్ని ఆశలతో వెళ్లేడు తను అక్కడికి. గట్టిగా నాల్గు నెలలు గడిచే సరికి అంతా అయిపోయింది.
    అక్కడితో శాశ్వతంగా బంధం తెగిపోయింది. తను ఖాళీ కాగితంపై సంతకం చేసి యిచ్చి వచ్చాడు.
    దాంతో తన బ్రతుకు కూడా ఖాళీ అయిపోయింది. తన వ్యక్తిత్వమే ఖాళీ పడిపోయినట్లయింది. అంతాశూన్యం సర్వం శూన్యం. ఏదీ మిగలని దుస్థితి. అయితే తనలో పట్టుదల చావలేదు.
    ఇప్పుడిక తిరిగి తను ఆ ఖాళీని భర్తీ చేసుకోవాలి. నిరాశని నిస్పృహని జయించి, జీవితాన్ని సాధించాలి. తిరిగి  తన బ్రతుకులో కొత్తదనం రావాలి. తనకి కొత్త జీవితం కావాలి. దాన్నెలాగయినా సాధించుకోవాలి.
    తనలో దైన్యం మొలకెత్తకూడదు.
    అధైర్యం తలెత్తకూడదు.
    ఆ ఇంటిని వదిలి వచ్చేవేళ తన మనస్సులో, తన మాటల్లో, తన చూపులలో ప్రతిఫలించి నిలిచిన ఆ ధైర్యం శాశ్వతంగా వుండిపోవాలి తనలో! కనీసం తిరిగి తనో మనిషి అనిపించుకునే వరకైనా వుండాలి!
    ఇది తనకి ఛాలెంజ్! బ్రతుకును నిర్మించుకోవటం గొప్పకాదు!
    చెడిపోయిన బ్రతుకుని సరిదిద్దుకుని తిరిగి చక్కబరచుకోవటంలోనే వుంది గొప్పతనం.
    తనలో ఆ గొప్పతనం వుందని తను నమ్మేడు. ఆ నమ్మకమే తనని బి.ఏ.పట్టా సాధించేట్టు చేసింది. తన వంశంలో ఎవరూ తనకి పూర్వం డిగ్రీ హోల్డర్స్ లేరు. తనే మొట్టమొదట పట్టభద్రుడు.
    చదువుకోసం తనెన్ని కష్టాలు పడ్డాడు? యెందర్నో యాచించాడు. యెన్నెన్నో చేశాడు. ట్యూషన్స్ చెప్పాడు. రాత్రిళ్ళు బాగా ప్రొద్దుపోయేదాకా చదివాడు. తెలిసిన వాళ్ళింట్లో గది ఉచితంగా యిచ్చినందుకు వాళ్ళకి చాకిరీ చేశాడు. ఇన్ని చేసి చదువుని అశ్రద్ధ చేయలేదు.
    అందుకే తెలివిగలవాడనిపించుకున్నాడు. మంచీ చెడు, మర్యాద మన్ననా తెలిసినవాడనిపించుకున్నాడు. యోగ్యుడు, దక్షుడు అనిపించుకున్నాడు. అందుకోసం తనెంత కృషి చేశాడు?
    "ప్చ్! అయితే ఏం లాభం? తన మంచీ మర్యాద, తన తెలివీ చదువు అన్నీ ఆ నిర్ణయంలో దెబ్బతిన్నాయి. అన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి..."
    "టికెట్ ప్లీజ్!"
    ఆలోచనలనుంచి బయటపడి అప్రయత్నంగా జేబులోంచి టికెట్ తీసియిచ్చాడు. టికెట్ పై మార్కుచేసి తిరిగి యిచ్చాడు. తర్వాత ముందుకి వెళ్ళిపోయాడు టి. టి. సి.
    ఆలోచనల చైన్ తెగిపోయింది.
    లేచి బెర్తుపైనుంచి దిగాడు. హోల్డాల్ చుట్టేడు. కిందికి దిగి సీట్లో కూర్చున్నాడు...ట్రెయిన్ వేగంగా వెళుతుంది. అనుభవాలతో ఆలోచనలతో నోరంతా చేదుగా వున్నట్లనిపించింది. మనస్సూ చేదుగానే వుంది.
    టాయ్ లెట్ రూమ్ కి వెళ్ళి తిరిగి వచ్చేసరికి టి.టి.సి. ఎదురుగా వస్తున్నాడు. అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అతను ప్రదీప్!
    తన కాలేజ్ మేట్! క్లాస్ మేట్!
    "హాయ్!" పులకరింత కలిగేట్టుగా పిలిచాడు ప్రదీప్.
    అతనూ అదేక్షణంలో చూశాడు శ్రీకర్ ని. చాలా ఏళ్ళ తరువాత మిత్రుడిని చూసిన ఆనందం అతని ముఖంలో తాండవిస్తోంది.
    ముఖంనిండా నిండిన సంతోషం మాటలతో వెలికి వచ్చింది.

Next Page