Previous Page Next Page 
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 19


    లింగం కొరకొరా చూసాడు. ఇంతలో ఫోన్ మ్రోగింది. చిరాగ్గా ఫోనెత్తి "హలో" అన్న లోకనాధం అవతలి గొంతు వినగానే మొహం విప్పార్చుకుని "మీరా.... అరెరే.... ఎంతమాట? కోటీశ్వరులు మీతో నేనెక్కడ.... అలాగే చెప్తాను సార్! అలాగే.... అలాగే" అంటూ గంగిరెద్దులా తల వూపి ఫోన్ పెట్టేసాడు. లింగంవైపు చూసి "తంతే బూర్లగంపలో పడ్డట్లూ ఆ జగపతి కోటని స్వాధీనం చేసుకునే ఉపాయం వాడంతట వాడే నాకు స్వయంగా తెలియజేసాడయ్యా" అన్నాడు.

    "జగపతిగారా! అదెలా?" లింగం ఆశ్చర్యంగా అడిగాడు.

    లోకనాధం సిగరెట్ పెట్టెలోంచి సిగరెట్ తీసి నోట్లో పెట్టుకుని హుషారుగా కాలువూపాడు.

    లింగం అగ్గిపుల్ల గీసి దాన్ని అంటిస్తూ "జగపతిగారు మీకన్నా చాలా పై స్థాయిలో మనిషి కదా! వారికి మీతో ఏం పని పడిందండీ?" అన్నాడు.

    లోకనాధం సిగరెట్ పొగ గుండెల నిండా పీల్చి వదిలాడు. అతనికి చాలా సంతోషం కలిగినప్పుడూ, ఎవరైనా అతిధులొచ్చినప్పుడూ అతను సిగరెట్ త్రాగుతాడు.

    లింగం కళ్ళు విప్పార్చుకుని ఆ పొగని వీక్షిస్తూ వుండిపోయాడు.

    "ఆ జగపతికి ఓ కొడుకున్నాడయ్యా!" అన్నాడు లోకనాధం.

    "ఆయ్!" అన్నాడు లింగం.

    "నాకో కూతురుందయ్యా!" అన్నాడు లోకనాధం లింగంకి కాస్త బోధపడ్డట్లే అయింది.

    "అదా లిటిగేషన్?" అన్నాడు నవ్వుతూ.

    "జగపతి ఆస్తంతా ఆడి కొడుక్కే కదా ఇస్తాడు. నాకు వున్నది ఒక్కగానొక్క కూతురు గనక నేను జీవితాంతం దాన్ని కనిపెట్టుకునే వుంటాగదా! ఇక ఆ జగపతిగాడికి గుండెజబ్బు. బ్లడ్ ప్రెషరూ, షుగరూ లాంటి అడ్డమైన రోగాలూ వున్నాయి కాబట్టి త్వరలోనే టపా కట్టేస్తాడు. అప్పుడిక అల్లుడుగారికి మనమే పెద్ద దిక్కు కాబట్టి అజమాయిషీ.... ఆస్తి మీద హక్కు అన్నీ మనవే! ఏమంటావు?" అని కళ్ళెగరేసాడు.

    లింగం కళ్ళు మిటకరించి చూసాడు. మనసులో ఓరి నక్క పీనుగా! నీకెన్ని మాయదారి ఆలోచన్లురా.... అనుకున్నాడు. పైకి మాత్రం 'ఆహా! తెలివంటే మీదేనండీ. చాణుక్యుడూ, యుగంధరుడూ కోవకి చెందిన వాళ్ళు" అన్నాడు.

    లోకనాధం చిద్విలాసంగా నవ్వి "ఎలా వుంది లోకనాధం దెబ్బ?" అన్నాడు.

    "ఒక్క దెబ్బకి రెండు పిట్టల్లా. అల్లుడూ, ఆస్తీ బాగానే వున్నాయి కానీ మీ పిట్టే ఇంట్లో లేదండీ!" అన్నాడు లింగం.

    లోకనాధం వులిక్కిపడి "అమ్మాయి ఇంకా రాలేదా?" అన్నాడు.

    లింగం జాలిగా చూసి "తీరిక దొరికినప్పుడల్లా ఇనప్పెట్టె దగ్గర కూర్చుని డబ్బులు లెక్ఖ పెట్టుకోవడం తప్ప అమ్మాయి సంగతి ఎప్పుడు పట్టించుకున్నారు లెండి మీరు?" అన్నాడు.

    లోకనాధం విసుగ్గా మొహం చిట్లించి "ఆ దిక్కుమాలిన దాని ఇంటికి వెళ్తానని వెళ్ళిందిగా! ఇంకా దిగబడలేదా?" అని అడిగాడు.

    "తప్పు బాబూ! ఎంతైనా తోడ పుట్టిన చెల్లెలు అలా అనకూడదు" అన్నాడు లింగం.

    "ఆ దరిద్రుడితో లేచిపోయినప్పుడే అది నాకు చచ్చిపోయిన దానితో సమానం అయిపోయింది" మండిపడ్తూ అరిచాడు లోకనాధం.

    లింగం శాంతంగా "ఈడొచ్చిన పిల్లని ఇంట్లో పెట్టుకుని ఎంతకీ పెళ్ళి చెయ్యకపోతే...." అని ఆపేసాడు.

    లోకనాధం వెంటనే "సర్లే.... సర్లే.... ఇంతకీ ఇది దిగబడిందా లేదా కొంపకి?" అన్నాడు.

    లింగం తల అడ్డంగా వూపి "ఏ వూరెళ్ళారో చెప్తే కబురు తెలుసుకుంటాను" అన్నాడు.

    లోకనాధం బుర్ర గోక్కుని "ఏమో, ఏదో పేరు చెప్పింది?

    అయినా ఫోన్లూ గట్రా చేస్తే డబ్బు దండగ, అదే వస్తుందిలే, వెళ్ళి ఎంత కాలమయిందీ?" అన్నాడు.

    "వారం పైగా కావస్తోంది" లింగం విసురుగా చెప్పాడు.

    "ఆహా! వచ్చేస్తుందిలే. ఈలోగా సంబంధం కుదిర్చేస్తాను" అన్నాడు.

    లింగం అడ్డుపడి "అబ్బాయి ఎలా వుంటాడో ఏమో! మన అమ్మాయి చూస్తే బంగారం బొమ్మలా వుంటుంది" అన్నాడు.

    లోకనాధం గొంతు పెంచి "కోటీశ్వరుడి కొడుకయ్యా! ఎట్లా వుంటే ఏం పోయింది? నువ్వెప్పుడయినా నీ జన్మలో కోటి రూపాయలని చూసావా? అది చచ్చేదాకా చూడచ్చు" అన్నాడు.

    లింగం మొహంలో కనపడిపోతున్న అసహ్యాన్ని దాచుకుంటూ "ఓ మాట వాకబు చేసుకుంటే మంచిదయ్యా" అన్నాడు.

    లోకనాధం తల తిప్పి "అసలు.... వాడింకా మన సంబంధానికి ఒప్పుకోలేదయ్యా బాబూ! ఎక్కడైనా నీ ఎరికలో మంచి సంబంధం నాకు సరితూగేది వుందా? అని అడిగాడు. ఆడపిల్ల గలవాడ్ని అట్టా ఒక మగపిల్లాడి తండ్రి అడిగాడంటే ఏవై వుంటుందీ? మనసులో ఇదే వుండి వుంటుందన్నది నా ఆలోచన" అన్నాడు.

    లింగం ఏకీభవిస్తున్నట్లుగా తల వూపాడు. "ఈ విషయానికేం గానీ.... ముందు మన థియేటర్ కి ఓ చాకులాంటి మేనేజర్ కుర్రాడ్ని చూడు. నేను పోయి ఆ రైసు మిల్లు సమస్య సెటిల్ చేసుకొస్తా!" అంటూ లేచాడు.

    "చిత్తం!" అన్నాడు లింగం.

    "అమ్మాయి ఇంట్లోలేదన్న విషయం ఎవరితోటీ అనబోకు! అసలే పరువుకి ప్రాణం విడిచే వంశం మాది!" అన్నాడు రహస్యంగా.

    "అవును! అమ్మాయి పరువు నాకు ముఖ్యం" చెప్పాడు లింగం.

    "భేష్! అందుకేరా నువ్వంటే నాకిష్టం! వెళ్ళి వంట పని చూడు" చెప్పి కదిలాడు లోకనాధం.

    వెళ్తున్న లోకనాధం కోటుని చూస్తూ లోపలున్న చిరుగుల చొక్కాని తలచుకుని విరక్తిగా నవ్వుకున్నాడు లింగం. అడ్డమైన గడ్డీ కరిచి లక్షలు సంపాదించాడు. ఏం లాభం? తను అనుభవించలేడూ, ఇంకోళ్ళని అనుభవించనీయడూ. రేపు కోట్లు సంపాదించినా ఇంతే! ఇదే చెక్క కుర్చీ, పాతపట్టె మంచం, పొగాకు కాడ, నీరు కావి పంచే, అన్నంలోకి ఆవకాయ ముక్కా, పప్పుచారూ!' అనుకున్నాడు.

 Previous Page Next Page