నీ కంట నీరు తిరుగుతోంది! నీ పెదవులు అదురుతున్నాయి.... నన్ను పట్టుకుని గట్టిగా కొట్టాలనిపిస్తోంది కదూ! చూసావా! నీ జీవితాన్ని నిన్ను అనుభవించనీయకుండా నీ అనుభూతులన్నీ దొంగలా ఎలా దోచుకుపోతున్నానో!
రిషీ.... అమలిన శృంగారం, అమర ప్రేమలూ మనకొద్దు. అద్వితీయాలూ, అనిర్వచనీయాలూ ఒద్దుగాక ఒద్దు! అలౌకికాలూ, అంతర్మధనాలూ అసలే ఒద్దు? అలుగుతూ, పోట్లాడుకుంటూ, ఏడుస్తూ, ఓదార్చుకుంటూ కలిసిపోతూ.... ఒక్కటిగా ఒకే గూటిలో అతి మామూలుగా జీవితాన్ని అనుభవిద్దాం!
నీకై గుమ్మానికి కాంక్షా తోరణాలు కట్టి,
మధురోహల మాలలు గుచ్చి,
ఎదురు చూస్తున్నాను. వసివాడి రాలిపోక ముందే వస్తావు కదూ? కష్టపడి దొరికించుకోవడంలోనే ఆనందం వుంటుంది మొద్దూ! చిన్నప్పుడు దాగుడుమూతలు అడలేదా?
చల్లని మలయమారుతాన్ని బ్రతిమిలాడు! పారిజాత సుమ పరిమళాన్ని వెదికి రమ్మని పంపు! ప్రత్యూషంలో మందారం మీద వ్రాలిన మంచు బిందువుపై నాలికతో వ్రాసాను.... చదువుకో! అన్నట్లు చార్ మినార్.... గోల్కొండా చూసావా?
రిషి పిచ్చిగా పదేపదే ఆ పంక్తుల్ని చదివాడు. ప్రతి అక్షరాన్నీ ముద్దాడాడు! ఎంత మోసం చేసావు ఆశ్రితా అని తనకి తెలీకుండానే కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.
వెలుతురు మొహం చాటు చేసుకుని దొంగలా జారుకుంది. చీకటి మాంత్రికుడిలా వికటాట్టహాసం చేస్తూ లోనికి ప్రవేశించింది.
క్రింద కూర్చుని మంచం మీద తల అన్చిన రిషి అలాగే ఉండిపోయాడు. సంపెంగలు పక్కమీద వ్రాలి తమ సుగంధంతో అతన్ని స్వాంతనపరచ చూసాయి. గులాబీ అతని చెంపను తాకి, వుప్పగా వున్న కన్నీటిని రుచి చూసింది.
గులాబీ రంగు కాయితం దోషిలా ముడుచుకుని కూర్చుంది. వెనుక నుండి గాజుల గలగలలు వినిపించాయి. రిషి తల తిప్పేలోపే వచ్చి అతని కళ్ళు రెండు మూస్తూ "నేనెవరో చెప్పుకో!" అంది ఆశ్రిత.
"ఆశ్రితా!" అంటూ రిషి దిగ్గున వెనక్కి తిరిగాడు. అదంతా తన భ్రమ అని తెలిసి కృంగిపోయాడు. "ఆకలేస్తోంది?" గారాలుపోతున్న ఆశ్రిత కంఠం చెవిలో వినిపించింది. చుట్టూ చూస్తే పెను చీకటి!
వంటింట్లోంచి ఎవరో పాదమంజీర ధ్వని చేసినట్లయి ఆశగా లేచి వెళ్ళి చూసొచ్చాడు.
ఖాళీ గిన్నెల మాటునుంచి పిల్లి ఒకటి మ్యావ్ అని లేచి అతన్ని వురిమి చూసింది. రిషి ఉస్సూరని వెనక్కి తిరిగాడు. తిరుగుతుండగా అతనికి బోర్లించిన కుండ కనిపించింది. కుండని చూడగానే అతనికి గోల్కొండ అని ఆశ్రిత వ్రాసిన మాట గుర్తొచ్చింది. గబగబా క్యాండిల్ వెలిగించి మరోసారి ఆ ఉత్తరం చదివాడు, చార్ మినార్. గోల్కొండ చూసావా? అని వ్రాయడంతోనే తన వూరు తెలిపిందన్న మాట అనుకున్నాడు. ఇప్పుడు అతనికి అంత నిస్సారంగా అనిపించలేదు. ప్రయత్నిస్తాను. కష్టపడి సాధించినదే నిజమైన ఆనందాన్నిస్తుంది అని తనకి తనే చెప్పుకున్నాడు.
ఇప్పుడు బాగానే వుంది కదరా! మరోసారి నీతో వస్తానులే! అని అమ్మ మొండిగా తనతో రానందుకు అప్పుడు కోపం వచ్చినా ఇప్పుడు మంచిదే అయింది అనిపించింది. రేపే హైద్రాబాద్ వెళ్ళాలి అనుకున్నాడు.
అంత పెద్ద పట్నంలో ఆమె జాడ ఎలా తెలుసుకోవడం అని అనుకోనేలేదు. మూలనున్న పెట్టె తీసి డబ్బులు చూసుకున్నాడు. బోలెడు రూపాయి నోట్లు కనిపించాయి. అవి ఎలా వచ్చాయో అతనికి తెలిసింది!
* * *
లోకనాధం పొగాకు కాడ కొరికి తపుక్కున వుమ్మి "ఒరేయ్ సెక్రెట్రి ఇదేట్రా ఘాటే లేదూ?" అన్నాడు.
సెక్రెటరీ లింగం వినయంగా చేతులు నలుపుకుంటూ "ఆ ఎదవ నాలిక ఎప్పుడో బెరడు కాసిపోయింది కానీ ఎవరైనా చూస్తే బాగోదు. సిగరెట్ కానీ పైపు కానీ కాల్చండీ" అన్నాడు.
లోకనాధం గుర్రున చూసి "నా నాలికా, నా చుట్టా మధ్యన ఈ పాడు లోకానికేటంట?" అన్నాడు.
లింగం నసుగుతూనే "ఎంతైనా లక్షాధికారి లోకనాధం అని పేరు తెచ్చుకున్నారు గదా దాన్ని నిలబెట్టుకోవడం ధర్మం...."
లోకనాధం మళ్ళీ కస్సుమన్నాడు. "ఎంత కష్టపడితే ఆ లక్ష లొచ్చాయో తెలుసా? డన్ హిల్స్ తాగుతూ, సూట్లు ఏసుకుని తిరిగితే ఇంత కూడ బెట్టేవాడినా? అన్నట్లు ప్రొద్దుట చొక్కా బొత్తాలు కుట్టమన్నాను కుట్టావా?" అని అడిగాడు.
లింగం విసుగ్గా "ఆ కుట్టాను. పేరుకి సెక్రటరీని కానీ అడ్డమైన పన్లూ చేయించుకుంటారు. చివరికి గరిట తిప్పడంతో సహా!" అన్నాడు.
లోకనాధం చిద్విలాసంగా నవ్వి "ఆ రైసు మిల్లు కూలీలు ఎందుకో సమ్మె చేస్తున్నారట నిజమేనా?" అడిగాడు.
"చెయ్యరు మరీ.... ఎక్కడేసిన గొంగళీ అక్కడే అన్నట్లు వాళ్ళ జీతం మాత్రం పెంచరు. బియ్యం ధర మాత్రం ఆకాశాన్నంటిస్తారు" అన్నాడు అక్కసుగా లింగం.
"వాళ్ళుచేసే పనికి ఆ కూలి చాలు లేవోయ్! అయినా ఎంత పెంచితే మాత్రం వాళ్ళ దరిద్రం తీరెను? ఆ! మన భారత్ థియేటర్లో ఏదో అల్లరైందట నిజమేనా?"అడిగాడు.
లింగం విచారంగా "ఔను సార్! పాపం అన్యాయంగా ఆ మేనేజర్ ని చితక్కొట్టారు. పిల్లలు కలవాడు. మీరు పెద్ద మనసు చేసుకుని కాస్త వైద్యం ఖర్చులైనా....."
లోకనాధం వెంటనే మాట మారుస్తూ "అయినా వయసు పైబడ్డ వాళ్ళని పెట్టుకుంటే ఇదే సమస్య! నాలుగు కొట్టలేరు. తినలేరు! ఎవరైనా చాకులాంటి కుర్రాడ్ని చూడవయ్యా అని చెప్తుంటే నువ్వు వినిపించుకోవు. అబ్బబ్బా! అన్నీ నేను చూసుకుంటే ఇంక మీరందరూ ఎందుకయ్యా?" అని గదమాయించాడు.