Previous Page Next Page 
అడుగడుగునా... పేజి 18


    అతను స్నానం చేసి గదిలోకి వచ్చాడు. అద్దం ముందు నుంచొని మళ్ళీ ఈలపాట మొదలు పెట్టి అద్దంలో తన అందాలు చూసుకుంటున్నాడు.

    అవంతి కొద్దిసేపు తర్వాత బీరువా సందు నుంచి కొద్దిగా ముఖం బయటకు పెట్టి చూసింది.

    అతని ముస్తాబు పూర్తయినట్లుంది. షర్టు బటన్స్ పెట్టుకుంటున్నాడు.

    అతనెవరో కాదు.

    అవంతి గుండె కొట్టుకోవడం ఒక్కసారి ఆగి మళ్ళీ వెంటనే పనిచేయడం మొదలు పెట్టింది.

    "భగవాన్ ఇప్పుడు నాకేం దారి!" అవంతి అనుకుంది.

    వింతో విడ్డూరమో తర్వాత సంగతి, వచ్చి వచ్చి ఇక్కడే దాక్కోవాలా! ఖర్మకాకపోతే ఏమిటి? ఈ ఇంట్లో చంద్ర వుంటాడని తనేం కలగందా! నిజం ఆలోచించాలంటే ఈ అబ్బాయి చాలా మంచివాడు. కోరిందే తడవుగా తనతో సహకరించి సాయం చేశాడు. అలాంటి మంచివాడికి కనీసం తను థాంక్స్ అయినా చెప్పలేదు. ఆటో దొరకటమే ఆలస్యంగా తుర్రుమంది.

    సరే ఆ రోజు అలా జరిగింది. మళ్ళీ స్టేషన్ లో ఎదురయ్యాడు కదా! పోనీ తనని చూసి వూరుకున్నాడా, చెయ్యి గట్టిగా పట్టేసుకొని గతాన్ని కెలుకుతూ కూర్చున్నాడు. తన అసలు పేరు అతనికి చెప్పడమే పెద్ద తప్పు. పైగా మామూలు రూపంతో రెండు సార్లు అతని కంటపడింది. తన జాబ్ ఎలాంటిది! అణువంత చిన్న తప్పిదం కూడా తను చేయకూడదు.

    అందుకే....అందుకే....ఇంకా గత్యంతరం లేని పరిస్థితుల్లో అతన్ని రౌడీగా చిత్రిస్తూ మాట్లాడింది. దాంతో తను తప్పించు కోవటానికి వీలైందిగాని అతను నలుగురి చేతుల్లో పడ్డాడు. ఎలా తప్పించుకున్నాడన్నది తర్వాత. ముందు దెబ్బలు తిన్నాడన్నది ఖాయమే కదా! అంటే అతను తనవల్ల వాళ్ళచేత దెబ్బలు తిన్నాడు.

    అదే ఎవరూ లేనిచోట చంద్రశేఖర్ ఆజాద్ తనకంటపడితే  ఏదో సాకు చెప్పి మర్యాదగా మాట్లాడేది. పదుగురూ తిరిగే చోట చెయ్యిపట్టుకోవడంతో అతన్ని నేరస్తుడ్ని చేయక తప్పలేదు. జరిగిందేదో జరిగింది. జీవితంలో అతనికి తారసపడకూడదనుకుంది. కాని ఇప్పుడు జరిగిందేమిటి? ఈ కవికుమారుని గదిలోనే దాక్కోవాల్సి వచ్చింది.

    తనని ఈ వేషంలో చూస్తే అసలు నమ్మాడు. ఇంకా ఏమి చెప్పినా తన్ని తగలేస్తాడు. అబద్ధం అనేది ఒక్కసారి పనిచేసేను. రెండు సార్లు పనిచేసెను. మూడోసారి వికటిస్తుంది. పైగా ఇప్పుడు బీరువాచాటు నుంచి అతని, ముందుకు వెళ్ళి "సారీ బ్రదర్!" అంటే వెంటనే.

    "రామ్మారా!" అన్న మాట వినపడింది. అవంతి ఆలోచనా స్రవంతిలో నుంచి ఉలికిపాటుతో బయటపడింది.

    "రామ్మారా!" అన్నాడు చంద్ర.

    చంద్ర తనని కనిపెట్టాడా? తను దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా గదిలోకి ఎవరైనా వచ్చారా! ఆ రెండో మనిషి గొంతు ఏది? వినపడదేం?

    చంద్ర ఎవరిని పిలిచాడో అవంతికి అర్ధం కాలేదు.  

    "నీకేం నిక్షేపంగా వున్నావ్" మళ్ళీ చంద్ర గొంతు వినపడింది.

    చంద్ర మాట్లాడేది ఎవరితో?

    తనని అయ్యేది, మరొకరిని అయ్యేది చూసి తెల్సుకోవడం మంచిది అనుకున్న అవంతి నెమ్మదిగా తల బైట పెట్టింది.

    ఆశ్చర్యపోవడం అవంతి వంతయింది.

    చంద్ర చిన్న వి.ఐ.పి. సూట్ కేస్ మంచంమీద పెట్టి అటు తిరిగి సర్దుకుంటూ గుడ్డలతో మాట్లాడుతున్నాడు.

    "చూడు భాయ్! నీ ముఖం వెలతెలా పోవడం లేదుగాని ఈ మధ్యనే కొర్రుపట్టావ్, కనుక నిన్ను విసర్జిస్తున్నాను" అంటూ పూలబంగీని దండాన పారేశాడు.

    అవంతికి నవ్వు వచ్చింది.

    "బ్రదర్! నీవు నాతో వుండాలి. నలగని పువ్వులా వున్నావ్" అంటూ మల్లెపువ్వులాంటి ఫ్యాంటు షర్టుని సూట్ కేస్ లో పెట్టుకున్నాడు.

    సరీగ అప్పుడే దబదబ తలుపు చప్పుడు అయింది.

    చంద్ర విసుక్కుంటూ లేచి వెళ్ళి తలుపు తీశాడు.

    అవంతి చెవి యొగ్గి బీరువా చాటున నక్కింది.

    వచ్చిన వాళ్ళు ఇద్దరు మామూలు దుస్తులతో వున్నారు. ముఖాలు చాలా కఠినంగా వున్నాయి.

    "ఎవరి కోసం. ఎవరు కావాలి!" చంద్ర అడిగాడు.

    "ఈ యింట్లో ఎవరెవరు వుంటున్నారు?" ఇద్దరిలో ఒకతను కరకుగా అడిగాడు.

    రెండో అతను మెడ రిక్కించి డేగ చూపులతో లోపలికి చూస్తున్నాడు.

    "ఎవరు కావాలని నేను అడుగుతుంటే ఈ యింట్లో ఎవరెవరు వుంటున్నారని నీ వడుగుతావేవయ్యా! నేను నా ఫ్రెండు వుంటున్నాము. వాడు లేడు. నేను ఒక్కడినీ వున్నాను. నా ఫ్రెండు వారం దాకా రాడు. వాడు రాంచీ వెళ్ళాడు. నేను మా వూరు వెళ్ళటానికి ప్రయాణం అవుతున్నాను. ఇంతకీ మీరెవరు! ఎవరు కావాలి!" చంద్ర గుమ్మం దగ్గరే నుంచుని అడిగాడు.

 Previous Page Next Page