మరో 'విజయ విలాసం'
వాలు మీలు డాలు నేలింత కన్గవ
సోము గోము నోము రామ మోము
మించు మించు సంచు మించు బాలిక
మిన్ను చెన్ను తన్ను కన్నె నడుము.....
ఈ పద్యం వినిపిస్తే - ప్రబంధ కవిత్వంతో అంతో ఇంతో పరిచయ ఉన్నవాళ్ళు చప్పున ఇది 'విజయ విలాసం' పద్యమనేస్తారు.
నిజానికి ఇది విజయ విలాసంలోని పద్యమే అయితే 'చేమకూర' విజయ విలాసం కాదు. గణపవరపు వేంకట కవి 'ప్రబంధ రాజ వేంకటేశ్వర విజయ విలాసం'---
ప్రబంధాల్లో ఆశుచిత్ర విస్తర వర్ణన అనే చిత్ర కవిత్వం ఎక్కడో ఒకచోట చెప్పడం మన ప్రబంధ కవుల నియమం. కానీ అంతా చిత్ర కవిత్వమే చెప్పిన ఏకైక ప్రబంధం "ప్రబంధ రాజ వేంకటేశ్వర విజయవిలాసం" ఎక్కడో ఒకచోట అలాటి పద్యం వుంటేనే దాన్ని ప్రతిపదార్ధంగా వివరిస్తే తప్ప సులువుగా అర్ధంకాదు. అలాంటిది గ్రంధానికి గ్రంధమే మొత్తం అలావుంటే ఇక చెప్పేదేముంది.
మీలు అంటే మీనులు - వాలు మీలు అంటే వాలు కన్నులున్న చేపలు ఆడవాళ్ళను మీన నేత్రలు అంటారు. చేప ఆకారంలో వుండి జింక కళ్ళలా - చేప కదలికతో మెరిసే విరిసే కనులున్న అమ్మాయిని మీన నేత్ర అంటారు. ఆ ఇంతి కనుగవ - రెండు కళ్ళు - వాలు కనుల చేప డాలు -- అందాన్ని ఏలుతుందట - అంటే చేప కనులతో పోలిక కాదు - దాన్ని మించి వున్నాయనీ అర్ధం ---
సోము అంటే చంద్రునియొక్క - గోము అంటే అందచందాలు ఓమడమంటే జయించడం రామ అందగత్తె ఆ అందగత్తె ముఖ చంద్రుడు చంద్రుని అందచందాలను జయించేలా వున్నాడట---
మించు అంటే మెరుపు తీగె మించు మించు అంటే ఆ మెరుపుల్లో మెరిసే మెరుపు. దాని సంచు అంటే అందము. ఆ బాలిక మేను. మెరుపు తీగల్లో మెరుపు తీగ అందాన్ని మించుతుందట - ఆడవాళ్ళ శరీరాన్ని మెరుపు తీగతో పోల్చడం కవి సమయం. అయితే ఈ బాలిక శరీరం మెరుపు తీగల్లో మెరుపు తీగ అందాన్ని మించి పోతున్నదట.
మిన్ను అంటే ఆకాశం. ఆకాశం గగనం శూన్యం అని.... అది ప్రోది చేసుకుని ఆకాశం అంటే శూన్యం అని అర్ధాన్ని లాగారు. చెన్ను అంటే అందం. నడుమును గగనంతో పోలుస్తారు. ఆకాశం కంటికి కన్పిస్తుంది. కానీ నిజానికి అది శూన్యం లేదు. కాబట్టి ఉండీ లేనట్టు, లేనట్టుండే లేలేత నడుమును గగనంతో ఉపమించడం కవి సంప్రదాయం. అయితే ఈ కన్నె నడుము ఈ ఆకాశం ఉనికినే ప్రశ్నిస్తోన్నట్టుగా వుందట ---
ఒక తేలిక పద్యంలోనే ఇంత కసరత్తు చూపిస్తే కొంచెం కఠినమైన పద్యంలో ఎలా మీతి మీరాడో చూద్దాం.
నిను నెమ్మనమున నమ్మిన
ననుమానము మానమాననని నేమమునన్
మననీ నామము నూనెన్నను
మానిక నిన్ను మాననానేమేనా
ఇది నిఘంటువును దగ్గర పెట్టుకొని చీల్చి చెండాడితే కానీ అర్ధం దొరకని పద్యం. దీని తాత పద్యం మరొకటి....
లోలాళీ లాలి లీలా ళిలా లీ లాల లేల లేలిలు లలులే
లోలులై లాలలల ల్లీ లైలల లాలలోల లేలో లేలా....
ఇవన్నీ పండిత ప్రకాండులు వలచి ఒలచి చేతిలో పెడితే మనం "తాపీగా" ఆస్వాదించదగ్గ ఇనుపగుగ్గిళ్ళు --- ఉహూ నారికేళాలు. మన్నించండి నాలికేరాలు---
విజయ విలాసం అన్నందుకు --- అలాంటి పద్యాలు కోకొల్లలు.
హరిపదము బోలుజవరాలి గౌనుకును
మిక్కుటద్దములను గొమరెక్కు చెక్కు చెక్కు
గులుకు దేటుల కింతి ముంగురులు గురులు
గరిమ నెలకన్న కన్నె జఘనము ఘనము
ఇలా సబ్దాశ్రయ శ్లేషచమత్కారం కొంచెమే నిజానికి ఇందులో పాండితీప్రౌఢిమ అంతా ఛందస్సం భంది. ఇదొక చిత్ర బంధ కవిత్వ సరసి.
బంధ కవిత్వంలో గోమూత్రికా బంధంలాటిని చాలామంది కవులు చేసిన చిత్రాలే--- అలాగే ఒక పద్యంలో రెండో మూడో పద్యాలు లాగడం కూడా చాలామంది చేసిన పరిశ్రమే. అయితే ఇందులో ఒక సీసంలో 41 వృత్తాలు ఇమడ్చడం--- నభూతో నభవిష్యతి అనేలా చేసింది మాత్రం గణపవరం వేంకట కవే! (808 పద్యం) పద్యాలకు కందమనో సీసమనో చంపకమాలనో పేరుంటుంది. ఉదా---- శ్లోకగర్భిత చంపకమాలిక--- అంటే చంపకమాల పద్యంలో శ్లోకం వుంటుంది (822)--- అయితే 41 వృత్తాలను ఇముడ్చుకున్న ఆ పద్యం పేరే ఒక పెద్ద వచనంలా వుంటుంది---
ఇలాటి కఠిన క్రీడలే కాక "తేలికయిన ఆటలు" కూడా పద్యాలతో ఆడుకున్నాడు వేంకట కవి--- సంవత్సర యుక్త సీసంలో శ్రీముఖి ప్రభవ--- సౌమ్య --- భావ మొదలయిన సంవత్సరాల పేర్లతో పద్యం కట్టాడు కవి (389)--- సర్వలఘువచనం (383)తో పాటు, సర్వ గురువచనం కూడా వుంది (447) అచ్చ తెలుగు పచ్చలూ ఇందులో పొదిగి పోషించాడు కవి.
ఇలాటి కారచమత్కారాలేకాదు చక్కని కవిత్వం కూడా చెప్పాడు కవి.
ఏటికి నన్నెదుర్కొన వదేటికి కౌగిటగ్రుచ్చి చేరవిం
తేటికి విన్న నయ్యెద వదేటికి చూచెదుఱిత్తచూపులన్
మాటిలి వెందు రీకులుకు మాటలు నీనగుమోము తేటలో
పాటలో పాటలాధర కృపన్ గనుమా యనుమాన మేటికిన్
ఒక కవి ఆ జీవితం కృషి చేస్తేనే ఇలాటి ప్రబంధాన్ని సృష్టించగలడు. అలాంటి గ్రంధాన్ని పఠించాలంటే ఎంతో తీరిక ఓపిక అవసరం. ముద్రణ పుణ్యం కట్టుకున్నది ఆంధ్రప్రదేశ్ సాహిత అకాడమి. ఇప్పుడు తెలుగు విశ్వవిద్యాలయం పనిగట్టుకుని పూనుకుంటే ఎవరైనా "తాపీ"గా కృషిచేస్తే ఈ 'విజయ విలాసం' కూడా 'ఆంధ్రావళి ఆమోదం' పడయగలదు. ఎవరో ఆ పుణ్యాత్ములు? ఎప్పుడో ఆ బంగారు కాలం?
----*----