Previous Page Next Page 
కాదేదీ కథకనర్హం పేజి 17


                                              జనరేషన్ గ్యాప్
    
    "డోంట్ బి సిల్లీ మమ్మీ హౌ డు యు ఎక్స్ పెక్ట్ మీ టు మేరీ ఎన్ అన్ నొన్ గై" నందిత అద్దం ముందు నిలబడి జుత్తు బ్రష్ చేసుకుంటూ. చేత్తో కర్ల్స్ తిప్పుతూ. అద్దంలో అన్ని యాంగిల్స్ నించి అందం చూసుకుంటూ తల్లి వంక చూడనైన చూడకుండా నిర్లక్ష్యంగా కొట్టి పారేసింది. కూతురి ధోరణి మాధవికి కోపం తెప్పించినా కోపం చూపితే యీ కాలం పిల్లలు అందులో అమెరికాలో పెరిగే పిల్లలు అసలు సహించరని తెలుసు కనక తన కోపం దాచుకుని.
    "యూ డోంట్ బి సిల్లీ నందూ, పెళ్ళికి ముందే తెలియడానికి, పరిచయాలు పెంచుకుని డేటింగులు చేయడానికి , చేసి నచ్చకపోతే వదిలేసి మరోడ్ని వెతుక్కోవడానికి యిది అమెరికాయే అయినా మనం ఇండియన్స్ అని మరిచిపోకు. మన అలవాట్లు, ఆచారాలు, సంస్కృతులు వేరని నీకు తెలియదా. యిక్కడున్నా మన ఆచారం ప్రకారం నడవాల్సిందే....." గొంతులో అధారిటీ కన్పించింది.
    "ఓ.....డోంట్ టాక్ రబ్బిష్ మమ్మీ ఈ ఆచారాలు, సంస్కృతులు.....అల్ నాన్సెన్స్ .....యూనో దట్ ఐ డోంట్ హేవ్ బిలీల్ ఇన్ సబ్ థింగ్స్ --- మనిషి ఎలాంటివాడో తెలియకుండా ముక్కు మొహం తెలియనివాడిని ఐదు నిమిషాలు చూసి పెళ్ళాడాలని ఎలా చెప్తున్నావు --- నీవు చదువుకుని మోడర్న్ అయి వుండీ ....... సమ్ టైమ్స్ యూ టాక్ అల్ నాన్ సెన్స్ మమ్మీ -------చూడు నాకెవరన్నా పరిచయం అవాలి. నాకు నచ్చాలి, మా మనసులు కలవాలి , ఐడియాలు, టెస్టులు కలవాలి. యిద్దరి మధ్య అండర్ స్టాండింగ్ కుదరాలి -------లవ్ పుట్టాలి అప్పుడు గాని నేను చేసుకోను ---మీరు చూపించిన వాడిని కట్టుకుని మనసులు కలవకపోతే కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఆ టార్చర్ అంతా సహిస్తూ లోకం కోసం కల్సి బతకడం వగైరాలు నేను చచ్చినా చేయను. అంచేత నాకు నచ్చిన వాడు కనిపిస్తే నేనే చెపుతా మీకు' ఖచ్చితంగా అంది.
    'ఆ, చూస్తున్నాంగా ఈ డేటింగులు ఎంత సక్సెస్ పుల్ అవుతున్నాయో ---- కలిసి తిరిగి మనసులే కాక శరీరాలు పెళ్ళి కాక ముందే కలుపుకుని నచ్చలేదని యింకోడిని వెతుక్కోడం, లేదంటే పెళ్ళి చేసుకుని ఏడాది రెండేళ్ళకే డైవర్సు లు యివన్నీ చూడడం లేదా, పెళ్ళికి ముందు ప్రతి మగాడు జెంటిల్ మెన్ లాగే ప్రవర్తిస్తాడు. అసలు రంగులన్నీ పెళ్ళి అయి కల్సి మెల్సి బతకడం అరంభించాక గాని బయట పడవు. కొత్త మోజులో నాల్గురోజులు ప్రేమ కబుర్లు చెపుతారు మగవాళ్ళు ----ఆ తరువాత అందరూ ఒకటే. ఆడదాని అదృష్టం బాగుంటే సౌమ్యుడు, సహృదయుడు దొరుకుతాడు. మేరేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నది మనం నమ్మి తీరాలి. అంచేత ఈ మనసులు కలవడాలు, అర్ధం చేసుకోడానికి డేటింగ్స్ అంతా రబ్బిష్ అంటాను నేను ---- ' కూతురన్న రాబ్బీష్ మాటని వత్తి పలుకుతూ తీవ్రంగానే అంది మాధవి.
    "కమాన్ మమ్మీ నీకు రబ్బీష్ అయింది నాకు కావాలని ఏమన్నా రూలుందా. నీ అభిప్రాయం నీది, నా అభిప్రాయం నాది. నీకోసం నా ఉద్దేశాలు మార్చుకోవాలా -----' సూటిగా అంది.
    "నాకోసం కాదు, నీకోసమే మార్చుకోమంతున్నాను. నే చెప్పేది నీ మంచి కోసమేనని గ్రహించామంటున్నాను. ఇక్కడికి వచ్చిన ఈ పన్నెండేళ్ళ నుంచి చుట్టూ చూస్తూ తెల్సుకున్న విషయం నుంచి నేర్చుకున్న పాఠాల అనుభవం వల్ల చెప్తున్నాను. ఈ డేటింగులు , ఈ ప్రేమ యిదంతా మనలాంటి వాళ్ళకి కాదు....' నచ్చ చెప్పబోయింది.
    "మమ్మీ నీవెలా మాట్లాడు తున్నావంటే అమెరికాలో అందరూ చెడిపోయి నట్టు -----రోజూ అందరూ డైవర్సులు లిచ్చుకుంటున్నట్టే మాట్లాడుతున్నావు. ఏం వీళ్ళెవరు పెళ్ళిళ్ళు చేసుకోడం లేదా, సంసారాలు చేయడం లేదా, ఎటొచ్చి మనకి వాళ్ళకి తేడా ఏమిటంటే ఒకరితో ఒకరికి పడకపోయినా, లోకం కోసం నటిస్తూ తిట్టుకుంటూ, కొట్టుకుంటూ పడి వుంటాం మనం, వాళ్ళు లోకాన్ని కేర్ చెయ్యకుండా వాళ్ళు సుఖం చూసుకుంటారు. మమ్మీ మీ అందరికీ అమెరికా కావాలి, ఇక్కడ ఉద్యోగాలు కావాలి, యిక్కడి డబ్బులు పనికొస్తాయి . ఈ దేశంలో వుంటూ, ఈ దేశం తింటి తింటూ యిక్కడి మనుష్యులని విమర్శిస్తారు. ఐ హెట్ దీజ్ డబుల్ స్టాండర్త్స్....... మీ పిల్లలని అమెరికాలో పెంచుతూ వాళ్ళకి ఇండియన్ థింకింగ్ లే కావాలంటారు. అన్నీ ఎలా కుదురుతాయి.....' వ్యంగ్యంగా ఎత్తి పొడిచింది ---కూతురు మాటల్లో నిజం వున్నా చిన్నపిల్ల తమని వేలెత్తి చూపిస్తూ ఎత్తి పోడిచేసరికి సహించ లేకపోయింది మాధవి.
    "నందూ యిన్ని మాటలు అనవసరం, అమెరికాలో వున్నంత మాత్రాన మన ఆచార వ్యవహారాలూ వదిలేసి అమెరికన్స్ మీ అవక్కరలేదు. ఎవరి సంగతో నా కానవసరం --- మేం మా పిల్లలని ఇండియన్ పద్దతిలోనే పెంచాం --- పెంచాలనుకుంటున్నాం. ఈ డేటింగులు, యీ లవ్ ఎపైర్లు, పెళ్ళికి ముందు మేం ఒప్పుకోం. ఇప్పుడు నీకు చూపించిన ఫోటోలో అబ్బాయి యింజనీరింగు చదివి, ఎమ్.ఎస్ చేయడానిక్కడికి వస్తున్నాడు, తల్లి తండ్రి డాక్టర్లు ---- మన వాళ్ళు -- చదువు, సంస్కారం, డబ్బు, హోదా అన్నీ వున్న ఫేమిలీ వాళ్ళది. ఆ అబ్బాయి అమెరికా వస్తే మళ్ళీ గ్రీన్ కార్డ్ వచ్చేలోగా రావడం కుదరదని పెళ్ళి చేసి పంపాలని వాళ్ళ తల్లిదండ్రులు అనుకుంటున్నారు. అబ్బాయి చక్కగా, స్మార్టుగా వున్నాడు. అన్ని విధాల మంచి సంబంధం అని మామయ్యా రాశాడు. నీ ఫోటో చూసి నచ్చావట. మా అందరికీ నచ్చింది సంబంధం. నీవోక్కర్తీవి వూ అంటే ఇండియాకి టికెట్ బుక్ చేసుకొని వెళ్లి పెళ్ళి చేసుకుని రావడమే ---అన్నీ కుదిరిన యింత మంచి సంబంధం మనం కావాలన్నప్పుడల్లా రాదు ....అంచేత ఈ సంబంధం ఒప్పుకో ---- డేటింగుల పేర ఏ తలమాసిన వాడితోనో తిరగడం -- అదంతా కుదరని వ్యవహారం. అది మన కల్చర్ కాదు." శాసిస్తున్నట్టుగా అంది మాధవి. తల్లి గొంతులో తీక్షణత , ఆమె మాటల్లో శాసిస్తున్న తీరు చూసేసరికి నందిత ఇన్సల్ట్ ఫీలయింది. ఆ అమ్మాయి మొహం ఎర్రబరచుకుని,
    "మమ్మీ ఐ నో వాట్ ఐ వాంట్ , ఐ నో వాటీజ్ గుడ్ ఫర్ మీ ------ డోంట్ ట్రీట్ మి యాజ్ ఏ కిడ్ , ఎండ్ డోంట్ ఇన్ సిస్ట్ మి ఇన్ దిస్ మాటర్ ఎనీ మోర్," అంటూ విసవిస అక్కడ నించి వెళ్ళిపోయింది నందిత. ఆ తిరస్కారాన్ని ఆ పొగరుని సహించలేకపోయింది మాధవి. డ్రాయింగ్ రూమ్ లో పేపరు పట్టుకు కూర్చున్న ప్రకాశరావు తల్లీ కూతుళ్ళ సంభాషనంతా వింటూనే వున్నాడు. మాధవి విసురుగా వచ్చి సోఫాలో కూలబడింది. "అన్నీ వింటూ కూడా మీరలా నిమ్మకు నీరెత్తినట్టు ఎలా వూరుకుంటున్నారో నాకర్ధం కావడం లేదు" కోపం అంతా భర్త మీదకి తిప్పి దులిపింది మాధవి.
    "కూల్ డౌన్ మై డియర్ ---" పేపరు పక్కన పెడ్తూ శాంతంగా అన్నాడు.
    'చాల్లెండి .దాని మాటలు వింటూ, దాని పొగరు చూస్తూ కూడా కల్పించుకోకుండా వూరుకుంటున్నారు గాబట్టే దాని కసలు నా మాటంటే భయం లేకుండా పోయింది. అలాంటప్పుడు వచ్చి కాస్త మగవాళ్ళు మందలిస్తే పిల్లలకి భయం వుంటుంది. మిమ్మల్ని చూసే అదలా ఆడుతోంది." ఉక్రోషంగా అంది మాధవి.

 Previous Page Next Page